Saturday, October 31, 2015

ఆధునిక భారత నిర్మాత

బ్రిటిష్ వారు దేశానికి స్వాతంత్ర్యం ఇస్తూ పాకిస్తాన్ చిచ్చు పెట్టారు.. అంతే కాదు 552 సంస్థానాలకు భారత్ లేదా పాకిస్తాన్లో చేరే స్వేచ్ఛ ఇచ్చారు.. భారత దేశం అఖండంగా ఉండొద్దని, కుక్కలు చింపిన విస్తరిలా ఉండాలని వారు కుట్ర పన్నారు.. ఇలాంటి పరిస్థితుల్లో స్వతంత్ర భారత ప్రథమ హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టారు సర్ధార్ వల్లభాయ్ పటేల్..
పరిస్థితి ఇలాగే కొనసాగితే దేశ భవిష్యత్తుకు ఏర్పడే ముప్పును అంఛనా వేశారు పటేల్.. వెంటనే సంస్థానాలన్నింటినీ భారత దేశంలో విలీనం అయ్యేందుకు ఒప్పించారు.. తాము భారత దేశంలో చేరకుండా స్వతంత్రంగా ఉంటామని చెబుతూనే పాకిస్తాన్ వత్తాసుతో కుట్రలు పన్నుకున్న హైదరాబాద్, జునాగఢ్ సంస్థానాలపై దండోపాయం ప్రయోగించి దారికి తెచ్చారు పటేల్.. అయితే జమ్మూ కాశ్మీర్ విషయంలో ప్రధాని నెహ్రూ స్వయంగా జోక్యం చేసుకోవడంతో ఆ సమస్య ఇప్పటికీ రావణ కాష్టంలా రగులుతూనే ఉంది..
సర్ధార్ వల్లభాయ్ పటేల్ ముందు చూపు, దృఢ వైఖరి వల్లే భారత దేశాన్ని మనం ఈ రోజున నిండుగా చూడగలుగుతున్నాం.. అందుకే పటేల్ ఉక్కు మనిషిగా దేశ ప్రజల మన్ననలు అందుకుంటూ ప్రజల మదిలో చిరస్థాయిగా నిలిచారు..
నిజానికి స్వతంత్ర్య భారత దేశానికి సర్ధార్ వల్లభాయ్ పటేల్ నాయకత్వం వహించాలని దేశ ప్రజలు కోరుకున్నారు.. కాంగ్రెస్ పార్టీలో నాయకులు, కార్యకర్తలంతా పటేల్ ప్రధాని కావాలని భావించారు.. కానీ గాంధీజీ నెహ్రూ వైపు మొగ్గు చూపారు.. పటేల్ కేవలం 40 నెలలు హోంమంత్రిగా ఉన్నా అద్భుతాలు చూపించారు.. ఆయనే కనక ప్రధాని అయ్యుంటే చరిత్ర గతి మరోలా ఉండేది.. కాశ్మీర్ సమస్యకు అప్పుడే శాశ్వత పరిష్కారం దొరికి ఉండేది.. పాకిస్తాన్తో సుధీర్ఘ శతృత్వం కొనసాగేది కాదు.. పాకిస్తాన్, చైనా యుద్ధాలు వచ్చి ఉండేవే కాదు.. భారత్ ఏనాడో శక్తి వంతమైన దేశంగా రూపొంది ఉండేదని భావించడంలో అనుమానమే లేదు..

నేడు (అక్టోబర్ 31) సర్ధార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా జాతి ఐక్యతా దినోత్సవం పాటిస్తున్నాం.. దేశ సమగ్రత, ఐక్యత, భద్రత కోసం చిత్తశుద్దితో పని చేస్తూ, పటేల్ ఆశయాల సాధన కోసం మనం ప్రతినబూనాల్సిన తరుణమిది..

No comments:

Post a Comment