Sunday, May 31, 2015

పొగాకు మీ జీవితాలను మింగేస్తుంది..

మీకెవడైనా పగోడున్నాడా?.. వాన్ని మూడో కంటికి తెలియకుండా లేపేద్దామనుకుంటున్నారా?.. చాలా సులభం..  వాడితో తీయగా, స్నేహంగా మాట్లాడుతూ సిగరెట్ ఆఫర్ చేయండి.. అలవాటుగా మార్చేయండి.. ఇక వాడి చావుకూ, మీకూ ఎలాంటి బాధ్యత లేదు.. ఇది హస్యాస్పదంగా అనిపించవచ్చు.. కానీ నమ్మలేని వాస్తవం.. సిగరెట్ సైలెంట్ కిల్లర్.. అది కాలుతూ మీ జీవితాన్ని బూడిద చేస్తుంది.. చివరకు పాడె మీదకు చేరుస్తుంది..
సిగరెట్ తో పాటు ఇతర పొగాకు ఉత్పత్తులైన చుట్ట, బీడీ, జర్దా, గుట్కా, పాన్ మసాలా ఏదైనా ప్రమాదకరమైనవే.. ప్రపంచ వ్యాప్తంగా ఏటా 60 లక్షల మందిని పొగాకు ఉత్పత్తులు పొట్టన పెట్టుకుంటున్నాయి.. భారత దేశంలో ఈ సంఖ్య 10 లక్షలు.. అంటే పొగాకు చంపేస్తున్న వారిలో ఆరో వంతు భారతీయులే.. మన దేశంలో ప్రమాదకరమై క్యాన్సర్ వ్యాధితో మరణిస్తున్న వారిలో నూటికి 66 శాతం పొగాకు ఉత్పత్తులను వాడే వారే.. పరిస్థితి ఇలాగే కొనసాగితే 2020 నాటికి ప్రపంచ వ్యాప్తంగా ఏటా కోటి మంది పొగాకు కారణంగానే మరణిస్తారని అంఛనా..
పొగాకు ఉత్పత్తులు మొదట దెబ్బతీసేది మన నోటినే.. ఆ తర్వాత ఊపిరితిత్తులను, మెదడు, రక్తనాళాలు, జీర్ణకోశం, మూత్ర పిండాలను పనికి రాకుండా చేస్తాయి.. సిగరెట్టు పెట్టెపై పొగాకు వాడకం ప్రమాదకరమని ఎంత పెద్దగా రాసినా ఫలితం ఉండదు.. అసలు ప్రభుత్వాలు పొగాకు ఉత్పత్తులను నిషేధిస్తాయని ఆశించడమే అత్యాశ.. పొగాకు ఉత్పత్తుల అమ్మకాల వల్ల ప్రభుత్వానికి భారీ సుంకాలు వసూలవుతున్నాయి.. అలాగే ఎగుమతులు భారీ ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నాయి..  ప్రభుత్వానికి బంగారు గుడ్లు పెట్టే కోళ్ల లాంటి పొగాకు ఉత్పత్తులను వదులు కోవడం కత్తిమీద సాములాంటిదే..
బహిరంగ ప్రదేశాల్లో పొగాకు వాడకాన్ని నిషేధించడంతో పాటు, అమ్మకాలను కూడా పూర్తిగా అరికట్టాల్సిందే..  పొగాకు రైతులకు, ఈ వ్యాపారంపై ఆధారపడే వారికి ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలి.. ప్రయత్నం చేస్తే సాధ్యం కానిదంటూ ఉండదు.. ఇకప్పుడు ఐటీసీ కంపెనీకి పొగాకు వ్యాపారమే పెద్ద దిక్కు.. ఈ రోజు ఆ కంపెనీ ఇతర ఉత్పత్తులపై కూడా దృష్టి పెట్టి భారీగా విస్తరించింది.. అన్నింటకన్నా ముఖ్యం ప్రజల ఆరోగ్యానికి ముప్పు తెచ్చిపెట్టే పొగాకు ఉత్పత్తులను పూర్తిగా అరికట్టాలంటే ప్రజల్లో చైతన్యం రావాల్సిందే.. పొగాకు వల్ల కలిగే అనర్ధాలను తెలుసుకొని, వాటికి దూరంగా ఉండటంతో పాటు ఇతరులనూ అప్రమత్తం చేయాలి..

