Sunday, February 17, 2013

తొమ్మిదేళ్లు.. తొమ్మిది పాపాలు


కుంభకోణాల మీద కుంభకోణాలు.. 9 ఏళ్ల పాలనలో 9 కుంభకోణాలు.. ఒక కుంభకోణం మరువక ముందే మరో కుంభకోణం..
ఓటుకు నోటు, 2జీ, ఆదర్శ్ హౌసింగ్, కామన్ వెల్త్ క్రీడలు, బొగ్గు గనుల కేటాయింపు, ఎస్ బ్యాండ్, జాతీయ ఉపాధి హామీ పథకం, విదేశాల్లో నల్ల ధనం.. చివరకు ఇప్పడు అగస్టా హెలిక్యాప్టర్ల కుంభకోణం..
ఇదేనా యూపీఏ ప్రభుత్వం సాధించిన ప్రగతి.. ఏ కుంభకోణంపైనా విచారణ కొలిక్కి రాలేదు.. తూతూ మంత్రం లాంటి విచారణలు.. అవినీతిపై ప్రతి పక్షాలు నిలదీసినా చర్యలు తీసుకోవడం దేవుడెరుగు.. ఎదురు దాడే కాంగ్రెస్ నేతల సమాధానం..
ఉలుకూ, పలుకు లేని మౌనీ బాబా మన్మోహన్ గుడ్డి దర్బారులో అవినీతి బేషుగ్గా రాజ్యమేలుతోంది.. దేశంలో ఆర్ధిక సంస్కరణలు ప్రవేశ పెట్టిన గొప్ప ఆర్థిక వేత్తగా పేరొందిన మన్మోహన్జీ హయాంలో ధరలు ఆకాశాన్ని అంటుతూ పేదలు బతకడమే గగణమైపోయింది.. పేదలు మరింత పేదలు అవుతుంటే.. ధనికులు ఆస్తులు ఎన్నో రెట్లు పెరిగిపోతున్నాయి..  ఇవేమీ పట్టని పాలకులు దేశ సంపదను అడ్డంగా దోచుకుంటున్నారు..
ఇప్పుడు తొమ్మిదేళ్ల పాలన అయిందేదో అయింది, కొత్తగా యువరాజు వచ్చి ఏదో కుళ్లపొడుస్తాడని కాంగ్రెస్ నేతలు గొప్పగా చెప్పుకుంటున్నారు..  ఇంతకాలంగా కొనసాగిన అనర్థాలన్నింటికీ మనన్మోహన్ సింగ్ ను బాధ్యున్ని చేసేసి.. అధినేతి సోనియమ్మవారు ప్రెష్ లుక్ పేరుతో రాహుల్ గాంధీని తెరపైకి తెరపైకి తెస్తున్నారు.. అంటే ఇంత కాలంగా కొనసాగుతున్న అసమర్థ పాలనకు కాంగ్రెస్ పాలకులు మూల్యం చెల్లించనక్కరలేదా?
ప్రజలు వెర్రివాళ్లు కాదు.. రాబోయే ఎన్నికల్లో కచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి, యూపీఏకు కచ్చింతంగా కర్రు కాల్చి వాత పెడతారు..

Thursday, February 14, 2013

ప్రేమికులకో దినమా?


