Tuesday, June 14, 2016

*చదువుకుందామా?..కొందామా?*

బ‌డి గంట మోగింది.. పాఠ‌శాల‌లు మ‌ళ్లీ తెరుచుకున్నాయి.. వేస‌వి సెల‌వులు అప్పుడే అయిపోయాయా పిల్ల‌ల నిట్టూర్పులు.. కొత్త‌గా బ‌డిలో దిగ‌బెట్టిన చిన్నారుల ఏడుపులు.. ప్ర‌తీ ఏడాది జ‌రిగే త‌తంగ‌మే ఇది..
జూన్ వ‌చ్చింద‌టే త‌ల్లిదండ్రుల‌కు గుండె ద‌డ‌.. వేలాది రూపాయ‌ల‌ ఫీజులు, డొనేషన్లు, పుస్త‌కాలు, యూనిఫారమ్‌, స్కూలు వ్యాను ఖ‌ర్చులు.. స‌గ‌టు జీవి సంపాద‌నంతా ఇందుకే ఖ‌ర్చ‌యిపోతోంది.. ఇదేమి అన్యాయ‌మ‌ని ప్ర‌శ్నించ‌లేని ప‌రిస్థితి.. పోటీ ప్ర‌పంచంలో పిల్ల‌ల‌పై ఈ మాత్రం ఖ‌ర్చు త‌ప్పదంటారు కొందరు శ్రేయోభిలాషులు.. నా చిన్న‌ప్ప‌టి నుండి డిగ్రీ, పీజీ దాకా పెట్టిన ఖ‌ర్చంతా, మా అబ్బాయి ఒక ఏడాది ఫీజంత అని గొప్ప‌గా చెప్పాడో మిత్రుడు..
మ‌న పిల్ల‌ల భ‌విష్య‌త్తు కోస‌మే క‌దా ఖ‌ర్చు చేస్తున్నాం అంటూ స‌రిపుచ్చుకుంటున్నారు త‌ల్లిదండ్రులు.. ప్ర‌భుత్వ పాఠ‌శాల అధ్వాన్న నిర్వాకాన్ని చూసి త‌ప్ప‌ని స‌రైన ప‌రిస్థితుల్లో ప్ర‌యివేటు పాఠ‌శాల‌ల‌కు పంపుతున్నారు.. ఎల్‌కేజీ నుండే ఐఏఎస్ పాఠాలు చెబుతామని బిల్డ‌ప్ ఇస్తున్నాయి ప్ర‌యివేటు విద్యా సంస్థ‌లు.. ఎమ్సెట్లూ, జేఈఈలు, ఐఐఎంలూ, ఐఏఎంలూ, ట‌క్కు ట‌మారాలంటూ మాయ చేస్తున్నాయి.. వీరు సాగిస్తున్న దారుణ దోపిడీకి అంతులేకుండా పోయింది.. ఎవ‌రూ వీరిని ప్ర‌శ్నించ‌లేక‌పోతున్నారు..
ఒక‌ప్పుడు సేవా భావంతో పాఠ‌శాల‌లు పెట్టేవారు.. కానీ  ఇప్పుడు ప‌క్తు వ్యాపార ధోర‌ణితోనే స్కూళ్ల‌ను న‌డిపిస్తున్నారు.. కార్పోరేట్ విద్యా సంస్థ‌లు ఊరూరా  బ్రాంచీలు, ప్రాంచైజీలు  స్థాపిస్తూ నయా దోపిడీకి తెర తీశాయి.. ప‌ట్టించుకోవాల్సిన ప్ర‌భుత్వ పెద్ద‌లు ఇది త‌మ‌కు సంబంధం లేని వ్య‌వ‌హారం అన్న‌ట్లు ప్ర‌వ‌ర్తిస్తున్నారు.. అవును మ‌రి వారికి ద‌క్కాల్సిన అమ్యామ్యాలు అందుతున్నాయి కదా.. ఈ విద్యా సంస్థ‌ల‌తో వారికి ప్ర‌త్య‌క్షంగాలో ప‌రోక్షంగానో సంబంధాలు ఉంటాయ‌న్నది బ‌హిరంగ ర‌హ‌స్యం..
విద్యారంగం ముసుగులో సాగుతున్న ఈ దోపిడి ఇలా కొన‌సాగాల్సిందేనా?.. ఆలోచించండి..#

No comments:

Post a Comment