Monday, October 31, 2016

భారత జాతిని ఐక్య పరిచిన ఉక్కుమనిషి

బ్రిటిష్ వారు భారత దేశానికి స్వాతంత్ర్యం ఇచ్చి వెళ్లారు.. ఉక్కుమనిషి భారత దేశాన్ని సమైక్య పరిచారు.. వారు ముక్కలుగా వదిలేసి పోతే, ఆయన అన్నింటికీ కలిపారు.. విశాల భారత దేశ విలీనాధీశునిగా చరిత్రలో శాశ్వత స్థానం దక్కించుకున్నారు.. నవ భారత దేశ నిర్మాత సర్ధార్ వల్లభాయ్ పటేల్ జయంతి అక్టోబర్ 31ని జాతీయ ఐక్యతా దినోత్సవంగా జరుపుకుంటున్నాం..
గుజరాత్ రాష్ట్రంలోని నదియాద్ లో 31 అక్టోబర్ 1875 నాడు జన్మించారు వల్లభాయ్ పటేల్.. ఇంగ్లాండ్ లో బారిస్టర్ చదువుకొని వచ్చి అహ్మదాబాద్ లో న్యాయవాద వృత్తిని చేపట్టారు. ఈ క్రమంలో భారత స్వాతంత్ర్య పోరాటంలో చేరారు వల్లభాయ్.. సహాయ నిరాకరణ, బర్దోలీ సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమంలో చురుకైన పాత్రను పోశించారు. బ్రిటిష్ ప్రభుత్వం ఆయనను జైలు పాలు చేసింది.. 1931లో కరాచీలో జరిగిన ఆలిండియా కాంగ్రెస్ మహాసభల్లో పార్టీ అధ్యక్ష పదవి చేపట్టారు..
సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశ స్వాతంత్ర్యం తర్వాత ఉప ప్రధానమంత్రి పదవి చేపట్టారు.. 565 స్వదేశీ సంస్థానాలను భారత దేశంలో సంపూర్ణంగా విలీనం చేయడం ద్వారా నవ భారతానికి బాటలు వేశారు.. విలీనం కావడానికి మొండికేసిన హైదరాబాద్ సంస్థానంపై పోలీస్ యాక్షన్ చేపట్టి నిజాం నవాబును దారికి తెచ్చారు.. ప్రధాని నెహ్రూ ద్వంద్వ వైఖరి కారణంగా జమ్మూ కాశ్మీర్ పూర్తిగా పాకిస్థాన్ కబ్జాలోకి వెళ్లకుండా కాపాటంలో పటేల్ పాత్ర విస్మరించలేనిది.. భారత రాజ్యాంగ రచనలో ప్రాథమిక హక్కుల కమిటీ ఛైర్మన్ గా వ్యవహరించారు.. ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ ప్రారంభించారు.. వల్లభాయ్ పటేల్ 15 డిసెంబర్, 1950లో మనకు శాశ్వతంగా దూరమయ్యారు..

కాంగ్రెస్ పార్టీలో గాంధీ, నెహ్రూలకు భిన్నంగా దేశ ప్రయోజనాలకు కాపాటంతో దృఢ వైఖరిని అవలంభించిన సర్దార్ పటేల్ ఉక్కు మనిషిగా పేరు తెచ్చుకున్నారు.. ఆయన తొలి ప్రధాని అయ్యుంటే భారత దేశ చరిత్ర మరింత మెరుగ్గా ఉండేదని చెప్పక తప్పదు.. పటేల్ కఠిన సంకల్పం కారణంగా ముక్కలు, చెక్కులుగా ఉన్న సంస్థానాలు దేశంలో పూర్తిగా కలిపిపోయాయి.. లేకపోతే జాతీయ సమైక్యతకు తీవ్ర విఘాతం కలిగేది.. అందుకే పటేల్ జయంతిని జాతీయ ఐక్యతా దినోత్సవంగా జరుపుకుంటున్నాం.. ముఖ్యంగా మన తెలంగాణ (హైదరాబాద్ స్టేట్) ప్రజలకు సర్దార్ పటేల్ ప్రాత స్మరణీయుడు..

