Sunday, April 30, 2017

విజయాన్ని కాపాడుకోవాలి..


జీవితం అంటేనే ఒక ఇక సమర భూమి.. కష్ట సుఖాలు మన శత్రు మిత్రులు.. కష్టమనే శత్రువుతో నిరంతరం పోరాడుతూ ఉండాలి..
పోరాటంలో కొన్నిసార్లు ఓడిపోతాం.. ఈ ఓటమే శాశ్వతం అని కృంగిపోవద్దు.. అలాగే విజయం సాధించిన వాడు ఆ గెలుపే శాశ్వతం అని మురిసిపోవద్దు.. 
ఓడినవాడు విజయం కోసం తిరిగి పోరాటం మొదలు పెట్టాలి.. అలాగే గెలిచినవాడు ఆ విజయాన్ని శాశ్వతంగా నిలుపుకోవడానికి ప్రయత్నించాలి.. విజేతకు అసలైన సవాలు ఇక్కడే.. ఈ ప్రయత్నం చేసినవాడు చరిత్రలో నిలచిపోతాడు..
- క్రాంతి దేవ్ మిత్ర 
(వివేక వాణి స్పూర్తితో)

కేజ్రీవాల్ కు చెంపపెట్టు

అసలే తిక్క.. దానికో లెక్క కూడా లేదు.. బాసలెన్నో చేసి ఆశలు పెంచాడు.. అవన్నీ అడియాశలైపోయాయి.. ఈయన అరవింద కాదు, గురవింద అని తెలుసుకున్నారు హస్తిన జనం.. ఎంసీడీ ఎన్నికల్లో చెంప పెట్టులాంటి తీర్పు ఇచ్చారు..

ఏదో చేస్తానని వచ్చింది ఆమ్ ఆద్మీ పార్టీ.. ఊకదంపుడు ఉపన్యాసాలు, వాగ్దానాలు ఇచ్చేసింది.. కొత్త పార్టీపై ఢిల్లీ ప్రజలు ఆశలు పెట్టుకొని అసెంబ్లీ ఎన్నికల్లో కనీవినీ ఎరుగనంత మెజారిటీతో అధికారం అప్పగించారు.. కానీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చేసింది ఏమిటి? పరిపాలన గాలికి వదిలేసి ఎప్పుడూ ప్రధానమంత్రి మోదీని ఆడిపోసుకోవడం.. ఆయన విద్యార్హతలు ఏమిటా అని ఆరా తీయడం.. కేంద్రం, లెఫ్టినెంట్ జనరల్ సహకరించడం లేదంటూ గిల్లీ కజ్జాలు పెట్టుకోవడం.. ఢిల్లీ గల్లీల్లో జనం గోడును పక్కన పెట్టి జాతీయ, ఇతర రాష్ట్రాల రాజకీయాల్లో తల దూర్చడం..
రాజకీయాలను ప్రక్షాళన చేస్తానంటూ వచ్చిన ఆమ్ ఆద్మీ మంత్రులు, ఎమ్మెల్యేల్లో చాలా మందికి నేర చరిత ఉండటం, కేసుల్లో ఇరుక్కోవడం చూస్తుంటే వారి స్వచ్ఛత ఏపాటిదో అర్థమవుతోంది..ఇది ఆప్ కాదు, పాప్ అని హస్తినవాసులకు అర్థం కావడానికి ఎక్కువ సమయం పట్టలేదు.. అందుకే ఎంసీడీ ఎన్నికల్లో ఆప్ ఘోర పరాజయం.. భాజపా విజయకేతనం..
ఇంత జరిగినా కేజ్రీవాల్ లో మార్పు రాలేదు.. తప్పంతా ఈవీఎంలదే అంటూ అరగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డును మళ్లీ వినిపిస్తున్నాడు.. హుమ్.. మారడు గాక మారడీయన (27.04.17)

సోషల్ మీడియా విశ్వసనీయత కోల్పోవద్దు..

దున్నపోతు ఈనింది అని ఒకడు అంటే, దూడను కట్టేయండ్రా అంటూ స్పందించాడట మరొకడు..
ప్రస్తుతం సోషల్ మీడియా తీరు ఇలాగే ఉంది.. రాందేవ్ బాబా విషయంలో ఇప్పుడు జరిగింది ఇదే.. వార్త నిజమా కాదా అని తెలుసుకునే ప్రయత్నం చేయకుండానే ఎవరో మార్ఫింగ్ చేసి పంపిన ఫోటోలను గుడ్డిగా ఫార్వర్డ్ చేసేశారు.. చివరకు వాస్తవం తెలుసుకొని నాలిక కరచుకున్నారు.. 
ఇలాంటి కారణాలు చూపించే ప్రభుత్వాలు సోషల్ మీడియాను కంట్రోల్ చేయాలంటూ కారాలు మిరియాలు నూరుతుంటాయి.. సోషల్ మీడియాకు స్వీయ నియంత్రణ ఆవశ్యకతను ఈ ఘటన గుర్తు చేస్తుంది..
26.04.2017

Thursday, April 20, 2017

చైనాకు బుద్ధి చెప్పాల్సిందే..

