Thursday, July 4, 2013

చిత్రగుప్తుని శిథిల వైభవం..

మానవుల పాపాల లెక్కలు రాసి యమ ధర్మరాజుకు నివేదించే చిత్రగుప్తుని ఆలయ ఉనికి ప్రమాదంలో పడింది.. భారత దేశంలో చిత్రగుప్తునికి కేవలం ఆరేడు ఆలయాలు మాత్రమే ఉన్నాయి.. అందులో ప్రత్యేకించి చిత్ర గుప్తుని పేరిట వెలసినవి రెండే రెండు.. ఒకటి ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నోలో ఉంటే, రెండోది హైదరాబాద్ పాత నగరంలోని కందికల్ గేట్ ప్రాంతంలో ఉంది.. దురదృష్టవశాత్తు మన చిత్రగుప్త దేవాయానికి సంబంధించిన గత వైభవ చిహ్నాలేవీ ఇప్పుడు లేదు..

దశాబ్దాలుగా కబ్జాలకు గురవుతూ వస్తున్న ఆలయ ప్రాంగణం మూడో వంతుకు తగ్గి పోయింది..  దశాబ్దాల తరబడి తిష్టేసిన కబ్జాదారులు న్యాయ పోరాటంలో ఆలయ ప్రాంగణంలో చాలా భాగం చేజిక్కించుకున్నారు.. (గూగుల్ మ్యాప్ చూడండి) చిత్ర గుప్త దేవాలయంలో ఒకప్పడు దసరా ఉత్సవాలు ఎంతో ఘనంగా జరిగేవి.. ఆర్యసమాజ్ వారి ఊరేగింపు,  రథయాత్ర, రావణ దహన వేడుకలు తీపి గుర్తులుగా మిగిలాయి.. బతుకమ్మలను నిమజ్జనం చేసే బావిని ఏనాడో పూడ్చేశారు.. నేను చిన్నప్పుడు ఆటలాడిన మైదానం, చెట్లూ ఏనాడో మాయమయ్యాయి..

ఇదంతా ఒక ఎత్తైతే విచారకరమైన మరో విషయం ఉంది.. ఇక్కడ మీరు చూసిన అద్భుత ముఖ ద్వారా కట్టడం ఇప్పడు లేదు.. కందికల్ గేట్ రైల్వేలైన్ క్రాసింగ్ మీదుగా నిర్మిస్తున్న రైల్ ఓవర్ బ్రిడ్జ్ పేరుతో ఆలయ ప్రకార గోడను కూల్చేశారు.. (గూగుల్ మ్యాప్ లో ఎర్ర రంగుతో చూపించిన రైల్ ఓవర్ బ్రిడ్జ్ మార్గాన్ని చూడండి) రైలు వంతెన పేరిట అరుదైన చారిత్రిక ఆలయాన్ని మింగేయడం ఏ అభివృద్ధికి చిహ్నం? పాపుల లెక్కలు రాసే చిత్రగుప్తునికే ఇంత అన్యాయం జరిగిపోతుంటే.. పాపం ఆయన ఎవరికి చెప్పుకోవాలి? అయినా చిత్రగుప్తుడు ఎవరికి పట్టాడు గనుక? తెలుగు సినీ రంగం చిత్రగుప్తున్ని హాస్యగానిగా మార్చేసినా నోరు మెదపని ఆయన భక్తులు, తమ దేవుడి ఆలయ ఉనికే ప్రమాదంలో పడితే చలిస్తారనుకోవడం మన అత్యాశ కాకపోతే..