Saturday, October 29, 2016

జాగ్రత్తలు పాటించండి.. ఆనందంగా దీపావళి జరుపుకోండి..

దీపావళి సందర్భంగా టపాకాయలు కాల్చండి ఆనందంగా, ఉత్సాహంగా.. అయితే టపాసులు కాల్చే సమయంలో మన అజాగ్రత్త కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.. ప్రమోదం కాస్తా ప్రమాదంగా మారొద్దు.. కొద్దిపాటి జాగ్రత్తలను కచ్చితంగా పాటించి దివ్వ దీపావళిని మరింత సంతోషకరంగా మార్చుకోండి..

·       నాణ్యమైన టపాకాయలు మాత్రమే కొనుగోలు చేయండి.. నాసిరకం టపాసులతో ప్రమాదాలకు అవకాశం ఎక్కువ
·       టపాకాయలను భద్రమైన ప్రాంతంలోనే నిల్వ చేయండి.. వేడికి, మంటకు దూరంగా ఉంచండి.. ముఖ్యంగా వంటింటిలోకి టపాసులు తీసుకెళ్లకండి..
·       ఇళ్లలో, డాబా మీద, ఇరుకు వీధుల్లో, రోడ్లమీద టపాకాయలు కాల్చకండి.. వీలైనంత వరకూ ఆరుబయట, మైదానాల్లోనే కాల్చండి..
·       చిన్న పిల్లలను వంటరిగా టపాకాయలు కాల్చనీయకండి. పెద్దలు విధిగా వెంట ఉండాలి..
·       టపాకాయలు కాల్చే సమయంలో వదులైన దుస్తులు ధరించకండి.. శరీరానికి అతుక్కుపోయే నైలాల్ బట్టలు అసలే వద్దు.. కాటన్ దుస్తులు శ్రేయస్కరం..
·       టపాకాయలు కాల్చే సమయంలో విధిగా పాదరక్షలు ధరించాలి..
·       టపాకాయలు చేతిలో పట్టుకొని కాల్చడం చాలా ప్రమాదకరం. విష్ణు చక్రాలు, భూచక్రాలు, చిచ్చుబుడ్లు, తారాజువ్వలు కూడా పేలే అవకాశం ఉంటుంది ఉంటుంది..
·       కాకరపువ్వొత్తులు, మెరుపు తీగలు కాల్చే సమయంలో జాగ్రత్తగా ఉండకపోతే చేతులు  కాలే ప్రమాదం ఉంది..
·       ఒకటికన్నా ఎక్కువ టపాకాయలు ఒకేసారి కాల్చే ప్రయత్నం చేయకండి..
·       చిన్న అగర్ బత్తితో టపాకాయలు కాల్చరాదు.. పొడువైన బత్తీని మాత్రమే వాడండి..
·       టపాకాయలపై మొహం పెట్టి కాల్చకండి.. ఇది చాలా ప్రమాదకరం.. కళ్లు కోల్పోయే అవకాశం ఉంది..
·       పేలని టపాసును మళ్లీ వెలిగించే ప్రయత్నం చేయకండి. ఈ క్రమంలో మీరు గాయపడే ప్రమాదం ఉంది..
·       టపాకాయలు వెలిగించేందుకు ఇబ్బంది పడేలా కంటి చూపు సరిగ్గా లేనివారు టపాకాయలకు దూరంగా ఉండటం మంచింది.. ఉత్సాహం ఆపు కోలేము తప్పదు అనుకుంటే కల్లద్దాలు సరిగ్గా పెట్టుకొని ప్రయత్నించండి..
·       వీలైనంత వరకూ పెద్ద శబ్దాలు వచ్చే టపాకాయలకు దూరంగా ఉండాలి.. ఈ శబ్దాల కారణంగా వృద్ధులు, రోగులకు ఇబ్బంది. అంతే కాదు చెవిపోటు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి.. వినికిడి శక్తికి ఇలాంటి టపాకాయలు చాలా ప్రమాదకరం..
·       టపాకాయల శబ్దాలుకు పెంపుడు జంతువులు చిరాకుపడి కరిచే ప్రమాదం ఉంది..
·       ఎక్కువ ధ్వని, వాయు కాలుష్యాలకు కారణం అయ్యే టపాకాయలను అసలు ఉపయోగించకండి.. పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపైనా ఉంది..
·       టపాకాయలు కాల్చడానికి ముందుగా బకెట్ నిండా నీరు, తడిపిన టవాల్, బర్నాల్ సిద్ధంగా ఉంచుకోండి.. ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే గాయం అయిన బాగాన్ని నీటిలో పెట్టండి.. ప్రథమ చికిత్సతో పాటు ప్రమాదాల తీవ్రతను బట్టి వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లడం అతి ముఖ్యం..

