Wednesday, August 31, 2016

వానలకు తట్టుకోలేని నగరమా..

కేవలం ఒకపూట, అదీ కొద్ది గంటలు కురిసిన భారీ వర్షానికే హైదరాబాద్ మహానగరం అతలాకుతలమైపోయింది.. రోడ్లు నదుల్లా మారాయి.. బస్తీలు, కాలనీలు చెరువులను తలపించాయి.. 2000 సం.నాటి విపత్తును తలచుకొని జనం భయపడిపోయారు.. 425 ఏళ్ల మన మహానగరానికి ఏమిటీ దుస్థితి?
ఒకప్పుడు హైదరాబాదు ‘భాగ్ నగర్’ (ఉద్యాన నగరం),‘లేక్స్ సిటీ’ (చెరువుల నగరం)గా గుర్తింపు ఉండేది.. ఈ మహానగర పరిధిలో 500కు పైగా చిన్నా పెద్ద చెరువులు, కుంటలు, కాలువలు, తోటలు ఉండేవి.. ఇవన్నీ గొలుసుకట్టు పద్దతిలో ఒకదానికొకటి అనుసంధానమై వరద నీరు మూసీలో కలిసేది.. (చిత్రాన్ని చూడండి) కానీ ఇప్పుడు ఇందులో 10వ వంతు కూడా ఇప్పుడు కనిపించడంలేదు..
నగరీకరణ పేరుతో అన్నింటినీ మింగేశారు.. చెరువులు, కాలువలు కబ్జా చేసి కాలనీలు, బస్తీలు, భవన సముదాయాలు నిర్మించారు.. మరి వాన పడితే నీరు ఎక్కడికి పోవాలి.. అందుకే వాన పడితే చాలు నీరంతా రోడ్లమీదకు వస్తోంది.. డ్రైనేజీలు, కాలువలపై వత్తిడి పెరిగి నగరం చెరువులా మారిపోతోంది.. ఈ పరిస్థితికి కారణం ఎవరు?
పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నివాస వసతి కల్పించాలంటే చెరువులు, కుంటలను పూడ్చాల్సిందేనా?.. జనావాసాలకు తగ్గట్లుగా డ్రైనేజీలు, కాల్వలను విస్తరించాల్సిన అవసరం లేదా?.. కబ్జాలను తొలగించి, జలప్రవాహాలకు ఆటంకాలు నివాలించే ప్రయత్నం ఎందుకు  చేయడం లేదు? తప్పు ప్రభుత్వానిదేనా? ఇందులో మన పాత్ర లేదా? ఒక్కసారైనా ఆత్మ పరీక్ష చేసుకున్నామా?..

Monday, August 29, 2016

మన తెలుగులో తెలుగెంత?

దేశ భాషలందు తెలుగు ‘లెస్స’ అని శ్రీకృష్ణ దేవరాయలు అన్నారని పదే పదే గుర్తు చేసుకుంటాం.. కానీ తెలుగు క్రమంగా ‘లెస్’ అవుతున్నా పట్టించుకోం..
హిందీ తర్వాత దేశంలో రెండో అతిపెద్ద భాష తెలుగు.. హిందీకి సొంత లిపి లేదు.. కానీ తెలుగుకు సొంత లిపి, అస్థిత్వం ఉంది.. కానీ ఏమి లాభం?
దేశంలోనే భాష పేరిట ఏర్పడిన తొలి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్.. కానీ అధికార భాషగా ఏనాడూ తెలుగు అమలుకు నోచుకోలేదు.. ఎందుకిలా?
మన సొంత రాష్ట్రాల్లో తెలుగును ఎందుకు బతుకు తెరువు భాషగా మార్చలేకపోయాం? ఎందుకు ఇంగ్లీషు వెంట పడుతున్నాం?

