Sunday, November 19, 2017

ఇది ఇవాంక కథ కాదు

అనగనగా ఒక మహారాజు. ఆయనకు ఒక కూతురు పుట్టింది. ఆమె భవిష్యత్తులో బిచ్చగాన్ని పెళ్లి చేసుకుంటుందని జ్యోతిష్యుడు చెప్పాడు. దీంతో అప్రమత్తమైన మహారాజు ముందు జాగ్రత్తగా తన రాజ్యంలో యాచక వృత్తిని నిషేధించారు. బిచ్చగాళ్లను అరెస్ట్ చేశారు. శిక్షలకు భయపడ్డ కొందరు దేశం వదిలి పారిపోయాడు. 
కొన్నేళ్ళకు మహారాజు గారి ముద్దుల రాకుమారి లోక సంచారం తలపెట్టింది. ఎందుకైనా మంచిదని మహారాజు గారు రాకుమారి వెళ్లే దేశాలకు లేఖలు పంపారు. ' మీ దేశానికి వస్తున్న నా కూతురుకు బిచ్చగాళ్లు కనిపించకుండా జాగ్రత్తలు తీసుకోగలరు..' అని ఉందా ఉత్తరాల్లో..
ఈ లేఖను చూసిన దేశాల పాలకులు వెంటనే అప్రమత్తమయ్యారు.. ఎంతైనా అవతలి మహారాజు బలవంతుడు. ఆయన కోరికను మన్నించి సామరస్యంగా వ్యవహరిస్తే మనకే ప్రయోజనం కదా అనుకున్నారు. మొత్తానికి దేశాల్లో 'ఆపరేషన్ యాచక' అమలైంది..ఇదఇమహారాజు గారి కూతురు వెళ్లిన ఒక దేశంలో పొరపాటున ఆమెకు ఓ బిచ్చగాడు కనిపించాడు. వాడు అప్పుడే ఊరు నుంచి రాజధానికి వచ్చాడు. ఆపరేషన్ యాచక అమలులో ఉన్న సంగతి తెలియదట.
తర్వాత ఏమైంది?..
సినిమాలు చూడలేదా?.. షరా మాములే.. రాకుమారి వాడితో లవ్వులో పడింది.. కొన్ని రీళ్ల కథ నడిచాక కైమాక్స్ లో మహారాజు గారు బిచ్చగాడికి తన కూతురుని ఇచ్చి పెళ్లి చేశాడు.
గమనిక: ఇవాంక హైదరాబాద్ పర్యటనకు, ఈ కథకు ఎలాంటి సంబంధం లేదు.

(15.11.2017)

No comments:

Post a Comment