ఈ ప్రపంచంటో అర్ధంలేని దినాల్లో ఒకటి ప్రేమికుల దినం (వాలెంటైన్స్ డే).. అసలు ప్రేమ అంటే ఏమిటి?.. దురదృష్టవశాత్తు ప్రేమ అంటే ఆడ, మగ మధ్య అనే నడిచే వ్యవహారం అనే అపోహ మన సమాజంలో ఉంది.. ఇందుకు కారణం సినిమాలు, సాహిత్య ప్రభావమే.. నిజానికి ప్రేమకు విస్తృత అర్థం ఉంది.. ప్రేమ కేవలం ప్రేయసీ, ప్రియులకు సంబంధించినది మాత్రమే కాదు.. మనం భగవంతున్ని ప్రేమిస్తాం.. తల్లిదండ్రులను, తోబుట్టువులను, బంధుమిత్రులను,  తోటి మనుషులను సైతం ప్రేమిస్తాం..  
ప్రేమ అనేది అనంతం, శాశ్వతం, నిత్య నూతనం.. ప్రేమను ఒక్క రోజుకు పరిమితం చేయగలమా? ప్రేమ ఒక్క రోజులో పుట్టి, ఒక్క రోజులోనే అంతరిస్తుందా? అలాంటప్పుడు ఎందుకీ అర్థం పర్థం లేని ప్రేమికుల రోజు.. నిజానికి మన దేశంలో ప్రేమికుల రోజు జరుపుకోవడం మెట్రో నగరాలకే పరిమితంగా ఉండేది.. కానీ మీడియా పుణ్యమా అని రెండు దశాబ్దాలుగా చిన్న పట్టణాలకు, గ్రామీణ ప్రాంతాలకూ వ్యాపించింది.. గ్రీటింగ్ కార్డులు, గిఫ్టులు అమ్ముకునేవారికి వ్యాపార లాభాలు, మీడియాకు ప్రకటనలు, టీఆర్పీ రేటింగ్ల ఆదాయానికి మాత్రమే పనికి వచ్చే దినమిది..
ఒక్కసారి మనం చరిత్ర పుటలను తిరగేస్తే వాలెంటైన్స్ డే ఎందుకు జరుపుకుంటారు అనే దానికి సూటిగా సమాధానం ఉండదు.. (వీకీపీడియా, ఇతర సర్చ్ ఇంజన్లు తిరగేసి చూడండి) వాలెంటైన్స్ డే మత పరమైన వేడుకే తప్ప ప్రేమికులకు సంబంధించింది కాదు.. ఓ మత ప్రచారకుడు ప్రేమతత్వాన్ని ప్రచారం చేయడం.. అతన్ని చక్రవర్తి బంధించి ఉరి తీయడం.. ఈ లోగా ఆ ప్రచారకుడు జైలరు కూతురుకు ప్రేమ లేఖ రాయడం (కూతురు వయసులో ఉన్న యువతిపై ఆ మత ప్రచారకునికి ప్రేమ ఏమిటో?)..

వాలెంటైన్స్ డే రోజులన గ్రీటింగ్స్, గిఫ్టులు ఇచ్చి పుచ్చుకొని పార్కులు, గట్లెమ్మట తిగినంత మాత్రాన ప్రేమ బలపడుతుందా? ఈ ఒక్క రోజు ప్రేమించుకుంటే చాలా? ప్రేమ అనేది శాశ్వతంగా ఉండాలి కాని దానికో దినం పెడితే ఎలా? నిజానికి దినాలు జరుపుకోవడం మన సాంప్రదాయం కాదు.. ఎవరైనా నా భావాలతో ఏకీభవిస్తే సంతోషం.. ఏకీభవించకున్నా నేనేమీ బాధపడను.. నేను ఎవరి మనోభావాలనైనా నొప్పించి ఉంటే క్షమించాలని కోరుకుంటున్నాను..

Tuesday, February 12, 2013

కాశ్మీరీలకు ఎవరు ఆదర్శం?

