Sunday, June 29, 2014

బోనాల పండుగ మొదలయ్యింది..

తెలంగాణ రాష్ట్రంలో తొలి బోనాల పండుగ.. చారిత్రిక గోల్కొండ కోటలో బోనాల సందడి మొదలయ్యింది..నెల రోజుల పాటు తెలంగాణ అంతటా ఘనంగా జరిగే బోనాలకు రాష్ట్ర పండుగ హోదా రావడం సంతోషకరం..తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ఇది నిజమైన గౌరవం.. నెత్తిన బోనం కుండలు.. పొతరాజుల కోళాహలం.. అమ్మోరి సిగాలు.. ఆషాడ మాసంలో ఈ నెల రోజుల పాటు తెలంగాణ అంతటా సందడి సందడి.. అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు..

పి.వి, ఎన్.టి.ఆర్.లకు భారతరత్న ఇవ్వాలి

పాములపర్తి వెంకట నరసింహా రావు, నందమూరి తారక రామారావు.. ఇద్దరూ ఇద్దరే.. ప్రపంచ ప్రఖ్యాతి గడించిన వారు.. అందునా మన తెలుగు వారు కావడం మనందరికీ గర్వకారణం..
ఏం.. పి.వి, ఎన్.టి.ఆర్. భారతరత్న అవార్డులకు అర్హులు కాదా? ఇప్పటికే ఈ అవార్డు అందుకున్న ఎం.జి.ఆర్., రాజీవ్ గాంధీతో పొలిస్తే, వీరు ఏ విధమైన అర్హత లేదో చెప్పగలరా?..
మన తెలుగు లెజెండ్స్ ఇద్దరికి భారతరత్న ఇవ్వాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు కలసికట్టుగా సిఫార్స్ చేయాలని డిమాండ్ చేద్దాం.. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం తప్పకుండా పరిశీలిస్తుందనే నమ్మకం నాకుంది.. 

Friday, June 27, 2014

దొందుకు దొందు..దొందుడుకు చర్యలు..

ఆంధ్రప్రదేశ్,తెలంగాణ ప్రభుత్వాల పరస్పర ప్రతీకార చర్యలు భావి పౌరుల భవిష్యత్తుకు ముప్పుగా మారాయి.. తెలంగాణ ప్రభుత్వం  స్థానికతను సాకుగా చూపి, అర్థం లేని నిభందనలు పెట్టి విద్యార్థులకు ఫీస్ రీయంబర్స్, స్కాలర్షిప్స్ నిరాకరించడం బాధాకరం.. 1956కు ముందు తెలంగాణలో స్థిర పడిన వారే అర్హులట.. బతుకు తెరువు కోసం తెలంగాణకు వలసవచ్చిన కుటుంబాలకు ఇది గొడ్డలి పెట్టుగా మారింది..
ఇక్కడ బాధితులు సీమాంధ్ర వాసులే కాదు.. పొరుగున ఉన్న కర్ణాటక, మహారాష్ట్ర, చత్తీస్ ఘఢ్ రాష్ట్రాల నుండి వలస వచ్చిన వారికీ ఇబ్బంది కరమే.. వీరిలో చాలా మందికి తమ స్వస్థలాల్లో ఆస్తిపాస్తులు కూడా లేవు.. కొందరైతే కాలక్రమంలో కుటుంబ సభ్యులకు, బంధు మిత్రులకు దూరమైపోయారు.. ఇందులో తెలంగాణ వారితో బంధుత్వాలు కలుపుకున్న కుటుంబాలూ ఉన్నాయి.. నా సీమాంధ్ర మిత్రుల్లో చాలా మంది తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి మద్దతు ఇచ్చారు. ఇప్పుడు వారు సైతం నొచ్చుకునే పరిస్థితి ఏర్పడింది..  అర్థం లేని ఆంక్షలు వారి భవిష్యత్తును అంధకారంలోకి నెడుతున్నాయి..

