Saturday, January 31, 2015

ఛ‌త్తీస్‌గ‌డియా స‌బ్‌లే బ‌డియా..

छत्तीसगढ़िया सबले बढ़िया.. రాయ్‌పూర్‌ శివారులో స్వామి వివేకానంద విమానాశ్రయం వెళ్లే రోడ్డులో స్వాగత ద్వారంపై కనిపించిన వాక్యం ఇది.. అంటే ఛ‌త్తీస్‌గ‌డ్‌ చాలా ఉత్తమమైనది అని అర్థం..
ఛ‌త్తీస్‌గ‌డ్‌ రాజధాని రాయ్‌పూర్‌ వెళతానని ఎప్పుడూ అనుకోలేదు.. మహా అయితే మన దేశంలో ఢిల్లీ, ముంబై లాంటి మెట్రో నగరాలకో లేదా పర్యాటక ప్రదేశాలకో, పుణ్యక్షేత్రాలకో ఏదో ఒక సందర్భంలో వెళతాం.. కానీ రాయ్‌పూర్‌ వెళ్లాల్సిన అవసరమే పడకపోవచ్చు.. కానీ ఈ చిన్న నగరానికి అనుకోకుండా వెళ్లాను.. ఒక విధంగా మంచిదే అయింది.. లేకపోతే ఒక అందమైన నగరాన్ని చూసే అవకాశం కోల్పోయేవాన్నే..
రాయ్‌పూర్‌.. 11 లక్షల జనాభా గల ఈ చిన్న నగరం ఎంతో సుందరంగా కనిపించింది. హైదరాబాద్ నగరంతో పోలిస్తే రాయ్‌పూర్‌ రోడ్లు చాలా నయం అనిపించింది. విశాలమైన రోడ్లకు తోడు ట్రాఫిక్, కాలుష్యం కూడా చాలా తక్కువ.. తెల్లని చొక్కాలు, టోపీలతో ట్రాఫిక్ కానిస్టేబుల్స్ కౌబాయ్స్ మాదిరిగా కాస్త వింతగా కనిపించారు. తక్కువ వ్యవధి ఉన్నందున రాయ్‌పూర్‌ నగరంలోని ప్రదేశాలన్నింటినీ పెద్దగా చూడలేకపోయాం.. కానీ నగర్ గడీ క్లాక్ టవర్, షహీద్ స్మారక్ చౌక్, వివేకానంద సరోవర్, మాలవీయ మార్గ్, బిరాన్ బజార్ల మీదుగా కారులో ప్రయాణించాం..
ఛ‌త్తీస్‌గ‌డ్‌ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ పరిపాలనా దక్షత చూడాలంటే రాయ్‌పూర్‌ చూస్తే చాలనిపించింది.. కొత్తగా నిర్మిస్తున్న నయా రాయ్‌పూర్‌ మరో అద్భుతం.. కానీ సమయాభావం వల్ల సందర్శించలేకపోయాం..
అంతా బాగానే ఉంది కానీ రాయ్‌పూర్‌ ఆహారం తలచుకుంటేనే భయమేసింది.. పొద్దున్నే కచోరీ, జిలేబీల అల్పాహారం.. భోజనంలో లావుపాటి జిడ్డు పూరీలు భరించలేక పోయాం.. రాయ్‌పూర్‌ వాసులు పెరుగు, మజ్జిగ అంతగా వాడరనుకుంటాను.. మనకు అవి లేనిదే ముద్ద దిగదాయే.. అక్కడి ఆహారంలో కారాలు, మసాలాల వాడకం కాస్త తక్కువే.. ఇదీ ఒకందుకు మంచిదే అనిపించింది..

జమ్మూ కశ్మీర్ అధ్యయన కేంద్రం జాతీయ సదస్సు కోసం ఎన్వీకె ప్రసాద్, రాకా సుధాకర్, రవిశంకర్, విక్రం సింహా, చౌదరి గార్లతో ఇటీవల రాయ్‌పూర్‌ నగరానికి వెళ్లాను.. నిజంగా ఈ నగర దర్శనం చాలా చక్కని అనుభూతిని ఇచ్చింది.. రాయ్‌పూర్‌ను చూసి పరవశించిపోయిన మా బృందంలోని ఒక మిత్రుడు ఒక్కడే స్థిరపడి వ్యాపారం పెట్టేసుకుంటాననేశాడు.. నాకైతే మరోసారి ఈ నగరాన్ని చూసేందుకు వెళ్లాలనిపిస్తోంది..