అఫ్జల్ గురును ఉరి తీసినందుకు కాశ్మీర్ లోయలోని యువతలో పరాయివారమనే భావన ఏర్పడిందట.. ఒక తరం ప్రజలు తమని తాము బాధితులుగా భావిస్తున్నారట.. ఈ తీవ్రదాదిని కాశ్మీర్ యువత ఆదర్శంగా భావిస్తోందట.. అఫ్జల్ ను ఉరి తీయడం తప్పట.. ఈ మాటలు అన్నది ఎవడో దారిన పోయే దానయ్యో, గొట్టంగాడో కాదు.. స్వయాన జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా నోటి గుండా వచ్చిన కూతలు ఇవి..
మన దేశం తిండి తింటూ, ఇక్కడి స్వేచ్ఛా వాయువులు పీలుస్తూ పరాయి దేశం పాట పాడే వారిని ఏమనాలి.. కచ్చితంగా దేశ ద్రోహులు అనక తప్పదు.. భారత రాజ్యాంగం, ప్రజాస్వామ్యంపై విశ్వాసం వ్యక్తం చేస్తూ, ఒక రాష్ట్ర ప్రజలు ఎన్నికున్న పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తూ ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి మాట్లాడాల్సిన మాటలేనా ఇవి.. అసలు ఈ అబ్దుల్లాల కుటుంబమే అంత.. కాశ్మీర్ తొలి సీఎం షేక్ అబ్దుల్లా.. ఆయన కొడుకు ఫరూక్ అబ్దుల్లా.. ఇప్పడు మనవడు ఒమర్ అబ్దుల్లా వంశ పారం పర్యంగా కాశ్మీర్ను ఏలుతూ తమ స్వార్ధ ప్రయోజనాలను కాపాడుకుంటున్నారు..
కాశ్మీర్లో తీవ్రవాదం బలంగా ఉన్న కాలంలో అబ్దుల్లాల కుటుంబం విదేశాల్లో విహరిస్తుంది.. పరిస్థితి చక్కబడ్డాక వచ్చి అధికార పగ్గాలు చేపడుతుంది..  నెహ్రూ మొదలు కొని ఇందిరా, రాజీవ్, సోనియా వరకూ కాంగ్రెస్ పాలక కుటుంబం అబ్దుల్లాల కుటుంబానికి అండగా నిలుస్తూ వచ్చింది.. అయితే ఈ కుటుంబంలో విశ్వాసం అనేదే కనిపించదు.. నెహ్రూ ఏరి కోరి సీఎం చేసిన షేక్ అబ్దుల్లా మధ్యలో కొంత కాలం పాకిస్తాన్ పాట పాడి జైలు పాలయ్యాడు.. ఆయన కొడుకు ఫరూక్ అబ్దుల్లా కేంద్రంలో అధికారానికి దూరం అయిన కాంగ్రెస్కు మస్కా కొట్టి నేషనల్ ఫ్రంట్, బీజేపీ నేతృత్వం ఎన్టీఏ పంచన జేరాడు.. వీరికి అధికారమే పరమావధి..
కాశ్మీరీల్లో దేశ భక్తికి నెల కొల్పాల్సిన ఆ రాష్ట్ర పాలకులు ఉగ్రవాదులకు సలాంలు కొట్టడం దారుణం.. ఇంతకీ అఫ్జల్ గురు కాశ్మీరీ యువతకు ఎందులో ఆదర్శం.. పార్లమెంటుపై దాడిలో సహకరించడంలోనా?.. పాకిస్తాన్లో ఉగ్రవాద శిక్షణ పొందడంలోనా? వీధుల్లోకి వచ్చి రాళ్లు విసరడంలోనా?.. జవాబు చెప్పాల్సిన బాధ్యత అబ్దుల్లా కుటుంబంపై ఉంది.. ఇలాంటి నీఛులు అధికార పీఠాలపై ఉండటం కన్నా జైళ్లలో ఉండటం బెటరు..
ఇంతకీ కాశ్మీరీ యువతకు ఆదర్శం ఎవరు? అఫ్జల్ గురులాంటి తీవ్రవాదులు కాదు.. సివిల్స్ లో విజయం సాధించి 2009 బ్యాచ్లో ఐఏఎస్ టాపర్ గా నిలచిన డాక్టర్ షాఫైసల్ అనే కాశ్మీరీ యువకుడు.. ఈ విషయం బహిరంగంగా ఎందుకు చెప్పరు?