మరోవైపు ఆంధ్రప్రదేశ్ సర్కారు వైఖరి కూడా ఇందుకు భిన్నంగా లేదు.. తెలంగాణ సరిహద్దు జిల్లాల నుండి విజయవాడ్, కర్నూలు నగరాలకు వెళ్లి చదువుకునే విద్యార్ఠులు పెద్ద సంఖ్యలొనే ఉన్నారు.. ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ అధికారులు వారికి బస్ పాసులు ఇవ్వడంపై ఆంక్షలు పెడుతున్నారు.. ఈ సమస్య ఖమ్మం జిల్లా వాసులకు ఎక్కువగా ఉంది..  
చావు పుట్టుకలు మన చేతుల్లో ఉండవు.. తెలిసో తెలియకో ఉపాధి కోసం వలస వచ్చిన వారిని అర్థం లేని ఆంక్షలతో మానసికంగా శిక్షించడం భావ్యమేనా? ఇరు రాష్ట్రాల పాలకులు పగలు, ప్రతీకారాలు వదిలి సామరస్యంగా ఆలోచించాలి..

Thursday, June 26, 2014

30 రోజులు..

కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారం చేపట్టి నెల రోజులు పూర్తయ్యింది.. మోదీ నెల రోజుల పాలన ఎలా ఉందని అడిగితే, చూసే వారి కోణాన్ని బట్టి జవాబు ఉంటుంది..
మోదీ సర్కారు రైలు చార్జీలు పెంచిందని, పెట్రోలియం ఉత్పత్తుల ధరలను నియంత్రించడం లేదని ప్రతిపక్షాలు, ఆయనంటే గిట్టని వారు గగ్గోలు పెట్టేస్తున్నారు. నిజానికి ఇది ఎప్పుడూ ఉండే గోలే.. వారు నరేంద్ర మోదీని గతంలో విమర్శించారు.. ఇప్పుడూ విమర్శిస్తున్నారూ.. భవిష్యత్తులొ కూడా ఇలాగే ఏడుస్తూనే ఉంటారు.. మనం సద్విమర్శలనే స్వీకరిద్దాం..
నరేంద్ర మోదీ ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తూనే, పొరుగు దేశాలతో సత్సంబంధాలకు నాంది పలికారు.. ప్రభుత్వ యంత్రాంగంలో బాధ్యత, జవాబుదారి తనం పెంచే దిశగా ప్రయత్నాలు చేపట్టారు.. ప్రతి ప్రభుత్వ విభాగాన్నీ ఆయతన  నిషితంగా పరిశీలిస్తున్నారు.. దశాబ్ద కాలంగా పేరుకుపొయిన యూపీఏ పాలన తాలూకు చెత్తను తొలగించాలంటే కొంత సమయం పడుతుంది. అయితే విమర్షకులు ఆగేట్టు లేరు.. బిడ్డ పుట్టగానే పరుగెత్తాలనే తొందర వారిది.. మోదీ ప్రధాని అయిన మరునాటి నుండే వారి దాడి మొదలైంది.. ఇలాంటి వారిని పట్టించుకోవాల్సిన అవసరం ఉందంటారా?
ఒక ఆంగ్ల పత్రిక నిర్వహించిన తాజా సర్వే ప్రకారం.. నరేంద్ర మోదీ నెల రోజుల పాలనపై అత్యధిక శాతం ప్రజలు దేశ ప్రజలు సంత్రుప్తిని వ్యక్తం చేశారు.. గత ప్రధానులతో పొలిస్తే 69 శాతం ఉత్తమమని మార్కులిచ్చారు.. దేశం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే సత్తా మోదీకే ఉందన్నారు.. ఇది చాలు నెల రోజుల పాలనపై జడ్జ్ చేసేందుకు..   