పై జాగ్రత్తలన్నీ మీరు విధిగా పాటిస్తే ఆనందరకర దీపావళి సంతోషం మీ సొంతం.. అందరూ విధిగా పాటిస్తారని ఆశిస్తున్నాను..

Sunday, October 23, 2016

టపాకాయల బహిష్కరణ చైనాకు చెంప పెట్టు కావాలి

  చైనా మన భారత దేశానికి అతిపెద్ద వాణిజ్య భాగస్వామి.. భారత దేశ దిగుమతుల్లో ఆరో వంతు చైనా నుంచే వస్తున్నాయి.. చైనాకు మన ఎగుమతులకన్నా దిగుమతులే ఎక్కువ.. మన వాణిజ్య నిఘా, గణాంకాల డైరెక్టర్ జనరల్ నివేదిక ప్రకారం గత ఐదేళ్లలో చైనాకు మన ఎగుమతులు 18 బిలియన్ డాలర్ల నుండి 9 బిలియన్ డాలర్లకు పడిపోగా, ఇదే కాలంలో చైనా నిండి మనకు దిగుమతులు 61 డాలర్లకు చేరింది.. అంటే ఇరు దేశాల మధ్య వాణిజ్య లోటు 52 డాలర్లు..
చైనా నుండి కారు చౌకగా వస్తున్న ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్, మెకానికల్, ఖనిజ, రసాయణ, గాజు, పింగాణి వస్తువుల కారణంగా మన దేశీయ పరిశ్రమలు తల్లడిల్లిపోతున్నాయి.. చైనా నిం ప్రధానంగా మన దేశానికి ప్రధారంగా సెల్ ఫోన్, లాప్ టాప్, సోలార్ సెల్ బ్యాటరీ, స్ప్రింగ్, బేరింగ్, టీవీ రిమోట్, సెటప్ బాక్స్, ఎల్ ఈ డీ, ఎల్ సీ డీలు కుప్పలు తెప్పలుగా వస్తున్నాయి.. రకరకాల ఔషధాలు, పిల్లల ఆట వస్తువులు కూడా భారత మార్కెట్లను ముంచెత్తుతున్నాయి..
చైనాలో మానవ వనరులు, ముడి పదార్ధాలు కారు చౌర.. ఆ దేశంలో శ్రమదోపిడి ఎక్కువ.. ఎక్కువ సమయం పని చేయించుకొని, తక్కువ జీతాలు చెల్లిస్తారు.. పేరుకే కమ్యూనిస్టు దేశం.. కానీ పెట్టుబడి, దోపడిదారుకు ఉండాల్సిన అవలక్షణాలన్నీ కాస్త ఎక్కువే ఉన్నాయి.. ఈ కారణం వల్లే మన దేశంతో సహా ప్రపంచ మర్కెట్ ను కారు చౌక వస్తువులతో ముంచెత్తుతోంది చైనా..
ప్రతి ఏటా మనం దీపావళి పండుగను టపాకాయలతో ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటాం.. శివకాశీలో పెద్ద సంఖ్యలో ఉన్న టపాకాయల పరిశ్రమలు లక్షలాది మంది కార్మికులకు ఉపాధి కల్పిస్తున్నాయి.. ఆ పరిశ్రమకు ఏటా 6000 వేల కోట్ల రూపాయల మేర జరిగే దీపావళి వ్యాపారమే ప్రధానం.. దురదృష్టవశాత్తు కారు చౌకగా మన దేశంలోకి వచ్చిపడుతున్న చైనా