Saturday, August 31, 2013

ఈయనకు బాధ్యత లేదా?..

నేను దొంగనా? అని బాధ పడ్డారు.. బొగ్గు కుంభకోణం ఫైళ్లు పోతే నేనేం చేయాలి, నేను కాపలా దారుడినా? అంటూ అమాయకంగా ప్రశ్నించారు.. ఆర్థిక సంక్షోభానికి మేమా కారణం? ఉల్లి ధర పెగితే మాదా బాధ్యత అంటున్నారీ పెద్ద మనిషి.. బంగారం ధర పెరిగినా, రూపాయి ధర పతనమైనా తనకు సంబంధం లేదన్నట్లు తేల్చేశారు.. అన్నింటికీ బీజేపీయే కారుణం, వారి వల్లే సంస్కరణలకు అవరోధం ఏర్పడిందని దుమ్మెత్తి పోశారు.. రాజ్యసభలో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మాట్లాడిన తీరు ఇది..
ప్రధానమంత్రి మట్లాడిన తీరు ఆశ్చర్యాన్ని కలిగించడమే కాదు, బాధ్యతా రహితంగా కూడా ఉంది.. అధికారంలో ఉన్నవారు, దేశాన్ని పరిపాలించే నాయకులు ప్రజలకు జవాబుదారిగా ఉండాలి.. కానీ తమకేదీ సంబంధం లేదని చాటు కోవడం మన్మోహన్ చేతగాని తనాన్ని స్పష్టంగా బయట పెడుతోంది.. ప్రతిపక్షం అన్నప్పుడు అధికారంలో ఉన్నవారిని నిలదీయడం సహజం.. జవాబు చెప్పడం అధికారంలో ఉన్నవారి విధి..
తొమ్మిదేళ్ల యూపీఏ ప్రభుత్వానికి నాయకత్వం వహించిన ప్రధాని మన్మోహన్ సింగ్ తన పాలనలో జరిగిన తప్పిదాలకు బాధ్యత వహించాల్సిన అవసరం లేదా? తనకేమీ సంబంధం లేదని తప్పించుకునే బదులు పదవిని త్యజిస్తేనే మంచిది కదా? 2014 నాటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలవుతుందని సర్వేలన్నీ చెబుతున్నాయి.. అప్పడు కాంగ్రెస్ నాయకులంతా బలిపశువును చేసేది మన్మోహన్ సింగ్ గారినే.. గతంలో పీవీ నరసింహారావు పరిస్థితి ఏమైంది? రావు గారికి పట్టిన దుస్థితి సింగ్ గారికి పట్టక ముందే తెలివైన నిర్ణయం తీసుకోవడం ఉత్తమమేమో?..

Friday, August 30, 2013

బరితెగించిన బర్మా..

మన నాయకుల అసమర్ధత ప్రపంచానికి తెలిసిపోయింది.. నిన్నటి దాకా పాకిస్తాన్, చైనాలు మన సరిహద్దులను కబలిస్తే, ఇవాళ మయన్మార్(బర్మా) కూడా తెగించింది.. మణిపూర్ రాష్ట్రంలోని చందేల్ జిల్లా మోరే పట్టణ సమీపంలోని హాలెన్ ఫాయ్ గ్రామంలోకి చొరబడి స్థావరాన్ని ఏర్పాటు చేసుకుంది మణిపూర్.. పొరుగు దేశానికి బుద్ది చెప్పాల్సిన భారత ప్రభుత్వం ఎప్పటిలాగే..'మమన్మార్ తో ఈ విషయాన్ని చర్చించి సామరస్యంగా సరిహద్దు సమస్యను పరిష్కరిస్తాం' అంటూ చిలుక పలుకులు పలికింది..
దేశ సరిహద్దులను కాపాడుకోలేని మన దౌర్భగ్య పరిస్థితికి ఈ బలహీన దేశం చక్కగా ఉపయోగించుకుంది.. పాకిస్తాన్, చైనాలను మనం గట్టిగా బుద్ది చెప్పి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేదా? మన నాయకుల అతి మంచితనాన్ని బలహీనతగా భావించిన పొరుగు దేశాలు కాలరెగరేస్తున్నాయి..
మన బలహీన విదేశాంగ విధానం కారణంగా ఒకప్పుడు మనకు ఎంతో సన్నిహితంగా ఉంటూ, పెద్దన్నగా గౌరవించిన నేపాల్, శ్రీలంక, మాల్దీవులు క్రమంగా చైనాతో స్నేహం  ప్రారంభించి ప్రయోజనాలు పొందుతున్నాయి.. భూటాన్ విషయంలోనూ మన ప్రభుత్వం ఇటీవల తప్పు చేస్తోంది.. ఇదే విధానం కొనసాగితే భవిష్యత్తుల్లో దేశ సరిహద్దులు మరింత ప్రమాదంలో పడతాయి.. ఇప్పటికైనా భారత విదేశాంగ విధానంలో మార్పు రావాలి..