Tuesday, June 24, 2014

కాశ్మీర్ కోసం బలిదానం

జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370కి వ్యతిరేకంగా పోరాడి అమరుడైన జనసంఘ్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీని గుర్తు తెచ్చుకుందాం.. ఈ రోజు ఆ మహనీయుని బలిదాన దినం (23 జూన్ 1953)
జూలై 6, 1901న కలకత్తాలో అశుతోష్ ముఖర్జీ, జోగమయా దేవిలకు జన్మించారు శ్యామ ప్రసాద్.. తండ్రి అశుతోష్ ముఖర్జీ కలకత్తా విశ్వ విద్యాలయ తొలి వైస్ ఛాన్సలర్..  ఎంఏ, బారిస్టర్ చేసిన శ్యామ ప్రసాద్ ముఖర్జీ 1934లో 33 ఏళ్ల చిన్న వయసులోనే అదే యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ అయ్యి రికార్డు సృష్టించారు.. కాంగ్రెస్ పార్టీ తరపున అవిభక్త బెంగాల్ అసెంబ్లీకి ఎన్నికైన శ్యామప్రసాద్జీ 1941లో ఆ రాష్ట్ర తొలి ఆర్ధిక మంత్రిగా పని చేశారు.. కాంగ్రెస్ విధానాలతో అసంతృప్తితో హిందూ మహాసభలో చేరారు.. ఆ సంస్థకు అధ్యక్షునిగా పని చేశారు.. బ్రిటిష్ వారు దేశ విభజన తలపెట్టినప్పుడు బెంగాల్ ను ఏకమొత్తంగా పాకిస్తాన్లో చేర్చేందుకు అభ్యంతరం చెప్పారు శ్యామప్రసాద్ ముఖర్జీ.. ఇవాళ పశ్చిమ బెంగాల్ భారత దేశంలోనే ఉందంటే అది ఆయన పోరాట ఫలితమే..
జవహర్ లాల్ నెహ్రూ ప్రధానిగా ఏర్పాటైన స్వాతంత్ర భారత తొలి క్యాబినెట్లో శ్యామప్రసాద్ ముఖర్జీ పరిశ్రమల శాఖమంత్రిగా పని చేశారు.. నెహ్రూ విధానాలతో విసుగొచ్చి 1950లో కేంద్ర మంత్రి పదవికి  రాజీనామా చేశారు.. ఆర్ఎస్ఎస్ సర్ సంఘ్ చాలక్ గోల్వాల్కర్ (గురూజీ) చర్చించిన శామప్రసాద్ ముఖర్జీ 1951 అక్టోబర్ 21న భారతీయ జనసంఘ్ పార్టీని స్థాపించారు ( కాలక్రమంలో భారతీయ జనతా పార్టీగా మారింది)
భారత దేశంలో సంపూర్ణంగా విలీనమైన జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370కి వ్యతిరేకంగా శ్యామ ప్రసాద్ ముఖర్జీ ఉద్యమం ప్రారంభించారు.. జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక జెండా, రాజ్యాంగం, ప్రధానమంత్రి ఉండటాన్ని ప్రశ్నించారు.. ఒకే దేశంలో రెండు రాజ్యాంగాలు, రెండు జెండాలు, ఇద్దరు ప్రధానులు ఉండరాదని గట్టిగా నినదించారు.. కాశ్మీర్ వెళ్లి నిరాహార దీక్ష తలపెట్టారు.. శ్యామప్రసాద్ ముఖర్జీ గుర్తింపు కార్డు లేకుండా కాశ్మీర్ లోకి ప్రవేశించారనే సాకుతో  షేక్ అబ్దుల్లా ప్రభుత్వం మే 11, 1953న ఆయనను అరెస్టు చేసింది.. కాశ్మీర్ జైలులో అనుమానాస్పద పరిస్థితుల్లో జూన్ 23న ప్రాణాలు కోల్పోయారు శ్యామ ప్రసాద్జీ.. ఆయన మరణంపై విచారణ జరిపించాలని జనసంఘ్ డిమాండ్ చేసినా ప్రధాని నెహ్రూ పట్టించుకోలేదు..  ముఖర్జీ మరణం నేటికీ అనుమానాస్పదంగా మిగిలింది..

