Saturday, August 29, 2015

రక్షాబంధన్ సందేశం

నేను మీకు రక్ష.. మీరు నాకు రక్ష.. మనమంతా ఈ దేశానికి, సమాజానికి, ధర్మానికి రక్ష.. ఇదే రక్షా బంధన్ సందేశం..
భారత దేశ మంతటా జరుపుకునే పండుగ రక్షాబంధన్.. సోదరులు, సోదరీమణుల మధ్య ప్రేమానురాగాలకు ప్రతీకగా జరుపుకునే ఉత్సవం ఇది. తన సోదరుడు ఉన్నత శిఖరాలకు ఎదగాలని ప్రతి సోదరి కోరుకుంటుంది.. అలాగే తన సోదరికి రక్షకునిగా నిలవాల్సిన బాధ్యత సోదరునికి గుర్తు చేస్తుంది..
రక్షాబంధన్ కేవలం సోదర, సోదరీమణులకు సంబంధించిన ఉత్సవం మాత్రమే కాదు.. దీని అర్థం మరింత విస్తృతమైనది.. ఈ దేశానికి, సమాజానికి, ధర్మానికి కూడ అండగా నిలవాలనే సందేశాన్నిస్తుంది రక్షా బంధన్..

అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు..

Friday, August 28, 2015

సంకల్పంతో పాటు పాలనా యంత్రాంగం కూడా మారాలి..

సంకల్పం మంచిదే.. కానీ ఆచరణ కూడా ముఖ్యం.. ఆర్థిక రంగంలో చైనాకు ధీటుగా ఎదగాలని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆశయం.. కానీ మనకు అంత సీన్ లేదంటారు ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్.. నాయకుల్లో దూకుడు ఉంటే సరిపోదు.. యంత్రాంగంలో బద్దకాన్ని కూడా వదిలించాలి.. రౌతు ఎంత సమర్ధుడైనా, గుర్రం సహకరించకపోతే ఎవరు మాత్రం ఏం చేయగలరు?.. ముందు మన పాలనా వ్యవస్థను సంస్కరించాలి..

వరములిచ్చే వరలక్ష్మీ..

వరాలిచ్చే దేవత శ్రీమహాలక్ష్మికి చేసే పూజే వరలక్ష్మీ వ్రతం.. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు రోజున ఈ వ్రతాన్ని జరుపుకుంటారు.. లక్ష్మీదేవి కొలిచే వారికి కొంగు బంగారమై వరాలు ఇస్తుందని ప్రతీతి.. ఈ రోజున లక్షీదేవిని పూజిస్తే అష్ట లక్ష్ములను పూజించినంత పుణ్య ఫలం లభిస్తుంది.. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి.. ముఖ్యంగా మహిళలు ఈ వ్రతాన్ని నిష్టగా ఆచరిస్తారు. తన భర్త, సంతానం, అత్తామామలు, ఇతర కుటుంబ సభ్యులకు శుభం కలగాలని ప్రార్ధిస్తారు..

వరలక్ష్మీ వ్రతం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు..

Wednesday, August 26, 2015

ఉల్లి కష్టాలు..

గల్లీ నుండి దిల్లీ దాకా ఉల్లి లొల్లి..
ఇంకా ఎన్నాళ్లీ కష్టాలు తల్లీ..

ఉల్లి గడ్డలు కొందామని కిరాణా షాపుకు పోతే అక్కడ చెప్పిన రేటుకు కళ్లు బైర్లు కమ్ముతున్నాయి.. రైతు బజార్ సబ్సిడీ కేంద్రాలకు పోతే పర్లాంగుల కొద్దీ లైన్లు.. ఇచ్చే రెండు కిలోలకు ఆధార్ కార్డు అడుగుతున్నారు.. మళ్లీ రాకుండా వేలిపై ఓటింగ్ మార్కు చుక్క పెడుతున్నారు.. ఈ పోరు పడలేక బహింగ మార్కెట్లో ఉల్లి కొంటే జేబు గుళ్లవుతోంది.. అయినా సాహసిస్తే పాన్ కార్డు కూడా అడుగుతారనే భయం వేస్తోంది.. జిహ్వా చాపల్యం చంపుకోలేక ఉల్లి కొన్న నేరానికి, ధనికుల కేటగిరీలో చేర్చి, ఆదాయపు పన్ను వాళ్లు దాడులకు వస్తారని భయంగా ఉంది.. (జస్ట్ సెటైర్.. నవ్వుకోండి..)