ఓ మోతుబరి ఆసామి పక్కనే ఉన్న చిన్న రైతు పొలాన్ని ఆక్రమించాడు.. ఆ తర్వాత దాని పక్కన ఉన్న మరో ఆసామి పొలంపై కన్నేశాడు.. పొలం గట్ల దగ్గర వివాదం సృష్టించి, అవి తనవేనని చాటుకొని పెత్తనం చేస్తున్నాడు..
చైనా తీరు కూడా ఇలాగే ఉంది.. అన్యాయంగా స్వతంత్ర టిబెట్ దేశాన్ని అక్రమించి కలిపేసుకుంది.. టిబెట్ ను ఆనుకొని ఉన్న భారత్ లోని అరుణాచల్ ప్రదేశ్ భూభాగాలు తనవేనని దబాయిస్తోంది.. అవి దక్షిణ టిబెట్ లోని భాగాలని దబాయిస్తోంది.. అసలు టిబెట్టే చైనాది కానప్పుడు, ‘దక్షిణ టిబెట్’ అనే వాదనలో పస ఉందా?.. ఇక్కడే భారత్ ఇరకాటంలో పడుతోంది..
1949లో టిబెట్ పై దురాక్రమణ చేసి ఆక్రమించినప్పుడు అందరికన్నా ముందు సమర్ధించి, చైనాకు దానిపై హక్కును గుర్తించింది జవహర్ లాల్ నెహ్రూ నేతృత్వంలోని భారత ప్రభుత్వమే..  ‘హిందీ-చీనీ భాయ్ భాయ్’ అంటూ చైనాతో మైత్రి చైశారు నెహ్రూ. మరోవైపు తాను శాంతి దూతగా పేరు తెచ్చుకోవలని తపనతో దలైలామాకు భారత్ లో ఆశ్రయం ఇచ్చారు నెహ్రూ..
ఈ ద్వంద్వ విదేశాంగ నీతే భారత్ ప్రయోజనాలకు ముప్పుగా మారింది. భారత్ తో చైనా యుద్దం, జమ్మూ కశ్మీర్ లోని అక్సాయ్ చిన్ దురాక్రమణ, అరుణాచల్ ప్రదేశ్ వివాదం.. భారత్ లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ కు బహిరంగంగా బాసటగా నిలిచింది చైనా వీటన్నింటికీ నెహ్రూ విధానాలే వారసత్వ శాపంగా కొనసాగుతున్నాయి..

ఇప్పటి వరకూ ఉన్న ప్రభుత్వాలన్నీ చైనాను దారిలో పెట్టలేకపోయాయి.. కనీసం నరేంద్ర మోదీ ప్రభుత్వమైనా చైనాతో మనకు ఉన్న సమస్యను పరిష్కరిస్తుందని ఆశిద్దాం..

పెద్దవాడివైతే ప్రయోజనం ఏమిటి?

' నీవు అందరికన్నా పెద్దవాడినని మురిసిపోతే ఏం ప్రయోజనం.. ఖర్జుర చెట్టు ఎత్తుగా ఉంటుంది. దాని నీడ ఎవరికీ అందదు.. పండ్లు కూడా ఎంతో ఎత్తులో ఉంటాయి..' - సంత్ కబీర్
కొందరు అందరికన్నా తాము ఉన్నతులం అని, ఎంతో ఎదిగి పోయామని మురిసిపోతారు.. తోటి వారి కష్ట సుఖాలను పట్టించుకోరు.. ఇలాంటి ఎదుగుదల వారి మానసిక ఆనందానికి పనికి వస్తుందేమో కానీ, సమాజానికి వీరి వల్ల ఉపయోగం ఏమిటి?..

Wednesday, April 19, 2017

అర్థం మారిన లౌకికవాదం

'మతతత్వం' అనే పదానికి అర్థం మారిపోయింది..
మతపరమైన రిజర్వేషన్లు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తే 'మతతత్వం'..
మతపరమైన రిజర్వేషన్లు ఇవ్వడాన్ని సమర్థిస్తే 'లౌకికవాదం'

Monday, April 17, 2017

ఈ రిజర్వేషన్లు న్యాయమేనా?

మన సమాజానికి అన్నింటికన్నా మొదటి శత్రువు పేదరికం.. ఆ తర్వాతే ఏదైనా.. సమాజంలో సామరస్య వాతావరణం నెలకొని అందరూ సుఖ సంతోషాలతో జీవించేలా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలది.. దురదృష్టవశాత్తు మన నాయకులు ఓటు బ్యాంకు రాజకీయాలతో సమాజంలో చిచ్చు పెడుతున్నారు..

