Wednesday, December 27, 2017

అర్థంలేని ఆరోపణలు

మోకాలికి బట్టతలకు ముడి పెట్టడం అంటే ఇదే.. ప్రధాని నరేంద్ర మోదీని వ్యతిరేకించేందుకు సాకుల కోసం కాచుకున్న శక్తులు విచక్షణ కోల్పోవడం మరోసారి స్పష్టంగా కనిపించింది.. 2జీ స్పెక్ట్రమ్ కేసులో నాటి టెలికమ్ మంత్రి రాజా, డీఎంకే ఎంపీ కనిమొళి తదితరులు నేరం చేశారనేందుకు ఆధారాలు లేక వదిలేస్తున్నట్లు సీబీఐ న్యాయస్థానం ప్రకటించగానే కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడులు మొదలయ్యాయి.

యూపీఏ ప్రభుత్వ హయాంలో 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణాన్ని బయట పెట్టింది కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్).. 2008లో జరిగిన కేటాయింపులకు 2001 నాటి ధరలను ప్రామాణికంగా తీసుకొని అస్మదీయులకు కేటాయింపులు జరిపారని ఆరోపణ. మంత్రి రాజా తన కుటుంబ వ్యాపార కార్యకలాపాలతో సంబంధం ఉన్న యూనిటెక్, డాట్ కామ్, స్వాన్ కంపెనీలకు కట్టబెట్టడాన్ని 2012లో స్వయానా సుప్రీం కోర్టు గుర్తించి 122 లైసెన్సులపై వేటు వేసింది..
2జీ స్పెక్ట్రమ్ కుంభకోణం కారణంగా ప్రభుత్వ ఖజానాకు రూ.1.76 లక్ష కోట్ల నష్టం జరగిందని కాగ్ నిర్ధారించింది. ఇక్కడ గమనించాల్సిన విషయంలో ఒకటి ఉంది. కుంభకోణం జరిగింది కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వ హయాంలో, కుంభకోణంతో సంబంధం ఉన్న వారు కాంగ్రెస్ మిత్రపక్షం డీఎంకే పార్టీకి చెందిన రాజా, ఆ పార్టీ అధినేత కరుణానిధి తనయ ఎంపీ కనిమొళి.. మరి కుంభకోణంపై దర్యాప్తు చేస్తున్న సీబీఐ సంస్థ ఎవరి కనుసన్నల్లో పని చేసినట్లు.. ఆ సమయంలోనే కీలకమైన పత్రాలను తారుమారు అయ్యే అవకాశం ఉంటుంది. ఒక రకంగా కేసు అప్పుడే నీరు గారింది..
తాజాగా సీబీఐ న్యాయస్థానం తీర్పు చెప్పే సమయానికి ప్రాసిక్యూషన్ వాదన వీగిపోయింది. సాక్ష్యాలను ప్రవేశ పెట్టడంలో విఫలం అయ్యారని న్యాయమూర్తి సైతం వ్యాఖ్యానించడం గమనార్హం.. మరి ఇక్కడ మోదీ ప్రభుత్వ ప్రమేయం ఎక్కడ ఉన్నట్లు?. కొద్ది రోజుల క్రితం చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధానమంత్రి మోదీ అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందిన డీఎంకే అధినేత కరుణానిధిని కలవడం ఇక్కడ ప్రస్థావనకు వస్తోంది..
కరుణానిధిని పరామర్శించడమే మోదీ చేసిన నేరమా?. దీనికి, తాజా తీర్పుకు ముడి పెట్టడం ఆశ్చర్యకరంగా ఉంది. డీఎంకేను తమవైపు తిప్పుకోవడానికే స్పెక్ట్రమ్ కేసును బీజేపీ ప్రభుత్వం నీరు గార్చిందని వాదన. మోదీ ప్రభుత్వం నిజంగా న్యాయస్థానాలను, దర్యాప్తు సంస్థలను ప్రభావితం చేసిందని నమ్మగలమా? ఇదే నిజమైతే ఇటీవల చాలా కేసుల్లో న్యాయస్థానాలు మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు ఇస్తున్నాయి. అంత పెద్ద కుంభకోణాన్నే ప్రభావితం చేసిన మోదీ, చిన్నా చితకా కేసుల్లో తన ప్రభుత్వాన్ని తప్పు పట్టకుండా చూసుకోలేరా?
నిజానికి 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణం న్యాయస్థానానికి చేరేందుకు కారణం బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి.. ఆయన ఈ కేసును అంత తేలికగా వదిలి పెట్టరు.. పై కోర్టుల్లో ఈ వ్యవహారాన్ని తేల్చేందకు అప్పుడే సిద్దమైపోయారు. డీఎంకే, కాంగ్రెస్ పార్టీలు ఇప్పుడు పండుగ చేసుకుంటూ ఉండొచ్చు.. అసలైన మొసళ్ల పండుగ ముందు ముందు ఉంటుంది.

22.12.2017

No comments:

Post a Comment