Sunday, November 13, 2016

ఉప్పు కొరత పుకార్ల వెనుక కుట్ర ఏమిటి?

అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్లుంది వ్యవహారం.. సామాన్యునిడి నిత్యావసరం ఉప్పు.. ఉప్పు లేని తిండి రుచించదు.. నీ ఉప్పు తిన్నవాడిని అంటూ విశ్వాసం ప్రకటిస్తారు.. మన స్వాతంత్ర్య పోరాటంలో ఉప్పు సత్యాగ్రహ పాత్ర విస్మరించలేనిది..

దేశంలో ఉప్పుకు కొరత వచ్చిందంటూ పుకార్లు ఉప్పెనలా సాగాయి.. జనం పరుగులు తీసి కిలోల కొద్దీ ఉప్పు కొని దాచుకోవడం మొదలు పెట్టారు.. కిలో ఉప్పు ధర రూ.25 నుండి అమాంతం రూ.500 దాకా పెరిగిపోయింది..
కిరాణా షాపుల ముందు బారులు, జనం తొక్కిసలాటలో ఒక మహిళ మృతి, పోలీసుల లాఠీ ఛార్జీ, ఉప్పు లూఠీలు జరిగిపోయాయి.. ఉప్పు నోస్టాక్ అంటూ బోర్డులు పెట్టి బ్లాక్ మార్కెట్ కు తెర తీశారు వ్యాపారులు.. దేశంలో ఉప్పు కొరత లేదని ప్రభుత్వం ప్రకటించినా జనం నమ్మని పరిస్థితి..
కరెన్సీ కొరతతో జనం సతమతం అవుతున్న వేళ పులిమీద పుట్రలా ఇలాంటి పుకార్లు వ్యాపిస్తున్నది ఎవరు?.. బాధ్యత లేని సోషల్ మీడియానే ఇందుకు కారణం..
ఒక్కసారి ఆలోచించండి.. మన దేశంలో ఎక్కడికి వెళ్లినా ఉప్పు విస్తారంగా, చౌకగా దొరుకుతుంది. మనకు అపారమైన సముద్ర తీరం ఉంది.. కయ్యల్లో ఇబ్బడి ముబ్బడిగా ఉప్పు తయారవుతుంది.. ఉప్పు కొరత అంటే ఎలా నమ్మగలం.. అలా నమ్మిన వారిని వెర్రివారిగా జమ కట్టక తప్పదు..

నిజానికి మనం ఉప్పును ఆహారంలో ప్రత్యేకంగా కలుపుకోవాల్సిన అవసరం లేదు.. మన తీసుకునే ఆహారంలో సహజ సిద్దంగా ఉండే ఉప్పు శరీరానికి సరిపోతుంది.. కాస్త రుచికోసం చిటికెడు ఉప్పు కూరల్లో, మజ్జిగన్నంలో వేసుకుంటే చాలు.. చిటికెడుకన్నా ఎక్కువ ఉప్పును మనం రుచి చూడగలమా?.. కిలోలు కిలోలు ఉప్పు కొని దాచుకొని ఏమి చేయగలం?.. ఈ మాత్రం కామన్ సెన్స్ మనకు ఉంటే చాలు.. దయచేసి ఇలాంటి ఉత్త పుకార్లను ప్రోత్సహించి, జనాలను వెర్రివాళ్లను చేయకండి.. నల్ల వ్యాపారుల కుట్రలో భాగస్వాములు కాకండి..

No comments:

Post a Comment