Sunday, December 31, 2017

తమిళనాడుకు రజినీయే బెస్ట్

నేను సినిమాలు పెద్దగా చూడను.. కానీ చూసిన చిత్రాల్లో కమల్ హాసన్, రజినీకాంత్ నటించినవే ఎక్కువ.. ఎందుకో నాకు మన తెలుగు హీరోల నటన పెద్దగా నచ్చదు.. కమల్, రజినీలు కాలానుగుణంగా తమ నటనా వైవిధ్యాన్ని కొనసాగించడం, వినూత్న ప్రయోగాలకు పెద్ద పీట వేయడం కారణంగా అరుదుగా వచ్చే వారి చిత్రాల కోసం ఎదురు చూస్తుంటాను.

నిజానికి నేను రజినీ కన్నా కమల్ కు పెద్ద అధిమానిని.. నటన వరకే సుమా.. అతని వ్యక్తిగత జీవితం నాకు అనవసరం అనుకున్నా.. ఇటీవల కాలంలో రాజకీయాల్లోకి వచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించిన కమల్ హాసన్ విడుదల చేస్తున్న విచిత్రమైన ప్రకటనలు, ట్వీట్లు నాకు నచ్చలేదు.. కమ్యూనిస్టుల చంకలో చేరి హైందవానికి, జాతీయవాదానికి వ్యతిరేకంగా ఆయన చేసిన ప్రకటనలు నా మనసు విరిచాయి. సైద్దాంతిక గందరగోళం, రాజకీయ పరిపక్వత లేని కమల్ రాజకీయాలకు దూరంగా ఉండటమే మంచిదని నా అభిప్రాయం. లేకుంటే నా లాంటి ఎంతో మంది అభిమానులు ఆయనకు దూరమైపోతారు.
తమిళనాట ఎంజీఆర్ తర్వాత అంతటి గొప్ప విలక్షణ నటుడు రజినీకాంత్.. మూడున్నర దశాబ్దాలుగా అగ్ర నటుడిగా ఉన్న రజినీ రాజకీయాల్లోకి రావాలని అభిమానలు చాలా కాలంగా కోరుకుంటున్నారు. కానీ ఆయన తొందర పడకుండా తన నిర్ణయాన్ని ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ వచ్చారు. ప్రస్తుతం తమిళనాట రాజకీయ శూన్యత ఉంది. జయలలిత తర్వాత ఆమె అంతటి సాహసోపేత, జనాధరణ గల నాయక్తవం లేదు.. ఇలాంటి సమయంలో వేర్పాటువాద శక్తులకు అండగా నిలిచిన కొన్ని సోకాల్డ్ ద్రవిడ పార్టీలు అవినీతి, చిల్లర వేశాలతో ప్రజల ఏవగింపునకు గురవుతున్నాయి. ఇలాంటి సమయంలో రాజకీయాల్లోకి వస్తున్నట్లు రజినీకాంత్ ప్రకటన చేయడం సంతోషకరం.. ఆధ్యాత్మిక చింతన అధికంగా ఉన్న రజినీకాంత్ తమిళనాడుకు నైతిక విలువలతో కూడిన రాజకీయాలు అందించాల్సిన అవసరం ఉంది. ప్రజలకు ఏమీ చేయలేకపోతే రాజకీయాల్లో నుంచి తప్పుకుంటానని చేసిన ప్రకటనకు రజినీకాంత్ కట్టుబడి ఉండాలని కూడా భావిస్తున్నాను.

సినిమాలు, రాజకీయాలు వేరు వేరు.. కానీ తమిళనాట ఈ రెండూ దశాబ్దాలుగా అవిభక్త కవలలుగా సాగుతున్నాయి. ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత సినీ రంగం నుంచి వచ్చి రాజకీయాలను శాసించారు. ప్రజాధరణతో రాజకీయాల్లోని వచ్చిన వీరి పాలనా కాలం అంతా అవినీతి మయమే.. ఇలాంటి సమయంలో రజినీకాంత్ రాజకీయాల్లోకి వస్తున్నారు. ఆయన తన స్వచ్ఛతను కాపాడుకొని అవినీతి దూరంగా నీతివంతమైన, సమర్ధ పాలకుడుగా ఆవిర్భవించాలని మనసారా కోరుకుంటున్నాను.

No comments:

Post a Comment