రాకాసిలా దూసుకొస్తున్న ఈ రైల్వే వంతెన శతాబ్ద చరిత్ర ఉన్న కందికల్ గేట్ ఉనికినే కాలగర్భంలో కలిపేసింది.. ఇటువైపు నుండి కందికల్ గేట్ బస్తీలోకి వెళ్లే మార్గమే లేకుండా పోయింది.. నేను పుట్టి పెరిగిన ప్రాంతానికి ఇక వెళ్లలేనని తలచుకోవడానికే బాధగా ఉంది.. చత్రినాఖ నుండి కందికల్ గేట్ వెళ్లే రహదారికి రెండు వైపులా ఇళ్లూ, షాపులు కూల్చేయడంతో ఈ ప్రాంతమంతా శిథిల మరుభూమిని తలపిస్తోంది.. ప్రభుత్వం దగ్గర అత్తెసరు నష్ట పరిహారం తీసుకున్న వారు ఆ డబ్బుతో కొత్త ఇంటిని కట్టుకునే అవకాశం లేక దీనంగా ఈ ప్రాంతాన్ని వదిలేసి ఇతర చోట్ల అద్దె ఇంట్లోకి తరలిపోయారు..

ఈ ప్రాంత వాసుల గోడు ప్రభుత్వానికి, రాజకీయ పార్టీల చెవికి ఎక్కే అవకాశమే లేకుండా పోయింది.. ఎందుకంటే మజ్లిస్ ప్రాభల్య ప్రాంతంలో ఉన్న ఇక్కడి హిందువుల బతుకులు మైనారిటీలకన్నా అధ్వాన్నంగా తయారయ్యాయి.. వీరి ఓట్లకూ విలువలేదు.. వీరు ఓట్లేసినా, వేయకున్నా తాము గెలుస్తామని తెలిసిన మజ్లిస్ పార్టీ ఎంపీ, ఎమ్మెల్యే, ఇతర ప్రజాప్రతినిధులకు వీరంటే ఎంతో చులకన.. అలాగే వీరు ఓట్లేసినా గెలిచే అవకాశం లేని బీజేపీ నాయకులు కూడా వీరిని పట్టించుకోకుండా గాలికి వదిలేశారు.. ఇక కాంగ్రెస్, టీడీపీలు ఈ ప్రాంత ఛాయలకే రావు.. పాత నగరంలో హిందువులుగా పుట్టడమే ఇక్కడి వారు చేసుకున్న పాపం.. 

Wednesday, July 3, 2013

చిత్రగుప్త ఆలయం

మన పురాణాల ప్రకారం చిత్రగుప్తుడు.. యమధర్మ రాజుకు సహాయకుడు. మన జనన మరణాలు, పాపపుణ్యాల లెక్కలు రాస్తుంటాడు.. Chief Accountant అనుకోవచ్చు..ఈ లెక్కల ఆధారంగానే మరణానంతరం యమ లోకంలో శిక్షలుంటాయి..  చిత్ర గుప్తునికి ఐరావతి, దక్షిణ అనే ఇద్దరు భార్యలున్నారు.. వీరికి 12 మంది సంతానం..


మన దేశంలో యుగయుగాలుగా గణక (Accountant) వృత్తిలో ఉన్న కాయస్తులకు చిత్రగుప్త మహారాజు కుల దైవం.. కాయస్తులు మన దక్షిణ భారత దేశంలో చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారు.. కానీ ఉత్తరాదిన ఈ కులస్తులు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు.. నేతాజీ సుభాష్ చంద్రబోస్, స్వామి వివేకానంద, బాబూ రాజేంద్ర ప్రసాద్ తదితరులు కాయస్తులే..


హిందూ దేవుళ్లలో చిత్రగుప్తుడు కూడా ఉన్నా, ఆయనకు దేవాలయాలు చాలా తక్కువ సంఖ్యలోనే ఉన్నాయి.. . మన రాష్ట్రంలో చిత్రగుప్తునికి ఆలయం ఉన్న విషయం చాలా మందికి తెలియదు.. అదెక్కడో తెలుసా.. హైదరాబాద్ పాత బస్తీలోని కందికల్ గేట్.. ఇది నేను పుట్టి పెరిగిన ప్రాంతంగా చెప్పుకోవడానికి నేను ఎంతో గర్వపడుతుంటాను..


