Tuesday, June 30, 2015

యమగోల.. యమ అర్జెన్సీ

యముడి నిరంకుశ పాలన వద్దు, యమ అర్జెన్సీ ఇకపై రద్దు .. యమగోల చిత్రం పాటలోని చరణం ఇది.. నరక లోకంలో యమ ధర్మరాజుపై యమ భటులతో తిరుగుబాటు చేయిస్తాడు సత్యం (ఎన్టీఆర్).. ఆ సందర్భంగా పాడిన సమరానికి నేడే ప్రారంభంపాటలో ఎమర్జెన్సీని ప్రస్థావించారు.. ఇందిరా గాంధీ దేశంపై ఎమర్జెన్సీని రుద్ది..ప్రతిపక్షాన్ని, ప్రజలను అష్టకష్టాలపాలుజేశారు.. ఈ నేపథ్యాన్ని ఈ పాటలో గుర్తు చేశారు ఎన్టీఆర్..

1975 జూన్ 25 నుండి 1977 మార్చి 21 వరకూ ఎమెర్జెన్సీ అమల్లో ఉంది.. అదే సంవత్సరం అక్టోబర్ 21న యమగోల విడుదలైంది.. సమరానికి నేడే ప్రారంభం పాటను శ్రీశ్రీ రాశారు. ఈ గీతాన్ని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడగా, చక్రవర్తి సంగీతాన్ని అందించారు.. ఈ చిత్రంలో కార్మిక సంఘాల పడిగట్టు భాష కాబట్టి కామ్రేడ్స్ నేను చెప్పేది ఏమిటంటే.. ఏమి లేదు..’ అంటు హాస్యాన్ని పండించారు ఎన్టీఆర్.. ఎమర్జెన్సీ విధించి 40 ఎళ్లు పూర్తయిన నేపథ్యంలో యమగోల గుర్తుకు వస్తోంది.. 

Monday, June 29, 2015

ప్రధాని, విపక్ష నేతల సంబంధాలు ఎలా ఉండాలంటే..

పీవీ నరసింహారావు, అటల్ బిహారీ వాజపేయి.. ఒకరు దేశ ప్రధానమంత్రి, మరొకరు ప్రతిపక్షనేత.. ఇద్దరూ ఇద్దరే.. రాజకీయ దురంధరులు, సాహితీ వేత్తలు.. ఇద్దరివీ వేర్వేరు రాజకీయ సిద్దాంతాలు..
పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకునిగా ప్రజా సమస్యలపై అధికార పక్షాన్ని ఎలా నిలదీయాలో, ఎక్కడ ఇబ్బంది పెట్టాలో చూపించారు అటల్జీ.. అదే సమయంలో దేశ ప్రయోజనాల కోసం పలు అంశాల్లో ప్రభుత్వానికి నిర్మాణాత్మక సహకారాన్ని అందించారు. ప్రధాని పీవీ సైతం అంతే హుందాగా ప్రతిపక్ష నేతను గౌరవించారు. ఐక్యరాజ్య సమతికి దేశం తరపున వెళ్లే బృందానికి విపక్ష నేత వాజపేయి నేతృత్వం వహించారు. పాకిస్తాన్ విధానాలను ఎండగట్టారు.. చట్టసభల్లో తన వాగ్దాటితో నిర్మాణాత్మ విమర్శలతో పాటు అధికార పక్షానికి సలహాలు అందజేసేవారు వాజపేయి.. ఈ కారణం వల్లే ఆయన్నిఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు వరించింది.
అటల్జీ ప్రధాని అయిన తర్వాత పీవీ సైతం ప్రతిపక్ష నేతగా ఉన్నా, అమ్మోరు సోనియా ఆగ్రహం వల్ల ఎక్కువ కాలం ఆ హోదా దక్కలేదు. రాజకీయంగా ఎన్నో అంశాల్లో అటల్జీ, పీవీ సంఘర్షించుకున్నా వ్యక్తిగతంగా మంచి మిత్రులు.. ఇద్దరినీ కలిపింది సాహిత్యం. బహుభాషా కోవిధుడైన నరసింహారావు, వాజపేయి కవిత్వాన్ని చాలా ఇష్టపడేవారు.. పీవీ నరసింహా రావు రాసిన తన జీవిత కథ ఇన్ సైడర్ను ప్రధానమంత్రి హోదాలో ఆవిష్కరించారు అటల్జీ..

