Sunday, August 3, 2014

ఎన్నాళ్లకెన్నాళ్లకెన్నాళ్లకూ?..

‘దోస్తు మేరా దోస్త్..’ ‘స్నేహమేనా జీవితం..’ ‘ఇద్దరు చంద్రులు కలిశారు..’ అంటూ ఈ దృశ్యానికి మన మీడియా మిత్రులు బాణీలు కట్టేస్తున్నారు.. నిజానికి ఈ సీన్ కోసం రెండు నెలలుగా గోతికాడి నక్కల్లా ఎదురు చూస్తున్నారంటే నమ్మండి.. వెటకారం మరీ ఎక్కువైందని ఎవరైనా మీడియా మిత్రులు నొచ్చుకుంటే అందులో నా తప్పేమీ లేదు.. నిజం నిప్పులాంటి కదా?.. మీరు చూస్తున్న ఈ దృశ్యంలో ఏ మాత్రం నిజాయితీ లేదు.. ఇద్దరివీ తెచ్చి పెట్టుకున్న బలవంతపు నవ్వులే..
రెండు రాష్ట్రాలు.. ఇద్దరు ముఖ్యమంత్రులు.. ఒకే రాజధాని.. ఒకే తడక చాటు సచివాలయం..ఇద్దరి నివాసాలు దగ్గర్లోనే ఉంటాయి.. అంతే కాదు ఇద్దరి క్యాంప్ ఆఫీసులు దగ్గర్లోనే ఉంటాయి.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి అప్పుడే రెండు నెలలు గడచింది.. కానీ ఈ రెండేళ్లలో ఏనాడూ మొహాలు చూసుకోలేదు ఈ మాజీ దోస్తులు..
కలవడానికి ఎన్నో సందర్భాలు వచ్చాయి.. ఒకరి ప్రమాణ స్వీకారానికి మరొకరు హాజరు కాకుండా తప్పించుకు తిరిగారు.. గవర్నర్ సాంప్రదాయంగా ఇచ్చిన ఇఫ్తార్ విందులో తప్పనిసరిగా కలుస్తారుని మీడియా మిత్రులు చకోర పక్షుల్లా ఎదురు చూశారు.. కానీ ఇద్దరిలో ఒక సీఎం మాత్రమే వచ్చాడు.. రెండో ఆయన మొహం చాటేశాడు.. ఏ కార్యక్రమంలోనూ ఎదురుపడకుండా జాగ్రత్త పడ్డారు.. కానీ ఇప్పడు రాష్ట్రపతి హైదరాబాద్ వస్తున్న సందర్భంలో రాజ్యాంగ హోదాలో ఇద్దరూ ఎయిర్ పోర్టుకు వెళ్లి స్వాగతం పలకక తప్పలేదు.. మొత్తానికి ఇలా బుక్కైపోయారు.. ఎన్నాళ్లు తప్పించుకుంటారు.. బలవంతపు నవ్వులతో పలకరించుకొని చేతులు కలిపారు పాపం..
నిజానికి ఇరు రాష్ట్రాల మధ్య సత్సంబంధాల కోసం చంద్రబాబు ఓ మెట్టు దిగి వస్తున్నా కేసీఆర్ ‘యే మేనా జహా.. తెర కామ్ క్యా హై యహా..’ అంటూ మొండిగానే ఉంటున్నారు.. కానీ బాబు గారికి తప్పదు కదా ఎంతైనా అద్దె ఇళ్లు.. కొత్త ఇళ్లు కట్టుకునే దాకైనా ఓనరు గారితో జాగ్రత్తగా ఉండాలి కదా?..
ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇలా ఎడ్డం అంటే తెడ్డం అంటూ దోబూచులాడుతుంటే, దెబ్బతినేది తెలుగువారి ప్రయోజనాలే.. భౌగోళికంగా, పాలనా పరంగా విడిపోయామే తప్ప, భాషా సాంస్కృతికంగా ఉన్న సంబంధాలను ఎవరు చెరిపేయగలరు? మనకు సమస్యలు ఎన్నో ఉన్నాయి.. అవి స్థానికత, ఫీజు రీ యంబర్స్ మెంట్, విద్యుత్, నదీ జలాల పంపిణీ తదితరాలతో ముగిసిపోదు.. మున్ముందు ఇంకా ఎన్నో  దృశ్యాలు చూడబోతున్నాం.. ఇవన్నీ పరిష్కారం కావాలంటే ఇలాంటి దోబూచులాటలు పనికి రావు.. మీ కోసం కాకపోయినా ప్రజల కోసమైనా ఈ బలవంతపు నవ్వులు పులుముకొని అయినా తరచూ కలుసుకోండి.. కరచాలనాలు చేసుకోండి అవసరమైతే వాటేసుకోండి..

