Monday, February 25, 2013

బాధ్యత లేని మీడియా, నాయకులు..


దిల్ సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల తర్వాత మన నాయకులు, మీడియా బాధ్యత లేకుండా వ్యవహరించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది..
బాంబు పేలుళ్లు జరగగానే రాజకీయ నాయకులు ఢిల్లీ నుండి గల్లీ దాకా నాయకులు సంఘటనా స్థలంలో వాలిపోయారు.. తామేదో మైలేజీ కోల్పోతామన్నట్లుగా ఒకరి చూసి ఒకరు సంఘటనా స్థలానికి పరుగెత్తి దర్యాప్తు సంస్థలకు ఇబ్బంది కలిగించడం ఎంత వరకూ సమంజసం.. ఇలాంటి విపరీత ప్రవర్థన కారణంగా కేసు దర్యాప్తుకు అవసరమైన ప్రాథమిక ఆదారాలకు నష్టం జరిగిన విషయం ఆ నాయకులకు అర్థం అయ్యిందా? పోలీసులు ప్రజల భద్రతను పక్కన పెట్టి వీరికి భద్రత కల్పించడమెలా అని హైరానా పడిపోయారు.. అంతగా కుతూహలం ఉంటే పోలీసులు దర్యాప్తు ఆధారాలు సేకరించిన తర్వాత వెళ్లవచ్చు..అయ్యా నాయకులారా.. ఇలాంటి క్లిష్ట సమయంలో ప్రజలెవరూ మీ సందర్శనలు, పరామర్శలు ఆశించడం లేదని గ్రహించండి..
ఇక మీడియా విషయానికి వద్దాం.. బాంబు పేలుళ్ల కేసులలో నిఘా సంస్థలు, పోలీసులు సేకరిస్తున్న ఆధారాలను ఎప్పటికప్పడు బట్టబయలు చేస్తున్న మీడియా కేసు దర్యాప్తుకు అవరోధాలు కల్పిస్తోందా అనిపిస్తోంది.. ముంబాయిపై దాడి సమయంలో టీవీ ఛానెళ్లు ఇచ్చిన లైవ్ చూసి అప్రమత్తమైన తీవ్రవాదులు తమను పట్టుకోవడానికి వచ్చిన పోలీసులు మరింత ఎక్కువ సంఖ్యలో పొట్టన పెట్టుకున్నారు.. ఇది కాదేనలేని నిజం.. ఇప్పడు హైదరాబాద్ పేలుళ్ల దర్యాప్తు విషయంలో మీడియా ఇస్తున్న కథనాలు అదే స్థాయిలో ఉన్నాయి.. దర్యాప్తు జరుగుతున్న తీరును ఎప్పటికప్పడు ప్రకటించడం ద్వారా తీవ్రవాదులు తప్పించుకునే అస్కారాన్ని కల్పిస్తోంది మన మీడియా.. ఇవాళ ఓ ఛానెల్లో చూసిన స్క్రోలింగ్ ఆశ్యర్యాన్ని కలిగించింది.. దర్యాప్తు సంస్థలు తనను వేధిస్తున్నాయని ఒకాయన ఆ ఛానలోడితో ఏడిచాడట.. అయ్యా.. వాడి నేరం ఏమిటో విచారణలో నిగ్గు తేలుతుంది కదా? అతగాడు నిర్దోషి అని వకాల్తా పుచ్చుకునే అధికారం మీకు ఎక్కడిది?

 అమెరికా లాంటి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో సెప్టెంబర్ 11 సంఘటన తర్వాత అక్కడి మీడియా కనీసం మృతుల సంఖ్యను కూడా ప్రకటించకుండా.. కీలకమైన దర్యాప్తు అంశాలను బయటపెట్టకుండా ఎంతో నిగ్రహం, సంయమనం పాటించింది.. అలాంటి సంయమనం మన మీడియాకు ఎందుకు లేదో?.. మీ పోటీలకు, రేటింగ్లకు తగిన సమయమేనా ఇది.. అసలు పోలీసులు, నిఘా సంస్థలు తప్పుకొని బాంబు పేలుళ్ల కేసు దర్యాప్తును మీడియాకే అప్పగిస్తే మంచిదేమో? నేర వార్తల కవరేజీ విషయంలో మీడియా విచారణ ప్రతికూల ప్రభావాలను చూపే అవకాశం ఉందని ఇటీవల సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి అల్తమస్ కబీర్ ఆందోళన వక్తం చేయడం గమనించాల్సిన అవసరం ఉంది..

No comments:

Post a Comment