Tuesday, August 25, 2015

కాల్చమన్నది ప్రకాశం పంతులు కాదు..

గుత్తొంకాయ కూర పేరు వినగానే నోరూరుతుంది.. ఇందులో కీలకం వంకాయ అయినా తగిన మసాలా పడనిదే రుచి రాదు.. ఆపిల్ పండుకు ఎంతో పోషక విలువలున్నాయని అందరికీ తెలుసు.. కానీ వ్యాపారి మైనం పూసి నిగనిలాడిస్తున్న పండునే కొనడానికి ఇష్టపడతాం..
విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు మన్యంలో తిరుగుబాటు లేపి తెల్లవాడి గుండెల్లో నిద్ర పోయాడు.. ఆ మహా వీరుని పోరాటాన్ని తెరకెక్కించే క్రమంలో సీత పాత్రను సృష్టించారు.. వస్తాడు నా రాజు ఈ రోజు..అనే పాట ఎంత ప్రఖ్యాతి గాంచిందో చెప్పనక్కరలేదు.. నిజానికి అలూరి సీతారామరాజు జీవితంలో ప్రేమ కానీ, సీత పాత్ర కానీ లేనే లేవు.. ఇది కల్పితం అని స్వయానా ఆయన కుటుంబ సభ్యులు చెప్పినా ఎవరికీ పట్టలేదు..
ఇక ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు విషయానికి వద్దాం.. దేశ స్వాతంత్ర్యం కోసం తన ఆస్తిపాస్తులన్నీ పోగొట్టుకొని, చివరి దశలో చేతిలో ఏమీ లేక చాలా ఇబ్బంది పడ్డ మహనీయుడు ఆయన.. సైమన్ కమిషన్ కు వ్యతిరేకంగా పోరాటంలో దమ్ముంటే కాల్చరా..అంటూ ప్రకాశం పంతులు తన గుండెను చూపించినట్లు ప్రచారంలో ఉంది.. ఆయన జీవితంపై నిర్మించిన చిత్రంలోనూ ఈ సన్నివేశం పెట్టడంతో మరింత ప్రాచుర్యం పొందింది..
నిజానికి ఆ రోజున కాల్చమన్నది ప్రకాశం పంతులు కాదు.. ఆయన పక్కన ఉన్న ముస్లిం యువకుడు.. ఈ విషయాన్ని ప్రకాశం పంతులు స్వయంగా తన ఆత్మకథ నా జీవిత యాత్రలో వెల్లడించారు.. ఆంధ్రకేసరి ఔన్నత్యాన్ని తగ్గించి చూపడం నా ఉద్దేశ్యం కాదు.. కానీ స్వయాన ఆయన చెప్పిన విషయాన్ని ఎవరూ పట్టించుకోకుండా మరో విధంగా ప్రచారం పొందడం కాస్త ఆశ్చర్యాన్ని కలిగించింది..

( ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా నేను పోస్టు చేసిన టాంగ్ టూటీ పీర్ ఖాసిం కథ చూసిన సీనియర్ జర్నలిస్టు బుద్దా మురళి గారు పంపిన నా జీవిత యాత్రలోని పేజీ లింక్ ఇక్కడ జత చేశాను.. గమనించగలరు. వారికి ధన్యవాదాలు)

Monday, August 24, 2015

కుక్కతోక, పాకిస్తాన్ వైఖరి ఒకటే..

