Wednesday, March 8, 2017

ప్రతి రోజూ మహిళల రోజు ఎందుకు కారాదు?

యత్ర నార్యంతు పూజ్యంతు రమంతే తత్ర దేవతా..
ఎక్కడ స్త్రీలను పూజిస్తారో, అక్కడ దేవతలు కొలువై ఉంటారని మన పెద్దలు చెబుతుంటారు.. భారతీయ సమాజంలో మహిళలకు మొదటి నుంచీ ఉన్న గౌరవనీయ స్థానం ఇది.. పురుషులతో సమానంగా, ఇంకా చెప్పాలంటే కాస్త ఎక్కువ ప్రాధాన్యతే మహిళలకు ఉంది. మన దేశాన్ని భారత మాతగా కొలుస్తున్నాం.. మన పురాణాలను గమనించినట్లైతే దుర్గామాత, పార్వతి, పోచమ్మ ఎల్లమ్మ తదితర దేవతలను శక్తికి ప్రతీకగా, సరస్వతి, లక్ష్మిలను చదువు, సంపదకు గుర్తులుగా పూజిస్తాం..
దురదృష్టవశాత్తు మన దేశంపై విదేశీయుల దండయాత్రలు మొదలయ్యాక పరిస్థితి మారింది.. ప్రజల ఆలోచనా విధానంలో మార్పు వచ్చింది.. మరోవైపు మూఢనమ్మకాలు పెరిగాయి.. దీంతో స్త్రీలను ఇంటికే పరిమితం చేయడం మొదలు పెట్టారు.. అయినా రాణి రుద్రమదేవి, ఝాన్సీ లక్ష్మీభాయి, చెన్నమ్మ తదితర వీర వనితలు తమ శక్తి సామర్ధ్యాలను చాటుకున్నారు..ఇక ఆధునిక యుగంలో మహిళలు అన్ని రంగాల్లో పురుషులకు ధీటుగా దూసుకుపోతున్నారు.. రాజకీయ, పరిపాలన, వ్యాపార రంగాల్లో ఎందరో మహిళలు ఉన్నత స్థానంలో ఉన్నారు.. అయినా ఎక్కడో లోపం.. ఇవన్నీ పైపై మెరుగులేనా అనిపిస్తుంది.. ..
పొద్దున్నే పేపర్ తెరచినా, టీవీ ఛానళ్లు చూసినా ప్రముఖంగా కనిపించే వార్తలు బాధను కలిగిస్తుంటాయి.. మహిళలపై వివక్ష దారుణంగా కొనసాగుతోంది.. బాల్య వివాహాలు, అవిద్య చాలా మేరకు తగ్గినా, మహిళలపై అత్యాచారాలు, హింస, వరకట్న వేధింపులు చూస్తుంటే మనం నిజంగా అనాగరికులమేనా అనే సందేహం కలుగుతుంది.. సామాజికంగా, రాజకీయంగా వివక్ష దారుణంగా ఉంది.. రాజ్యాంగం ఇచ్చిన రిజర్వేషన్ల పుణ్యమా అని పదవులు మహిళలకు దక్కినా పెత్తనం మాత్రం పురుషులదే.. అత్యున్నత స్థానంలో ఉన్న మహిళలదీ ఇదే దుస్థితి..మహిళలకు రాజకీయాల్లో 33 శాతం రిజర్వేషన్ల బిల్లుకు మాత్రం మోక్షం కలిగే పరిస్థితి కనిపించడంలేదు..
మనం ఆధునికులం అని చెప్పుకుంటున్నాం.. కానీ మన ఆలోచనా విధానం పూర్తిగా అనాగరికంగా ఉంది.. స్త్రీని భోగ వస్తువుగానే చూస్తున్నాం.. సినిమాలు, టీవీలు, పత్రికల్లో కనిపించే దృశ్యాలను ఎలా అర్థం చేసుకోవాలి? మన పిల్లలకు, యువతకు ఎలాంటి సందేశం ఇస్తున్నాం? మహిళల కట్టు, బొట్టు గురుంచి కామెంట్ చేయడం గౌరవ ప్రదం అనిపించుకోదు.. పురుషుల వస్త్రధారణ మారినట్లుగానే మహిళలదీ మారుతోంది అని నా అభిప్రాయం.. ఈ విషయంలో స్త్రీలను ఎంత తప్పు పడుతున్నామో, పురుషులకూ అంతే బాధ్యత ఉంది.. మనం భారతీయులం అనే విశిష్ట గుర్తింపును నిలుపుకునేందుకు మన సంస్కృతీ సాంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది..
అసలు మహిళల హక్కులు, గౌరవం, ప్రాధామ్యాల విషయంలో పోరాటాలు చేసే దుస్థితి ఎందుకు?.. ఈ విషయంలో ప్రతి ఒక్కరూ ఆలోచించాలి.. సృష్టిలో స్త్రీ, పురుషులు ఇద్దరూ సమానమే.. ఏ ఒక్కరు లేకున్నా ప్రకృతి అనేది ఉండదు.. పురుషులకన్నా ఏ విధంగానూ స్త్రీ తక్కువ కాదు..
మార్పు అనేది మన కుటుంబాల నుంచే రావాలి.. మన ఇళ్లలోని మహిళా మూర్తులను గౌరవించాలి.. ఆడ పిల్లలను మగ పిల్లలతో సమానంగా చదివించాలి.. వారు స్వశక్తిపై ఎదిగేందుకు తోడ్పడాలి.. అప్పుడే సమాజం మారుతుంది.. ఇవేవీ చేయకుండా ఎవరిని నిందించినా ఫలితం ఉండదు..
చివరగా నాదో సందేహం? అసలు మహిళలకంటూ ఒక దినోత్సవం ఏమిటి? ఒక్క మార్చి 8వ తేదీనాడే మహిళా దినోత్సవం ఎందుకు జరుపుకోవాలి.. ఈ ఒక్కరోజే మహిళలకు ప్రాధాన్యత ఇచ్చి గౌరవిస్తే సరిపోతుందా?.. ప్రతి రోజూ మహిళల దినమే ఎందుకు కారాదు?

No comments:

Post a Comment