తయారీ టపాకాయల కారణంగా దేశీయ టపాకాయల పరిశ్రమకు ముప్పు ముంచుకొచ్చింది.. మన దేశీయ టపాకాయల్లో ఉపయోగించే రసాయణాలతో పెద్దగా ప్రమాదం ఉండదు.. కానీ చైనా తయారీ టపాకాయల్లో నైట్రేట్, సల్ఫర్ అధిక మోతాదులో ఉంటోంది.. చైనా మతాబులు కారు చౌకగా లభిస్తున్నా, మన పిల్లలకు అవి చాలా ప్రమాదకరం.. ఇటీవల కాలంలో చైనా టపాకాయలకు ప్రభుత్వం నిషేధించినా, అవి అక్రమ మార్గంలో దేశంలోకి వచ్చి పడుతున్నాయి..
మైత్రి అనేది ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉండాలి.. చైనాతో భారత్ ఎంతో ఉదారంగా వ్యవహరిస్తున్నా, ఆ దేశం మాత్రం ద్వంద్వ ప్రమాణాలను పాటిస్తోంది.. ముఖ్యంగా సరహద్దుల విషయంలో మన దేశంతో పేచీలు పడుతూ, మన శత్రు దేశం పాకిస్థాన్ కు అన్ని విషయాల్లోనూ అండగా నిలుస్తోంది.. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్ ను వెనుకేసుకు వస్తోంది.. అంతర్జాతీయ వేదికలపై పాకిస్థాన్ అనుకూల భారత్ వ్యతిరేక ధోరణి అవలంభిస్తున్న చైనాకు గుణపఠం చెప్పాల్సిన అవసరం ఉంది.. మన దేశం నుండి వ్యాపారపరంగా లాభ పడుతూ, మనకు వ్యతిరేకంగా పని చేస్తున్న చైనాతో కఠినంగానే వ్యవహరించాలి.
చైనా తయారీ వస్తువుల బహిష్కరణే మన ముందున్న ఏకైక మార్గం.. దేశీయ మధ్య, చిన్న తరహా పరిశ్రమలను కాపాడుకోడానికి ఇది తప్పని సరి.. చౌకగా దొరికే వస్తువులను వదులుకోవడం ఎందుకు అని కొందరు వినియోగదారు దృష్టితో ఆలోచిస్తారు.. కానీ దేశీయ పరిశ్రమలు కుదేలైపోతే మనకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఎలా అనే కోణంలో కూడా ఆలోచించాలి..
మేకిన్ ఇండియా స్పూర్తితో దేశీయంగా పరిశ్రమలు ప్రారంభమై, వస్తూత్పత్తి క్రమంగా పెరుగుతోంది.. ఈ కారణంగా భవిష్యత్తులో చైనా దిగుమతులు గణనీయంగా తగ్గిపోతాయి.. ఇప్పటికే దేశ వ్యాప్తంగా వ్యాపారులు, వినియోగదారులు చైనా వస్తువుల బహిష్కరణ ప్రారంభించారు.. మనం కూడా చైనా వస్తువుల బహిష్కరణను ఈ దీపావళి నుండి మొదలు పెడదాం.. ఇందుకు చైనా టపాకాయల బాయ్ కాట్ నాంది కావాలి.. 

Sunday, October 16, 2016

ఇంతకీ జిల్లాలు ఎన్ని?