Wednesday, August 28, 2013

Monday, August 26, 2013

హైదరాబాద్ ఎవరిది?

నాకు దక్కనిది మరొకరికి దక్కకూడనే ఆలోచనా విధానాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?.. ఇది ఉన్మాద మనస్థత్వం కాదా?.. రాష్ట్ర విభజన జరిగితే హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండాలని కొందరు, కేంద్ర పాలిత ప్రాంతంగా ఉండాలని మరి కొందరు వాదిస్తున్నారు.. అసలు హైదరాబాద్ నగరాన్ని తామే అభివృద్ధి చేశామని, ఈ నగరంపై తమకూ హక్కు ఉందని లా పాయింట్ లేవనెత్తుతున్నారు.. తెలంగాణకు ఎంత హక్కు ఉందో తమకూ అంతే హక్కు ఉందని అంటున్నారు..
హైదరాబాద్ ఎవరిది అనే వాదనల్లో కొన్ని చాలా విచిత్రంగా కనిపిస్తున్నాయి.. ఈ మహానగర చరిత్ర తెలిసిన వారెవరూ ఇలా మూర్ఖంగా మాట్లాడరు.. సరిగ్గా 422 సంవత్సరాల క్రితం (1591లో) నిర్మించిన నగరమిది.. కుతుబ్ షాహీలు, అసఫ్ జాహీలు (నిజాంలు) హైదరాబాద్ కేంద్రంగా తమ సామ్రాజ్యాలను నడిపించారు.. 1948లో హైదరాబాద్ భారత దేశంలో విలీనం అయ్యే నాటికి దేశంలోనేని ప్రముఖ నగరాల్లో ఒకటి.. గోల్కొండ, చార్మినార్ లాంటి ప్రఖ్యాత కట్టడాలతో ప్రపంచ ఖ్యాతి పొందిన చారిత్రిక నగరమిది.. భిన్న సంస్కృతులు, జాతులు, మతాలు, భాషల ప్రజలు హైదరాబాద్ లో స్థిరపడ్డారు. నిజాం పాలన అంతం తర్వాత 8 ఏళ్లపాటు హైదరాబాద్ ప్రత్యేక రాష్ట్రంగా(తెలంగాణ, మరాఠ్వాడ, హై.కర్ణాటక) కొనసాగింది..1956లో ఎలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ అవతరించిందో అందరికీ తెలుసు.. (మద్రాసు, కర్నూలు భంగపాట్లు) కనుక చరిత్ర లోతుల్లోకి వెళ్లదలుకోలేదు.. సొంత రాజధాని ఏర్పాటు చేసుకోలేని పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్ర నేతలు కేవలం హైదరాబాద్ నగరం కోసమే భాషాప్రయుక్త రాష్ట్రాల వాదన తెర పైకి తెచ్చి తెలంగాణను కలుపుకొని ఆంద్రప్రదేశ్ ఏర్పాటు చేశారు (ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీలో బెజవాడ గోపాలరెడ్డి, నీలం సంజీవరెడ్డి ప్రసంగాల రికార్డులను పరిశీలించండి)..