అన్నట్లు పై పేరాలోకి మళ్లీ వెళదాం.. సిగరెట్, బీడీ, చుట్ట ఏదైనా.. అది పీల్చే వారితో పాటు, పక్కనుండే వారికీ ముప్పే.. సో మీరు ఆ అలవాటు ఇతరులకు నేర్పినా, వారి పక్కన ఉండే మీకు కూడా ముప్పే..

Saturday, May 30, 2015

సోషల్ మీడియా సేవకు గుర్తింపు..

నారద జయంతి సందర్భంగా సమాచార భారతి సంస్థ విశిష్ట పాత్రికేయులకు పురస్కారాలు అందించింది.. నాతో పాటు వేదుల నరసింహం, వక్కలంక రమణ, మేడపాటి రామలక్ష్మి గార్లకు ఈ పురస్కారాలు అందజేశారు.. రెండున్నర దశాబ్దాలుగా జర్నలిజం వృత్తిలో ఉన్న నేను సోషల్ మీడియా ద్వారా జాతీయ భావాలను ప్రచారం చేస్తున్నందుకు ఈ పురస్కారానికి ఎంపిక చేశారు.. కార్యక్రమానికి సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ డాక్టర్ మాడభూషి శ్రీధర్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. 
ఈ పుస్కరానికి నన్ను ఎంపిక చేసి, బాధ్యతలను పెంచిన సమాచార భారతి అధ్యక్షులు హరిహర శర్మ, ప్రధాన కార్యదర్శి మల్లికార్జున రావు, సీనియర్ పాత్రికేయులు వల్లీశ్వర్ గార్లకు.. పురస్కారాన్ని నాకు అందజేసిన కిస్మత్ కుమార్ గారికి, కార్యక్రమ నిర్వహణలో పాల్పంచుకున్న మిత్రులు రామ్మోహన్, కృష్ణమూర్తి, నాగరాజారావు, నీలేష్, వీరప్ప, ప్రదీప్ నంబియార్, రాఘవేందర్ గార్లకు ధన్యవాదాలు.. 
ఈ పురస్కారంతో పాటు చెక్కు రూపంలో అందజేసిన నగదును నేను గ్రామ భారతి సంస్థకు అందజేయాలని నిర్ణయించుకున్నాను.. నాకు శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేసిన మిత్రులందరికీ ధన్యవాదాలు.. 

Friday, May 29, 2015

సూటు బూటు వేసుకోడానికి అర్హత ఏమిటి రాహుల్?