తెలంగాణలో కొత్త జిల్లాలు ఉనికిలోకి వచ్చి ఆరు రోజులవుతోంది.. కానీ ఇప్పటి వరకూ ఏ పత్రిక కూడా పూర్తి జిల్లాల చిత్ర పటాన్ని ప్రచురించలేదు.. ప్రభుత్వం ముందుగా విడుదల చేసిన 27 జిల్లాల పటాన్నే పత్రికలు ప్రచురించాయి.. ఆ తర్వాత జిల్లాల సంఖ్య 31కి పెరిగినా పాత పటాన్నే వాడుతున్నాయి.. ఇప్పటి వరకూ ప్రభుత్వం కూడా సవరణలతో కూడిన చిత్ర పటాన్ని విడుదల చేయలేదు.. కొత్త జిల్లాలకు సంభంధించిన అధికారిక వెబ్ సైట్ http://newdistrictsformation.telangana.gov.in/FirstPage.do?status=maps  క్లిక్ చేస్తే పాత చిత్ర పటాలే కనిపిస్తున్నాయి.. ప‌రిజ్ఞానం జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల సరిహద్దులు మారిపోవడంతో ఇంకా చిత్ర పటాల విషయంలో గందరగోళం కొనసాగుతోంది.. ఆధునిక సాంకేతిక ప‌రిజ్ఞానం అందుబాటులో ఉన్న తర్వాత కూడా కొత్త జిల్లాల తుది రూపాల చిత్ర పటాలను విడుదల చేయకపోవడంలో ఆంతర్యం ఏమిటో ప్రభుత్వమే చెప్పాలి.. లేదా ఇంకా ఏమైనా మార్పులు,  చేర్పులు ఉంటే ఆ విషయాన్ని అయినా ప్రకటించాలి..

కొత్త జిల్లాల సందడి..

' ఏ జిల్లా.. ఏ జిల్లా.. పిల‌గా నీది ఏ జిల్లా.. రంగారెడ్డా?.. కామారెడ్డా?.. ' ద‌సరా వేళ తెలంగాణ అంత‌టా పాడుకుంటున్న పాట‌..


మా పూర్వీకుల ఊరు మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లాలో ఉంటే, నేను పుట్టింది హైద‌రాబాద్‌, ఉంటున్న‌ది రంగారెడ్డి జిల్లా.. నీది ఏ జిల్లా అని ఎవ‌రైనా అడిగితే, వివ‌ర‌ణ ఇచ్చుకోలేక ఇబ్బంది ప‌డేవాన్ని.. ఇప్పుడా ఇబ్బంది త‌ప్పింది నాకు.. నేను రావ‌డం లేద‌ని ఊరు బెంగ పెట్టుకున్న‌దేమా?.. ఏకంగా నేనుంటున్న జిల్లాలో క‌లిసిపోయింది.. షాద్ న‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గం, కొత్తూరు మండ‌లం, పెంజ‌ర్ల గ్రామం ఇప్పుడు రంగారెడ్డిలోకి వ‌చ్చేశాయి..
ఇప్పుడు నేను రంగారెడ్డి అని చెప్పుకుంటానేమో.. కానీ మ‌ళ్లీ గంద‌ర‌గోల‌మే.. పాల‌నా ప‌రంగా మాది గ్రేట‌ర్ హైద‌రాబాద్‌.. మ‌ళ్లీ గంద‌ర‌గోల‌మే.. నేనిప్పుడు బాధ ప‌డుతున్న‌ది పాల‌మూరోడిని అని చెప్పుకునే అర్హ‌త కోల్పోయాన‌ని.. కృష్ణా, తుంగ‌భ‌ద్ర న‌దుల‌కు, న‌ల్ల‌మ‌ల అడ‌వుల‌కు  దూర‌మ‌య్యాన‌ని.. అఫ్ కోర్స్ మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లా కూడా వాటిని కోల్పోయింది.. మ‌న పెద్ద‌లంటారు అన్నీ మ‌న‌వేన‌ని అనుకోవ‌ద్దు.. కొన్ని సాధించాలంటే, కొన్నింటిని కోల్పోవాలి.. ఏదేమైనా ప‌రిపాల‌నా సౌల‌భ్యం కోసం కొత్త జిల్లాల‌ను స్వాగ‌తిద్దాం..

Tuesday, October 11, 2016

చరిత్రలో తెలంగాణ పునర్వ్యవస్థీకరణలు ఎన్నో..