హైదరాబాద్ రాష్ట్ర రాజధాని కాబట్టే సహజంగా అన్ని ప్రాంతాల వారు ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఇక్కడకు వచ్చారు.. ఇందులో ఎవరినీ తప్పు పట్టాల్సిన అవసరం లేదు.. కానీ కొందరు సీమాంధ్ర నేతలు తామే హైదరాబాద్ నగరాన్ని అభివృద్ది చేశామని ప్రగల్భాలు పలకడం ఎందుకు? తొండటు గుడ్లు పెట్టడానికి కూడా ఇష్టపడని నగరాన్ని అంతర్జాతీయ నగరంగా మార్చామని, రాళ్ల హైదరాబాద్ను రతనాల హైదరాబాద్గా మార్చామని రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎందుకు చేస్తారు? ఆంధ్రప్రదేశ్ రాజధానిగా మారకముందే అన్ని శాసనసభ, సచివాలయం తదితర మౌళిక సదుపాయాలు హైదరాబాద్ నగరంలో అందుబాటులో ఉన్నాయి.. హైదరాబాద్ భౌగోళికంగా దేశం నడిబొడ్డున ఉంది.. ఇక్కడ వాతావరణం సమశీతోష్ణ స్థితిలో ఉంటుంది.. ఈ కారణంగానే రక్షణ రంగంతో సహా ఎన్నో కేంద్ర ప్రభుత్వం సంస్థలు హైదరాబాద్ ను తమ కీలక స్థావరంగా మలచుకొన్నాయి.. ఇది సీమాంధ్ర నాయకుల కృషి అని ప్రచారం చేసుకోవడం హస్యాస్పదం.. ఇక్కడ అర్థం కాని విషయం ఒకటి ఉంది.. 1956 నాటికే హైదరాబాద్ దేశంలో 5వ పెద్ద నగరంగా ఉంది.. ఇప్పటికీ అదే స్థానంలో ఉంది.. హైదరాబాద్ నగర అభివృద్ధి తమ ఘనతే అని డబ్బా కొట్టుకునే నాయకులు దీన్ని కనీసం2,3,4 స్థానాలకైనా తీసుకెళ్ల గలిగారా? దేశంలోని అన్నిప్రముఖ నగరాలతో సమానంగానే ఇక్కడ అభివృద్ధి సాధిస్తూ వచ్చింది కదా? నగరంలో ఇబ్బడి ముబ్బడిగా జనాభా, కాలుష్యం పెంచడం.. చెరవులు, ఖాళీ స్థలాలను మింగేయడం.. హైటెక్ సిటీ, ఫ్లయ్ ఓవర్లు కట్టడం, నేతాజీలు ఇబ్బడి ముబ్బడిగా ఇక్కడ ఆస్తులు పెంచుకోవడం మాత్రమే అభివృద్ధికి కొలమానాలా?..
భౌగోళికంగా సీమాంధ్ర ప్రాంతానికి ఏ దారిలో చూసినా 200 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది.. ఎటు నుండి చూసినా రెండు, మూడు తెలంగాణ జిల్లాలు అడ్డుగా ఉంటాయి.. ఈ పరిస్థితుల్లో హైదరాబాద్ శాశ్వత ఉమ్మడి రాజధానిగా ఉండటం సాధ్యమేనా? ఇది సాధ్యం కాదని తెలిసే సీమాంధ్ర నాయకులు కేంద్ర పాలిత ప్రాంత వాదనను తెరపైకి తెచ్చారు.. కేంద్ర పాలిత ప్రాంతం అంటే ఇక్కడ ప్రజాప్రతినిధుల పాత్ర తగ్గిపోతుంది.. ఇదేం కుట్ర?  