Thursday, September 17, 2015

భారత దేశంలో హైదరాబాద్ విలీనమైన మహోన్నత రోజు..

నిరంకుశ పాలన నుండి విముక్తి చెందిన రోజు.. స్వేచ్ఛ కోసం తపించిన ప్రజల బానిస సంకెళ్లు తెగిన రోజు.. తరతరాల బూజు వదిలిన రోజు.. హైదరాబాద్ సంస్థానం భారత దేశంలో విలీనమైన రోజు ఇది..
17 సెప్టెంబర్ 1948..
భారత దేశమంతా బ్రిటిష్ పాలన నుండి విముక్తి పొందింది.. కానీ వారి సామంతుడైన ఏడో మీర్ ఉస్మాన్ అలీఖాన్ హైదరాబాద్ సంస్థానాన్ని భారత దేశంలో విలీనం చేసే ప్రసక్తి లేదన్నాడు.. తాను స్వతంత్రంగా ఉంటానన్నాడు.. అవసరమైతే పాకిస్తాన్ లో చేరతానని బెదిరింపు..  
మధ్య యుగాల నాటి ప్యూడల్ వారసత్వం, మత మౌఢ్యం, నిరంకుశత్వం కలగలసిన పాలన.. ప్రజల సంక్షేమం ఏమాత్రం పట్టదు.. మెజారిటీ ప్రజల ఆకాంక్షలు అంటే లెక్కలేదు... మెజారిటీ ప్రజల భాషా సంస్కృతులకు విలువేలేదు.. సమాజంలో కొన్ని ఉన్నత వర్గాలు తప్ప, మిగతా వారివంతా బానిస బతుకులే.. ఒకవైపు దేశ్ ముఖ్, దేశ్ పాండే, దొరలు గ్రామీణ ప్రజల శ్రమను దోచుకునేవారు.. మరోవైపు కాశీం రజ్వీ నేతృత్వంలో రక్త పిపాసులైన రజాకార్లు ప్రజలపై పడి మారణకాండ సృష్టించారు..  మహిళల మానప్రాణాలు దోచుకున్నారు.. నగ్నంగా బతుకమ్మలు ఆడించారు..
ప్రజల ఆక్రందనలు నవాబు గారికి పట్టలేదు.. నిరంకుశ పాలనపై పోరాడిన ఆంధ్ర మహాసభ, ఆర్యసమాజం, స్టేట్ కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలను నిషేధించాడు.. ఆ సంస్థల నాయకులను, కార్యకర్తలను జైలుపాలు చేసి చిత్ర హింసలు పెట్టాడు..
భారత దేశం నడి బొడ్డున క్యాన్సర్ కణితిలా మారింది హైదరాబాద్ సంస్థానం.. మెజారిటీ ప్రజలు భారత దేశంలో కలవాలని కోరుకుంటున్నారు.. వీరి ఆకాంక్షలపై నీళ్లు చల్లాడు నిజాం నవాబు.. హైదరాబాద్ పరిణామాలు ఎప్పటికప్పుడు గమనిస్తూ వచ్చారు కేంద్ర హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్.. ఇక ఆలస్యం ఏమాత్రం పనికిరాదని నిర్ణయించుకున్నారు.. వెంటనే ఆపరేషన్ పోలో (పోలీసు యాక్షన్) అమలు చేశారు..

ఐదు రోజుల యుద్దంలో హైదరాబాద్ సైన్యం తోక ముడిచింది.. భారత సైన్యానికి ప్రజలు జేజేలు పలికారు.. ఏడు తరాల తన అసఫ్ జాహీ వంశ పాలన అంతరించిందని అర్థమైపోయింది ముసలి నవాబుకు.. విధిలేని పరిస్థితిలో లొంగుబాటును అంగీకరించాడు.. అలా 17 సెప్టెంబర్ 1948న హైదరాబాద్ సంస్థానం భారత దేశంలో సంపూర్ణంగా విలీనం అయింది..

No comments:

Post a Comment