తెలంగాణ రాష్ట్ర చరిత్రలో మరో అధ్యాయం మొదలైంది.. ఇప్పటి వరకూ ఉన్న 10 జిల్లాలు ఇప్పుడు 31 అయ్యాయి.. గతంలోని 45 రెవెన్యూ డివిజన్లు ఇప్పుడు 68కి చేరాయి.. అలాగే మండలాల సంఖ్య 459 నుండి 584కు పెరిగింది..
తెలంగాణలోని ప్రస్తుత గ్రామాల సంఖ్య 10,966.. రాష్ట్రం మొత్తం విస్తీర్ణం 1,12,077 చ.కి.మీ.. మొత్తం జనాభా 3,50,03,674 మంది..
పరిపాలనా సౌలభ్యం కోసం జరిగిన పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు కొత్తేం కాదు.. చరిత్రలో ఇలాంటి చాలా మార్పులను గమనించవచ్చు..

మౌర్యులు, శాతవాహనులు, చాళుక్యులు, విష్ణుకుండినులు, రాష్ట్ర కూటులు, కాకతీయులు, కుతుబ్ షాహీలు, అసఫ్ జాహీల కాలం నుండి ఇలాంటి మార్పులు ఎన్నో జరిగాయి.. అసఫ్ జాహీ (నిజామ్) పాలకుల కాలం నుండి చరిత్రను గమనిస్తే..
అప్పట్లో హైదరాబాద్ స్టేట్ ను  మొదటి పేరు ‘దక్కన్ సుభా’  అందులో నాలుగు డివిజన్లు, 16 జిల్లాలు.. తెలుగు ప్రాంతాలు గుల్షానాబాద్ డివిజన్, వరంగల్ డివిజన్ల కింద ఉండేవి..
గుల్షానాబాద్ డివిజన్లో ఆత్రాప్ బల్దా (హైదరాబాద్) మెదక్, మహబాబ్ నగర్, నల్లగొండ, నిజామాబాద్ జిల్లాలు, వరంగల్ డివిజన్లో ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాలను ఏర్పాటు చేశారు..
1948తో హైదరాబాద్ స్టేట్ భారత దేశంలో విలీనం అయింది.. ఆ తర్వాత 1953లో వరంగల్ జిల్లా నుండి ఖమ్మం జిల్లా ఏర్పాటు చేశారు.. 1956లో హైదరాబాద్ స్టేట్ లోని తెలంగాణ ప్రాంతం, ఆంధ్ర రాష్ట్రంను కలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు.. 1978లో హైదరాబాద్ నుండి గ్రామీణ ప్రాంతాన్ని విడదీసి రంగారెడ్డి జిల్లా ఏర్పాటు చేశారు.. 1985లో తాలూకాల స్థానంలో మండల వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది..
2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది.. 2016 దసరా రోజున తెలంగాణలో కొత్తగా 21 జిల్లాలను ఏర్పాటు చేశారు..
తెలంగాణలోని ప్రస్తుత జిల్లాలు: ఆదిలాబాద్, కొమురం భీం (ఆసిఫాబాద్), నిర్మల్, మంచిర్యాల, కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, నిజామాబాద్, కామారెడ్డి, వరంగల్, వరంగల్ రూరల్, జయశంకర్ (భూపాలపల్లి), మహబూబా బాద్, జనగామ, ఖమ్మం, భద్రాద్రి (కొత్తగూడెం), మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి, నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి, హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్, మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్ కర్నూలు, జోగులాంబ (గద్వాల)..
కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో వివాదాలు ఎన్ని ఉన్నా, పరిపాలనా సౌలభ్యం కోసం స్వాగతించాల్సిన అవసరం ఉంది.. కొత్త జిల్లాల ఏర్పాటుతో అధికార వికేంద్రీకరణ జరిగి, ప్రజలకు పరిపాలనా సౌకర్యాలు మరింత చేరువ కావాలని ఆశిద్దాం.