Sunday, February 10, 2013

గురప్ప భాషాభిమానం

ఈయన పేరు గురప్ప.. తిరుమల నడక మార్గంలో గాలి గోపురం దగ్గర చిన్న హోటల్ నడుపుతున్నాడు.. గురప్ప హోటల్లో మేం ఇడ్లీలు తిన్నాం.. తెలుగులో మాట్లాడినందుకు 5 రూపాయలు రాయితీ ఇచ్చాడు.. ఇటీవల తిరుపతిలో తెలుగు మహాసభలను చూసి ప్రభావితుడయ్యాడట.. కాణిపాకం నివాసి అయిన గురప్ప పెద్దగా చదువుకోలేదు.. అయినా తెలుగు భాషపై ఎంతో అభిమానం ఉంది.. గురప్ప లాంటి సామాన్యుడు చేస్తున్న పనిని ఇతర వ్యాపారులు ఎందుకు చేయరు? తెలుగు భాషను తన వంతు సేవ చేస్తున్నగురప్ప అందరికీ మార్గదర్శి కావాలని కోరుకుంటున్నాను.. ప్రభుత్వం ఇలాంటి వ్యక్తులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది..

ఉరిలో రహస్యమేల?

పార్లమెంట్ పై దాడి కేసులో అఫ్జల్ గురుకు ఉరి శిక్ష అమలు చేయడానికి ఎట్టకేలకు యూపీఏ సర్కారుకు ధైర్యం చాలింది.. అయితే శిక్షను అమలు చేసిన తీరే విచిత్రంగా ఉంది.. అఫ్జల్ గురు, అంతకు ముందు అజ్మల్ కసబ్ లను రహస్యంగా ఉరి తీశారు.. ఉరి తీయడానికి అంత రహస్యం పాటించాల్సిన అవసరం ఏమిటి? హిందుత్వానికి తీవ్ర వాదానికి లింకులు పెట్టడానికి ప్రయత్నించి భంగ పడ్డ కాంగ్రెస్ పార్టీ, వారి ఓట్లను దూరం చేసుకోవడానికి ఇష్టం లేకే ఇంత కాలంగా తాము ఇంటా అల్లుళ్ల మాదిరిగా జైళ్లలో మేపుతున్న ఈ ఘరానా తీవ్రవాదులను అయిష్టంగానే ఉరి తీయక తప్పలేదు..
కసబ్ ను ఉరి తీసినప్పుడు నోరు మెదపడానికి సాహసించని వారు ఇప్పుడు అఫ్జల్ ను ఉరి తీయడాన్ని తప్పు పడుతున్నారు.. భారత ప్రజాస్వామ్య వ్యవస్థపై దాడి చేసిన పాకిస్తాన్ ప్రేరిత తీవ్ర వాదులకు వత్తాసు పలుకుతున్న ఇలాంటి వారిని ఏమనాలో అర్థం కావడం లేదు.. ఎందుకు ఉరి శిక్ష అమానుషం అనేది వీరి వాదన.. కానీ వీరు సమర్థిస్తున్న సిద్దాంతం తాలూకూ వ్యక్తులు ఆయుధాలు ధరించి ఎన్ని హత్యలు చేసినా, దోపిడీలు చేసినా తప్పు లేదేమో?.. ఎందుకీ ద్వంద్వ వైఖరి.. అఫ్జల్ గురు అమాయకుడంటున్నారు.. మరి ఈ విషయాన్ని న్యాయస్థానంలో ఎందుకు నిరూపించలేకపోయారో?
కొందరు వ్యక్తులు మతాన్ని బట్టి వాదనలు మారుస్తారు.. వారి దృష్టిలో ఒక మతం వారు చేస్తే ఉరి తీయాల్సిన నేరం, మరో మతం వారు చేస్తే ఉరి తీయకుండా జైలు శిక్ష వేస్తే చాలు.. పైగా సుదీర్ఘ కాలం శిక్ష అనుభవించి పశ్చాతాప పడుతున్నందుకు వదిలేయాలని వాదిస్తారు.. ఎందుకీ ద్వంద్వ నీతి? తీవ్రవాదానికి, మతానికి సంబంధం లేదు.. మతం ముసుగులో ఎవరు తప్పు చేసినా క్షమించరాదు..