కొద్దిపాటి జనాభా ఉన్న దేశాలు తమ భాషను ప్రపంచ భాషలుగా రుద్దాయి.. తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా 10 కోట్లకు పెగా ఉన్న మనం తెలుగును ఎందుకు ప్రపంచ భాష చేయలేకపోతున్నాం?
అరవం వాడు తమ భాషకు ప్రాచీన హోదా తెచ్చుకున్నాడని, మనమూ కేంద్ర ప్రభుత్వంతో పోరాడి తెచ్చుకున్నాం.. కానీ ఒరిగిందేమిటి?..
బ్రిటిష్, కుతుబ్ షాహీ, నిజాం పరాయిపాలనలో వికసించిన తెలుగు భాష, సొంత పాలకుల హయాంలో ఎందుకు కొడిగట్టుకుపోతోంది?
ఈ రోజున మనం మాట్లాడుతున్న తెలుగు భాషలో ఎన్ని తెలుగు పదాలు ఉన్నారో గమనించారా?..
తెలుగు టీవీ ఛానళ్లలో కనీసం 50 శాతం తెలుగు కూడా లేని సంగతి మీకు తెలుసా? తెలుగు పత్రికల్లో వాడే భాషలో 20 శాతం కూడా తెలుగు లేని విషయాన్ని గుర్తించారా?
అంతర్జాలంలో ఇంగ్లీషుకు ఉన్న సౌలభ్యం తెలుగు భాషకు ఎందుకు లేదు?.. వందలాది ఇంగ్లీషు ఫాంట్లు ఉచితంగా దొరుకుతాయి.. కానీ మనకు తెలుగు ఫాంట్లు మరీ అంత ఖరీదుగా మారాయెందుకు?
ప్రపంచంలో వేగంగా అంతరిస్తున్న భాషల్లో తెలుగు ఒకటని యునెస్కో ఏనాడో గుర్తించింది.. ఈ సంకేతాలు మీకు కనబడటం లేదా?
తెలుగు భాషకు అన్యాయం జరుగుతోందని, పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నారని గగ్గోలు పెడుతున్నాం.. కానీ మన ఇళ్లలో, మన చుట్టు పక్కల సమాజంలో భాషను కాపాడుకుంటున్నామా?.. ప్రభుత్వాల మీద ఎందుకు వత్తిడి తేలేకపోతున్నాం..
తమిళ, కన్నడ రాష్ట్రాల్లో ఎన్ని రాజకీయాలు ఉన్నా వారి మాతృభాషను కాపాడుకోవడంలో అంతా ఒకటి అవుతారు.. ఈ పరిస్థితి మన తెలుగు రాష్ట్రాల్లో ఎందుకు లేదు?..
ఈ ప్రశ్నల్లో కనీసం 50 శాతమైనా ఆలోచింపజేస్తే మనలో తెలుగు భాషాభిమానం ఇంకా ఉన్నట్లే.. ఈ ఆశాభావమే తెలుగు భాష సంరక్షణకు పునాది కావాలి..
ఆగస్టు 29న తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు.. 

Sunday, August 28, 2016

అదే పనిగా తప్పు చేస్తే పాకిస్తాన్..

ఒకసారి తప్పు చేస్తే అజ్ఞాన్
రెండోసారి తప్పు చేస్తే నాదాన్
పలుమార్లు తప్పు చేస్తే సైతాన్
అదే పనిగా తప్పులు చేస్తే పాకిస్తాన్
(హర్యానా అసెంబ్లీలో జైన దిగంబర సాధువు తరుణ్ సాగర్ ప్రసంగం నుండి

Thursday, August 25, 2016

*మోదీ వైపు బలూచీల చూపు.. ఖంగుతిన్న పాక్

జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఉగ్రవాదానికి ఆజ్యం పోస్తున్న పాకిస్తాన్ కు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గట్టి ఝలకే ఇచ్చారు.. స్వాతంత్ర్య దినోత్సవ దినోత్సవ ప్రసంగంలో బలూచిస్తాన్ లో పాకిస్తాన్ ఆగడాలను మోదీ ప్రస్థావించడం తెలిసిందే. పాకిస్తాన్ నుండి వేరు పడేందుకు దశాబ్దాలుగా పోరాడుతున్న బలూచీలకు భారత ప్రధాని సంఘీభావం పలకడాన్ని పాక్ జీర్ణించుకోలేకపోతోంది..
తమ పోరాటాన్ని భారత ప్రధాని గుర్తించడంతో బలూచ్ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.. మోదీకి ధన్యవాదాలతో ప్రదర్శనలు చేపట్టారు. తమ పోరుకు భారత్ సహకారంలపై వారు గంపెడాశలు పెట్టుకున్నారు.
పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా నసీరాబాద్, డేరాబుగ్తీ, సుయ్, జాఫరాబాద్ తదితర ప్రాంతాల్లో ఆందోళనలు తీవ్రమయ్యాయి. పాకిస్థాన్ జెండాలను కింద పడేసి తొక్కుతున్నారు.  ముషారఫ్ హయాంలో హత్యకు గురైన బలూచీ నేత అక్బరుద్దీన్ భుగ్తీ,నరేంద్ర మోదీ ఫొటోలు, భారత జాతీయ పతాకాలు పట్టుకుని ప్రదర్శనలు జరుపుతున్నారు. మోదీ సహకరిస్తే బంగ్లాదేశ్‌లా బలూచిస్తాన్ కూడా స్వతంత్ర్యదేశంగా ఏర్పడుతుందని వారు ఆశలు పెట్టుకున్నారు. చూడబోతే పాకిస్తాన్ ఎక్కువ కాలం మనుగడలో ఉండే అవకాశాలు కనిపించం లేదు. సింధ్ లో కూడా ఎప్పటి నుండో సింధ్ దేశ్ కోసం ఉద్యమాలు జరుగుతున్నాయి. వాయువ్య సరిహద్దు రాష్ట్రంలో గిరిజన తెగలు చాలా కాలంగా పాక్ సైన్యంతో పోరాడుతున్నాయి.. పీవోకే భారత్ లో కలిస్తే పాకిస్తాన్ ఇక పశ్చిమ పంజాబ్ రాష్ట్రంకే పరిమితం..

