Wednesday, December 27, 2017

మనువు పేరుతో ధర్మంపై దాడి

మ‌నుస్మృతి.. ఈ పేరు విన‌గానే హిందూ వ్య‌తిరేక శ‌క్తులు ర‌గిలిపోతుంటాయి. హిందూ మ‌తంపై దాడికి ఈ గ్రంథాన్ని సాకుగా చూపుతాయి. మ‌నుస్మృతిలోని చాతుర్వ‌ర్ణ వ్య‌వ‌స్థ‌, అంట‌రాని త‌నం, శూద్రులు, మ‌హిళ‌ల‌పై వివ‌క్ష‌, ఘోర‌మైన శిక్ష‌ల‌ను ప్ర‌స్థావించి స‌మాజంలోని కొన్ని వ‌ర్గాల‌ను రెచ్చ‌గొట్టి హిందూ మ‌తం నుంచి దూరం చేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. అస‌లు కాలం చెల్లిన‌, మ‌నుగ‌డ‌లో లేని ఈ శిక్షాస్మృతిపై ఎందుకు ఇంత రాద్దాంతం?
ప్ర‌తి మ‌తంలోనూ మంచి, చెడూ రెండూ ఉంటాయి. ఇత‌ర మ‌తాల‌తో పోలిస్తే స‌నాత‌న హిందూ ధ‌ర్మంలో కాలానుగుణంగా వచ్చి మార్పులలో మంచిని గ్రహించి చెడును వదిలేస్తూ వచ్చింది.. అందుకే వేలాది సంవ‌త్స‌రాలుగా నిత్య నూతనంగా కొన‌సాగుతోంది హిందూ ధ‌ర్మం. 
ప్ర‌పంచ వ్యాప్తంగా చ‌రిత్ర‌ను గ‌మ‌నించి చూస్తే పూర్వం రాజ్యాలు ప‌రిపాల‌న కోసం తమదైన వ్య‌వ‌స్థ‌ల‌ను ఏర్పాటు చేసుకోవ‌డం గ‌మ‌నించవ‌చ్చు.. రాజ్యంలో పాల‌కులు-పాలితుల మధ్య సంబంధాలు, పౌరుల విధులు బాధ్యతలు, సమాజంలో వివిధ వర్గాల ప్రజలు, ఎవ‌రు ఏం చేయాలి?.. ప్రభుత్వానికి చెల్లించాల్సిన ప‌న్నులు.. నేరాలు, త‌ప్పులు చేస్తే వారికి విధించాల్సిన శిక్ష‌లు.. ఇలా అన్నింటికీ చ‌ట్టాలు, శిక్ష్మా స్మృతులు ఉంటాయి.. రాజ్యాలు పోయి ప్ర‌జాస్వామ్య పాల‌న వ‌చ్చాక వీటిలో చాలా వరకూ మార్పలు చేర్పులు వచ్చాయి.. ఇందులో కొన్ని ఒక‌నాడు ఒప్పు అనిపించిన‌వి, ఇప్పుడు త‌ప్పు అనిపించ‌డం స‌హ‌జం. 
భార‌తదేశాన్ని ఎంద‌రో రాజులు పాలించారు. విదేశీయుల దండ‌యాత్ర‌లు, వారి పాల‌న చూశాం.. చివ‌ర‌కు స్వాతంత్ర్యం పొంది ప్ర‌జాస్వామ్య పాల‌న అనుభ‌విస్తున్నాం. మ‌న దేశంలో వేలాది సంవత్స‌రాలుగా స‌నాత‌న ధ‌ర్మం కొన‌సాగుతోంది. ఆ కాలంలోని చ‌ట్టాలు, శిక్షాస్మృతుల‌ను మ‌నం నేటి స‌మాజానికి ఆపాదించ‌లేం.. హైంద‌వ స‌మాజం ఎన్నో మార్పుల‌ను కూడా చూసింది. స‌మాజంలో అంట‌రానిత‌నం, వివ‌క్ష‌త‌ల‌ను రెండు వేల సంవత్స‌రాల క్రిత‌మే ఆది శంక‌రాచార్యులు, రామానుజాచార్యులు త‌దిత‌ర మ‌హ‌నీయులు ప్ర‌శ్నించారు. ఆధునిక కాలంలో కూడా ఎంతో మంది సంఘ సంస్క‌ర్త‌లు వీటిపై పోరాటం కొన‌సాగించారు. 