ప్రధానమంత్రి, ప్రతిపక్ష నేతల సంబంధాలు ఎలా ఉండాలో ఆచరణలో చూపించారు పీవీ, అటల్జీలు.. ఇలాంటి మహానేతలను, వారు అనుసరించిన విధానాలను ఈనాటి పరిస్థితుల్లో ఊహించుకోగలమా?

Sunday, June 28, 2015

లోపలి మనిషి... మహా వ్యక్తి

అపర చాణక్యుడు, రాజనీతి చతురుడు, సంస్కరణల సారధి, బహు భాషా కోవిధుడు, సాహితీ వేత్త.. పాములపర్తి వెంకట నరసింహారావు గురుంచి ఎంత చెప్పినా తక్కువే.. రాజకీయ జీవితాన్ని ముగించుకొని ఆధ్యాత్మిక, సాహితీ, సేవా కార్యక్రమాలతో శేష జీవితాన్ని ప్రశాంతంగా గడపాలని మూలా ముల్లె సర్దుకొని ఢిల్లీ నుండి హైదరాబాద్ బయలు దేరేందుకు సిద్దమైన వేళ ప్రధానమంత్రి పదవి తలుపు తట్టింది..
దేశం ఆర్ధికంగా వివాళా తీసిన దశలో, రాజీవ్ గాంధీ మరణంతో ప్రధాని పదవి చేపట్టేందుకు పీవీ నరసింహారావును మించిన అర్హులు కాంగ్రెస్ పార్టీలో కనిపించలేదు. క్లిష్ట పరిస్థితుల్లో ఆర్థిక సంస్కరణలకు బాటలు వేసి దేశాన్ని ప్రగతి పథంలో నడిపించారు.. మైనారిటీ ప్రభుత్వాన్ని చాకచక్యంగా ఐదేళ్లు నెట్టుకొచ్చారు.. రాజకీయంగా ఎన్నో ఆరోపణలు, కుంభకోణాలు ఆయన్ని వేధించాయి.. ఎవరికీ కొరుకుడు పడని మౌనం మితభాషణం ఆయన ఆభరణాలు.. దురదృష్టవశాత్తు ఈ కారణంగానే రాజకీయంగా, వ్యక్తిగతంగా ఎన్నో ఇక్కట్ల పాలయ్యారు పీవీ..
కాంగ్రెస్ కోటరీ రాజకీయాలు, సోనియాగాంధీ కంటగింపులకు గురైన పీవీ జీవిత చరమాకం ప్రశాంతంగా సాగలేదు.. మరణించిన తర్వాత మాజీ ప్రధానులకు లభించాల్సిన గౌరవం ప్రకారం ఢిల్లీలో సమాధికి నోచుకోలేదు.. పార్థివ దేహాన్ని పార్టీ కార్యాలయంలోకి కూడా తీసుకురాని కుసంస్కారంతో, రోడ్డు మీద నుండే హైదరాబాద్ పంపేశారు కాంగీయులు.. చివరకు అంతిమ సంస్కారాలు కూడా సక్రమంగా నిర్వహించలేకపోయారు ఈ సోకాల్డ్ గాంధీ కుటుంబ భజనపరులు..
1921 జూన్ 28న తెలంగాణలోని వరంగల్ జిల్లా లక్నేపలిల్లో జన్మించిన నరసింహారావు చిన్నప్పటి నుండే నాయకత్వ లక్షణాలు అలవరచుకున్నారు. హైదరాబాద్ సంస్థాల విముక్తి పోరాటంలో, నిజాం పాలనకు వ్యతిరేకంగా వందేమాతరం నినాదం ఇచ్చి ఉస్మానియా యూనివర్సిటీ నుండి బహిష్కృతులయ్యారు. శాసనసభ్యునిగా, మంత్రిగా సేవలు అందించిన తర్వాత సంయుక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. కాంగ్రెస్ వర్గపోరాటాలు ఆయనను పదవి నుండి అర్ధంతరంగా తప్పించాయి.. కానీ ఆయన చేపట్టిన భూసంస్కరణలు ప్రశంసలందుకున్నాయి.. పార్లమెంట్ సభ్యునిగా, మంత్రిగా కేంద్ర మంత్రిగా ప్రతిభను చాటుకున్న పీవీని అనూహ్యంగా ప్రధానమంత్రి పదివి దక్కినా ఆయన ప్రతిష్టకు గ్రహణం తెచ్చింది..
నరసింహారావు గొప్ప సాహితీ వేత్త మాత్రమే కాదు 10కి పైగా భాషలు వచ్చు.. విశ్వనాథ సత్యనారాయణ వేయిపడగలుకు ఆయన పీవీ హిందీ అనువాదం సహస్రపణ్ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు తెచ్చిపెట్టింది.. పలు అనువాదాలు, కథలతో పాటు తన ఆత్మకథను ఇన్ సైడర్ పేరిట రాశారు.. తెలుగులో ఇది లోపలి మనిషిగా అనువాదమైంది.. దీనికి కొనసాగింపుగా రెండో భాగం తెచ్చేలోపే పీవీ మన మధ్య లేకుండాపోయారు.. 2004 డిసెంబర్ 23న ఈ లోకాన్ని వీడారు..