థాయ్ లాండ్ ఎందుకు వెళ్లొచ్చాడో తెలియదు కానీ, అక్కడి నుండి వచ్చిన తర్వాత రాహుల్ గాంధీ తెగ మట్లాడేస్తున్నారు.. ఆ మాటలకు భలే భలే అంటూ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు చప్పట్లు కొడుతూ, చంకలు చరచుకుంటూ ఆనందిస్తున్నారు.. అంతే కదా ఆలస్యంగా మాటలు నేర్చిన పిల్లోడు ఏం మాట్లాడినా అతని తల్లి దండ్రులకు, బంధు మిత్రులకు ముద్దుగా, అబ్బురంగా అనిపిస్తుంది..
ప్రధాని నరేంద్ర మోదీ పాలన సూటు, బూటు సర్కార్ అంటూ ఎక్కడపోయినా అరిపోయిన రికార్డింగ్ వినిపించేస్తున్నారు రాహుల్.. మరి పదేళ్ల యూపీఏ పాలన లూఠ్, జూఠ్ అయినందునే ప్రజలు తిరస్కరించారని మాత్రం ఆత్మ విమర్శ చేసుకోలేకపోతున్నారు.. మోదీ సూటు వేస్తేనేమి, బూటు వేస్తేనేని అది ఆయన ఇష్టం.. రాహుల్ తాత జవహర్లాల్ నెహ్రూ, తండి రాజీవ్ గాంధీ సూట బుటూ వేసినోళ్లే కదా.. ఇప్పుడు ఆయన బావ రాబర్ట్ వాద్రా సూటు బూటు వేయడం లేదా? దాని గురుంచి ఎందుకు మాట్లాడరు రాహుల్..
అమెరికా అధ్యక్షుడు ఒబామా భారత్ వచ్చిన సందర్భంగా ప్రధాని మోదీ వేసిన సూట్ విషయంలో పెద్ద రాద్దాంతం చేశారు.. పది వేలు కూడా విలువ చేయని ఆ సూటు విలువను లక్షలు ఖరీదు చేస్తుందంటూ లెక్క కట్టి డిమాండ్ పెంచారు.. మోదీ ప్రతి ఏటా తాను వాడిన వస్తువులను వేలం వేసి సామాజిక సేవా కార్యక్రమాలకు ధనం చేకూర్చడం ఆనవాయితీగా పెట్టుకున్నారు.. విమర్శకుల పుణ్యమా అని దాని విలువ ఏకంగా రూ.4.32 కోట్లు పలికింది.. అదీ మోదీ విలువ.. నెహ్రూ, రాజీవ్, రాబర్ట్ దుస్తుల విలువెంత? వేలం వేసి చూడండి తెలుస్తుంది.. పోనీ రాహుల్ బట్టల విలువెంతో?..

స్వాతంత్రోద్యమ కాలంలో ఇండియాలో సరైన లాండ్రీ సదుపాయాలు లేవని నెహ్రూతో పాటు కొన్ని ఉన్నత కుటుంబాలు తమ సూటు బూట్లను లండన్, ప్యారీస్ లాండ్రీలకు పంపేవారని కథలు కథలుగా చెప్పుకుంటారు.. తమ కుటుంబం భేషుగ్గా సూటు బూటు వేసుకోవచ్చు.. కానీ నరేంద్ర మోదీ మాత్రం వేయకూడదు.. ఓ చాయ్ వాలా దేశ ప్రధాని కావడం ఏమిటి? సూటు బూటు వేయడం ఏమిటని ఓర్వలేకపోతున్నావా రాహుల్?..

Thursday, May 28, 2015

వీర సావర్కర్ ను గుర్తు చేసుకుందాం..

దేశం కోసం జీవితాన్నే సమర్పించుకున్న ప్రఖ్యాత సమర యోధుడు.  రెండు యావజ్జీవ కారాగార శిక్షలు పడి 27 ఏళ్లు అండమాన్ జైలు శిక్ష అనుభవించిన విప్లవ వీరుడు..  1857లో జరిగింది సిపాయిల తిరుగుబాటు కాదు, ప్రథమ స్వాతంత్ర్య సమరమని బయటపెట్టిన చరిత్రకారుడు.. కవిగా, రచయితగా సమాజంలో చైతన్యం రగిలించారు.. అంటరానితనం, అసమానతలు, మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా పోరాడిన సంఘ సంస్కర్త.. హిందుత్వ సిద్దాంతకర్త.. హిందూ మహాసభ వ్యవస్థాపకుడు.. ఎంతో మంది సమరయోధులను తీర్చి దిద్దిన స్పూర్తి ప్రధాత.. ఇలా ఆయన గురుంచి ఎన్ని చెప్పినా తక్కువే..
వినాయక్ దామోదర్ సావర్కర్.. స్వాతంత్ర్య వీర సావర్కర్ పేరిట ప్రఖ్యాతుడు..

దేశం కోసం సర్వస్వాన్ని కోల్పోయిన ఈ మహనీయుడి జయంతి ఈరోజు.. వీర సావర్కర్ జయంతి సందర్భంగా ఆయన సేవలను గుర్తు చేసుకుందాం.. వారి నుండి స్పూర్తిని పొందుదాం..

