Saturday, December 10, 2016

స్పూర్తినిచ్చే భగవద్గీత

భగవద్గీత.. ఈ పేరు వినగానే చాలా మంది హిందువుల పవిత్ర గ్రంథం అనేస్తారు..  కానీ నా దృష్టిలో ఇది కేవలం ఆధ్యాత్మిక గ్రంధం మాత్రమే కాదు.. ప్రపంచంలో మొదటి వ్యక్తిత్వ వికాస గ్రంథం.. సమాజంలో మనిషి ఉత్తమ పౌరునిగా ఎదిగేందుకు అవసరమైన మార్గాన్ని భగవద్గీత చూపిస్తుంది.. శ్రీకృష్ణ పరమాత్ర్మడు మహాభారత యుద్ధంలో అర్జునుడికి చేసిన కర్తవ్య బోధన భగవద్గీతగా ప్రసిద్దికెక్కింది.. ఈ 18 అధ్యాయాల భగవంతుని గీతంలో వేదాలు, ఉపనిషత్తుల సారాంశం నిక్షిప్తమై ఉంది.. భారతీయ ఆధ్యాత్మిక చింతనలో భగవద్గీతకు ప్రముఖ స్థానం ఉంది. అయితే దీన్ని కేవలం ధార్మిక గ్రంధంగా చూస్తే మది మన అజ్ఞానమే అవుతుంది..
తెలుగువారికి ఘంటసాల ఆలపించిన భగవద్గీతతో పరిచయం ఎక్కువ..
భగవద్గీత భారత జాతీయోధ్యమం, ఆధ్యాత్మిక, తాత్విక, సాంస్కృతిక పునర్జీవనాలకు స్పూర్తిని ఇచ్చింది.. మహర్షి దయానంద సరస్వతి, స్వామి వివేకానంద, బాలగంగాధర్ తిలక్, మహాత్మగాంధీ, బంకించంద్ర చటోపాధ్యాయ, అరబిందో ఘోష్, నేతాజీ సుభాష్ చంద్రబోస్, వీర్ సావర్కార్, భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, రాంప్రసాద బిస్మిల్, ఖుదీరాంబోస్, సుఖ్ దేవ్, రాజగురు, ఉద్దాం సింగ్ లాంటి ఎందరో మహనీయులు, వీరులు భగవద్గీత నుండి స్పూర్తిని పొందారు..
భగవద్గీత అంటే చనిపోయినప్పుడు వినిపించే ఘంటసాల సంగీతం అనే భావన చాలా మందిలో ఉండటం దురదృష్టకరం.. ఆత్మీయులను కోల్పోయిన సమయంలో బాధను మరచిపోయేందుకు, ఆధ్మాత్మిక చింతన కోసం భగవద్గీతను వినడంలో తప్పులేదు.. కానీ నిత్య జీవితంలో అన్ని సందర్భాల్లోనూ మనం గీతా పారాయణం చేయడంతో పాటు అందులోని విషయాలను ఆచరించాలి..
మరి కొందరు భవవద్గీతను పదవీ విరమణ తర్వాత కాలక్షేపం కోసం చదువుతారు.. కానీ జీవిత చరమాంకంలో మాత్రమే గీతను చదువుకోవడం వల్ల ఏం లాభం? ముందుగానే చదువుకుంటే వారు తమ జీవితాలను మరింత ఫలవంతంగా తీర్చి దిద్దుకునేవారు కదా?
భగవద్గీత కేవలం హిందువులదేనా?.. అలా అని శ్రీకృష్ణుడు ఎక్కడా అందులో చెప్పలేదే.. మానవ జీవితాన్ని మార్చేసిన ఆవిష్కరణలు, సిద్దాంతాలు ఒక మతానికే పరిమితం కాలేదు కదా? మరి కొన్ని వేల సంవత్సరాల క్రితం ఆవిర్భవించిన గీతాన్ని ఒక మతంతో ముడి పెట్టడం సమంజసమేనా? హిందుత్వం ఒక జీవన విధానం.. భగవద్గీత ఈ ధర్మాన్ని ఆచరించే వారి జీవితాన్ని పరిపూర్ణం చేస్తుంది.. అన్య మత విశ్వాసులకు ఈ అదృష్టం ఎందుకు దక్కరాదు?
నేడు గీతాజయంతి.. మార్గశీర్ష మాసం శుద్ధ ఏకాదశి రోజున భగవద్గీత ఆవిర్భవించింది.. ఈ శుభ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు..

No comments:

Post a Comment