Saturday, February 2, 2013

భారతీయుడు

కొంత కాలం క్రితం ఓ పెద్ద మనిషి నీ బ్యాక్ గ్రౌండ్ ఏమిటి?’ అని ప్రశ్నించాడు..
జర్నలిస్టుఅని చెప్పాను..
నేనడిగింది నీవెవరని?’.. ఆయన తొలి ప్రశ్న నాకు అర్థం కాలేదని భావించి కాస్త డీటైల్డ్ గా ప్రశ్నించాడు..
అబ్బ అది కాదు బాసూ.. నేనడిగింది నీ కులం గురించి.. గురుడు అసలు విషయానికి వచ్చేశాడు..
అప్పుడు నేను కాస్త గంభీరంగానే సమాధానం చెప్పాను..
“I am INDIAN”.. “నేను భారతీయుడిని..
ఓహో కమల్ హాసన్ వా? అయితే అందుకేనా నీ జుట్టు కాస్త ముందుకుంది.. ఆ పెద్ద మనిషి ఎక్కసెక్కేలాడాడు.. (కారణమేంటో తెలియదు.. ఎంత దువ్వినా నా జుట్టు ముందుకే పడుతుంది)
నేను నా పేరులో కులం ప్రస్థావన లేకుండా జాగ్రత్త పడతాను.. భారతీయునిగా చెప్పుకోవడానికి గర్వపడతాను.. భారతీయుడినని చెప్పగానే ఆ పెద్ద మనిషి ఆ పెద్ద మనిషి క్రూరమైన జోక్ వేశానని అనుకొని నవ్వుకున్నాడు..
శంకర్ దర్శకత్వంలో సొంత కొడుకునే క్షమించని, అవినీతి వ్యవస్థపై పోరాడిన స్వాతంత్ర్య సమరయోధుడిగా భారతీయుడు చిత్రంలో కమల్ హాసన్ అద్భుతంగా నటించారు.. ఇదే చిత్రం తమిళంలో ఇండియన్గా, హిందీలోహిందుస్తానీగా వచ్చింది..

నిజానికి నేను సినిమాలు చూసేది చాలా తక్కువ.. చూసేవి కూడా ఎక్కువగా కమల్ హాసన్ వే.. చిన్నప్పటి నుండి కమల్ కు నేను వీరాభిమానిని.. భారత దేశంలోనే ఆయన గొప్ప నటుడని గట్టిగా చెప్పగలను.. నిరూపిస్తాను కూడా.. దురదృష్ట వశాత్తు మన తెలుగు ఇండస్ట్రీలో కమల్ లాంటి గొప్ప నటుడు, ఆయనలా వినూత్న ప్రయోగాలు చేసే నటుడు లేడని బాధ పడుతుంటాను..

Friday, February 1, 2013

పోలీసులంతా ఇంతేనా?..