దేశ భద్రత విషయంలో రాజీలేదు: రాంమాధవ్

దేశ భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్.. ఈ విషయంలో ప్రధాని నరేంద్రమోదీ గట్టి నిర్ణయాలు తీసుకుంటున్నారని, ఇతరుల నుండి తాము పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదని స్పష్ట చేశారాయన. జమ్మూ కాశ్మీర్ అధ్యయన కేంద్రం, ప్రజ్ఞా భారతి, ఫోరమ్ ఫర్ లీడర్ షిప్ గవర్నెన్స్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ‘దేశ భద్రతకు సవాళ్లు – జమ్మూ కాశ్మీర్ నుండి అరుణాచల్ వరకూ, పాకిస్తాన్ నుండి చైనా వరకూ ’ అనే అంశంపై జరిగిన చర్చా కార్యక్రమంలో మాట్లాడారు రాంమాధవ్.. పొరుగు దేశాలతో తాము సత్సంబంధాలను కోరుకుంటున్నామని, అదే సమయంలో భారత వ్యతిరేక చర్యలకు పాల్పడితే వారికి గట్టి బదులు స్తున్నామని వివరించారు. పాకిస్తాన్ వేర్పాటు వాదులతో చర్చలు జరిపినందు వల్లే ఆ దేశంతో సత్సంబంధాల విషయంలో ప్రతిష్టంభన ఏర్పడిందన్నారు రాంమాధవ్.. చైనా పర్యటనలో సరిహద్దు వివాదాల విషయంలో ఆ దేశాలని మన వైఖరిని స్పష్టం చేశారని గుర్తు చేశారు.
కాశ్మీర్ పండితులను న్యాయం చేస్తున్న ఘనత మోదీ ప్రభుత్వానిదేనని, గతంలో కాంగ్రెస్ పార్టీ వారిని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు రాంమాధవ్.. ఆర్టికల్ 370 విషయంతో తమ విధానం చాలా స్పష్టమని అందులో అనుమానాలకు ఆస్కారం లేదన్నారు.. జమ్మూలో అత్యధిక సీట్లు గెలుచుకున్న బీజేపీ, ఆ ప్రాంతానికి అన్యాయం చేయరాదనే లక్ష్యంతోనే జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వంలో చేరిందని వివరించారు. చరిత్రలో తొలిసారిగా కాశ్మీర్ లోయతో సమానంగా జమ్మూకు ప్రాంతానికి నిధులు అందుతున్నాయని తెలిపారు.
రాహుల్ గాంధీ కొత్తగా మాటలు నేర్చిన చిన్నపిల్లాడని ఎద్దేవా చేశారు రాంమాధవ్.. మోదీ ప్రభుత్వాన్ని సూటు బూటు ప్రభుత్వం అని చెబుతున్న రాహుల్, ఇప్పటి వరకూ తాము అందించింది లూఠ్ జూఠ్ అని మరుస్తున్నారని విమర్శించారు. బట్టలను విదేశాల్లోని లాండ్రీకి పంపుకున్న ఘనత వారి కుటుంబానికి ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ గరీబీ హఠావో నినాదం ఇస్తూ పేదలను అడ్డం పెట్టుకొని రాజకీయం చేసిందని ఆరోపించిన రాంమాధవ్, బీజేపీ ప్రభుత్వం ఈ పరిస్థితిని మారుస్తుంటే తట్టుకోలేక అర్ధం లేని ఆరోపణలు చేస్తోందన్నారు. మంచి పాలన అందిస్తున్న నరేంద్ర మోదీపై ప్రతిపక్షాలకు విమర్శించే అర్హత కూడా లేకుండా పోయిందని, మోదీ ప్రభుత్వంపై వారు చేస్తున్న ఆరోపణలన్నీ అర్ధం లేనివే అని స్పష్టం చేశారు రాంమాధవ్.. మన్మోహన్ సింగ్ తో పోలిస్తే, విదేశీ పర్యటనల్లో మోదీకి అభిస్తున్న ఆదరణ చూసి కాంగ్రెస్ పార్టీ తట్టుకోలేకపోతోందని అన్నారు.. అందుకే అర్థంలేని ఆరోపణలకు దిగుతోందని ఎద్దేవా చేశారు.
నరేంద్ర మోదీ పాలనలో దేశం ఆర్ధికంగా బలోపేతం అవుతోందని, మన వృద్ధి రేటు ఘననీయంగా పెరిగిందని వివరించారు రాంమాధవ్.. ఈ విషయంలో విదేశీ పత్రికలు సైతం ప్రశంసలు కురిపిస్తున్నాయన్నారు.
భూసేకరణ బిల్లుపై అవాస్తవాల ప్రచారం జరుగుతోందని రాంమాధవ్ వివరించారు. మోదీ ప్రభుత్వం కార్పోరేట్లకు లాభం చేస్తోందనే ఆరోపణలకు ఎలాంటి ఆధారాలులేవన్నారు. ప్రభుత్వ ప్రాజెక్టులకు అవసరమైన మేరకే భూసేకరణ జరుగుతుందని, రైతులకు నాలుగింతల పరిహారం అందుతుందని తెలిపారు. నరేంద్ర మోదీ పాలనలో భారత్ శక్తివంతమైన దేశంగా ఎదుగుతోందని రాంమాధవ్ అన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రజ్ఞా భారతి ఛైర్మన్ హనుమాన్ చౌదరి, జమ్మూకాశ్మీర్ అధ్యయన కేంద్రం అధ్యక్షుడు, ఓయూ మాజీ వైస్ ఛాన్సలర్ ప్రొ.తిరుపతి రావు పాల్గొన్నారు.