తనపై వచ్చిన ఆరోపణలు అన్నింటికీ నరసింహారావు చెప్పిన సమాధానాలు.. చట్టం తన పని తాను చేసుకుపోతుంది.. కాలమే అన్ని సమస్యలను పరిష్కరిస్తుంది.. చరమాంకంలో అన్ని కేసుల నుండి కడిగిన ముత్యంలా బయట పడ్డారు.. ఆ మహా మనిషిని తలచుకొని నివాళులర్పిద్దాం..

ఎమర్జెన్సీ.. బీజేపీ మహా ప్రస్థానం

స్వతంత్ర భారత చరిత్రలో విషాద ఘట్టం ఎమర్జెన్సీ.. ప్రధాని ఇందిరా గాంధీ ప్రజాస్వామ్యాన్ని నడిరోడ్డుపై ఖూనీ చేసి, దేశాన్ని రాత్రికి రాత్రి జైలు పాలు చేశారు. ఇందిర నియంతృత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాటంలో కీలక పాత్ర పోషించింది ఆర్ఎస్ఎస్, జనసంఘ్(బీజేపీ) కార్యకర్తలే.. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు, దేశం కోసం త్యాగాలు చేశారు.. జనసంఘ్ పేరు బీజేపీగా మారింది ఎమర్జెన్సీ పుణ్యమే..
1952లో ప్రారంభమైన భారతీయ జన సంఘ్ జాతీయవాద రాజకీయాలకు కేంద్రం మారింది.. కాంగ్రెస్ పార్టీ నియంతృత్వ స్వభావం, అవినీతి, ప్రజా వ్యతిరేక విధానాలపై నిరంతర పోరు సాగించింది. దేశ సమగ్రత కోసం ఆ పార్టీ అగ్రనేతలు శ్యామప్రసాద్ ముఖర్జీ, దీన దయాళ్ ఉపాధ్యాయ తమ ప్రాణాలు కోల్పోయారు. నెహ్రూ అనంతంరం ఇందిర దేశ ప్రధాని అయిన తర్వాత ఆమెను ధీటుగా ఎదుర్కొన్నది జనసంఘ్.. 1975లో ఇందిరా గాంధీ తమ పదవిని కాపాడుకునేందుకు అత్యవసర పరిస్థితి విధించి ప్రతిపక్ష నాయకులకు జైలుకు పంపారు. అటల్ బిహారీ వాజపేయి, లాల్ కృష్ణ అడ్వానీ తదితర అగ్ర జనసంఘ్ నేతలను చెరసాలతో పెట్టారు.. 
ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రతిపక్షాలన్నీ ఐక్యంగా పోరాడి ఇందిరాగాంధీని ఎదుర్కోవాలని ప్రతిపాదించారు లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్.. దేశ భవిష్యత్తు కోసం ఇందుకు అంగీకరించింది జనసంఘ్, కొత్తగా ఏర్పడిన జనతా పార్టీలో వినీమైంది.. 