హైంద‌వ ధ‌ర్మశాస్త్రాల్లో మ‌నుస్మృతి ఒక‌టి మాత్ర‌మే లేదు. ఇలాంటి 18 స్మృతులు ఉన్నాయి.. అవి మనుస్మృతి, బృహస్పతిస్మృతి, దక్షస్మృతి, గౌతమస్మృతి, యమస్మృతి, అంగీరసస్మృతి, యాజ్ఞవల్క్యస్మృతి, ప్రచేతస్స్మృతి, శాతాతపస్మృతి, పరాశరస్మృతి, సంవర్తస్మృతి, ఔశనసస్మృతి, శంఖస్మృతి, లిఖితస్మృతి, ఆత్రేయస్స్మృతి, విష్ణుస్మృతి, ఆపస్తంబస్మృతి, హరీతస్మృతి... ఇవికాక మ‌రో 18 ఉపస్మృతులు ఉన్నాయి. అవి కణ్వస్మృతి, కపిలస్మృతి, లోహితస్మృతి, దేవలస్మృతి, కాత్యాయనస్మృతి, లోకాక్షిస్మృతి, బుధస్మృతి, శాతాతపస్మృతి, అత్రిస్మృతి, ప్రచేతస్మృతి, దక్షస్మృతి, విష్ణుస్మృతి, వృద్ధవిష్ణుస్మృతి, వృద్ధమనుస్మృతి, ధౌమ్యస్మృతి, నారదస్మృతి, పౌలస్త్యస్మృతి, ఉత్తరాంగిరసస్మృతి..
ఇక్క‌డ మ‌నం అర్థం చేసుకోవాల్సిన విష‌యం ఏమిటంటే.. హైంద‌వ ధ‌ర్మానికి మ‌నుస్మృతి ఒక‌టే ప్ర‌మాణికం కాదు.. అందులో కొందరికి మంచి కనిపించవచ్చు, మరి కొందరికి చెడు కనిపించవచ్చు.. అస‌లు ప్ర‌స్తుత స‌మాజంలో మ‌నుస్మృతి ఎక్క‌డ ఉంది?.. దీన్ని ఎవ‌రైనా ఆచ‌రిస్తున్నారా?.. ఎవ‌రూ ప‌ట్టించుకోని ఈ గ్రంథంపై అస‌లు ఎందుకు ఇంత ర‌భ‌స‌?.. మ‌నం ఇప్పుడు ప్ర‌జాస్వామ్యంలో ఉన్నాం.. ఆధునిక కాలానికి అనుగుణంగా మ‌న‌కు రాజ్యాంగం, చ‌ట్టం, శిక్షా స్మృతులు ఉన్నాయి. అలాంట‌ప్పుడు కొన్ని వ‌ర్గాల‌కు ఎప్పుడో అన్యాయం జ‌ర‌గిపోయింది అంటూ నేటికీ మ‌నుస్మృతిని ప‌ట్టుకొని హిందూ ధ‌ర్మాన్ని నిందంచ‌డం ఎందుకు?. చాలా మంది తెలిసీ తెలియ‌క మ‌నుస్మృతి గ్రంధాన్ని త‌గుల‌బెడుతున్నారు. ప్ర‌తిగా మ‌రి కొంద‌రు రెచ్చిపోయి గొడ‌వ‌కు దిగుతున్నారు. మ‌నం ప‌ట్టించుకున్న కొద్దీ అవ‌త‌లి వారు అలా రెచ్చిపోతూనే ఉంటారు.. కాబ‌ట్టి మీరింతే అని ప‌ట్టించుకోక‌పోవ‌డ‌మే ఉత్త‌మం.. 

అన్య‌మ‌తాల గ్రంథాల్లో ఇంకా దారుణ‌మైన శిక్షాస్మృతులను చూడ‌వ‌చ్చు.. మ‌రి ఆ మ‌తాల‌ను నిందించ‌కుండా హిందూ మ‌తాన్ని మాత్ర‌మే టార్గెట్ చేయ‌డం ఎందుకు? ఇందులోని కుట్ర కోణాన్ని మ‌నం అర్థం చేసుకోవాలి.. 

No comments:

Post a Comment