Saturday, December 30, 2017

ఇక ఉమ్మడి పౌరస్మృతి దిశగా

అది 1985 సంవత్సరం షాబానో అనే వృద్ధురాలు తనను వదిలేసిన భర్త మనోవర్తి చెల్లించాలంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. సుప్రీం కోర్టు ఆమెకు అనుకూలంగా తీర్పు ఇచ్చేసరికి నాటి ముస్లిం నాయకులు గగ్గోలు పెట్టారు. తమ మత సంబంధమై విషయాల్లో జోక్యం చేసుకోవడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో నాటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ సుప్రీంకోర్టు తీర్పును కాలరాస్తూ 1986లో  ప్రొటెక్షన్ ఆన్ డైవర్స్ యాక్ట్ తీసుకొచ్చారు. ఆనాడు కాంగ్రెస్ పార్టీకి లోక్ సభలో సంపూర్ణ మెజారిటీకన్నా ఎక్కువ సభ్యులు ఉన్నా ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఛాందసవాసుల ఒత్తిడికి తలొగ్గాల్సి వచ్చింది.

షాబానో ఉదంతం దేశ వ్యాప్తంగా ఉమ్మడి పౌరస్మృతిపై చర్చకు దారి తీసింది. పర్సనల్ లా ముసుగులో ముస్లిం మహిళలకు తీరని అన్యాయం జరుగుతోంది. ఇలాంటి సమయంలో కొందరు చైతన్యవంతులైన ముస్లిం మహిళలు ముమ్మారు తలాక్’కు వ్యతిరేకంగా గళమెత్తారు. భర్త మూడుసార్లు తలాక్ అని ఉచ్చరించగానే వైవాహిక బంధం పెటాకులు అయినట్లేనట.. సుప్రీం కోర్టు ఆదేశాల పుణ్యమా అని కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ‘ముస్లిం మహిళల వివాహ హక్కుల పరిరక్షణ బిల్లు’ను ప్రవేశపెట్టి లోక్ సభలో ఆమోదించింది. కాంగ్రెస్ పార్టీ తప్పని సరైన సరిస్థితిలో మద్దతు ఇవ్వాల్సి వచ్చింది. ఇక రాజ్యసభ కూడా ఈ బిల్లుకు మద్దతు ఇవ్వడం లాంఛనమే అని చెప్పవచ్చు.
నిజానికి భారతీయ ముస్లింలలో కొన్ని ఛాందస వర్గాలు తప్ప మెజారిటీ వర్గాలు తలాక్విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. కేంద్ర తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాయి. కానీ దురదృష్టవశాత్తు కొన్ని పని లేని ప్రతిపక్షాలు, వామపక్షాలు మాత్రం వ్యతికేస్తున్నాయి. ఈ వర్గాలకు ఈ చట్టం తీసుకు రావడం ఇష్టం లేకపోవడానికి కారణం ప్రధాని మోదీపై ఉన్న గుడ్డి వ్యతిరేకతే అని చెప్పక తప్పదు..
ముమ్మారు తలాక్ వ్యతిరేక చట్టం ముస్లిం సమాజానికి ఏమాత్రం వ్యతిరేకం కాదు. ముస్లిం మహిళల ప్రయోజనాలను రక్షించేందుకు తీసుకు వచ్చిన ఈ చట్టాన్ని వ్యతిరేకించడానికి వారు చెబుతున్న కారణాలు సహేతుకంగా లేవు. ప్రపంచంలో ముస్లింల జనాఖా ఎక్కువగా ఉన్న పాకిస్తాన్, ఈజిప్టు, ఇండోనేషియా, ఇరాన్, టర్కీ, బంగ్లాదేశ్ తదితర 19 దేశాలు ఏనాడో తలాక్కు తలాక్ చెప్పేశాయి. నిత్యం మన దేశంపై విద్వేషాన్ని విరజిమ్మే మత ఛాందస దేశం పాకిస్తాన్ 1961లో ముమ్మారు తలాక్ ను నిషేధించింది. మరి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత దేశంలో సెక్యులరిజం ముసుగులో ఇంకెంత కాలం సాగుతాయి ఈ కపట నాటకాలు?

దేశ ప్రజలందరికీ ఉమ్మడి పౌరస్మృతిని రూపొందిచాలని రాజ్యాంగంలోని 44వ అధికరణం నిర్దేశించిన విషయాన్ని సుప్రీం కోర్టు గుర్తు చేసింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా ఆనాడే ఉమ్మడి పౌరస్మృతి ఉండాలని వాంచించారు. దేశ సమగ్రత, సమైఖ్యత కోసం ఇప్పుడు మనం అంతా ఈ దిశగా పోరాడాల్సిన అవసరం ఉంది. ఇందుకు ముమ్మారు తలాక్ నిషేధం స్పూర్తి కావాలి..

No comments:

Post a Comment