కందికల్ గేట్ ప్రాంతంలోని శ్రీ చిత్రగుప్త దేవాలయానికి 250 ఏళ్ల చరిత్ర ఉంది.. ఉత్తరాది నుండి కొన్ని శతాబ్దాల క్రితం వలస వచ్చిన కాయస్తులు నిర్మించిన ఆలయం ఇది..  ఎంతో మంది భక్తులు ఒక్కడికి వచ్చి తమ దోషాల నివారణ కోసం చిత్రగుప్త మహారాజుకు పూజలు చేస్తుంటారు.. బుధవారం నాడు ప్రత్యేక అభిషేకం, కేతు దోష నివారణ పూజలు కూడా ఇక్కడ నిర్వహిస్తారు.. దీపావళి తర్వాత రోజు వచ్చే యమ ద్వితీయ చిత్రగుప్తుని జన్మదినం.. ఆ రోజున భోజ్ దోజ్ పేరిట ఉత్సవం నిర్వహిస్తారు.. కాలక్రమంలో చిత్రగుప్త దేవాలయ ప్రాంగణంలో శివాలయం, రామాలయం, ఆంజనేయ స్వామి ఆలయం, సాయిబాబా గుడి కూడా వచ్చాయి..





Tuesday, July 2, 2013

చిత్రగుప్త కథ..

 
చిత్రగుప్తుడు అంటే ఎవరో మీ అందరికీ తెలుసు కాదా?.. మన దేశంలో చిత్రగుప్తునికి భక్తులు కూడా ఉన్నారు.. అంతెందుకు నేనూ చిత్ర గుప్తున్ని పూజించిన వాన్నే.. దురదృష్టవశాత్తు తెలుగు చిత్రసీమ చిత్రగుప్తున్ని హాస్యగానిగా మార్చేశారు..చిత్ర గుప్తునికి ఆలయాలు ఉన్నాయా?.. ఉంటే ఎక్కడ ఉన్నాయి? మన రాష్ట్రంలో కూడా ఒక గుడి ఉన్న విషయం మీకు తెలుసా?.. దీంతో పాటే విషాదం కలిగించే వార్త కూడా ఒకటి ఉంది.. ఇలాంటి ఆసక్తికరమైన విషయాలతో మరికొద్ది గంటల్లో మీ ముందుకు వస్తాను.. ఎదురు చూస్తూ ఉండండి..

Saturday, June 29, 2013

రాజకీయం చేయకండి

భారత జాతికి అండ సైనికులు.. తెలుగు జాతికి అండ చంద్రబాబు. జై జవాన్.. జై చంద్రబాబు
పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ టీడీపీ నాయకుడు పెట్టిన ఫ్లెక్సీ ఇది..
భారతీయుల జాతి వేరు, తెలుగు వారి జాతి అని ఆ నాయకుడు భావిస్తున్నారా? తెలుగు వారు భారతీయుల్లో భాగం కాదా?
జై జవాన్.. జై కిసాన్.. జై విజ్ఞాన్.. నినాదాం వెనుక ఓ స్పూర్తి ఉంది.. దీన్ని రాజకీయ నినాదంగా మార్చకోవడం సబబేనా..
అభిమానానికీ హద్దు ఉండాలి.. చంద్రబాబు నాయుడు ఉత్తరాఖండ్ రాష్ట్రంలో తెలుగు యాత్రికులను రక్షించేందుకు చొరవ తీసుకోవడం అభినందనీయమే.. కానీ అతి పబ్లిసిటీ బెడిసి కొట్తే ప్రమాదం ఉంది.. దేశ రక్షణ కోసం అహర్నిమిషం కష్టపడుతూ, ప్రాణాలకు తెగించి ప్రకృతితో పోరాడుతూ బాధితులను కాపాడుతున్న సైనికులతో చంద్రబాబును పోల్చడం సరికాదు..
చంద్రబాబు ఓ రాజకీయ నాయకుడు, తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన బాబు గారు ఏమి చేసినా మీడియాలో పబ్లిసిటీ దొరుకుతుంది.. కానీ వీర జవాన్లకు పబ్లిసిటీ అవసరం లేదు.. దేశం కోసం తమ ప్రాణాలు పణంగా పెట్టి పని చేస్తున్న సైనికులకు ఓట్లు అవసరం లేదు.. ప్రజల ఆశీర్వాదాలు, అండదండలు కావాలి..