కుల రహిత సమాజ నిర్మాణం కోసం కలలు కన్న బాబాసాహెబ్ సామాజిక న్యాయం కోసం పరిమిత కాలం పాటు రిజర్వేషన్లు ఉండాలన్నారు.. కానీ ప్రభుత్వాలు, పార్టీలు తమ ప్రయోజనాల కోసం పదే పదే పొగిస్తూ పోతున్నాయి.. కొత్తగా మరికొన్ని వర్గాలను చేరుస్తూ ఇప్పటికే జాబితాలో ఉన్న వారితో ఘర్షణ పూరిత వాతావరణం కల్పించారు. వీరి కుఠిల విధానాలు, ఓటు బ్యాంక్ రాజకీయాల కారణంగా రిజర్వేషన్ల ప్రక్రియ మొత్తం ప్రమాదంలో పడింది..  వాస్తవానికి నేటికీ రిజర్వేషన్ ఫలాలు అందని అర్హుత గల కులాలు, వ్యక్తులు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు.. వారి ఓట్లకు పెద్దగా విలువ లేదేమో?. ఎవరికీ వారి గోడు పట్టదు..
మరోవైపు ఇప్పటికే రిజర్వేషన్ల ద్వారా లబ్ది పొందిన వారు కొత్తగా మరికొందరు జాబితాలో చేరడాన్ని ఇష్టపడటం లేదు.
వాస్తవానికి రిజర్వేషన్ల కారణంగా సామాజిక స్థితి మారుతుంది అనే వాదన అవాస్తవం అని ఇప్పటి వరకూ ఉన్న అనుభవాలు చెబుతున్నాయి.. సమాజంలో కులతత్వం తగ్గక పోగా మరింత బలపడుతోంది.. కులాన్ని వదులుకుంటే రిజర్వేషన్ పోతుంది అనే భయమే ఇందుకు కారణం.. పరిస్థితి ఇలాగే కొనసాగితే బాబాసాహెబ్ ఆశించిన కుల రహిత సమాజ నిర్మాణం ఎప్పటికి సాధ్యం అవుతుంది?
తాజాగా తెలంగాణలో మత ప్రాతిపదికన రిజర్వేషన్ల చిచ్చు మొదలైంది.. ఆ మతం వారికి సామాజిక, ఆర్థిక న్యాయం కోసమే అని ప్రభుత్వ వాదన.. ప్రభుత్వం చూపిస్తున్న కారణాలు కేవలం ఒక మతంలో మాత్రమే లేవు అన్నది కఠిన వాస్తవం.. మరి ఎందు కోసం ఈ రిజర్వేషన్లు?..
ఇప్పటికే మన సమాజం కుల మతాల కుంపటితో రగిలిపోతోంది. మత ప్రాతిపదికన రిజర్వేషన్ కారణంగా మత మార్పిడులు మొదలైతే ఎంత ప్రమాదమో ఆలోచించారా?.. ఇప్పుడు ఈ వ్యాసం మొదటికి వద్దాం..
అన్ని మతాలు, కులాలకు మొదటి శత్రువు పేదరికమే.. పేదరికానికి కుల మతాలు లేవు.. అన్ని కులాలు, మతాల్లోని పేదలను గుర్తించి వారికి రిజర్వేషన్లు ఇవ్వాలి.. వారి కుటుంది ఆర్థిక స్థితి మారగానే రిజర్వ్ కేటగిరీ ఎత్తివేసి ఇతర పేదలకు ఇవ్వాలి.. ఆధార్ అనుసంధానం అమలవుతున్న ఈ రోజుల్లో అర్హులైన పేదలకు గుర్తించడం కష్టమేమీ కాదు.. ఇప్పుడు అమలవుతున్న రిజర్వేషన్లను పూర్తిగా ఎత్తేయలని నేను కోరుకోవడం లేదు.. ఇవి ఆయా సామాజిక వర్గాల్లోని పేదలకు మాత్రమే చెందేలా చూడాలి.. ధనికులకు రిజర్వేషన్ సదుపాయాన్ని తొలగించాలి..
నిజమైన సామాజిక న్యాయం, వివక్ష లేని సమాజం ఏర్పడాలనే తలంపు ఉన్న వారంతా ఇందు కోసం పోరాడాలి.. మనం కుల మతాల కోణాలు వదిలేసి భారతీయులుగా ఆలోచిద్దాం..
స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో ఆనాటి సామాజిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ రిజర్వేషన్ విధానాన్ని ప్రవేశపెట్టారు.. షెడ్యూల్డ్ కులాలు, తెగలు, బడుగు బలహీన వర్గాల సామాజిక-ఆర్థిక-రాజకీయ అభివృద్ధి ఈ రిజర్వేషన్ల లక్ష్యం.. రిజర్వేషన్ల కారణంగా కోట్లాది మందికి సామాజిక న్యాయ ఫలాలు అందాయి ఆనండంలో ఎలాంటి అనుమానం లేదు..