Tuesday, July 12, 2016

ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ..

కొన్నాళ్లుగా కుదుట పడుతున్న కాశ్మీరంలో కల్లోల వాతావరణం నెలకొంది.. శ్రీనగర్ తో పాటు పలు పట్టణాలు నిరసనలు, కాల్పులతో అట్టుడుకుతున్నాయి.. హిజ్బుల్ ముజాహిద్దీన్ కమాండర్ బుర్హాన్ వనీ ఎదురు కాల్పుల్లో మరణించిన తర్వాత ఉద్రిక్తతలు నెలకొన్నాయి.. కాశ్మీర్ లో పరిస్థితులు పునరావృతం కానున్నాయా?.. కాదు కానే కాదు..

ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ.. కాశ్మీర్ లో ఉగ్రవాదం పరిస్థితి అంతే.. పండుగ చేసుకోవానికి సందర్భం ఏదైతేనేం అన్నట్లు ప్రశాంత పరిస్థితులను భగ్నం చేయడానికి పాకిస్తాన్ ప్రేరిత వేర్పాటువాద శక్తులకు ఏదో ఒక కారణం కావాలి.. అది బుర్హాన్ వనీ రూపంలోవచ్చింది..
గతంతో తీవ్రవాదులంతా పాకిస్తాన్ నుండి వచ్చి కాశ్మీర్లో కార్యకలాపాలు సాగించేవారని, బుర్హాన్ స్థానికుడు కావడం వల్లే ఉద్రిక్తతలు నెలకొన్నాయని విశ్లేషిస్తున్నారు.. మరి బుర్హాన్ కమాండర్ గా ఉన్న హిజ్బుల్ ముజాహిద్దీన్ సంస్థ ఎక్కడిది?.. ఆయన అంత్యక్రియల సందర్భంగా ఎగిరిన జెండాలు ఎక్కడివి?.. ఆజాదీ అంటూ పాచిపాట పాడేవారంతా కాశ్మీర్ ను పాకిస్తాన్ లో కలపాలని కోరేవారే కదా?
కాశ్మీరీల స్వీయ నిర్ణయ హక్కు గురుంచి మాట్లాడే గురవింద పాకిస్తాన్ ముందు తనకింద నలుపు చూసుకోవాలి.. కబ్జాలో ఉన్న పీవోకేను భారత్ కు తిరిగి అప్పగించకుండా చిలకపలుకులు పలుకుతోంది.. అంతర్గత వర్గపోరుతో కొట్టుకు చస్తున్న పాక్, కాశ్మీర్ లోనూ అదే పరిస్థితి ఏర్పడాలని కోరుకోవడం సహజం కదా?.. 

No comments:

Post a Comment