Saturday, November 16, 2013

ధ్యాన్ చంద్ కు భారత రత్నం ఏదీ?..

క్రికెట్ క్రీడలో అసమాన ప్రతిభ చూపి రిటెర్ అయిన సచిన్ టెండూల్కర్ కు భారత రత్న ఇవ్వాలనే నిర్ణయంపై ఎవరికీ అభ్యంతరం ఉండబోదు.. కోట్లాది మంది భారతీయుల హృదయాలను చూరగొన్న గొప్ప ఆటగానికి ఇది సముచిత గౌరవమే.. దీన్ని స్వాగతిద్దాం.. అయితే ఇదే సమయంలో మరో అద్భుత క్రీడాకారుడున్ని గుర్తు తెచ్చుకుందాం..
మేజర్ ధ్యాన్ చంద్ సింగ్.. నేటి తరానికి ఈయన పేరు తెలియక పోవచ్చు.. హాకీ క్రీడలో భారత దేశానికి గౌరవం తెచ్చిన మేటి క్రీడాకారుడు.. ధ్యాన్ చంద్ నాయకత్వంలో భారత హాకీ జట్టు 1928, 1932, 1936 ఒలింపిక్ ఆటల పోటీల్లో మూడు బంగారు పతకాలను సాధించింది.. ఆయన హాకీ స్టిక్ పట్టాడంతో ప్రత్యర్థి జట్టు చిత్తు కావాల్సిందే.. ప్రపంచంలోనే అత్యధికంగా వేయికి పైగా గోల్స్ చేసిన ఘనత ధ్యాన్ చంద్ దే.. ఈ రికార్డు ఇప్పటికీ ఆయన పేరిటే ఉంది.. ప్రపంచ హాకీలో ధ్యాన్ చంద్ నేటికీ ధృవతారగానే కొనసాగుతున్నారు.. ఆయనకు భారత ప్రభుత్వం 1956లో పద్మ భూషన్ అవార్డు ఇచ్చి గౌరవించింది.. కానీ క్రీడాకారుడిగా అర్హత లేదనే సాకుతో భారత రత్న ఇవ్వలేదు..
భారతీయులు హకీని పూర్తి విస్మరించారు.. క్రికెట్ తప్ప వేరే ఆట లేదనేందగా పిచ్చి ముదిరింది.. ఇందుకు ప్రభుత్వ ప్రోత్సాహం కూడా ఉందనడం కాదనలేని సత్యం.. ఒలింపిక్, ఏసియన్ క్రీడల్లో చిన్న దేశాలు సైతం పతకాల పట్టికలో దూసుకు పోతుంటే ఒకటి అర పతకాలు సాధిస్తున్న భారత్ పరువుపోతోంది.. ఇప్పటికైనా కళ్లు తెరిచి ఇతర క్రీడలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది..
సచిన్ టెండూల్కర్ తో పాటు మేజర్ ధ్యాన్ చంద్ కు కూడా భారత రత్న అవార్డు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు చెప్పినా, మాట నిల్పుకోలేదు.. ప్రతిష్టను కోల్పోతున్న కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో దేశంలో ప్రజాధరణ ఉన్న సచిన్ టెండూల్కర్ కు భారత రత్న అవార్డు ఇచ్చి ఆయన అభిమానులను తనవైపు తిప్పుకోవాలనే దూరాలోచన చేసిందనడం ముమ్మాటికీ సత్యం..
క్రీడాకారులను గౌరవించే విషయంలో దయచేసి రాజకీయాలు చేయకండి.. సచిన్ తో పాటు ధ్యాన్ చంద్ కు కూడా భారత రత్న అవార్డు ఇద్దాం.. అది మనను మనం గౌరవించుకోవడం కూడా.. అంతే కాకుండా క్రికెటేతర క్రీడలకు కూడా ప్రోత్సహం ఉందని సందేశం ఇచ్చినట్లవుతుంది.. ఈ విషయంపై భారత ప్రభుత్వం దృష్టి సారిస్తే మంచిది..

No comments:

Post a Comment