Friday, April 15, 2016

కశ్మీరియత్ అసలైన చిరునామా


జమ్మూ కాశ్మీర్ పేరు వింటే అందరికీ వెంటనే గుర్తుకు వచ్చేది అక్కడ వెర్రి తలలు వేసిన వేర్పాటువాదం.. తాము భారతీయులం కాదని, ఆజాదీ, జీహాదీ అంటూ రంకెలు వేసే ఉగ్రవాదుల సమర్ధకులు.. తమది ప్రత్యేక సంస్కృతి అని, అదే కశ్మీరియత్ అని వాదిస్తారు.. అసలు ఏమిటి ఈ కశ్మీరియత్?.. దీనికి అర్థం తెలుసా వీరికి?.. వేర్పాటు వాదులు ప్రవచించే ఆజాదీ, జీహాదీయేనా కశ్మీరియత్? వీరి భ్రమల్లో పడి అసలైన కశ్మీరియత్, దీనికి మూల పురుషుడైన ఆచార్య అభినవ గుప్తను మరచిపోయాం మనం..
దాదాపు వేయేళ్ల క్రితం (క్రీ.శ.950-1020) కాశ్మీర్ లోయలో జన్మించారు అభినవ గుప్త.. ఆయన మహా ఆధ్యాత్మిక వేత్త.. గొప్ప పండితుడు, మేధావి, దార్శనికుడు, ఆలంకారికుడిగా ప్రసిద్ధుడు.. అభినవ గుప్తుని తల్లి విమల. తండ్రి నరసింహగుప్త.. తాత వరాహ గుప్తు. తండ్రియే ఆయనకు ప్రథమ గురువు.. పందొమ్మిది మంది మహా పండితుల వద్ద శాస్త్ర విద్యలను నేర్చుకున్నాడు అభినవ గుప్త.. భట్ట ఇందురాజు దగ్గర ధ్వని సిద్ధాంతాన్ని, భట్ట తౌతుడివద్ద నాట్య శాస్త్రాన్ని అభ్యసించారు. శైవ సంప్రదాయంలో ‘ప్రత్య భిజ్’  గ్రంధ రచన  రాశారు.. భరతుని నాట్య శాస్త్రానికి ‘అభినవ భారతి’ వ్యాఖ్యానాన్ని రాశారు అభినవుడు.. ఆనంద వర్ధనుడి ‘ధ్వన్యా లోకం’కు లోచన వ్యాఖ్యను రాసిన మహా పండితుడు.. అదే విధంగా ‘అభివ్యక్తి వాదం’ను సిద్ధాంతీకరించారు. శైవ అద్వైతం లో ఉన్న ‘ఆనంద వాదం’ భూమికగా అభినవ గుప్తుడు  ‘రసం’ అంటే ఏమిటి అన్నది చర్చించారు.. అభినవ గుప్త శైవ ఆగమాలలో నిష్ణాతుడు. తంత్ర శాస్త్రం లోనూ దిట్ట అయన. శైవానికి చెందిన నలభై ఒక్క  గ్రంధాలను రచించారు.. శైవ ఆగమాల మీద, స్తోత్రాల మీద అనేక వ్యాఖ్యలు చేశారు. భట్ట తౌతుడు రాసిన ‘కావ్య కౌతుకం’కు వివరణ రాశారు. అభినవ గుప్త ఇతర రచనల్లో తంత్రసార, బోధ పంచ దశిక, బోధార్ధ కారక, అనుభవ నివేదన, అనుభావాష్టక, క్రమస్తోత్ర భైరవ అష్టకం, దేహ స్థిత దేవతా చక్ర స్తోత్ర, పరమార్ధ వాదాసిక, మహోపదేశ వింశతిక, శివ శక్త్యావినాస స్తోత్రాలు, ఈశ్వర ప్రజ్ఞాభిజ్న విమర్శన, వృత్తి విమర్శిని, ఘత కార్పర కులాక వృత్తి కావ్య కౌతుక వివరణ, పరాత్రిక లఘు వృత్తి, పర్యంత పనికషణ, దేవీ స్తోత్ర తదితర గ్రంథాలు ఉన్నాయి.. అనేక వేదాంత గ్రంధాలు కూడా రచించారు..
అభినవ గుప్త కాశ్మీరంలో తన రచనలతో పాటు శైవ తత్వాన్ని విశేషంగా ప్రచారం చేశారు.. ఆధ్యాత్మిక సాధనకు కులం, లింగబేధాలు లేవని చాటి చెప్పారు.. దైవారాధనకు సన్యాసమే మార్గమని భావించడం సరికాదని, సంసార జీవితంలోనూ ఆధ్యాత్మిక మార్గాన్ని అవలంభించవచ్చని చెప్పిన అభినవ గుప్త, ఆ రోజుల్లో భైరవనాధ శివునిగా గుర్తింపు పొందారు.. ఆయన ప్రబోధించిన కాశ్మీరీ శైవం కొత్త పుంతలు తొక్కింది.. అభినవ గుప్త ఆజన్మ బ్రహ్మచారిగానే ఉండిపోయారు.. ముప్ఫై అయిదేళ్ళు సకల శాస్త్రాల అధ్యయనం చేస్తూ దేశాటనం చేశారు. అభినవ గుప్తకు ముమ్మట, క్షేమేంద్ర తదితర శిష్యులు ఉన్నారు. వీరితో అభినవ గుప్తాచార్య పరంపర అభివృద్ధి చెందింది..
కాలక్రమంలో విదేశీ దాడులతో కాశ్మీరం అనేక మార్పులకు లోనైంది. ఉన్మాదులు అక్కడి మూల వాసులపై పెద్ద ఎత్తున అత్యాచారాలు, దాడులు చేశారు.. మత మార్పిడులతో అసలైన కాశ్మీరి సంస్కృతిని కాలరాచారు.. సనాతన ధర్మాన్ని నమ్ముకున్నవారిని అక్కడి నుండి తరిమేశారు.. ప్రస్తుత తరానికి అభినవ గుప్త అంటే ఎవరో తెలియని దుస్థితి.. అయితే సంస్కృత భాషా పండితుల పరిశోధనల పుణ్యమా అని అభినవ గుప్త తన రచనల ద్వారా నేటికీ సజీవంగా ఉన్నారు.. ఆయన చేసిన 44 రచనల్లో ప్రస్తుతం 21 అందుబాటులో ఉన్నాయి..
జమ్మూ కాశ్మీర్ స్టడీ సెంటర్ దేశ వ్యాప్తంగా అభినవ గుప్త సహస్రాబ్ది కార్యక్రమాలను నిర్వహిస్తోంది.. ఇటీవల ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు.. ప్రస్తుతం కాశ్మీర్ లో ఉన్న ప్రత్యేక పరిస్థితుల్లో అభినవ గుప్త మార్గాన్ని మరోసారి ఆవిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ మహనీయుని సేవలను, బోధనలు ప్రచారం చేయడం ద్వారా అసలైన 'కశ్మీరియత్'ని చాటి చెప్పాల్సిన అవసరం ఉంది.

No comments:

Post a Comment