Thursday, February 14, 2013

ప్రేమికులకో దినమా?


ఈ ప్రపంచంటో అర్ధంలేని దినాల్లో ఒకటి ప్రేమికుల దినం (వాలెంటైన్స్ డే).. అసలు ప్రేమ అంటే ఏమిటి?.. దురదృష్టవశాత్తు ప్రేమ అంటే ఆడ, మగ మధ్య అనే నడిచే వ్యవహారం అనే అపోహ మన సమాజంలో ఉంది.. ఇందుకు కారణం సినిమాలు, సాహిత్య ప్రభావమే.. నిజానికి ప్రేమకు విస్తృత అర్థం ఉంది.. ప్రేమ కేవలం ప్రేయసీ, ప్రియులకు సంబంధించినది మాత్రమే కాదు.. మనం భగవంతున్ని ప్రేమిస్తాం.. తల్లిదండ్రులను, తోబుట్టువులను, బంధుమిత్రులను,  తోటి మనుషులను సైతం ప్రేమిస్తాం..  
ప్రేమ అనేది అనంతం, శాశ్వతం, నిత్య నూతనం.. ప్రేమను ఒక్క రోజుకు పరిమితం చేయగలమా? ప్రేమ ఒక్క రోజులో పుట్టి, ఒక్క రోజులోనే అంతరిస్తుందా? అలాంటప్పుడు ఎందుకీ అర్థం పర్థం లేని ప్రేమికుల రోజు.. నిజానికి మన దేశంలో ప్రేమికుల రోజు జరుపుకోవడం మెట్రో నగరాలకే పరిమితంగా ఉండేది.. కానీ మీడియా పుణ్యమా అని రెండు దశాబ్దాలుగా చిన్న పట్టణాలకు, గ్రామీణ ప్రాంతాలకూ వ్యాపించింది.. గ్రీటింగ్ కార్డులు, గిఫ్టులు అమ్ముకునేవారికి వ్యాపార లాభాలు, మీడియాకు ప్రకటనలు, టీఆర్పీ రేటింగ్ల ఆదాయానికి మాత్రమే పనికి వచ్చే దినమిది..
ఒక్కసారి మనం చరిత్ర పుటలను తిరగేస్తే వాలెంటైన్స్ డే ఎందుకు జరుపుకుంటారు అనే దానికి సూటిగా సమాధానం ఉండదు.. (వీకీపీడియా, ఇతర సర్చ్ ఇంజన్లు తిరగేసి చూడండి) వాలెంటైన్స్ డే మత పరమైన వేడుకే తప్ప ప్రేమికులకు సంబంధించింది కాదు.. ఓ మత ప్రచారకుడు ప్రేమతత్వాన్ని ప్రచారం చేయడం.. అతన్ని చక్రవర్తి బంధించి ఉరి తీయడం.. ఈ లోగా ఆ ప్రచారకుడు జైలరు కూతురుకు ప్రేమ లేఖ రాయడం (కూతురు వయసులో ఉన్న యువతిపై ఆ మత ప్రచారకునికి ప్రేమ ఏమిటో?)..

వాలెంటైన్స్ డే రోజులన గ్రీటింగ్స్, గిఫ్టులు ఇచ్చి పుచ్చుకొని పార్కులు, గట్లెమ్మట తిగినంత మాత్రాన ప్రేమ బలపడుతుందా? ఈ ఒక్క రోజు ప్రేమించుకుంటే చాలా? ప్రేమ అనేది శాశ్వతంగా ఉండాలి కాని దానికో దినం పెడితే ఎలా? నిజానికి దినాలు జరుపుకోవడం మన సాంప్రదాయం కాదు.. ఎవరైనా నా భావాలతో ఏకీభవిస్తే సంతోషం.. ఏకీభవించకున్నా నేనేమీ బాధపడను.. నేను ఎవరి మనోభావాలనైనా నొప్పించి ఉంటే క్షమించాలని కోరుకుంటున్నాను..

No comments:

Post a Comment