ఆయన నిజంగా నేరమే చేసి ఉండొచ్చు.. పోలీసులు చెప్పనట్లు వారిపట్ల దురుసుగానే ప్రవర్తించి ఉండొచ్చు.. అంత మాత్రాన ఒక రౌడీ షీటర్ ను లాక్కెళ్లినట్లు, చొక్కా సరిగ్గా వేసుకోని, లుంగీ ఊడిపోతున్న స్థితిలో పట్టుకెళ్లి పోలీసు వాహనంలో పట్టుకెళ్లడం సమంజసమేనా? పైగా తమపై దౌర్జన్యం చేసినట్లు పోలీసు స్టేషన్లో కేసు పెట్టేశారు..
ఇటీవలి వరకూ రాష్ట్ర మంత్రిగా ఉన్న వ్యక్తి, సీనియర్ శాసనసభ్యుడు శంకర్రావుకు పోలీసులు చేసిన మర్యాద ఏ పాటిదో ప్రజలంతా టీవీల్లో ప్రత్యక్షంగా చూశారు.. ఒక ప్రముఖ వ్యక్తి పట్లే పోలీసుల ప్రవర్తన ఇలా ఉంటే సామాన్యుల పరిస్థితి ఏమిటి? చట్టసభ సభ్యుడినే గౌరవించలేని పోలీసులు సామాన్య ప్రజల పట్ల ఎలా ప్రవర్తిస్తారో ఊహించుకోండి.. బహుషా చట్టం ముందు అందరూ సమానమే అని పోలీసులు బుకాయిస్తారేమో?.. సామాన్యునిలాగే గౌరవ శాసనసభ్యున్ని ట్రీట్ చేశామని గొప్పలకు పోతారేమో?
ఒక సీనియర్ జర్నలిస్టుగా మన పోలీసులను చాలా దగ్గర నుండి చూశాను.. నిజానికి వారికి పాత్రికేయులంటే చాలా చులకన భావం ఉంటుంది.. రెండేళ్ల క్రితం రవీంద్రభారతిలో నాటి ముఖ్యమంత్రి కార్యక్రమాన్ని కవర్ చేయడానికి వెళ్లిన నాకు ఇలాంటిదే ఓ వింత అనుభవం ఎదురైంది.. మీడియా ద్వారం వైపు వెళ్లుతున్న నన్ను ఓ ఖాకీ అటకాయించి ఏకంగా చొక్కా పట్టేశాడు.. నేను తీవ్రంగా స్పందించే సరికి సారీ ప్రెస్ అని తెలియదని బుఖాయించేశాడు.. ఆ మహానుభావుడికి నా మెడలో ఐడీ కార్డు కూడా కనిపించనంగా క్రౌర్యం కళ్లకెక్కిందేమో?..
ఖాకీ డ్రెస్ వేసేవారంతా తాము ఎలా ప్రవర్తించినా చెల్లుతుందనుకుంటారేమో?.. సాటి వ్యక్తికి గౌరవించలేని కరుదుదనం వారిలో అణువణువునా ఉంటుందనుకుంటా? పీపుల్స్ ఫ్రెండ్లీ కాప్స్అనే పదానికి వారికి అర్థమే తెలియదేమో? అసలు పోలీసులకు ఇచ్చే శిక్షణే ఇలా ఉంటుందా అనే అనుమానం కలుగుతుంది.. పోలీసులంటే నేరగాళ్లు భయపడాలి.. కానీ మన వ్యవస్థలో నేరగాళ్లు గల్లా ఎగరేసుకొని తిరుగుతుంటే సామాన్యుడు ఖాకీ డ్రెస్ వేసిన వారిని చూసి జడుసుకునే పరిస్థతి ఉంది..
నా బంధు మిత్రుల్లో చాలా మంది పోలీసు వృత్తిలో ఉన్నారు.. వారిని దగ్గర నుండి చూసి చెబుతున్న మాటలివి.. అయితే అందరూ ఇలాగే ఉంటారని మాత్రం నేను చెప్పడం లేదు.. ప్రతి వృత్తిలో మంచి వారు ఉంటారు. చెడు వారు కూడా ఉంటారు.. అది పోలీసు వృత్తి అయినా, పాత్రికేయ వృత్తి అయినా మంచీ చెడూ నాణేనికి రెండు వైపులా ఉంటాయి.. నా ఆవేదన అంతా రెండో శ్రేణి వారిగురుంచే..