Friday, January 30, 2015

తమశీల్దారుకు షాకిచ్చిన రైతన్న

'మరీ ఇంత అన్యాయమా?.. అసలు ఈ లోకంలో నీతి, నిజాయితీలు లేకుండా పోయాయి..' ఒకటే రొదపెట్టేస్తున్నాడు నా మిత్రుడు.
'ఇంతకీ ఏం జరిగిందో చెప్పండి..' ఆయన మాటలకు అడ్డు పడ్డాను.
'ఛీ వాడు అన్నమే తింటున్నాడా?.. అసలు మనిషేనా వాడు..' తన దండకం ఆపలేదు మన మిత్రుడు.
'విషయం ఏమిటో సూటిగా చెప్పు..' కాస్త గట్టిగానే అడిగేశాను.
'చెప్పుకోవడానికే సిగ్గుగా ఉంది.. అయినా నీకు కాబట్టి చెప్పేస్తున్నా.. మొన్నొక రైతు తీసుకొచ్చి ఇచ్చిన డబ్బులో అన్నీ దొంగ నోట్లే ఉన్నాయి..' గొల్లుమంటూ చెప్పుకొచ్చాడు మనోడు..
'అయ్యయ్యో.. నిజంగానే ఇది అన్యాయం.. అంతే కాదు దేశ ద్రోహం కూడా.. ఇంతకీ ఆ రైతు ఆ డబ్బులు ఎందుకు ఇచ్చాడు?..' ఊరడిస్తూ అడిగాను.
'పట్టాదారు పాసు పుస్తకం కోసం ఇచ్చిన డబ్బు అది..' నిజం కక్కేసి నాలిక కరుచుకున్నాడు మన తహశీల్దారు మిత్రుడు..
అవాక్కవ్వడం నా వంతైంది.. రైతు మిత్రమా.. మీకు పొర్లు దండాలు..

Wednesday, January 28, 2015

దత్తన్న @ కామన్ మాన్

మన దత్తన్న నాకు common manలాగే కనిపిస్తారు.. మీకూ అలాగే అనిపిస్తుందా?..

మా చిన్నబ్బాయి ఆదర్శ్ పుట్టిన రోజు..


జమ్మూ కశ్మీర్ సమస్యను అర్ధం చేసుకోండి..

‘’జమ్మూ కశ్మీర్ సమస్య ఈ దేశ ప్రజలందరిదీ.. శరీరంలో ఏ భాగానికి హాని కలిగినా మొత్తం దేహంపై ప్రభావం చూపినట్లే కశ్మీర్ సమస్య కూడా దేశ భద్రతను ప్రభావితం చేస్తుంది.. భారత దేశంలో జమ్మూ కశ్మీర్ రాష్ట్ర విలీనం విషయంలో ఎలాంటి సమస్య లేదు.. ఇది కేవలం బ్రిటిష్ వారి కుట్రకు తోడు ఢిల్లీ కేంద్రంగా సృష్టించిన సమస్యే.. జమ్మూ కశ్మీర్ సమస్యకు మూలం సరైన సమాచారం అందుబాటులో లేకపోవడమే.. ఇందుకు ప్రధాన బాధ్యత రాజకీయ నాయకులకన్నా విద్యావంతులు, మీడియాదే.. భారత్ లోని అన్ని రాష్ట్రాల మాదిరిగానే కశ్మీర్ దేశంలో సంపూర్ణ అంతర్ భాగం.. ఈ విషయంలో దేశ ప్రజలందరికీ అవగాహన కల్పించాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది.. జమ్మూ కశ్మీర్ గురుంచి ముందుగా తెలుసుకోండి, అర్థం చేసుకోండి, కలుపుకోండి.. ఈ దిశగా మనందరం పని చేద్దాం..’’
జమ్మూ కశ్మీర్:నిజానిజాలు
అనే అంశంపై ఛత్తీస్ గఢ్ రాజధాని రాయపూర్ లో జనవరి 24,25 తేదీల్లో జాతీయ సదస్సు జరిగింది.. ఈ సదస్సుకు వచ్చిన ప్రతినిధులకు జమ్మూ కశ్మీర్ అధ్యయన కేంద్రం డైరెక్టర్ అరుణ్ కుమార్ జీ ఇచ్చిన సందేశం ఇది..

Tuesday, January 27, 2015

సామాన్యునికి మరణం లేదు..

నేను ఎంతో అభిమానించే కార్టూనిస్ట్ ఆర్.కే.లక్ష్మణ్.. ఆయన సృష్టించిన సామాన్యుని పాత్ర కూడా అంతే ఇష్టం.. చాలా కాలంగా లక్ష్మణ్ అనారోగ్యంతో బాధ పడుతూ కనుమూయడం బాధాకరమే.. కానీ పుట్టిన ప్రతి వ్యక్తికీ మరణం తప్పదు అని గుర్తు తెచ్చుకోక తప్పదు.. ఆర్.కే.లక్ష్మణ్ లేకపోవచ్చు.. కానీ ఆయన సృష్టించిన సామాన్యుని పాత్రకు మరణం లేదు..ఈ సామాన్యుడు ఆరు దశాబ్దాలుగా మౌనంగానే ఉన్నాడు.. మౌనంగానే సమాజానికి చురకలంటిస్తూ వచ్చాడు.. సామాన్యుడు కొత్తగా కనిపించకపోవచ్చు కానీ ఆయన సంపుటాల్లో నిక్షిప్తమైన సామాన్యుని చిత్రాలు ఎప్పటికీ పలకరిస్తూ ఉంటాయి.. రేఖా విన్యాసాల్లో.. ఎందరో చిత్రకారులకు, కార్టూనిస్టులకు ఆర్కే లక్ష్మణ్ రేఖలు భగవద్గీత మాదిరే పవిత్రమైనవి..వారిని నేను నిరంతరం స్మరించుకుంటూనే ఉంటాను..