కాశ్మీర్ కోసం ప్రాణ త్యాగం చేసిన మహానీయుడు శ్యామ ప్రసాద్ ముఖర్జీ.. ఆర్టికల్ 370ని పూర్తిగా రద్దు చేసిన నాడే ఆయనకు నిజమైన నివాళి.. ఇందు కోసం పోడాల్సిన బాధ్యత  ప్రతి భారతీయునిపై ఉంది..

కుబేరుడు అక్రమార్కుడా?

హిందూ మతంలో కుబేరున్ని సంపదకు దేవునిగా పూజిస్తారు.. అష్ట దిక్పాలకుల్లో ఒకరైన కుబేరుడు యక్షులకు రాజు, అలకాపురి ఆయన రాజధాని అని హిందూ పురాణాలు చెబుతున్నాయి.. బౌద్దులు కూడా కుబేరున్ని దేవతగా గుర్తించారు.. సంపదకు అధిపతి అయిన కుబేరుడు మనం కలియుగ దైవంగా పూజిస్తున్న వేంకటేశ్వర స్వామి వారికి అప్పు ఇచ్చాడు.. శ్రీవారి అప్పులు తీర్చేందుకే మనం ఆయనకు ముడుపులు చెల్లించుకుంటున్నాం..
అసలు విషయానికి వద్దాం.. విదేశీ బ్యాంకుల్లో ఉన్న నల్ల ధనాన్ని వెనక్కి రప్పించేందుకు కేంద్రంలోని మోదీ సర్కారు చర్యలు ప్రారంభించింది.. ఈ సందర్భంగా నల్ల ధనాన్ని పోగేసిన వారిని మన మీడియా నల్ల కుబేరులు అని రాస్తోంది.. ఇదేం విడ్డూరం.. కుబేరుడేమన్నా అక్రమంగా ధనం పోగేశాడా?.. అక్రమార్కులను ప్రోత్సహించాడా?..

దేవుడిని గుర్తింపు పొందిన కుబేరున్ని అవమానపరచడం ద్వారా మెజారిటీ ప్రజల మనోభావాలు దెబ్బతింటున్నాయనే స్పృహ ఉందా ఈ రాతగాళ్లకు?

Sunday, June 22, 2014

కొత్త సీసాలో పాత సారా

హైదరాబాద్ పోలీసు వ్యవస్థకు అంతర్జాతీయ ప్రమాణాలు తీసుకు వస్తారట.. ఐక్యరాజ్య సమితి పోలీసుల డ్రెస్ కోడ్, న్యూయార్క్, లండన్ నగరాల్లో ఉన్న పోలీసు విధానాలను అమలు పరుస్తారట.. అత్యాధునిక వాహనాలు, పరికరాలు, సౌకర్యాలు, హంగూ ఆర్భాటం వచ్చేస్తోందట.. ఇదంతా ఆగస్టు 15 నాటికి సిద్దం కావాలని ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు ఆదేశాలు.. బాగానే ఉంది.

మరి ఇప్పుడున్న పోలీసులను ఏం చేస్తారు?.. బ్రాండ్ మారినా కొత్త సీసాలో పాత సారా అన్నట్లే ఉంటే కష్టమే కదా?.. మన పోలీసు శాఖకు ఇంటర్నేషనల్ లుక్ తేవడం మంచిదే.. సాధారణ ప్రజలు పోలీసు అంటేనే భయపడిపోతారు.. ఎందుకలా?.. కారణాలు అందరికీ తెలుసు.. ముందు మన పోలీసులను సంస్కరించడం మంచిది.. ఆ తర్వాతే అధునికత గురుంచి ఆలోచిస్తే బాగుంటుంది.. ఈ అంశంపై సోషల్ మీడియా పోలీసు మిత్రులు కూడా స్పందించాలని కోరుకుంటున్నాను..