1977 లోక్ సభ ఎన్నికల్లో జనతా పార్టీ ఘన విజయం సాధించింది. ఎన్నికల్లో ఆ పార్టీకి 295 సీట్లు రాగా అందులో 93 సీట్లు జనసంఘీయులే గెలిచారు. మిగతా వారిలో 71 మంది లోక్ దళ్, 44 మంది కాంగ్రెస్(ఓ), 28 మంది సోషలిస్ట్, సీఎఫ్ఓ సభ్యులున్నారు. న్యాయంగా ప్రధానమంత్రి పదవి జనసంఘీయులకే దక్కాలి.. కానీ పదవులకన్నా ప్రజాస్వామ్య పరిరక్షణకే ప్రాధాన్యత ఇచ్చారు వారు.. మురార్జీ దేశాయి ప్రధానిగా ఏర్పడిన జనతా ప్రభుత్వంలో అటల్జీ విదేశాంగ మంత్రిగా, అడ్వానీ సమాచార శాఖ మంత్రిగా పని చేశారు..భిన్న రాజకీయ పార్టీలు, సిద్దాంతాల స్వరూపమైన జనతా పార్టీలో నాయకుల అంతర్గత కుమ్ములాటల కారణంగా ఆ ప్రభుత్వం ఎక్కువ కాలం కొనసాగకుండానే పతనమైంది.. లోక్ సభ ఎన్నికల్లో పరాజయం పాలైంది. జనసంఘీయులు మాత్రం క్రమశిక్షణ, సైద్దాంతిక నిబద్దతను కాపాడుకుంటూ వచ్చారు.. దీంతో ఇతర నాయకులు వీరిని చూసి ఆందోళనకు గురయ్యారు. జనసంఘీయులు ఆర్ఎస్ఎస్ తో అనుబంధాన్ని వదులుకోవాలని డిమాండ్ చేశారు. ఇందుకు వారు అంగీకరించలేదు.. దీంతో ద్వంద్వ సభ్యత్వాన్ని సాకుగా చూపి జనసంఘ్ నాయకులను జనతా పార్టీ నుండి బహిష్కరించారు.
జనతా పార్టీ నుండి బయటనకు రావడం స్వేచ్ఛగా భావించారు జనసంఘీయులు.. తమదైన సైద్దాంతిక దృక్పధాన్ని కొనసాగిస్తూ 1980లో భారతీయ జనతా పార్టీ ఏర్పాటు చేశారు. జనతా పరివార్ ముక్కలు చెక్కలైపోయినా బీజేపీ భారత రాజకీయాలను శాసించే స్థాయికి ఎదిగిందంటే, ఇందుకు కారణం సైద్దాంతిక నిబద్దతే.. అటల్ బిహారీ వాజపేయి, లాల్ కృష్ణ అడ్వానీల నాయకత్వం, ఎందరో కార్యకర్తల త్యాగం, కృషి వృధా పోలేదు.. అటల్జీ, నరేంద్ర మోదీ దేశ ప్రధాన మంత్రులు అయ్యారంటే ఎందరో త్యాగధనుల ఫలితమే
..('చీకటి రోజులకు 40 ఏళ్లు' కథనానికి కొనసాగింపు)

Wednesday, June 24, 2015

ప్రజాస్వామ్య గ్రహణానికి 40 ఏళ్లు..

