Monday, June 12, 2017

జ్ఞాపకాల్లో సినారె

చిత్రం భళారే విచిత్రం.. పొద్దున్నే దాన వీర శూర కర్ణ చిత్రంలోని ఈ గీతం నా మదిలో మెదిలింది.. ఎన్టీఆర్ నటించిన ప్రతి నాయక పాత్ర దుర్యోధనుడికి యుగళ గీతం ఒక ఎత్తైతే, ఆ పాటను రాసిన సినారె గుర్తుకు వచ్చారు.. కొద్ది గంటల్లోనే దుర్వార్త.. ఆ మహా సాహితీ దిగ్గజం ఇక లేరని.. నా జ్ఞాపకాలు 17 ఏళ్లు వెనక్కిపోయాయి..

'సర్.. నేను మీ అభిమానిని..'
చిరునవ్వుతో నా వైపు చూసి ఏదో బ్రోచర్లో తల దూర్చారు ఆయన..
'మీ రచనలు, చాలా ఇష్టం.. మీరు రాసిన కవితలు, గజళ్లు, పాటలు తరచూ చదువుతుంటాను..'
ఈసారి ఆసక్తిగా నావైపు దృష్టి సారించారు..
ఒక జర్నలిస్టుగా రవీంద్ర భారతిలో యాదృచ్చికంగా సినారెను కలిసిన సందర్భం అది.. ఇలా ఇద్దరికీ సంభాషణ కలిసింది.. నా గురుంచి అడిగి తెలుసుకున్నారు.. ఎంతో ఆత్మీయత కనిపించింది వారి మాటల్లో..  వీడ్కోలు తీసుకునే ముందు కనబడుతూ ఉండు అన్నారు.. ఆ తర్వాత ఒకటి, రెండుసార్లు మాత్రమే వారిని కలిసి ఉంటాను.. అయినా గుర్తు పెట్టుకొని మాట్లాడారు..
ఇటీవల ఆ మహనీయున్ని కలవాలని చాలామార్లు అనుకున్నాను.. కానీ ఎప్పటికప్పుడు ఏదో పని పడుతూ వాయిదా వేస్తూ పోయాను.. ఈలోగా శాశ్వతంగా దూరమయ్యారు.
హైదరాబాద్ సంస్థానంలో పుట్టి డిగ్రీ వరకూ ఉర్దూ మీడియంలో చదివిన సింగిరెడ్డి నారాయణ రెడ్డి తెలుగు సాహిత్యంలో ఉన్నత శిఖరాలను చేరడం, అధ్యాపకుడిగా, సినీ గేయ రచయితగా ఎనలేని పేరు ప్రఖ్యాతలు సాధించడం చాలా అద్భుతమైన విషయం.
తెలుగు సాహితీ ప్రపంచానికి సినారె చేసినంత సేవ మరే సాహితీవేత్త చేయలేదని నా ప్రగాఢ విశ్వాసం.. జ్ఞానపీఠ్, సాహిత్య అకాడమీ సహా ఎన్నో సాహిత్య అవార్డులు పద్మశ్రీ, పద్మవిభూషన్ లాంటి పురస్కారాలు, రాజ్యసభ సభ్యత్వం వారి కీర్తి కిరీటంలో మణిపూసలుగా నిలిచాయి..

కానీ నాకు ఎందుకో అసంతృప్తి.. వారికి ఇంకా ఎక్కువ గౌరవం దక్కాల్సింది అని.. సిరారె పవిత్ర స్మృతికి ఇదే నా అక్షరాంజలి..

No comments:

Post a Comment