Friday, February 1, 2013

పోలీసులంతా ఇంతేనా?..

ఆయన నిజంగా నేరమే చేసి ఉండొచ్చు.. పోలీసులు చెప్పనట్లు వారిపట్ల దురుసుగానే ప్రవర్తించి ఉండొచ్చు.. అంత మాత్రాన ఒక రౌడీ షీటర్ ను లాక్కెళ్లినట్లు, చొక్కా సరిగ్గా వేసుకోని, లుంగీ ఊడిపోతున్న స్థితిలో పట్టుకెళ్లి పోలీసు వాహనంలో పట్టుకెళ్లడం సమంజసమేనా? పైగా తమపై దౌర్జన్యం చేసినట్లు పోలీసు స్టేషన్లో కేసు పెట్టేశారు..
ఇటీవలి వరకూ రాష్ట్ర మంత్రిగా ఉన్న వ్యక్తి, సీనియర్ శాసనసభ్యుడు శంకర్రావుకు పోలీసులు చేసిన మర్యాద ఏ పాటిదో ప్రజలంతా టీవీల్లో ప్రత్యక్షంగా చూశారు.. ఒక ప్రముఖ వ్యక్తి పట్లే పోలీసుల ప్రవర్తన ఇలా ఉంటే సామాన్యుల పరిస్థితి ఏమిటి? చట్టసభ సభ్యుడినే గౌరవించలేని పోలీసులు సామాన్య ప్రజల పట్ల ఎలా ప్రవర్తిస్తారో ఊహించుకోండి.. బహుషా చట్టం ముందు అందరూ సమానమే అని పోలీసులు బుకాయిస్తారేమో?.. సామాన్యునిలాగే గౌరవ శాసనసభ్యున్ని ట్రీట్ చేశామని గొప్పలకు పోతారేమో?
ఒక సీనియర్ జర్నలిస్టుగా మన పోలీసులను చాలా దగ్గర నుండి చూశాను.. నిజానికి వారికి పాత్రికేయులంటే చాలా చులకన భావం ఉంటుంది.. రెండేళ్ల క్రితం రవీంద్రభారతిలో నాటి ముఖ్యమంత్రి కార్యక్రమాన్ని కవర్ చేయడానికి వెళ్లిన నాకు ఇలాంటిదే ఓ వింత అనుభవం ఎదురైంది.. మీడియా ద్వారం వైపు వెళ్లుతున్న నన్ను ఓ ఖాకీ అటకాయించి ఏకంగా చొక్కా పట్టేశాడు.. నేను తీవ్రంగా స్పందించే సరికి సారీ ప్రెస్ అని తెలియదని బుఖాయించేశాడు.. ఆ మహానుభావుడికి నా మెడలో ఐడీ కార్డు కూడా కనిపించనంగా క్రౌర్యం కళ్లకెక్కిందేమో?..
ఖాకీ డ్రెస్ వేసేవారంతా తాము ఎలా ప్రవర్తించినా చెల్లుతుందనుకుంటారేమో?.. సాటి వ్యక్తికి గౌరవించలేని కరుదుదనం వారిలో అణువణువునా ఉంటుందనుకుంటా? పీపుల్స్ ఫ్రెండ్లీ కాప్స్అనే పదానికి వారికి అర్థమే తెలియదేమో? అసలు పోలీసులకు ఇచ్చే శిక్షణే ఇలా ఉంటుందా అనే అనుమానం కలుగుతుంది.. పోలీసులంటే నేరగాళ్లు భయపడాలి.. కానీ మన వ్యవస్థలో నేరగాళ్లు గల్లా ఎగరేసుకొని తిరుగుతుంటే సామాన్యుడు ఖాకీ డ్రెస్ వేసిన వారిని చూసి జడుసుకునే పరిస్థతి ఉంది..
నా బంధు మిత్రుల్లో చాలా మంది పోలీసు వృత్తిలో ఉన్నారు.. వారిని దగ్గర నుండి చూసి చెబుతున్న మాటలివి.. అయితే అందరూ ఇలాగే ఉంటారని మాత్రం నేను చెప్పడం లేదు.. ప్రతి వృత్తిలో మంచి వారు ఉంటారు. చెడు వారు కూడా ఉంటారు.. అది పోలీసు వృత్తి అయినా, పాత్రికేయ వృత్తి అయినా మంచీ చెడూ నాణేనికి రెండు వైపులా ఉంటాయి.. నా ఆవేదన అంతా రెండో శ్రేణి వారిగురుంచే..

No comments:

Post a Comment