Wednesday, February 28, 2018

మన భాషను కాపాడుకుందాం..



మిత్రులారా.. ఇవాళ మనం అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం.. అసలు విషయంలోకి వచ్చే ముందు మూడు ప్రశ్నలు వేసుకుందాం..
1. మీ పిల్లలు తెలుగు మాధ్యమంలోనే చదువుతున్నారా?
2. తెలుగు పత్రికలను స్పష్టంగా చదవగలరా?
3. అన్య భాషా పదాలు లేకుండా తెలుగులో మాట్లాడుతున్నారా?..
ఈ మూడు ప్రశ్నల్లో ఏ ఒక్కదానికీ ఔననే సమాధానం లేకపోతే మన ఇంట్లో తెలుగు భాషకు ప్రమాద ఘంటికలు మోగుతున్నట్లే లెక్క.. 
ప్రపంచంలో తెలుగు మాతృభాషగా ఉన్నవారి సంఖ్య 10 కోట్ల వరకూ ఉంటుందని ఒక అంఛనా.. ఇందుతో ఎక్కువ మంది ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనే ఉన్నారు.. కర్ణాటక, తమిళనాడు, ఒడిషా రాష్ట్రాల్లో 30 నుంచి 40 శాతం దాకా, మహారాష్ట్ర, పాండిచ్చేరిలలో 20 శాతం వరకూ తెలుగు వారు ఉన్నారు..
నిజానికి దేశంలో ఎక్కువ మంది ప్రజల మాతృభాష తెలుగే.. ఇందుకు మనం జబ్బలు చరచుకోవాల్సిన అవసరం లేదు.. ఎందుకు అంటే ప్రపంచంలో అంతరిస్తున్న భాషల జాబితాలో చేరేందుకు శతాబ్దంకన్నా ఎక్కువ కాలం పట్టకపోవచ్చు..
తెలుగు అధికారిక భాషగా గుర్తింపు ఉన్న రాష్ట్రాల్లోనే మాతృ భాషకు దిక్కు లేదు. రెండు రాష్ట్రాల పాలకులు తెలుగు భాషాభివృద్ధి గురుంచి సుద్దులు బాగేనే చెప్పుతారు. ఉత్సవాలు చేస్తారు, గంభీరమైన ప్రకటనలు చేస్తుంటారు.. కానీ ఆచరణలో మాత్రం ఏమీ ఉండదు.. తమిళనాడు, కర్ణాటకలు విపరీతమైన స్వభాషాభిమానంతో తెలుగు భాషను అణచివేస్తున్నాయని బాధపడతాం.. ఈ విషయంలో మనం ఎక్కువగా స్పందిస్తే గొంగట్లో వెంట్రుకలు ఏరినట్లే ఉంటుంది..
తెలుగు భాషకు ప్రాచీన హోదా కావాలని కేంద్రంతో పోరాడి సాధించుకున్నాం.. కానీ ఏం జరిగింది.. పీఠం ఏర్పాటును గాలికి వదిలేస్తే అది మైసూరులో స్థిరపడిపోయింది..
తెలుగు భాషా సంస్కృతుల పరిరక్షణ కోసం ప్రభుత్వం సక్రమంగా పని చేయడం లేదని, ఆంగ్లానికే పెద్ద పీట వేస్తున్నారని ఆరోపిస్తుంటాం.. కానీ భాషను రక్షించుకునే విషయంలో మన వంతు పాత్ర ఏమిటి అనే ప్రశ్నకు మాత్రం సమాధానం లేదు..
తెలుగు మాధ్యమం పాఠశాలలు మూత పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నాం.. కానీ మన పిల్లలను మాత్రం ఆంగ్ల మాద్యమ పాఠశాలలకే పంపుతాం..
టీవీ యాంకర్లు భాషను ఖూనీ చేస్తున్నారని నిందిస్తున్నాం.. కానీ అలాంటి కార్యక్రమాలు ఎందుకు చూస్తున్నామనే విషయాన్ని ఆలోచించం..
మీలో తెలుగు అక్షరాలను వరుసక్రమం తప్పకుండా రాసే వారు ఎంత మంది?.. ఇంతకీ తెలుగు భాషలో అక్షరాలు ఎన్ని ఉన్నాయి?.. కొన్ని అక్షరాలను ఎందుకు మింగేశాం? ఈ రోజు మనం మాతృ భాషను వదిలేసి అన్య భాషల వెంట పడుతున్నాం.. రేపు మన ధర్మం, సంస్కృతి, సాంప్రదాయాలను కూడా ఇలాగే వదిలేస్తామా?
మారుతున్న సమాజంలో విద్య, ఉపాధి అవకాశాలు ఆంగ్ల భాష చుట్టే తిరుగుతున్నాయనేది సత్యం.. కాదనలేం.. మన పిల్లలను ఆంగ్ల మాధ్యమాల్లో చదివించక తప్పని పరిస్థితి వచ్చింది. నిజమే.. కానీ అదే సమయంలో మన భాషా సంస్కృతులను కూడా పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. కనీసం మన ఇళ్లలో అయినా తెలుగు భాషను రక్షించుకోవడానికి చేయాల్సిన ప్రయత్నాలు కొంత మేరకైనా చేస్తున్నామా?
మన దేశంలో 42 భాషలు, మాండలికాలు త్వరలో అంతరించిపోయే ప్రమాదం ఉందని ఇటీవల కేంద్ర హోంశాఖ నివేదిక వెల్లడించింది. ఇందులో అండమాన్ నికోబార్ దీవులకు చెందినవి 11, మణిపూర్ (7), హిమాచల్ (4) కాగా ఆంధ్రప్రదేశ్ కు చెందిన గడాబా, నైకీ ఉన్నాయి. అంతరిస్తున్న భాషల్లో మన తెలుగు లేదని సంతోష పడుతున్నారా?.. అప్పుడే సంబర పడకండి.. తర్వలో ఆ ముచ్చటా తీరిపోయే ప్రమాదం కనిపిస్తోంది..
తెలుగు భాషను రక్షించుకునే విషయంలో వ్యక్తిగా మనవంతు కర్తవ్యాన్ని నిర్వహిద్దాం.. సమాచార సాంకేతిక రంగం విస్తరించిన ఈ రోజుల్లో మాతృభాషను రక్షించుకునే అవకాశాలు గతంలో కన్నా మెరుగయ్యాయి.. దీన్ని సద్వినియోగం చేసుకోగలిగితే మన భాషకు ఎప్పటికీ ఢోకా ఉండదు.. ఎన్ని భాషలైనా నేర్వండి.. కానీ మీ మాతృభాషను మాత్రం మరచిపోకండి..
అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం (21 ఫిబ్రవరి) సందర్భంగా ఆలోచించాల్సిన విషయాలు ఇవి..
21.02.2018

No comments:

Post a Comment