హైదరాబాద్ నగరానికి తాగునీరు, విద్యుత్తు, చివరకు పాలు, కూరగాయల లాంటి నిత్యావసరాలు ఈ జిల్లాల నుండే రావాలి.. హైదరాబాద్ నగరపాలక సంస్థ ఇప్పడు గ్రేటర్ గా అవతరించి ఇతర తెలంగాణ జిల్లాలైన రంగారెడ్డి, మెదక్ సరిహద్దులకు విస్తరించింది.. నిజానికి పరిశ్రమలన్నీ ఈ జిల్లాల్లోనే ఉన్నాయి.. ఇలాంటి పరిస్థితుల్లో హైదరాబాద్ నగరాన్ని విడదీయడం సాధ్యమేనా? ఏరకంగా చూసినా హైదరాబాద్ చారిత్రకంగా, సాంస్కృతికంగా తెలంగాణ ప్రాంతానికి గుండెకాయ లాంటిది.. 57 సంవత్సరాల అనుబంధంతో హైదరాబాద్ మాదని వాదిస్తూ, 422 సంవత్సరాల అనుబంధం ఉన్న తెలంగాణ ప్రజలకు ఈ నగరాన్ని దూరం చేయడం న్యాయమా? ఈ మహానగరం తమకు దక్కే అవకాశం లేదు కాబట్టి తెలంగాణకు కూడా దూరం చేయాలనే శాడిజమే ఇందులో కనిపిస్తోంది.. అంటే తాను పెళ్లి చేసుకునే అవకాశం లేని అమ్మాయిపై యాసిడ్ పోయడం లాంటి వికృత ఆనందం అన్నమాట..
హైదరాబాద్ దూరమైతే నింగి విరిగి నేల మీద పడుతుందా? భూగోళం బద్దలౌతుందా? తెలుగు వారికి రెండు రాష్ట్రాలు, రెండు రాజధానులు ఉంటే ఎవరికి నష్టం? తెలంగాణ వాసులు స్వపరిపాలన కోరుకోవడం నేరమా? రాష్ట్ర విభజన వల్ల సీమాంధ్ర విద్యార్థులకు, నిరుద్యోగులకు ఎలా నష్టమో చెప్పగలరా? సీమాంధ్రకు కొత్త రాజధాని వస్తే ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు ఆ ప్రాంతం మరింతగా అభివృద్ది చెందుతుందనేది వాస్తవం కాదా? శరవేగంగా మారిపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వ ఉద్యోగాల పాత్ర క్రమంగా తగ్గిపోతోంది.. ప్రయివేటు రంగంలోనే ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.. ప్రయివేటు ఉద్యోగాలకు ప్రాంతాలతో సంబంధం ఉండదు.. బతుకు తెరువు కోసం ఎవరు ఎక్కడికైనా పోయి పని చేసుకోవచ్చు.. ఈ అంశాన్ని ప్రజలకు అర్థమయ్యేలా ఎందుకు చెప్పడం లేదు?
హైదరాబాద్ నగరంలో అన్ని ప్రాంతాల ప్రజలు నివసిస్తున్నారు.. చాలా కాలంగా వారి మధ్య సామరస్యపూర్వక వాతావరణం ఉంది.. ఇక్కడ అందరికీ జీవించే హక్కు ఉంది.. రాజకీయ నాయకులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఇంకా సమైక్యాంధ్ర పేరిట ఇరు ప్రాంతాల ప్రజల్లో అనవసర అపోహలు సృష్టిస్తూ, సామరస్యపూర్వక వాతావరణాన్ని దెబ్బతీస్తున్నారు.. రాజకీయ పార్టీలు రెండు నాల్కల ధోరణితో ఓటు బ్యాంకు రాజకీయాలు నడుపుతున్నాయి.. సీమాంధ్ర ప్రజలైనా, తెలంగాణ ప్రజలైనా ఇలాంటి స్వార్థ నాయకుల మాటలు నమ్మకుండా సామరస్యతను కాపాడుకోవాలి..