జై తెలంగాణ.. జై ఆంధ్రప్రదేశ్.. జై హింద్..

Wednesday, July 30, 2014

రెండుగ వెలుగు జాతి మనది..

తెలంగాణ గడ్డలో పుట్టి, తెలుగు సాహితీ మాగాణిలో బంగారు పంటలు పండించిన ఆధునికాంధ్ర కవి, సినీ రవి.. సింగిరెడ్డి నారాయణ రెడ్డి.. జ్ఞానపీఠ్ తో సహా  పురస్కారాలు అందుకున్న సినారె కొన్ని వేల గీతాలు రాశారు.. ఆయన కావ్యాలు, రచనలు ఎంతో ప్రసిద్ది పొందాయి.. తెలుగు భాషకు, సాహిత్యానికి అవిశ్రాంతంగా ఎంతో సేవ చేస్తున్న సినారె 84వ జన్మదినం జరుపుకున్న సందర్భంగా శుభాకాంక్షలు..

సినారెకు తెలంగాణ అంటే ఎంతో అభిమానం.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని బలంగా కోరుకున్నారు.. అయినా తొలి తెలంగాణ ఉద్యమ (1969)లో ఎన్టీఆర్ సినిమాలో ‘తెలుగు జాతి మనది..’ అనే పాట రాశారు.. దానిపై ఈనాటికీ విమర్శలు ఉన్నాయి.. అయితే ఈ విమర్శలకు ఆ పాటలోనే సమాధానం ఉందనే విషయం చాలా మంది గ్రహించలేదు.. ‘రెండుగ’ వెలుగు జాతి మనది.. అంటూ ఆ పాట రెండోలైనులో రాశారు.. ఇటీవల సాక్షిలో వచ్చిన సినారె ఇంటర్వ్యూలో ఈ ఆసక్తికరమైన అంశాన్ని గమనించండి..

Tuesday, July 29, 2014

ఇదేం సవరణ..

వెనకటికి ఒకడు 'కాకరకాయ' అనరా అంటే.. 'కీకరకాయ' అన్నాడని నానుడి..తెలంగాణ రాజముద్ర వ్యవహారం అలాగే ఉంది..
తెలంగాణ రాజముద్రపై ఆది నుండి వివాదాలే..
రాజముద్రలో నాలుగు సింహాల కింద ఉండే 'సత్యమేవ జయతే' అనే దేవనాగరి లిపి అక్షరాల విషయంలో వ్యక్తమైన అభ్యంతరాలు న్యాయస్థానం మెట్లు దాటాయి.. దీంతో ప్రభుత్వం లోగో కింద ఉండే 'సత్యమేవ జయతే'ను రాజముద్ర కింది నుండి తీసి నాలుగు సింహాల కింద చేర్చింది.. ఇప్పడు వ్యవహారం అశ్వథామ హత: (కుంజర) అన్నట్లైంది.. గతంలో సత్యమే జయతే కొట్టొచ్చినట్లు కనిపించేది.. ఇప్పడు బూతద్దం పెట్టి చూసినా కొత్త రాజముద్రలో సత్యమేవజయతే కనిపించకుండా పోయింది..
పాత రాజముద్రలో కాకతీయ శిలాతోరణం అను ఫాంట్ క్లిప్ ఆర్ట్ నుండి సంగ్రహించారనే అపవాదు ఉండేది.. దాన్ని సవరించారు సంతోషం.. అలాగే మూడు మీనార్ల చార్మినార్ నాలుగు మీనార్లకు చేరింది..కానీ మిగతా అభ్యంతరాల సంగతి ఏమిటి? ఆ విషయాలను ఎందుకు పరిశీలించలేదు?..
తెలంగాణ సంస్కృతికి ప్రతి రూపాలైన బతుకమ్మ, బోనం, పూర్ణకుంభంలతో ఏదైనా ఒకటి రాజముద్రలో చేరితే ఎంత హుందాగా ఉండేది.. నాకు తెలిసి సత్యమేవ జయతే వివాదం మళ్లీ కోర్డు దృష్టికి వెళుతుంది.. ఈలోగా ప్రభుత్వం ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని రాజముద్రను సవరిస్తే బాగుంటుంది..

Monday, July 28, 2014

ఈ ఆదర్శ తల్లిదండ్రుల్లో ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణా సిఎమ్ లు లేరా శ్రీధర్ గారూ..

