Saturday, March 31, 2018

ఇదే రామ తత్వం



ఎవరు ఈ రాముడు?.. ఎందుకు ఆయనపై ఇంత భక్తి?.. యావత్ భారత దేశమంతా ఆయన్ని ఎందుకు పూజిస్తోంది?.. విదేశాల్లో సైతం రామాయణ గాథను ఎందుకు ఇష్టపడుతున్నారు?.. అసలు రామాయణంలో ఏముంది?..
మన తెలుగు నాట భక్తి అంటే ముందు రాముడే గుర్తు వస్తాడు.. శ్రీరాముడు నడయాడిన భద్రాద్రి, పంచవటి తెలుగు నాట ఉండటం మనం చేసుకున్న పుణ్యం.. దాదాపుగా ఊరూరా రామాలయం సర్వసాధారణం.. ప్రతి ఊరిలో రామయ్య, రామశాస్త్రి, రామారావు, రాంరెడ్డిలు కనిపిస్తారు..
ఇక శ్రీరామ నవమి వచ్చిందంటే పండగే.. చలవ పందిళ్లు వేసి రాముని జయంతి, కల్యాణం, పట్టాభిషేకం కన్నుల పండువగా నిర్వహిస్తాం.. రామరసాన్ని తాగుతాం.. ఈ రాముడు, రామభక్తి తెలుగు నేలకే పరిమితం కాదు.. అయోధ్యలో జన్మించిన రాముడు అరణ్యవాసంలో భాగంగా సీత, లక్ష్మణులతో కలసి దేశమంతా తిరిగాడు.. చివరగా లంకకు వెళ్లి రావణున్ని వధించి, అయోధ్యకు చేరుకొని పట్టాభిషక్తుడయ్యాడు. ఇలా యావత్ భారతదేశం రాముని పాద స్పర్శతో తరించింది. 
రామాయణ గాధ దేశ సరిహద్దులను కూడా దాటి ప్రపంచ దేశాలను చేరింది.. ఇండోనేషియా, థాయ్ లాండ్, కాంబోడియా లాంటి తూర్పు ఆసియా దేశాల్ని సైతం రామాయణం ప్రభావితం చేసింది. చరిత్రలో తొలి ప్రపంచ ఆధ్యాత్మిక కథ శ్రీమద్రామాయణమే అని చెప్పక తప్పదు..

రాముని కథ ఎన్నిసార్లు చదివినా, విన్నా తనివి తీరదు.. అందుకే వాల్మీకి మహర్షి రాసిన రామాయణానికి తోడు ఎందరో కవులు, పండితులు ఈ గాథను రాశారు.. మళ్లీ మళ్లీ రాస్తున్నారు.. అదే రామాయాణానికి ఉన్న విశిష్టత.. 
శ్రీరామచంద్రుడు సకల సద్గుణాలు, పెద్దలపట్ల వినయ విధేయతలు కలవాడు.. ప్రజల పట్ల ఆత్మీయత, సేవకులపై ఔదార్యం చూపించాడు. శత్రువులను కూడా దయాగుణం చూపించాడు.. మాతృ-పితృ భక్తితో ఆదర్శ తనయునిగా, ఏకపత్నీవ్రతంతో ఆదర్శ భర్తగా, తోబుట్టువుపై మమకారంలో ఆదర్శ సోదరునిగా, గురువు ఆనతో రాక్షస సంహారం చేసిన ధర్మ రక్షకునిగా, ప్రజల కష్ట సుఖాలను తెలుసుకొని పాలించిన ఆదర్శ ధర్మపాలకునిగా, నమ్మిన మిత్రులకు రక్షకునిగా.. ఇలా ఎన్నో వైవిధ్య రూపాలల్లో రాముడు కనిపిస్తాడు.. భక్తుల పట్ల శరణాగత వాత్సల్యం, కృతజ్ఞత-క్షమా హృదయం, పరాక్రమం, ప్రజారంజక పాలక.. ఇలా ఎన్నోలక్షణాలు మనకు ఆదర్శప్రాయంగా కనిపిస్తాయి.. 
అలాగే రామాయణంలోని పాత్రన్నీ విశిష్టతగలవే.. రాముడు, సీత, లక్ష్మణుడు, భరతుడు, క్షత్రజ్ఞుడు, ఆంజనేయుడు. కౌసల్య, కైకేయి, విశ్వామిత్రుడు, శబరి, అహల్య, అగస్త్యుడు, గుహుడు, సుగ్రీవుడు, విభీషణుడు.. ఇలా ఒక్కో పాత్రకు ఒక్కో విశిష్ట ఉంది.. 
రాముడైనా, రామాయణ గాథ అయినా ఒక తరానికి పరిమితం కాలేదు. ఇది పురాణ కథగా మాత్రమే భావించలేం.. మన తాత ముత్తాతలు, తండ్రులు అందించ రామాయణ సందేశాన్ని మన పిల్లలకు అందించాలి.. వారు భావి తరాలకు చాటి చెప్పేలా ప్రోత్సహించాలి.. మన కుటుంబ విలువలు, ప్రేమ, అన్యోన్యత, అనురాగం రామాయణంతో ముడిపడి ఉన్నాయి.. 
గాంధీజీ స్వాతంత్ర్యం తర్వాత రామరాజ్యం కావాలని కోరుకున్నారు.. రామరాజ్యం అంటే ఆదర్శ పాలన.. దురదృష్టవశాత్తు ఈ రోజున రాముడు అంటే ఒక మతానికి పరిమితమైన వ్యక్తిగా చూస్తున్నారు.. రాముడు పుట్టిన జన్మభూమి వివాదాస్పదమైపోయింది. రాముడిన మన నుంచి ఎవరూ దూరం చేయలేరు.. సూర్య చంద్రులు ఉన్నంత కాలం రాముడు మనతో ఉంటాడు.. శ్రీరామ నవమి సందర్భంగా అందరికీ ఆయన కురుణా కటాక్షాలు శుభం కలగాలి అని కోరుకుంటూ.. జై శ్రీరామ్..
26.03.2018

No comments:

Post a Comment