Tuesday, May 26, 2015

ఏడాది పాలనలో ప్రజామోదీ..

365 రోజులు పూర్తయింది.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ప్రజలు ఇచ్చిన సమయం ఐదేళ్లు.. అప్పుడే ఏడాది పూర్తయింది.. ఈ సంవత్సర కాలంలో మోదీ ఏం చేశారు అన్నది సమీక్షించి, రాబోయే నాలుగేళ్లు ఏం చేయబోతారన్నది బేరీజు వేయడం న్యాయమే.. అదే సమయంలో అన్యాయమైన విమర్శలు చేసేవారి పట్ల కాస్త అప్రమత్తంగా ఉండటం అవసరం.. నిజం నిద్రలేచే లోపు అబద్ధం లోకాన్ని చుట్టి వస్తుందనే నానుడిని ఇక్కడ గుర్తు చేసుకోవాలి..
నరేంద్ర మోదీ ఏడాది పాలనలో అవినీతి, కుంభకోణాలు కనిపించాయా?.. గతంలో మాదిరిగా భారీగా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయా?.. విదేశాల్లో భారత దేశ ప్రతిష్ట పెరిగిన మాట వాస్తవం కాదా?.. మన దేశ ఆర్థిక వృద్ధి గణనీయంగా పెరగడం, ద్రవ్యోల్భనం సగానికి తగ్గడం, దేశంలో విద్యుత్ ఉత్పాదన ఘననీయంగా పెరగడం, పారిశ్రామిక ప్రగతి పుంచుకోవడం ఎవరి పుణ్యం?.. మేకిన్ ఇండియా, స్వచ్ఛ భారత్, నీతి ఆయోగ్ ఏర్పాటు, స్మార్ట్ సిటీస్, బేటీ బచావో-బేటీ పడావో, జన్ ధన్ యోజన, ముద్రా బ్యాంకు, పేదలకు కారు చౌకగా బీమా, పెన్షన్ పథకాలు ఎవరికి లబ్దిని కలిగిస్తాయి?.. మన్మోహన్ పదేళ్ల పాలన, మోదీ ఏడాది పాలనను బేరీజు వేసుకొని చూడండి..
మోదీని ఎన్నారై ప్రధాని అని విమర్శిస్తున్న వారు ఓ విషయాన్ని గమనించాలి.. యూపీఏ పాలకుల హయాంలో మన విదేశాంగ విధానం గాడి తప్పింది.. మన ఇరుగు పొరుగున ఉన్న చిన్న దేశాలు సైతం మనను బెదిరించే స్థాయికి ఎదిగాయి.. పాకిస్తాన్, చైనా సాగించే అగడాలు అన్నీ ఇన్నీ కావు.. అంతర్జాతీయంగా మనకు మద్దతు ఇచ్చేవారు పెరిగితే ఇలాంటి వాటికి చెక్ పెట్టడం సాధ్యం అవుతుంది.. ఇందుకు దూరదృష్టి అవసరం, దేశానికి ఘననీయంగా పెట్టుబడులు వచ్చినప్పుడే పారిశ్రామిక అభివృద్ధి ఉపాధి కల్పన సాధ్యం అవుతుంది.. ఇవన్నీ రాత్రికి రాత్రో, ఏడాదిలోగానో పూర్తయ్యే పనులు కావు.. అయినా ఫలితాలు కనిపిస్తున్నాయి.. మన ప్రధాని వెళ్లిన ప్రతి దేశంలోనూ అక్కడి ప్రవాస భారతీయులను కలుస్తున్నారు.. వారిలో ఉత్సాహాన్ని నింపుతూ మాతృదేశాభివృద్ధిలో భాగస్వాములను చేస్తున్నారు..
ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా నరేంద్ర మోదీ విదేశాల నుండి నల్ల ధనాన్ని రప్పించలేదు.. ధనికులు-పెట్టుబడి దారుల కొమ్ము కాస్తోంది.. భూసేకరణ చట్టంతో రైతులకు అన్యాయం చేస్తోంది అనే విమర్శలు చేస్తున్నవారు ఒక విషయాన్ని ఆలోచించాలి.. ప్రధాని పదవిలో ఉన్నవారు ఏదైనా ప్రయత్నం చేయకుండా నోరు మూసుకొని మూలన కూచోవాలని కోరుకుంటున్నారా? అలాంటప్పుడు మౌనీ బాబా మన్మోహన్ కు మోదీకి తేడా ఏముంటుంది.. ఏదైనా సాధించాలంటే ప్రయత్నించాలి.. ఆ ప్రయత్నం మొదలైందా లేదా అన్నది గమనించాలి.. మన చట్టాలకు పదును పెట్టడం, విదేశాలపై నల్లధనం రప్పించడ కోసం వత్తిడి తేవడం మీరు గమనించలేదా?.. అక్కడి చట్టాలు, పరిమితుల కారణంగా ఆలస్యం జరగడం వాస్తవం.. ఈ ప్రయత్నాన్ని గత ప్రభుత్వాలు చేశాయా? పెట్టుబడి దారులను భూతాల్లా చిత్రీకరించడం కొందరికి ఫ్యాషన్ అయింది.. వారిని పారిశ్రామికాభివృద్ధిలో భాగస్వాములను చేయడం వల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.. వారికి ప్రభుత్వ పరంగా ఎలాంటి సహకారం అందించకుండా, విదేశాలకు వెళ్లిపోయే పరిస్థితి కల్పించడం వల్ల ఎవరికి ఉపయోగం? ఈ క్రమంలో అవినీతి, కుంభకోణాలు చోటు చేసుకుంటే నిలదీయాలి. కానీ గుడ్డి వ్యతిరేకత వల్ల ఫలితం ఉంటుందా?.. భూసేకరణ చట్ట సవరణ విషయంలో వాస్తవాలకన్నా అవాస్తవాలే ఎక్కువ ప్రచారం అవుతున్నాయి.. పేదలకు, రైతులకు ఏదో అన్యాయం జరిగిపోతోందని ప్రతిపక్షాలు చేస్తున్న రాద్దాంతంలోని మర్మాన్ని కూడా గ్రహించాలి.. రైతులకు నష్టం జరగకుండా చూడాల్సిన బాధ్యతను ప్రభుత్వం ఏ విధంగా విస్మరిస్తుంది?.. మోదీ ప్రభుత్వ తీసుకుంటున్న చర్యలు నష్టాన్ని కలిగిస్తే ప్రజలే బుద్ది చెబుతారు..  నిర్మాణాత్మక విమర్శలు చేయకుండా ఆరోపణలకే పరిమితం అవుతున్న వీరు ఏమి కోరుకుంటున్నారు..

