Sunday, June 26, 2016

రండి.. చైనాపై పిడికిలి ఎత్తండి..

ఇటీవలి కాలంలో అవకాశం దక్కిన ప్రతి అంతర్జాతీయ వేదికపై భారత దేశ వ్యతిరేకతను బాహాటంగా బయట పెట్టుకుంటోంది చైనా.. మొన్న జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజహర్ పై ఆంక్షలు విధించాలనే ఐక్యరాజ్య సమితి తీర్మానాన్ని వీటో ద్వారా అడ్డుకుంది..  నిన్న NSGలో మనకు చోటు దక్కకుండా చక్రం తిప్పింది.. మన పక్కలో బల్లెంగా ఉన్న ఉగ్రవాద కర్మాగారం పాకిస్తాన్ కు అన్ని విధాలా అండగా నిలిచింది చైనా..
ఇప్పటికే పలు భారత దేశ భూ భాగాలను కబ్జా చేసిన చైనా, సైనికంగా పై చేయి సాధించాలని చూస్తోంది.. మన పొరుగు దేశాలు నేపాల్, మయన్మార్, బంగ్లాదేశ్, శ్రీలంక, మాల్దీవులకు సాయం ముసుగులో భారత దేశానికి వ్యతిరేకంగా రెచ్చగొడుతోంది.. ఆ దేశాల్లో తన సైనిక స్థావరాలను ఏర్పాటు చేసుకొని భారత్ ను అష్ట దిగ్బంధనం చేసే చర్యలు చేపట్టింది..
మన తొలి ప్రధాని నెహ్రు హిందీ-చీనీ భాయ్ భాయ్ అంటూ తప్పటడుగులు వేశారు.. టిబెట్ ను ఆక్రమించినా పట్టించుకోకుండా ఆ దేశాన్ని చైనాలో అంతర్భాగంగా గుర్తించారు.. పైగా మనకే దిక్కు లేకున్నా, చైనాకు భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం కృషి చేశారు.. నెహ్రూ ఇంత చేసినా కృతజ్ఞత లేని చైనా, దలైలామాకు ఆశ్రయం ఇచ్చామనే కారణంతో మన దేశంపై యుద్దానికి దిగింది..
తేనె పూసిన కత్తిలాంటిది చైనా.. పైకి స్నేహ హస్తం చూపిస్తూ, అవకాశం చిక్కినప్పుడల్లా వెన్నుపోటు పొడుస్తోంది. ప్రపంచంలో బలమైన ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్న భారత్ పై చైనా పరోక్ష కుట్రలకు తెరలేపింది.. 
చైనా నుండి మన దేశంలోకి అనేక వస్తువులు ఇబ్బడి ముబ్బడిగా వచ్చి పడుతున్నాయి.. మొబైళ్ళు, కంప్యూటర్లు, లాప్ టాప్స్, ఇతర ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, టపాకాయలు, బొమ్మలు, దుస్తులు, ఆట వస్తువులు, రంగులు, ప్లాస్టిక్ సామాగ్రి.. చివరకు ఆహార పానీయాలు..  ఇలా ఎన్నెన్నో చైనా తయారీ వస్తువులు దిగుమతి అవుతున్నాయి.. మన దేశీయ ఉత్పత్తులతో పోలిస్తే ఇవన్నీ నాసిరకం సరుకే.. కానీ చవగ్గా ఉన్నాయని జనం వీటిని కొంటున్నారు.. 
చైనా వీటిని ఇంత చవకగా తయారు చేయడానికి కారణాలు తెలుసా?.. ఆ దేశంలో మానవ వనరులు అధికంగా ఉన్నందున పోటీ పెరిగి తక్కువ జీతాలు తీసుకొని, ఎక్కువ గంటలు పని చేస్తారు.. చైనా పేరుకే కమ్యూనిస్టు దేశం.. కానీ అనుసరించేదంతా పెట్టుబడిదారీ వ్యవస్థే.. శ్రమ దోపిడీ ఎక్కువ.. కార్మికులకు కనీస సౌకర్యాలు కరువు.. తక్కువ ధరలకు లభించే వస్తు సామాగ్రిని డంప్ చేయడం ద్వారా భారతీయ పరిశ్రమలను దెబ్బ తీస్తోంది.. ఫలితంగా మన దేశీయ కుటీర పరిశ్రమలు నష్టపోయి కార్మికులు వీధిన పడుతున్నారు.. 
మొదటి నుండి కూడా భారత ప్రయోజనాలకు వ్యతిరేకంగా పని చేస్తున్న ఆ దేశానికి కచ్చితంగా బుద్ధి చెప్పాల్సిందే.. 
ఇప్పుడు మన దేశం ముందు ఉన్న తక్షణ కర్తవ్యం ఒకటే.. అదే *బాన్ ఆన్ మేడ్ ఇన్ చైనా*.. 
చైనాలో తయారైన వస్తువులన్నింటినీ బహిష్కరిద్దాం.. ఎట్టి పరిస్థితిలోనూ చైనా వస్తువులు కొనరాదు.. స్వదేశీ వస్తువులనే కొనండి.. ఇలా చైనాకు బుధ్ధి చెప్పడం ద్వారా దేశీయ పరిశ్రమలను కాపాడుకుందాం.. ఉపాధి అవకాశాలను పెంచుకుందాం.. మన ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేద్దాం.. భారతీయులుగా మన స్వాభిమానాన్ని చాటి చెబుదాం.. దేశభక్తిని ఎలుగెత్తి చాటుదాం.. మన దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకుందాం..

1 comment:

  1. అవును మీరు చెప్పింది అక్షరాల నిజం ఇదే విషయంపై నేను 2013లో నా బ్లాగులో టపా వ్రాసాను ఒకసారి చూడండి http://telugutechno.blogspot.in/2013/06/blog-post.html

    ReplyDelete