Friday, February 22, 2013

దిల్ దు:ఖ్ నగర్


దిల్ సుఖ్ నగర్ ఈ పేరులోనే ఎంతో సంతోషం కనిపిస్తుంది.. మన మనస్సు ఎంతో సుఖంగా ఉండాలని కోరుకుంటున్న ప్రాంతం.. నిత్యం వచ్చి పోయే ప్రయాణీకులతో, వ్యాపార, విద్యాసంస్థలు, సినిమా ధియేటర్లతో కళకళలాడే ప్రాంతం ఇది.. ఒక్కడి రద్దీ రోడ్లు, గల్లీల్లో తిరగాలే కానీ.. ఈ జనాన్ని చూస్తుంటే నిజంగా మన దిల్ కు ఎంతో సుఖం’ అనిపిస్తుంది..
జర్నలిస్టుగా నా కెరీర్ ప్రారంభించింది దిల్ సుఖ్ నగర్లోనే.. త్రినేత్ర సూపర్ మార్కెట్ పైన ఉండే ఈనాడు జోనల్ ఆఫీస్, మధుర స్వీట్స్, వెంకటాద్రి పక్కన ఉడిపి హోటల్ టిఫిన్స్, కోణార్క్ ముందు విల్సన్ కేఫ్ ఛాయ్.. ఇవన్నీ నా జీవితంలో మరచిపోయేని తీపి గుర్తులు.. దురదృష్టవశాత్తు మధుర స్వీట్స్ తప్ప త్రినేత్ర సూప్ మార్కెట్, ఈనాడు జోనల్ ఆఫీసు, ఉడిపి హోటల్, విల్సన్ కేఫ్ ఇప్పుడు లేవు.. విల్సన్ కేఫ్ పోయి ఆనంద్ టిఫిన్ సెంటర్ వచ్చింది (ఇక్కడే బాంబు పేలింది).. నా జీవితంలో రెండొంతులకు పైగా దిల్ సుఖ్ నగర్ గుర్తులు నిండిపోయాయి..

నిన్నటి దినం (21 ఫిబ్రవరి 2013) సాయంత్రం వేళ సరిగ్గా 6 గంటల 10 నిమిషాలకు దిల్ సుఖ్ నగర్ కోణార్క్ సమీపంలోనే ఛాయ్ తాగి వెళ్లాను.. కొద్ది నిమిషాలకే ఆ ప్రాంతంపై ఉగ్రవాదులు పంజా విసరడం నన్నెంతో కలచి వేసింది.. 25.08.2007 నాడు ఇలాగే కోఠిలోని గోకుల్ ఛాట్ భండార్లో సమోసా తిని బయలు దేరిన 5 నిమిషాలకే అక్కడో దారుణ సంఘటన జరిగింది.. (గతంలో ఫేస్ బుక్ లో ప్రస్థావించాను) ఇలా రెండుసార్లు మృత్యువు నుండి వెంట్రుక వాసిలో బయటపడ్డాను.. కానీ ఆనాటి, ఈనాటి ఉగ్రవాద చర్యల్లో ఎందరో అమాయకులు బలైపోయారు?.. వీరి ప్రాణాలకు ఎవరు తిరిగివ్వగలరు?.. నా జీవితంలో మరచిపోలేని చేదు గుర్తులు ఇవి.. 

No comments:

Post a Comment