Wednesday, July 23, 2014

తెలంగాణను రక్షించుకుందాం..

నిన్న, మొన్నటి దాకా కశ్మీర్ హిందుస్తాన్ కా.. నహీ కిసీకా బాప్ కా.. అంటూ దేశ ప్రజలు నినాదాలు చేసేవారు.. ఇప్పుడు తెలంగాణ విషయంలో కూడా అలాంటి నినాదాలు చేస్తే దుస్థితి రానుందా?.. మోకాలికి, బట్ట తలకు ముడి పెట్టినట్లు కొందరు మహానుభావులు కాశ్మీర్, తెలంగాణ సమస్యలు కలిపేసి వాదిస్తున్నారు.. అసలు వీరికి భారత దేశ చరిత్ర తెలుసా? ఈ దేశ ప్రజల మనోభావాలు అర్థం చేసుకున్నారా?
1947కి పూర్వం జమ్మూ కాశ్మీర్, తెలంగాణ భారత దేశంలో భాగం కాదట.. ఈ రెండు ప్రాంతాల భూ చట్టాలు ఒకేలా ఉన్నాయట.. స్థానికేతరులు భూములు కొనడం నిషేధమట.. ఎందుకీ వక్రీకరణ? ఎవరి చెవిలో పూలు పెట్టాలనుకున్నారు?
తెలంగాణ ప్రాంతం హైదరాబాద్ స్టేట్లోని మూడు ప్రధాన భూభాగాల్లో ఒక భాగం.. దానికి ప్రత్యేక భూచట్టం ఉన్నట్లు చరిత్రలో ఎక్కడా లేదు.. నిజాం నవాబు నిరంకుశ పాలన, రజాకార్ల దురాగతాలకు వ్యతిరేకంగా ఇక్కడి ప్రజలు పోరాడారు.. హైదరాబాద్ స్వతంత్ర దేశంగా ఉంటుందని, అవసరమైతే పాకిస్తాన్లో చేరతామని ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ బెదిరించాడు.. కానీ హైదరాబాద్ రాష్ట్ర ప్రజలంతా భారత దేశంలో కలవాలని కోరుకున్నారు.. స్టేట్ కాంగ్రెస్ , ఆర్యసమాజం, కమ్యూనిస్ట్ పార్టీలు నిజాం పాలనకు వ్యతిరేకంగా తమ తమ మార్గాల్లో పోరాడాయి.. చివరకు భారత హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ నిర్వహించిన పోలీస్ యాక్షన్ తో భారత్ లో హైదరాబాద్ విలీనం సంపూర్ణంగా జరిగింది.. నిజాం నవాబు సైతం హుందాగా అంగీకరించి రాజ్ ప్రముఖ్ (గవర్నర్) పదవి స్వీకరించారు.. ఇదీ చరిత్ర..
ఇక తెలంగాణకి ప్రత్యేక భూచట్టం ఎక్కడి నుండి వచ్చినట్లు? ఇప్పటికే ఆర్టికల్ 370 పుణ్యమా అని జమ్మూ కాశ్మీర్ రావణ కాష్టంలా రగులుతోంది.. ఆ రాష్ట్రంలో ఇతరులు భూములు కొనడం నిషేధం.. కాశ్మీరీలు దేశ ప్రజలతో మమేకం కాకుండా మరికొన్ని క్రూర నిబంధనలు ఆర్టికల్ 370 కారణంగా అడ్డు పడుతున్నాయి.. చూడబోతే తెలంగాణకు కూడా ఇలాంటి ఆర్టికల్ కోసం వీరు డిమాండ్ చేయబోతున్నారా అనే అనుమానాలు ఏర్పడుతున్నాయి..
పాకిస్తాన్ ప్రేరిత వేర్పాటువాద శక్తుల కారణంగా ఇప్పటికే కాశ్మీర్ రావణ కాష్టంలా రగులుతూనే ఉంది.. ఈ జాబితాలో తెలంగాణను చేర్చాలనుకుంటున్నారా?

తెలంగాణ ఎక్కడి నుండో ఊడిపడలేదు.. ఈ దేశంలో సంపూర్ణమైన అంతర్భాగమిది.. ముందు మనం భారతీయులం.. ఆ తర్వాతే తెలంగాణ వాసులం.. మన తెలంగాణను రక్షించుకుందాం..

Tuesday, July 22, 2014

తెలంగాణ ప్రాత:స్మరణీయుడు..