ఇండియాయే ఇందిర.. ఇందిరే ఇండియా..” దేశమంతా విధేయుల భజన మార్మోగుతున్న రోజులు.. ఇందిరాగాంధీ తిరుగులేని ప్రధానమంత్రిగా ఆవిర్భవించారు.  బ్యాంకు జాతీయీకరణ, రాజభరణాల రద్దు, బంగ్లాదేశ్ యుద్దంలో విజయంతో ప్రజల్లో ఆమె ఖ్యాతి అమాంతం పెరిగిపోయింది. క్రమంగా ఇందిరలో గర్వం పెరిగింది. తానేమీ చేసినా చెల్లతుందనే అహంభావం వచ్చేసింది. తన వారసునిగా తనయుడు సంజయ్‌ గాంధీని ఎంపిక వంశపారం పర్యపాలన శాశ్వతం చేసే ప్రయత్నాలు ప్రారంభించింది.. సంజయ్‌ రాజ్యాంగేతర శక్తిగా, షాడో పీఎంగా ఎదిగారు. పరిపాలన గాడి తప్పి విచ్చల విడితనం వచ్చేసింది. కేంద్ర ప్రభుత్వంతో పాటు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అవినీతి పెరిగిపోవడం ప్రారంభమయింది. ఇందిర పాలనపై దేశంలో క్రమంగా వ్యతిరేకత ప్రారంభమైంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రముఖ గాంధేయవాది లోక్‌నాయక్‌ జయప్రకాశ్‌ నారాయణ్‌ అవినీతికి వ్యతిరేకంగా ప్రారంభించిన సంపూర్ణ విప్లవ ఉద్యమం యావత్తు దేశాన్ని కదిలిస్తోంది..
సరిగ్గా అప్పుడే ఇందిరా గాంధీపై పిడుగు పడింది.. రాయబరేలీ నుండి పోటీ చేసి విజయం సాధించిన ఇందిర ఎన్నిక చెల్లదంటూ అలహాబాద్ హైకోర్టు తీర్పు.. ఎన్నికల్లో విజయం సాధించేందుకు ప్రభుత్వ యంత్రాంగాన్ని వాడుకున్నారని  ఆమెపై పోటీ చేసి ఓడిపోయిన రాజ్‌ నారాయణ్‌ ఈ కేసు ఫలితం ఇది. ఒక్కసారిగా దేశ వ్యాప్తంగా అలజడి.. ఇందిర గద్దె దిగాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి.. సుప్రీంకోర్టు షరతుల మీద బెయిల్ తీర్పుపై స్టే ఇచ్చినా, తనను చుట్టు ముట్టిన సమస్యల నుండి బయట పడటం ఎలాగో ఆమెకు అర్థం కాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో చుట్టూ చేరిన వందిమాగదుల సలహాల ఫలితంగా ఇందిరలో దాగిన నియంత నిద్ర లేచింది. ఒక కీలక నిర్ణయానికి వచ్చేశారు. అర్ధరాత్రి వేళ రాష్ట్రపతి ఫకృద్దీన్‌ అలీ అహ్మద్‌ను కలుకొని కీలక పత్రాన్ని ఆయన ముందు పెట్టారు.. ఫకృద్దీన్ మారుమాట్లాడకుండా సంతకం చేశారు.. 352వ నిబంధన క్రింద అత్యవసర పరిస్థితి అమలులోకి వచ్చింది.. అర్ధరాత్రి వేళ భారత ప్రజాస్వామ్యం హత్యకు గురైంది.. చీకటి రోజులకు తెరలేచింది. ఆ రోజు జూన్ 25, 1975..
దేశ వ్యాప్తంగా ప్రతిపక్ష నాయకులను రాత్రికి రాత్రి, ఎక్కడిక్కడ జైళ్లకు తరలించారు.. జయప్రకాశ్‌ నారాయణ్‌, మురార్జీ దేశాయి, అటల్‌ బిహారీ వాజ్‌పేయి, లాల్‌ కృష్ణ అద్వానీ, చరణ్‌ సింగ్‌, ఆచార్య కృపలానీ, అశోక్ మెహతా, జార్జ్ ఫెర్నాండెజ్‌, మధుదండావతే, రామకృష్ణ హెగ్డే, రాజ్‌నారాయణ్‌ తదితర నాయకులను కటకటాల పాలు చేశారు.. పత్రికలపై సెన్సార్ షిప్ విధించడంతో దేశ ప్రజలకు ఏమి జరుగుతోందో తెలియదు.. ఆరెస్సెస్‌తో పాటు ఎన్నో సంస్థలను రద్దు చేశారు. ప్రశ్నించే వారిని, మేధావులను, పాత్రికేయుల గొంతు నొక్కారు.. వారినీ మీసా చట్టం కింద జైళ్లకు పంపారు. దేశంలోని చెరసాలలన్నీ రాజకీయ ఖైదీలతో కిక్కిరిసి పోయాయి.