గీతాచార్యుని జన్మదినం

Wednesday, August 24, 2016

బాధ్యత ప్రభుత్వానిదేనా? మీది కాదా?

‘130 కోట్ల జనాభా గల పెద్ద దేశం సాధించింది రెండు పతకాలేనా? అందులో ఒకటి వెండి, ఇంకోటి కాంస్యం.. ఒక్క బంగారు పతకమైనా గెలిచారా సిగ్గు సిగ్గు..’ పెదవి విరిచాడు మా రావు గారు..
‘ఇది మన ప్రభుత్వాల వైఫల్యం..’ మరోసారి హుంకరించాడు..
‘మాస్టారూ మీరు మాట్లాడుతున్నది ఏ విషయంలో?..’ కాస్త అమాయకంగానే అడిగాను..
‘నువ్వేమి జర్నలిస్టువయ్యా? ఆ మాత్రం అర్థం చేసుకోలేవా?.. నేను మాట్లాడేది రియో ఒలింపిక్స్ లో మన దేశ వైఫల్యంగురుంచి..’ కాస్త కసురుకున్నట్లే జవాబిచ్చాడు రావు..
‘అది సరేగానీ రావుసాబ్.. మీ పిల్లలేం చేస్తున్నారు?..’

‘అబ్బాయి ఇంజినీరింగ్ సెకండియర్.. మా అమ్మాయి ఇంటర్ బైపీసీ ఫైనల్ ఇయర్.. డాక్టర్ అవ్వాలనుకుంటోంది..’ కాస్త కుతూహలంగా చెప్పాడు..
‘ఓహో.. మీ ఇంట్లో ఒకరు ఇంజినీరు, మరొకరు డాక్టర్ అవుతున్నారన్నమాట.’.
కాస్త గర్వంగా కాలరెగరేస్తూ నావైపు లుక్కిచ్చుకున్నారు రావుగారు..
‘మీ పిల్లలు ఏమైనా ఆటలాడతారా? క్రికెట్, హాకీ, టెన్నిస్, కబడ్డీ, చెస్.. ఇంకేమైనా?..’
‘వాళ్లకు అంత తీరికెక్కడిది నాయనా? పొద్దున్నే కాలేజీకి వెళ్లి రాత్రికి గానీ తిరిగి రారు.. కాలేజీలోనే స్పెషల్ కోచింగ్.. రాత్రికి ఇంటికి వచ్చాక కాస్త మింగుడు పడి పడుకుంటారు.. మళ్లీ పొద్దున్నే ఉరుకులు, పరుగులు..’
‘కనీసం సెలవు రోజుల్లో అయినా ఆడుకునేందుకు పోతారా?..’
‘కష్టపడి చదువుకోవాల్సిన వయసులో ఆటలు ఎందుకు?.. ఆటల మీద ధ్యాస పెడితే, వారి చదువు సంకనాకి పోదా?’ కాస్త ఆగ్రహంగానే బదులిచ్చారు రావు గారు..
గురుడు దొరికి పోయాడు.. నా మొహంపై ఓ చిరునవ్వు మొలిచింది.. ఇక అప్పుడందుకున్నాను..
‘రావు సాబ్.. ఏమంటిరి ఏమంటిరి?.. ఆటలాడితే చదువు సంకనాకి పోతదా?.. అందరూ కెరీర్ పేరిట తమ పిల్లలకు ఆటలకు దూరం చేసి పుస్తకాల పురుగులను చేస్తే, క్రీడాకారులు ఎలా తయారవుతారు?.. ఒలింపిక్స్, ఏసియన్ గేమ్స్ లో మన దేశానికి పతకాలు ఎలా వస్తాయి? ’
గతుకుక్కు మన్నారు రావు గారు.. కాస్త ఇబ్బందిగా మొహం పెట్టి అక్కడి నుండి నిష్క్రమించాడు..
మన దేశం ఒలింపిక్స్ లో పతకాలు సాధించలేదని, ప్రభుత్వం క్రీడాకారులను ప్రోత్సహించడం లేదని నిందిస్తారు.. కానీ తమ పిల్లలు క్రీడాకారులు కావాలని ఏ తల్లి దండ్రులూ కోరుకోరు.. సాయంకాలం వేళ వారిని ఆడుకోవడానికి పంపరు.. అందరూ తమ పిల్లలు చదువులకే పరిమితం కావాలని కోరుకుంటే, క్రీడాకారులు ఎలా తయారవుతారు? దేశానికి పతకాలను ఎవరు తీసుకు వస్తారు..
మీ పిల్లలు చదువుకునే స్కూళ్లలో ప్లే గ్రౌండ్స్ ఉన్నాయా? వాటిలో ఏయే ఆటలు ఆడిస్తున్నారు?.. అసలు స్కూళ్లలో పీఈటీలు అనేవారు ఉన్నారా?.. ఈ ప్రశ్నలకు మీ దగ్గర ఏమైనా జవాబు ఉందా?
తల్లి దండ్రులు ముందు తమ పిల్లలు ఆడుకునే స్వేచ్ఛ ఇవ్వాలి.. వారి ఇష్టాఇష్టాలను గమనించాలి.. క్రీడలపై వారికి ఆసక్తి ఉంటే ప్రత్యేక శిక్షణ ఇప్పించాలి.. ఇవేవీ పట్టించుకోకుండా ప్రభుత్వాలదే తప్పు అని బండరాయి పడేయడం ఎంత వరకు సమంజసం?.. ఆలోచించండి..