ఓ నిజాము పిశాచమా, కానరాడు
నిన్ను బోలిన రాజు మాకెన్నడేని
తీగలను తెంపి అగ్నిలో దింపినావు
నా తెలంగాణ కోటి రతనాల వీణ..
.. నాటి నిజాం నవాబు పాలనలో అష్టకష్టాలు పడుతున్న ప్రజల కష్టాలను చూసి చలించిపోయిన ఓ యువకుడు తన సాహితీ అక్షరాలను సంధించాడు.. రజాకార్ల అరాచకాలతో నలిగిపోతున్న పీడిత ప్రజల గొంతుకగా మారాడు..  రైతుదే తెలంగాణము రైతుదే.ముసలి నక్కకు రాచరికంబు దక్కునే అని గర్జించాడు. దగాకోరు బటాచోరు రజాకారు పోషకుడవు, దిగిపొమ్మని జగత్తంత నగారాలు కొడుతున్నది, దిగిపోవోయ్, తెగిపోనోయ్.. అంటూ గద్దించాడు.. హైదరాబాద్ సంస్థాన విముక్తి పోరాటంలో ఆంధ్ర మహాసభ ద్వారా ప్రజలను చైతన్య పరిపరుస్తున్న అతన్ని చూసి సర్కారు బెంబేలెత్తిపోయింది.. ఫలితంగా అరెస్టయి వరంగల్, నిజామాబాద్ జైళ్లలో బందీగా చిత్రహింసలకు గురికావాల్సివచ్చింది.. జైలు గోడలే ఆ సాహితీ యోధుడికి కాగితాలు అయ్యాయి.. ఆయనే దాశరధి కృష్ణమాచార్య..
1925 జులై 22న జన్మించిన దాశరథి కృష్ణమాచార్య చిన్నప్పటి నుండి తెలుగు సాహిత్యంపై మమకారాన్ని పెంచుకొని రచయితగా, కవిగా మారాడు.. తన సాహిత్యాన్ని ప్రజల కష్టాల అగ్నిధారగా మలిచారు.. ఊరూరా తిరిగి నిజాం పాలపై అక్షరాయుధాలతో పోరాడారు.. దాశరధి బహుముఖ ప్రజ్ఞాశాలి.. ఉపన్యాసకుడిగా, ఉపాధ్యాయుడిగా, రేడియో ప్రయోక్తగా, పంచాయితీ ఉద్యోగిగా ఎన్నో అవతారాలెత్తారు.. సినీ రంగంలో కూడా తన ముద్రను చాటారు.. ఎన్నో అద్భుతమైన గీతాలను రచించారు..  తెలుగులోనే కాకుండా ఉర్దూ సాహిత్యంలోనూ దాశరథి ప్రఖ్యాతుడు కావడం విశేషం..
దాశరథి కృష్ణమాచార్య రాసిన అగ్నిధార, రుద్రవీణ, మహాంద్రోదయం, మార్పునా తీర్పు, తిమిరంతో సమరం, కవితాపుష్పకం, యాత్రా స్మృతి తదితరాలు ఎంతో ప్రఖ్యాతి పొందాయి.. కేంద్ర రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డులు పొందారు.. ఆంధ్రప్రదేశ్ ఆస్థానకవిగా పని చేశారు..  1987 నవంబర్ 5 న దాశరథి కన్నుమూశారు.. తెలంగాణ వైతాళికుల్లో ఒకరిగా ప్రఖ్యాతి పొందిన దాశరథి తెలుగు సాహితీ రంగంపై చరగని ముద్రవేశారు..
నా తెలంగాణ కోటి రతనాల వీణ.. అనే దాశరథి గర్జన ప్రజలను ఉత్తేజితులను చేసింది..ఓ నినాదంగా మారింది.. నూతన రాష్ట్రంగా అవతరించిన తెలంగాణ ప్రభుత్వం దాశరథి కృష్ణమాచార్య జయంతిని అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించడం ఎంతో సంతోషకరం..

నేడు దాశరథి జయంతి.. ఆయనకు ఘనంగా నివాళులర్పిద్దాం..

Saturday, July 19, 2014

దేవెగౌడకు నిజమైన వారసుడు సిద్దిరామయ్య.. బెంగళూరులోని ఒక స్కూలులో విద్యార్థినిపై జరిగిన అత్యాచార ఘటనపై అసెంబ్లీలో ప్రతిపక్షాలు నిలదీస్తుంటే ఈ ముఖ్యమంత్రి ఎంత చక్కగా బజ్జున్నడో చూడండి..