మితి మీరిన పబ్లిసిటీ కొన్ని సందర్భాల్లో బెడిసికొట్టే ప్రమాదం ఉంది.. బాబుగారి విషయంలో ఇది చాలాసార్లు రుజువైంది.. ఈ విషయాన్ని టీడీపీ అభిమానులు, కార్యకర్తలు గ్రహించాలి..

Friday, June 28, 2013

జై జవాన్.. జై కిసాన్..

ఈ నినాదం వినగానే మనలో దేశభక్తి ఉప్పొంగుతుంది.. ఉత్తరాఖండ్ వరదల్లో మన సైనికుల సహాయక చర్యలను చూస్తుంటే మరోసారి ఈ నినాదం అందరి నోళ్లపై మెదులుతోంది..
1965లో లాల్ బహద్దూర్ శాస్త్రి ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో పాకిస్తాన్ మన దేశంపై యుద్ధానికి దిగింది.. భారత సైనికులు పాకిస్తాన్ ను చిత్తుగా ఓడించారు.. ప్రధమ భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ముందు చూపు లోపం కారణంగా చైనా దాడిని సమర్థవంతంగా ఎదురుకోలేక పోయామనే బాధలో ఉన్న భారత ప్రజలకు, పాకిస్తాన్ పై సాధించిన తాజా విజయం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది.. భారత జవాన్లలో శాస్త్రీజీ నింపిన స్పూర్తి విజయానికి కారణమైంది..
మరోవైపు స్వాతంత్ర్యం తర్వాత తీవ్ర ఆహార ధాన్యాల కొరతతో బాధపడుతున్న మన దేశం హరిత విప్లవంతో స్వయం సంవృద్ధిని సాధించింది.. దేశంలో విస్తారంగా పంటలు పండాయి.. ఈ నేపథ్యంలోనే లాల్ బహద్దూర్ శాస్త్రి జై జవాన్.. జై కిసాన్.. నినాదం ఇచ్చారు.. దేశాన్ని రక్షించే సైనికులకు జై కొడదాం.. అలాగే మనం తిండిని ఇచ్చే రైతన్నకూ జై కొడదాం అని శాస్త్రీజీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు..
ఈ నినాదాంలో మరో జై జోడించారు ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజపేయి.. 1999లో పోఖ్రాన్ అణు పరీక్ష విజయం సందర్భంగా వైజ్ఞానిక వేత్తల (శాస్త్రవేత్తల) సేవలను గుర్తిస్తూ జై విజ్ఞాన్ నినాదాన్ని కూడా చేర్చారు..
సైనికులకు, రైతులకు సైతం శాస్త్రవేత్తల సేవలు కావాలి.. ఈ ముగ్గరి సేవలు దేశ ప్రజలకు ఎంతో ముఖ్యం..
అలా జై జవాన్.. జై కిసాన్.. జై విజ్ఞాన్ .. నినాదం రూపు దిద్దుకుంది..



Thursday, June 27, 2013

వీర జవాన్లకు పాదాభివందనం..

దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అతి పెద్ద యుద్దేతర సహాయక కార్యక్రమాల్లో భారత సైన్యం పాల్పంచుకుంటోంది.. ఉత్తరాంఖండ్ వరదల్లో చిచ్చుకున్న వేలాది మంది చార్ ధామ్ భక్తులను కాపాడుతోంది మన సైన్యం.. కొండా కోనల్లో చెల్లా చెదురైన యాత్రికులను సురక్షితంగా బయటకు తీసుకు రావడంతో పాటు ఆహారం, వసతి కల్పించి ఆదుకుంటున్నారు మన జవానులు.. తాత్కాలిక వంతెనలు నిర్మించి, తాళ్లతో నదులను దాటించి యాత్రికుల ప్రాణాలు కాపాడుతున్నారు.. అందుకోసం ప్రతికూల వాతావరణంలో ప్రాణాలకు తెగించి ప్రకృతితో పోరాటం చేస్తున్నారు.. సహాయక చర్యల్లో సైనికులు తమ సహచరులను సైతం కోల్పోయినా మనో ధైర్యం కోల్పోకుండా పని చేస్తున్నారు.. ప్రతికూల వాతావరణంలో ఓ హెలిక్యాప్టర్ కూలి వైమానిక దళ సభ్యుల ప్రాణాలు కూడా పోయాయి..

మన వీర జవానులకు సెల్యూట్ చేయడంతోనే సరిపెట్టుకోవద్దు.. వీలైతే పాదాభివందనం చేద్దాం..






ముఖ్యమంత్రి ఢిల్లీకి ఎందుకు వెళ్లారు?

కేంద్రంలో యూపీఏ ప్రభుత్వానికి మెజారిటీ లోక్ సభ సీట్లను కట్టబెట్టిన ఆంధ్ర ప్రదేశ్ అంటే కాంగ్రెస్ పార్టీ ఏపాటి విలువ ఇస్తోందో మరోసారి గమనించండి..
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ దర్శనం కోసం మూడు రోజుల పాటు ఢిల్లీలో ఎదురు చూశారు.. ఆమె అపాయింట్మెంటే దొరకలేదట పాపం.. చేసేది లేక సెకండ్ కేడర్ నాయకులతో చర్చలు జరిపి హైదరాబాద్ కు తిరుగు ముఖం పట్టారు.. రెండు రోజుల కాశ్మీర్ పర్యటనకు వెళ్లిన సోనియాజీ, మూడో రోజున ముఖ్యమైన అపాయింట్మెంట్లతో బిజీగా ఉన్నారట.. ఒక కాంగ్రెస్ పాలిత రాష్ట్ర ముఖ్యమంత్రికే ఆమె సమయం ఇవ్వలేదంటే అంత పెద్ద రాచకార్యాలు ఏమున్నాయో? తమ రాష్ట్రాల్లోనే గుర్తింపు కోల్పోయిన గులాంనబీ, దిగ్విజయ్ లాంటి నాయకులతో కలిసేందుకే కిరణ్ కుమార్ గారు ఢిల్లీ దాకా వెళ్లారు.. ఏం వారినే హైదరాబాద్ వచ్చి మాట్లాడమని చెప్పొచ్చు కదా? చూశారు కదా తెలుగు వారన్నా, ఏపీ కాంగ్రెస్ నాయకులన్నా కాంగ్రెస్ పార్టీ పెద్దలకు ఏ మేరకు గౌరవం ఉందో..

ముఖ్యమంత్రి గారు ఢిల్లీ వెళ్లింది ఉత్తరాంచల్ రాష్ట్ర వరదల్లో చిక్కుకున్న తెలుగువారిని ఓదార్చి, వారికి అందుతున్న సహాయ కార్యకలాపాలు పర్యవేక్షించడానికే కాబోలు అని అంతా భావించారు.. కానీ కిరణ్ కుమార్ గారు పుణ్యం పురుషార్ధం కలిసి వస్తాయని అన్ని పనులు కలుపుకొని అక్కడికి వెళ్లారు.. సరే ఇక ఏపీ భవన్లోనే బస కాబట్టి బాధితుల కష్టాలు వినక తప్పలేదు.. దేశంలోని పలు రాష్ట్రాల సీఎంలు ఉత్తరాఖండ్ వెళ్లి తమ ప్రజల బాగోగులు చూసుకున్నారు.. మన సీఎం గారికి మాత్రం అంత తీరుబడి లేదేమో? అందుకే క్రెడిట్ అంతా తన జిల్లాకే చెందిన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుకు ఇచ్చేశారు..