Sunday, August 18, 2013

ఒమర్జీ సమాధానం మీ దగ్గరే ఉంది..

కాశ్మీరీలను భారత దేశంలో భాగంగా ఎందుకు చూడటంలోదే చెప్పాలని డిమాండ్ చేశారు జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా.. దేశ ప్రధాన స్రవంతి నుండి కాశ్మీర్ ను విడిగా చూడటాన్ని తాను ఎన్నోసార్లు ప్రశ్నించానని, దానికి సమాధానం తెలుసుకోవడం కష్టంగా ఉందని వాపోయారాయన.. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఒమర్ అబ్దుల్లా వేసిన అమాయక(?) ప్రశ్న ఇది..
ఒమర్ అబ్దుల్లా ఈ ప్రశ్నను తన తాత షేక్ అబ్దుల్లాను(జమ్మూ కాశ్మీర్ తొలి సీఎం) అడిగి ఉంటే భాగుండేది.. ప్రస్తుతం ఆయన లేరు కనక, కనీసం తండ్రి ఫరూఖ్ అబ్దుల్లాను(మాజీ సీఎం) అయినా అడగాల్సింది.. అసలు కాశ్మీర్ ఈ దేశంలో అంతర్భాగం కాదనే భావన అక్కడి ప్రజల్లో ఎందుకు కలిగింది?.. దీనికి కారణం కాశ్మీరీ నాయకులు, అక్కడి వేర్పాటువాద శక్తులు కాదా? ఆ రాష్ట్రాన్ని ఏళ్ల తరుబడి పాలించిన అబ్దుల్లాల కుటుంబానికి ఈ విషయంలో సంబంధం లేదా?
ఈ ప్రశ్నలకు మూలాలన్నీ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 370లోనే ఉన్నాయి.. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం భారత దేశంలో వినీనం అయ్యే సందర్భంలో కుదిరిన ఒప్పందం ప్రకారం ఆ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తూ  భారత రాజ్యాంగంలో 370వ అధికరణ  చేర్చారు.. వాస్తవానికి ఈ అధికరణ తత్కాలికమే అయినా, ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ అధికరణను అడ్డు పెట్టుకొనే తాము మిగతా భారత దేశ రాష్ట్రాలకు భిన్నం అని వాదిస్తుంటారు అక్కడి నేతలు.. ఆర్టికల్ 370 ప్రకారం భారత దేశంలోని ఇతర రాష్ట్రాల వారు స్థిరాస్థుల క్రయవిక్రయాలు జరపరాదు. ఇక్కడి భూములపై వేరే ప్రాంతాల వారికి హక్కులు కల్పించరాదు. కానీ పాకిస్తాన్ ఆక్రమితక కాశ్మీర్ వాసులకు మాత్రం ఇలాంటి నిబంధనలు లేదు.. కాశ్మీరీలు మాత్రం భారత దేశంలో ఎక్కడైనా స్థిరాస్తులు కొనుగోలు చేయవచ్చు..  ఇలాంటి అడ్డగోలు నిబంధనలను అడ్డం పెట్టుకొని వేర్పాటు వాద నాయకులు 1953 నాటి పూర్వ స్థితిని పునరుద్దరించాలని డిమాండ్ చేస్తున్నారు..  దీని ప్రకారం భారత దేశం తరహాలోనే కాశ్మీర్ కు కూడా ప్రధాని పదవి ఉంటుంది.. భారత జాతీయ పతాకం మాదిరే కాశ్మీర్ కు ప్రత్యేక పతాకం ఉంటుంది..