ఇండియాతో వేయేళ్లయినా యుద్ధం చేస్తామని పాకిస్తాన్ పాలకులు దశాబ్దాల కిందటే ప్రకటించారు.. అందుకు అనుగుణంగానే మన దేశంలో ఉగ్రవాద చర్యలు కొనసాగుతున్నాయి.. భారత వ్యతిరేకతే పాకిస్తాన్ పాలకులకు మనుగడ.. ఇదంతా అక్కడి సైన్యం, ఐఎస్ఐ కనుసన్నల్లో నడుస్తుంది.. పాలకులు నామమాత్రం.. తరాలు మారినా పాకిస్తాన్ విధానంలో మార్పు రాలేదు.. పైగా మరింత వేగంగా వారి కార్యకలాపాలు విస్తరించాయి..
భారత్ తో చర్యలకు సిద్ధం.. కానీ సరిహద్ధుల్లో కాల్పులు జరుపుతాం, దావూద్ ఇబ్రహీం, హఫీజ్ సయిద్ లకు మేపుతాం, కాశ్మీర్ వేర్పాటు వాదులకు దావత్లు ఇస్తూనే ఉంటాం.. ఇదీ పాకిస్తాన్ వైఖరి.. శాంతి చర్చలకు, కాశ్మీర్ కు లింకు.. భారత ప్రభుత్వం ఎప్పుడు చర్చలకు సంసిద్దత వ్యక్తం చేసినా, ఆ దేశంతో శాంతి ప్రక్రియకు సిద్దమైనా ఈ సామరసర్య వాతావరణాన్ని ఎలా చెడగొట్టుకుందామనే ప్రయత్నిస్తుంది పాకిస్తాన్.. గతంలో జరిగిన ఘటనలే ఇందుకు ఉదాహరణ..

పాకిస్తాన్ వైఖరి ఎప్పుడూ కుక్కతోక లాంటిదే.. కుక్కతోక వంకరను సరిచేయలేమూ, పాకిస్తాన్ విధాన్నాన్నీ మార్చలేమూ.. ఇది గత చరిత్ర చెబుతున్న వాతావరణం.. ఇకవైపు ఉగ్రవాదంపై పోరు అంటూ అమెరికా నుండి డాలర్లు రాబట్టుకుంటూ, ఆ ధనాన్ని భారత దేశంలో అభద్రత కోసం వెచ్చించడం నగ్న సత్యం.. ఇలాంటి సైతాను దేశంతో అసలు చర్చలు అవసరమా? ముల్లును ముల్లుతోనే తీయాలి..

Sunday, August 23, 2015

టాంగ్ టూటీ పీర్ ఖాసిం..

దమ్ముంటే ఇక్కడ కాల్చరా..’ అంటూ పోలీసులకు తన గుండెను చూపించి ధీశాలి టంగుటూరి ప్రకాశం పంతులు. ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి ప్రకాశం పంతులుకు హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులతో కూడా మంచి సంబంధాలుండేది.. నిజాం నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా పోరాడుతున్న స్టేట్ కాంగ్రెస్ కు దిశానిర్దేశం కూడా చేసేవారు.. ఆ సందర్భంలో ప్రకాశం పంతులు ఒకసారి తెలంగాణకు వచ్చారు. ఈ విషయాన్ని పసిగట్టిన నిజాం ప్రభుత్వం ఆయన బస చేసిన ప్రాంతానికి విచారణ కోసం ఓ పోలీసును పంపింది.. అక్కడ హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ నాయకుల నడుమ పంతులు గారు ఠీవీగా కూర్చున్నారు.. వచ్చిన పోలీసాయన ఇదర్ టాంగ్ టూటీ పీర్ ఖాసిం  కోన్ హై అంటూ ప్రశ్నించాడు.. పోలీసు చేతిలో ఉన్న లేఖలో టంగుటూరి ప్రకాశం పేరు ఉర్దూలో రాసి ఉంది.. అది ఆయనకు అర్ధం కాక టాంగ్ టూటీ పీర్ ఖాసిం (కాలు విరిగిన పీర్ కాసిం అనుకున్నాడు.. అక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులంతా ఒకరి మోహాలు ఒకరు చూసుకొని ఇదర్ కిసీకా టాంగ్ నహీ టూటీ..’ (ఇక్కడ ఎవరి కాలూ విరగలేదు) అని చూపించారు.. అందరి కాళ్లూ పరిశీలించిన పోలీసాయన టాంగ్ టూటీ పీర్ ఖాసి ఎవరూ లేరని నిర్ధారిచుంకొని వెళ్లిపోయారు.. అన్నట్లు ప్రకాశం పంతులుగారు మంచి భోజన ప్రియులు.. ఆ సమావేశంలో పాల్గొన్న వారి కోసం గంపెడు ఇడ్లీలు తెస్తే సగం ఆయనే లాగించారట.. ఈ విషయం దాశరథి కృష్ణమాచార్యుల జీవిత కథ యాత్రాస్మృతిలో రాసి ఉంది..

టంగుటూరి ప్రకాశం పంతులు గారి 143వ జయంతి సందర్భంగా ఆ మహనీయున్ని స్మరించుకుందాం..