ఏ పని చేసినా బురద జల్లడమే లక్ష్యంగా పెట్టుకున్న వారిని ఒప్పించడం కష్టమే.. మోదీ సూటు బూటు వేసుకుంటున్నారు, సెల్పీలు దిగుతున్నారు అని ఏడ్చేవారు ఆ పని వారూ చేయొచ్చు ఎవరొద్దన్నారు.. ఎందుకిలా ఏడవడం?.. ఇసుక నుండి సైతం తైలం తీయవచ్చు కానీ మూర్కులను రంజిపలేము అని భర్తృహరి తన సుభాషితంలో చెప్పారు.. ఏడాది మోదీ పాలనకు జీరో మార్కులేశారు కొందరు మహానుభావులు.. అచ్చే దిన్ ఏవీ అని తెచ్చి పెట్టుకున్న అమాయకపు ప్రశ్న వేస్తున్నారు.. అచ్చేదిన్ దేశానికి, ప్రజలకే కానీ వారికి కాదు అని గ్రహించడం మంచిది.. ప్రజలే అంతిమ న్యాయ నిర్ణేతలు..

Friday, May 22, 2015

అనగారిన వర్గాల 'భాగ్య'విధాత

హైద‌రాబాద్ న‌గ‌రంలో చాద‌ర్‌ఘాట్ చౌర‌స్తా దాటి ఉమెన్స్ కాలేజీ వైపు వెళుతుంటే ఎడ‌మ వైపు గంభీర‌మైన భ‌వ‌నం క‌నిపిస్తుంది.. ఆ భవనంపైన ‘ఆది హిందు భవన్’ అనే అక్షరాలు కనిపిస్తాయి.. అదే రోడ్డులో మరి కొంచెం ముందుకు వచ్చాక కుడివైపున చిన్న గణేష్ గుడి పక్కన ‘మాదరి భాగ్యరెడ్డి రోడ్డు’ అనే మున్సిపల్ బోర్డు కనిపిస్తుంది.  ఒక హైదరాబాదీగా నా చిన్నప్పటి నుండీ నాకివి సుపరిచిత దృశ్యాలు.. నాలాగే చాలా మంది చూసే ఉంటారు..  ఆది హిందూ భవన్ ఏమిటి? మాదరి భాగ్యరెడ్డి వర్మ రోడ్డేమిటి? ఎవరీ భాగ్యరెడ్డి వర్మ? అనే విషయాలు ఎప్పుడైనా ఆలోచించారా?