ఆర్టికల్ 370కి వ్యతిరేకంగా 1953లో జనసంఘ్ (బీజేపీ పూర్వ నామం) అధ్యక్షడు డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ సత్యాగ్రహం చేసేందుకు కాశ్మీర్ వెళ్లగా, షేక్ అబ్దుల్లా ప్రభుత్వం అరెస్టు చేసింది.. అక్కడి జైలులోనే ఆయన అనుమానాస్పద స్థితిలో మరణించారు.. కానీ 370 నిబంధన మాత్రం కొనసాగుతూనే ఉంది..
కాశ్మీర్ వేర్పాటు వాద నాయకులు తాము ప్రత్యేక దేశ హోదా కోసం, పాకిస్తాన్తో విలీనం కోసం ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు.. వీరికి వంత పాడే రీతిలో ఇప్పడు అధికారంలో ఉన్న నేషనల్ కాన్ఫరెన్స్ (అబ్దుల్లా పార్టీ) మరింత ప్రత్యేక ప్రతిపత్తి పేరిట కేంద్ర ప్రభుత్వంపై వత్తిడి తెస్తోంది.. ఆనాటి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ మిత్రుడైన షేక్ అబ్దుల్లాకు దొడ్డి దారిలో కట్టబెట్టిన అధికారం ప్రజాస్వామ్యం ముసుగులో అవిచ్ఛిన్నంగా కొనసాగుతోంది.. 1947లో పాకిస్తాన్ స్వాధీనం చేసుకున్న భూభాగం (పీవోకే) తిరిగి స్వాధీనం చేసుకునే మాట దేవుడెరుగు, పాకిస్తాన్ ప్రేరిత ఉగ్రవాదాన్ని రూపు మాపేందుకు షేక్ అబ్దుల్లా, ఆయన తనయుడు ఫరూఖ్ అబ్దుల్లా, మనవడు(ప్రస్తుత సీఎం) చేసిందేమీ లేదు..
వేర్పాటు వాదులు కాశ్మీర్ లోయలో కాశ్మీరీ పండిట్ (హిందువులు)లపై అత్యాచారాలు చేసినా, వారి ఆస్తులను స్వాధీనం చేసుకొని తరిమేసినా నోరు మెదపలేదు.. వారి రక్షణ కోసం ఎలాంటి చర్యలు తీసుకోలేదు.. ఈనాటికీ లోయ నుండి తరిమేయ బడిన లక్షలాది మంది పండిట్లు జమ్మూ, ఢిల్లీల్లో జీవచ్చవాలుగా బతుకుతున్నారు.. వారి సమస్యను ఇటు కేంద్ర ప్రభుత్వం, అటు రాష్ట్ర ప్రభుత్వ పట్టించుకోదు..
ఇప్పడు చెప్పండి ఒమర్ అబ్దుల్లాజీ మీరు అడుగుతున్నప్రశ్నలకు జవాబు ఎవరు చెప్పాలి?..

Saturday, August 17, 2013

వీరేనా మన నాయకులు?..

ఏ దేశానికైనా ఆర్థిక, రక్షణ రంగాలు అత్యంత కీలకం.. ఈ రెండూ నిర్వీర్యమైపోతే.. పరిస్థితి ఏమిటో ఊహించారా?... ఆ దేశం పతనం కావడం ఖాయం..
ఇది మరే దేశం సమస్యో కాదు.. 67 ఏళ్ల స్వతంత్ర  భారత దేశం ఇప్పడు ఎదుర్కొంటున్న పరిస్థితి ఇది.. రూపాయి విలువ గతంలో ఎన్నడూ లేనంత రికార్డు స్థాయికి పడిపోయింది. అమెరికన్ డాలర్తో మారకం విలువ రూ.62.03 అయ్యింది.. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు సరి సమానంగా ఉన్న డాలర్-రూపాయిల మధ్య క్రమంగా వచ్చిన గ్యాప్ ఇప్పడు ఇంత వరకూ వచ్చింది.. ఆర్థిక పరిస్థితి త్వరలో గాడిలో పడుతుందని ప్రధాని మన్మోహన్ సింగ్ అధికారంలోకి వచ్చింది మొదలు గత 9 ఏళ్లుగా చెబుతూనే ఉన్నారు.. అందుకు విరుద్దంగా దిగజారుతూనే వస్తోంది.. భారత దేశం పరువు గంగలో కలుస్తోంది..
ఈ దేశంలో ప్రపంచ స్థాయి ఆర్థిక వేత్తలకు కొదవలేదు.. ప్రధాని మన్మోహన్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లూవాలియా, రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ రంగరాజన్, ప్రస్తుత ఆర్థిక మంత్రి చిదంబరం.. అసలు వీరంతా భారత దేశాన్ని ఏం చేద్దామనుకుంటున్నారో అర్థం కావడం లేదు.. దివాళా అంచుకు తీసుకెళ్లి ఏ దేశాన్నికి తాకట్టు పడతారోనని భయమేస్తోంది.. రూ.27 సంపాదించిన వాడు పేదరికంలోంచి బయట పడ్డట్లేనని ప్రకటించినప్పుడే ఈ ఆర్థికవేత్తల మానసిక స్థితిపై అనుమానం వేసింది.. కెన్యాలో బస్తాడు కరెన్సీ నోట్లు తీసుకెళితే గానీ బ్రెడ్డు ముక్క రాదట.. రేపు మన రూపాయి పరిస్థితి కూడా అలాగే అవుతుందని భయమేస్తోంది..
ఇక దేశ భద్రత విషయానికి వద్దాం.. సరిహద్దులో పాకిస్తాన్ సైన్యం మన సైనికులకు చంపేసి పోతున్నా ఏం చేయలేని స్థితికి దిగజారింది మన ప్రభుత్వం.. భారత సరిహద్దుల్లో అనునిత్యం పాకిస్తాన్ కాల్పులతో కవ్వింపు చర్యలకు పాల్పడి, ఉగ్రవాదులను మన దేశంలోకి చొప్పిస్తున్నా సోయి లేకుండా వ్యవహరిస్తున్నారు మన దేశ పెద్దలు.. అటు చైనా కూడా తరచూ కాలు దువ్వుతూనే ఉంది.. లడక్, అరుణాచల్ లోకి పదే పదే చైనా సైన్యం చొరబడుతున్నా దిక్కు తోచని విధంగా వ్యవహరిస్తోంది మన్మోహన్ ప్రభుత్వం.. ఎక్కడైనా తప్పు చేసినోడే భయపడతాడు.. కానీ యూపీఏ ప్రభుత్వం పొరుగు దేశాలు రెచ్చిపోతున్నా వారిని చూసీ చూడనట్లు వదిలేయడంలోని ఆంతర్యం ఏమిటి?..
పాకిస్తాన్, చైనాలకు గట్టి బుద్ది చెప్పలేనంతగా దిగజారిపోయామా మనం?.. న్యాయం మన వైపు ఉన్నప్పుడు భయం ఎందుకు.. ప్రధాని మన్మోహన్, రక్షణ మంత్రి ఆంటోనీలకు ప్రతి విషయం చర్చలతో పరిష్కరించుకుంటామనడం ఊత పదంగా మారిపోయింది.. దేశ ప్రజలు వీరి చేతగానితనాన్ని చూసి అసహ్యించుకుంటున్నారు..
స్వాతంత్ర్య దినోత్సవం నాడు ప్రధాని మన్మోహన్ ఎర్రకోట నుండి జాతిని ఉద్దేశించి ఏం మాట్లాడారో ఓ సారి గుర్తు చేసుకోండి.. పాకిస్తాన్తో సమస్యలు ఉన్నాయట.. అవేమిటో చేప్పే ధైర్యం లేదా? దేశ ప్రజలకు స్పూర్తి దాయకమైన సందేశాన్ని ఇవ్వాల్సిన పెద్ద మనిషి అశ్వద్ధామ హత: కుంజర అన్నట్లు మాట్లాడితే ఏమనాలి? పాకిస్తాన్, చైనా 1,15,600 చ.కి.మీ భూభాగాన్ని మన దేశం నుండి ఆక్రమించుకున్నాయి.. ప్రస్తుత యూపీఏ సర్కారు ఈ భూభాగాన్ని తిరిగి సాధించుకునే దిశగా ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదు.. కనీసం ఉన్న భూభాగాలైనా కాపాడితే అదే పది వేలు..

Thursday, August 15, 2013