Monday, August 22, 2016

సామాజిక సేవలో ముందడుగు..

WE CAN CHANGE – Social Media for Social Service నినాదంతో తొలి అడుగు ఇది.. Facebook, Whatsapp తదితర సోషల్ మీడియా గ్రూప్స్ కేవలం చర్చలు, కబుర్ల కోసమేనా? ఇందులోని సభ్యుల ద్వారా మనకు సాధ్యమైన సేవా కార్యక్రమాలు చేయలేమా? అనే ఆలోచన చాలా కాలంగా నా మనసును తొలిచేస్తూ వచ్చింది.. 
ఈ దశలో జాతీయభావజాల వేదికగా ప్రారంభించిన WE CAN CHANGE ద్వారా ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నాను.. నా ఆలోచనలను బృందంలోని మిత్రులతో పంచుకోగా వారు వెంటనే కార్యాచరణ మొదలు పెడదామని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.. ఇలా తొలి అడుగు రంగారెడ్డి జిల్లాలోని మారుమూల గ్రామం కడ్మూరులో పడింది..

పూడూరు మండలం కడ్మూరులో ఉన్న ప్రభుత్వ పాఠశాల ఉన్నత పాఠశాలగా ఎదుగుతోంది.. ఈ గ్రామంలో వనరులు చాలా తక్కువ. పాఠశాలలోని విద్యార్థులకు చదువుకోవాలనే తపన ఉంది.. వీరికి మంచి విద్యా సంస్కారాలు అందించేందుకు ప్రధానోపాధ్యాయుడు చిన్ని కృష్ణ తన తోటి ఉపాధ్యాయులతో చాలా కష్టపడుతున్నారు.. గ్రామస్తులు కూడా వీరికి మంచి సహకారం అందిస్తున్నారు.. విరాళాలు వేసుకొని అధనపు ఉపాధ్యాయులను సమకూర్చుకున్నారు..  ఈ దశలో కడ్మూరు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు కొన్ని విజ్ఞాన శాస్త్ర పుస్తకాలు అవసరమని తెలిసింది.. ఈ అవసరాన్ని తీర్చే బాధ్యత WE CAN CHANGE భుజాన వేసుకుంది..

ఈ విషయాన్ని మన గ్రూప్ లో ప్రకటించగానే ఆత్మీయ మిత్రులు స్పందించి విరాళాలు అందజేశారు.. నాతో పాటు మిత్రులు తరుణ్ చక్రవర్తి, నరేంద్ర వర్మ, నీలేశ్ జోషి కడ్మూరు విద్యార్థులకు గ్రామ పెద్దలు, విద్యా కమిటీ సభ్యుల పుస్తకాలను అందజేశాం.. ఇలా మన తొలి కార్యక్రమాన్ని విజయవంతమైంది.. ఇందుకు సహకరించిన మిత్రులందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.. మన WE CAN CHANGE మున్ముందు చేపట్టే కార్యక్రమాలకు మీ అందరి సహకారం, దీవెనలు కోరుకుంటున్నాను..