చరిత్రకు జరిగిన అన్యాయాల్లో ఇదీ ఒకటి.. బాబా సాహెబ్ అంబేద్కర్, బాబూ జగ్జీవన్ రామ్, మహాత్మా జోతిబా పులే విగ్రహాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వాడవాడలా కనిపిస్తాయి.. కానీ తెలుగు నాట దళితోద్యమానికి బాటలు వేసిన భాగ్యరెడ్డి వర్మ విగ్రహం ఎందుకు కనిపించడదు?. కనీసం హైదరాబాద్ నగరంలో కూడా ఆ మహనీయుని విగ్రహం ఒక్కటైనా కనిపించదేం?.. భాగ్యరెడ్డి వర్మ గురించి నేటి తరానికి ఎందుకు తెలియదు? తెలిసినా ఓట్ల రాజకీయాలతో సంబంధంలేని వ్యక్తితో మనకేం సంబంధం అని నేతాజీలు నటిస్తున్నారా?.. 
నిజాం పాలిత హైదరాబాద్ రాజ్యంలో అనగారిన వర్గాల గొంతుక భాగ్యరెడ్డి వర్మ.. 1888 సం. మే 22 నాడు మాదిరి వెంకయ్య, రంగమాంబ దంపతులకు జన్మించారాయన.. తొలిపేరు భాగయ్య.. అయితే వారి కుల గురువు భాగ్యరెడ్డి అనే పేరు పెట్టారు.. (రెడ్డి అంటే పాలకుడు అనే అర్థం కూడా ఉంది) చిన్నప్పటి నుండి సామాజిక స్పృహను అలవరచుకున్న భాగ్యరెడ్డిపై ఆర్యసమాజం, బ్రహ్మసమాజం, బౌద్ధం ప్రభావం కూడా ఉంది. అంటరానితనం, దేవదాసీ వ్యవస్థ, మద్యపానం తదితర రుగ్మతలపై పోరాటాలు చేయడమే కాదు, స్వయంగా దళితులకు విద్య, ఉపాధి, సామాజిక హోదాల కోసం తన వంతు కృషి చేశారు. ఆయన సామాజిక సేవా కార్యక్రమాను చూసి ఆర్యసమాజం వర్మ అనే బిరుదును ఇచ్చింది.. అలా భాగ్యరెడ్డి వర్మ పేరు వచ్చింది.
అంబేద్కర్ కన్నా ముందే దేశ వ్యాప్తంగా దళితులకు అనాదిగా జరుగుతున్న అన్యాయాలపై గొంతెత్తిన మహానాయకుడు భాగ్యరెడ్డి వర్మ.. తదనంతర కాలంలో బాబా సాహెబ్ తో  కలసి ఉద్యమాల్లో పాల్గొన్నారు  ‘ మేము పంచములం కాదు.. ఈ దేశ మూల వాసులం.. ఆది హిందువులం..’ అని సగర్వంగా చాటారు.. అనగారిన కులాలను ఆది హిందువులు అని పిలవాలని పిలుపునిచ్చారు. భాగ్యరెడ్డి వర్మ సూచన మేరకు హైదరాబాద్, మద్రాసు ప్రభుత్వాలు వారిని ఆది హిందువులుగా గుర్తించాయి. ప్రారంభంలో జగన్ మిత్ర మండలి, ఆ తర్వాత కాలంలోఆది హిందూ మహా సభ పేరిట తన సేవా కార్యక్రమాలు నిర్వహించారు.. 1910లో చాద‌ర్‌ఘాట్ దగ్గర ఆది హిందూ పాఠశాల ప్రారంభించారు. మహాత్మా గాంధీ ఈ పాఠశాలను సందర్శించారు. కాలక్రమంలో ఆది హిందూ  పాఠశాలలు 26కు విస్తరించాయి. 
భాగ్యరెడ్డి వర్మ సేవలు హైదరాబాద్ (తెలంగాణ) సంస్థానానికే పరిమితం కాలేదు.. 1917లో విజయవాడలో అంటరాని కులాల సదస్సును నిర్వహించారు. ఆంధ్ర జిల్లాల్లో కూడా పర్యటించి అనగారిన వర్గాల్లో చైతన్యం తీసుకు వచ్చారు.  లక్నో, అలహాబాద్, కలకత్తా తదితర ప్రాంతాల్లో జరిగిన దళిత చైతన్య మహాసభలకు ముఖ్య అతిధిగా హాజరయ్యారు.. భాగ్యరెడ్డి వర్మ 1939 ఫిబ్రవరి 18న క్షయ వ్యాధితో కన్నుమూశారు. 51 ఏళ్లకే ఆయన అకాల మరణంతో ఆది హిందూ ఉద్యమం, అనగారిన వర్గాల అభివృద్ధి, అభ్యున్నతికి విఘాతం కలిగించింది. భాగ్యరెడ్డి వర్మ 127వ జయంతి సందర్భంగా ఆ మహనీయుని సేవలను గుర్తు చేసుకుందాం.. మన తెలుగు వాడైన భాగ్యరెడ్డి వర్మను నేటి తరం గుర్తు చేసుకోవడానికి వీలుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఆయన విగ్రహాలు ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాను