Wednesday, February 28, 2018

పార్టీ పెట్టగానే పండుగ కాదు కమల్..



'కమల్ హాసన్ పార్టీ పెట్టిండంట కదా?’ అని చిన్నప్పటి ఫ్రెండ్ ఒకడు ఫోన్ చేశాడు.. ‘అయితే ఏందంట..’ అని నేను రిప్లయ్ ఇచ్చే సరికి అతడు కొద్ది క్షణాలు నివ్వెరబోయి, ‘అదేంది అట్లంటవ్?’ అని వేరే సబ్జక్ట్ లోకి వెళ్లిపోయాడు.. నన్ను దగ్గరగా చూసిన వారికి నిజంగానే కమల్ విషయంలో నా తాజా వైఖరి ఆశ్చర్యాన్నే కలిగిస్తుంది.
నేను సినిమాలు పెద్దగా చూడను.. కానీ చూసిన సినిమాల్లో కమల్ హాసన్ వే ఎక్కువ.. అలా నాకు తెలియకుండానే అందరి దృష్టిలో ఆయనకు ఫ్యాన్ అయిపోయా.. నేను చూసిన మొదటి కమల్ హాసన్ చిత్రం సాగర సంగమం.. ఆ తర్వాత స్వాతిముత్యం, వసంత కోకిల, ఇది కథ కాదు, ఆకలి రాజ్యం, నాయకుడు, పుష్పక విమానం, విచిత్ర సోదరులు, ఇంద్రుడు చంద్రుడు, భారతీయుడు, క్షత్రియ పుత్రుడు, భామనే సత్యభామనే, సతీలీలావతి, ద్రోహి, గుణ, మహానది, హేరామ్, సత్యమే శివమ్, దశావతారం, విశ్వరూపం.. ఇలా ఆయన నటించిన దాదాపు అన్ని చిత్రాలు చూశాను. కమల్ సహజ నటన, సృజనాత్మకత, కొత్త ప్రయోగాలు నాకు చాలా నచ్చేవి.
కమల్ హాసన్ తర్వాత నాకు నచ్చిన నటుడు రజినీకాంత్.. వారు తెలుగులో నేరుగా నటించినవి అతి కొద్దివే.. మిగతావన్నీ డబ్బింగ్.. అయినా నేను వారు తమిళురు అని ఏనాడూ భావించలేదు.. గొప్ప భారతీయ నటులుగానే చూశాను.. కానీ వారి మొదటి ఆట చూడాలి అనేంత వెర్రి అభిమానిని మాత్రం కాదు.. నాకు వీలుంటే చూస్తాను.. చూడని చిత్రాలే ఎక్కవ,,
రీల్ లైఫ్ వేరు, రియల్ లైఫ్ వేరు.. ఈ హద్దులు నాకు తెలుసు. అందుకే ఎవరెంత విమర్శించినా కమల్ వ్యక్తిగత జీవితాన్ని నేను అంతగా పట్టించుకోను. కానీ వారు ఎప్పుడైతే ప్రజా జీవితంలోకి వచ్చారో, అప్పుడు అన్నీ పట్టించుకోక తప్పడం లేదు.. కమల్ ఇప్పుడు ‘మక్కల్ నీది మయ్యమ్’ అనే రాజకీయ పార్టీని పెట్టారు.. పార్టీ పెట్టుకునే స్వేచ్ఛ ఆయనకు ఉండొచ్చు.. కానీ అభిమానిగా నాలాంటి వారు సమర్ధించాల్సిన అవసరం అయితే కనిపించలేదు.. అందుకు సహేతుక కారణాలు ఉన్నాయి..
కమల్ నాస్తికుడిని అని చెప్పుకుంటారు.. అది ఆయన వ్యక్తిగతం. కానీ మెజారిటీ ప్రజల హిందూ మతాన్ని మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. గుడి దగ్గర బిచ్చగాడిని చూసి దేవుని మీద విరక్తి కలిగింది అంటారు.. మరి మిగతా మతాల ప్రార్థనాకేంద్రాల దగ్గర బిచ్చగాళ్ల సంగతేంటి? అనే ప్రశ్నకు సమాధానం లేదు.. కాషాయానికి ఆయన విరుద్దమట.. కమల్ ఆరెస్సెస్, బీజేపీలకు వ్యతిరేకం కావచ్చు, హిందూ మతానికి వీరు మాత్రమే గంపగుత్త కాదు కదా?.. సనాతన ధర్మానికి, త్యాగానికి ప్రతీక అయిన కాషాయంపై ఎందుకు విషం చిమ్ముతున్నారు?.. ఆధ్మాత్మిక విలువలు ఉన్న రజనీ కాంత్ కాషాయానికి దగ్గర అని నోరు పారేసుకున్నారు. కమల్ పార్టీ పెట్టడానికి ముందుగా పలు అంశాలపై కొద్ది రోజుల వ్యవధిలోనే పరస్పర విరుద్ధ ప్రకటనలు చేశారు.. భిన్న ధృవాలైన పార్టీల నాయకులను కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. స్వయాన పార్టీ పెడుతున్నప్పుడు ఈ ముందస్తు బేరాలు ఏమిటి?
కమల్ హాసన్ ను నటుడుగా దేశ వ్యాప్తంగా అభిమానించేవారున్నారు. కానీ ఆయన తమిళనాడు హద్దులకే పరిమితం.. పైగా ద్రవిడ, దక్షిణాది అంటూ దబాయింపు.. తమిళపేరుతో ఉన్న ఆయన పార్టీ దక్షిణాది మొత్తానికి ఎలా ప్రతీక అవుతుంది? ఆయన పార్టీ ఇతర రాష్ట్రాల్లో పోటీ చేసేది లేదు. పొత్తులు పెట్టుకునే అవకాశాలు తక్కువే. నా మాతృభాష తెలుగు అయినా నేను ఒక ‘భారతీయుడు’ని అని భావిస్తాను.. కానీ కమల్ మాత్రం తాను ‘తమిళ్’ అని గిరి గీసుకున్నారు.
ఇప్పడు చెప్పండి ఇంకా ఎలా అభిమానించేది.. నా దృష్టిలో ఒకప్పుడు కమల్ హాసన్ అనే గొప్ప నటుడు ఉండేవాడు అంతే..
22.02.2018

No comments:

Post a Comment