ఎమర్జెన్సీ ముసుగులో సంజయ్‌ గాంధీ, కాంగ్రెస్‌ నేతల అరాచకాలకు అంతు లేకుండా పోయింది. 1947లో దేశానికి స్వాతంత్రం వస్తే.. 28 ఏళ్ళకే దేశ దేశ ప్రజలు దాన్ని కోల్పోయారు. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యానికి చీకట్లు కమ్ముకున్నాయి.. తన పదవిని కొనసాగించుకోవడానికి ఇందిరా గాంధీ లోక్ సభ కాల పరిమితిని ఆరేళ్లకు పెంచారు.. దేశ వ్యాప్తంగా ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా రహస్య ఉద్యమం ప్రారంభమైంది. ప్రజలు జాగృతం కావడం మొదలు పెట్టారు.. ఎక్కడిక్కడ తిరుగుబాటు వాతావరణం కనిపిస్తోంది.. దీంతో 19 నెలల చీకటి రోజుల తర్వాత ప్రధాని ఇందిరాగాంధీలో ఆందోళన ప్రారంభమైంది. ఈ పరిస్థితి ఏనాటికైనా తనకు ముప్పు తెస్తుందని భయపడిపోయింది. ఇక తప్పని పరిస్థితుల్లో 1977 మార్చి 21న ఎమర్జెన్సీ ఎత్తేసింది ఇందిరాగాంధీ..  అలా దేశానికి పట్టిన సుదీర్ఘ గ్రహణం తొలగి పోయింది..
ఎమర్జెన్సీ సమయంలోనే ప్రధాన రాజకీయ పార్టీల్లో కదలిక వచ్చింది.. జయప్రకాశ్ నారాయణ సూచన మేరకు భిన్న రాజకీయ పక్షాలు కలిసిపోయి జనతా పార్టీ ఆవిర్భవించింది.. అదే సంవత్సరం జరిగిన లోక్ సభ ఎన్నికల్లో దేశ ప్రజలు ఇందిరా గాంధీకి బుద్ది చెప్పుతూ, జనతాకి ఘన విజయం చేకూర్చారు.. మురార్జీ దేశాయి ప్రధానమంత్రిగా కేంద్రంలో జనతా ప్రభుత్వం ఏర్పడింది.. దురదృష్టవశాత్తు భిన్న సైద్దాంతిక నేపథ్యాలు ఉన్న నాయకుల కారణంగా ఈ ప్రభుత్వం ఎక్కవ కాలం నిలవలేదు.. ప్రతిపక్షాల అనైక్యత ఫలితంగా మళ్లీ ఇందిర నేతృత్వంలో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చింది.
ఎమర్జెన్సీ మళ్లీ వస్తుందా?.. కొద్ది సంవత్సరాలుగా దేశంలోని మేధావులు, రాజనీతి కోవిధుల్లో నెలకొన్న ఆవేదన ఇది.. ఇందుకు కారణం మన రాజ్యాంగంలో, వ్యవస్థలో ఉన్న లోపాలే.. మన రాజ్యాంగాన్ని ఇప్పటికి వంద సార్లు సవరించుకున్నాం.. మరోవైపు కాంగ్రెస్ తో పాటు మరికొన్ని రాజకీయ పార్టీల్లో వారసత్వ రాజకీయాలు కొనసాగుతున్నాయి.. వ్యక్తి కేంద్రంగా నడిచే రాజకీయాలు ఏనాటికైనా మన వ్యవస్థకు ప్రమాదకరమే.. 40 ఏళ్ల నాటి ఎమర్జెన్సీ విషాద ఘటనకు కాంగ్రెస్ పార్టీ క్షమాపణలు చెప్పుకోకున్నా, ఈనాటికి విచారం వ్యక్తం చేయలేదు.. మన రాజకీయ వ్యవస్థను ఒకనైనా ప్రక్షాళన చేసుకోకపోతే ఏనాటికైనా మళ్లీ ఎమర్జెన్సీ రాక తప్పదు.. 

Saturday, June 20, 2015

యోగతో రోగ రహిత సమాజం

ప్రపంచానికి భారత దేశం ఇచ్చిన ఎన్నో కానుకల్లో అపూరుపమైనది యోగ’.  ప్రతి ఏటా జూన్ 21ని అంతర్జాతీయ యోగ దినోత్సవంగా జరుపుకోవాలని ఐక్యరాజ్య సమితి తీర్మానించింది. ఈ గుర్తింపు లాంఛనం మాత్రమే. యోగా ఏనాడో మన దేశ సరిహద్దులు దాటి ప్రపంచ వ్యాప్తమైంది. పతంజలి మహర్షి సూచించిన అష్టాంగ యోగ సూత్రాల నుండి రూపు దిద్దుకున్న యోగకు అధికారికంగా ప్రపంచ గుర్తింపు రావడం భారతీయులుగా మనందరికీ గర్వకారణం..
ఇంతకీ యోగలో ఏముంది? ఎందుకు దీనికి ప్రాధాన్యత ఇస్తున్నారు? ఇది ఒక మత ప్రచారంలో భాగం కాదా?.. ఇలాంటి ప్రశ్నలు రావడంతో తప్పులేదు. వాటన్నింటికీ సమాధానం ఉంది. మనం ముందుగా యోగా వల్ల ఉపయోగాలు ఏమిటి అన్న విషయానికి మాత్రమే ప్రాధాన్యత ఇద్దాం.. మొదటి ఉపయోగం సంపూర్ణ ఆరోగ్యం, రెండోది మానసిక ప్రశాంతం.. మన సనాతన ధర్మం (హిందూ మతం) ఒక రూపాన్ని సంతరిచుకోకముందే యోగా పుట్టింది. ఒక మతానికి చెందిన అత్యధికులు ఆచరిస్తున్నారనే సాకుతో యోగకు మతం రంగు పులమడం మూర్ఖత్వమే అవుతుంది.
యోగలో ప్రధానంగా కనిపించేవి ప్రాణాయామం, సూర్యనమస్కారాలు, ముద్రలు, క్రియలు, ఆసనాలు.. ఇందులో ఆసనాలు కనిపిస్తున్నా ప్రధానంగా 25 వరకూ ప్రాచుర్యంలో ఉన్నాయి. ఈ ఆసనాలు వేయడం వల్ల తల నుండి కాలి చిటికన వేలు వరకూ మన శరీరమంతా చురుగ్గా పని చేస్తుంది. శరీరం చక్కగా వంగటం వల్ల రక్త ప్రసరణ అన్ని అవయవాలుకు సక్రమంగా జరుగుతుంది. శ్వాస మెరుగవుతుంది. గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, మెదడు, వెన్నుపూస చురుగ్గా పని చేస్తాయి. చక్కగా యోగాసనాలు చేసే వారికి శారీరక కష్టాలు తగ్గుతాయి. గుండెపోటు, రక్తపోటు, మధుమేహం, స్థూలకాయం వంటి సమస్యలను ప్రాథమిక దశలోనే అడ్డుకోవచ్చు. ఇప్పటికే ఉంటే పూర్తిగా నియంత్రణలో పెట్టుకోవచ్చు. తద్వార మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. బద్దకాన్ని విడిచిపెట్టి చురుగ్గా పని చేసుకోగలుగుతాం. మెదడు చురుగ్గా పని చేయడం వల్ల మనలో కొత్త ఆలోచనలు పుంతలు తొక్కుతాయి. మొత్తం మీద సంపూర్ణ ఆరోగ్యానికి యోగ పూర్తి గ్యారంటి ఇస్తుంది..
యోగ ఖరీదైనదనే అపోహలు కొందరిలో వినిపించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ధనికులు, ప్రముఖులు యోగాసనాలను చేయడం, కొన్ని సంస్థలు భారీగా ఫీజులు వసూలు చేసి యోగా నేర్పడం చూసి తెలియని వారికి ఇలా అనిపించడం సహజం. మన ఆరోగ్యం కోసం ఎన్నో మందులు కొని వాడుతున్నాం. వీటి వల్ల మన జేబుకు చిల్లు మాత్రమే కాకుండా సహజ సిద్దంగా ఉండే శరీర రోగ నిరోధక శక్తిని క్రమంగా కోల్పోతున్న విషయాన్ని గ్రహించడం లేదు. అలాగే శరీరాన్ని నియంత్రణలో ఉంచుకోవడం కోసం జిమ్ములు, ఆరోబిక్స్, ఇతర పాశ్చాత్య వ్యాయామాల కోసం డబ్బును ఖర్చు చేస్తున్నాం.. కానీ యోగాకు ఇవేమీ అవసరం లేదు.. చక్కగా మీ ఇంట్లో, లేదా శుద్దమైన గాలి, వెలుతురు సక్రమంగా ఉన్న తగిన చోటు చూసుకొని ఆసనాలు వేసుకోవచ్చు. ఇలా చేసినందుకు మిమ్మల్ని డబ్బు ఇమ్మని అడిగేవారెవరు?

అందరూ యోగాసనాలు వేయండి.. సంపూర్ణ ఆరోగ్యవంతులు కండి.. యోగతో రోగ రహిత సమాజాన్ని రూపొందిద్దాం.. (by: క్రాంతి దేవ్ మిత్ర)