Tuesday, February 27, 2018

ఆ ఘటన జరగకపోతే చరిత్ర మరోలా ఉండేది..



ఆ రోజు ఆ ఘటన జరగకపోయి ఉంటే.. దేశ చరిత్ర గతి మరోలా ఉండేది..
నేను ఇక్కడ మహాత్మ గాంధీనో, నాథూరాం గాడ్సేనో సమర్థించడమో, విమర్శించడమో చేయడం లేదు.. ఇది ఒక సంక్షిప్త విశ్లేషణ మాత్రమే..
జనవరి 30, 1948, సాయంత్రం 5.17గం..
ఢిల్లీలోని బిర్లా హౌస్ దగ్గర ప్రార్ధన సమావేశానికి వెళ్లుతున్న మహాత్మా గాంధీని నాథూరాం గాడ్సే తుపాకీతో కాల్చి చంపాడు. ఆయనకు తోడ్పడింది నారాయణ ఆప్టే అనే మరో యువకుడు..
దేశ విభజన సందర్భంగా జరిగిన మత కల్లోలాల్లో లక్షలాది మంది అమాయక పౌరులు మరణించారు. ప్రజల మానప్రాణాలకు రక్షణ కరువైంది ఇళ్లూ ఆస్తులూ కోల్పోయిన అభాగ్యులెందరో.. పాకిస్తాన్ వైపు నుంచి భారత్ లోకి కట్టుబట్టలతో తరలి వచ్చిన కుటుంబాలు అసంఖ్యాకం.. వీరంతా కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అదే సమయంలో దేశ విభజన సందర్భంగా జరిగిన ఒప్పందం ప్రకారం పాకిస్తాన్ కు భారత్ ఇవ్వాల్సిన రూ.55 కోట్లను వెంటనే ఇవ్వాలంటూ మహాత్మగాంధీ నిరాహార దీక్ష చేపట్టడం ఆగ్రహం తెప్పించింది.
అప్పటికే గాంధీజీపై తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్న నాథూరాంగాడ్సే ఆయనను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు.. తన పథకాన్ని అమలులో పెట్టేశాడు.. గాడ్సే, ఆప్టేలకు ఉరిశిక్ష అమలైంది. తోడ్పడిన ఇతర నిందితులకు జైలు శిక్ష పడింది.. ఇవి బయటకు కనిపించిన సత్యాలు..
గాంధీ హత్యలో ఎలాంటి ప్రమేయం లేకున్నా నిందలు ఎదుర్కొన్న సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్.. ఈ సంస్థపై వెంటనే నిషేధం విధించారు.. వాస్తవానికి నాథూరాంగాడ్సే ఒకప్పుడు ఆరెస్సెస్ లో ఉన్నా, కాలక్రమంలో ఆ సంస్థతో విబేధించి హిందూ మహాసభలో చేరాడు..
గాంధీజీ హత్య తర్వాత జరిగిన దర్యాప్తులో ఆరెస్సెస్, హిందూ మహాసభలకు ఎలాంటి ప్రమేయం లేదని తేలిపోయింది. ఇది పూర్తిగా వ్యక్తిగతంగా చేసిన పని అని గాడ్సే కూడా స్పష్టం చేశాడు. కానీ జరగాల్సిన నష్టం అప్పటికే జరిగిపోయింది. గాంధీజీ హత్యతో ఎలాంటి సంబంధం లేకున్నా అన్యాయంగా అరెస్టయిన మహానేత వినాయక్ దామోదర్ సావర్కర్.. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడి రెండు యావజ్జీవ శిక్షలకు గురైన మహాయోధుడు సావర్కర్. అలాంటి మహానీయుడిపై అన్యాయమైన నిందలు మోపారు. ఆయన హిందూ మహాసభ అధ్యక్షుడు కావడమే కారణం.
గాంధీజీ హత్య జరగకపోయి ఉంటే భారత దేశ చరిత్ర మరోలా ఉండేని చెప్పవచ్చు.. అప్పటికే వయసు మీద పడిన కాంగ్రెస్ నాయకులు తమ జీవిత కాలంలో పదవులు అనుభవించలేమనే భయంతో దేశ విభజనతో కూడిన స్వాతంత్ర్యాన్ని అంగీకరించారు. విభజన సందర్భంగా జరిగిన మారణహోమం, విషాద ఘటనలపై దేశ ప్రజలంతా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. పాకిస్తాన్ లో మాన ప్రాణాలు, ఆస్తులు కోల్పోయి కట్టుబట్టలతో భారత దేశానికి తరలి వచ్చిన వారికి ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందలేదు. అలాంటి కష్ట సమయంలో వారికి అండగా నిలిచింది ఆరెస్సెస్, హిందూ మహాసభలు.. పెద్ద సంఖ్యలో శిబిరాలను ఏర్పాటు చేసి సహాయ, పునరావాస కార్యక్రమాలు నిర్వహించారు.
ఆరోజుల్లో స్వాతంత్ర్యానంతరం జరిగిన మొదటి సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచే అవకాశాలు పెద్దగా లేవు.. గెలిచినా బొటాబొటీ మెజారిటీయే ఉండేది.. హిందూ మహాసభకు అధికారం దక్కకున్నా పెద్ద సంఖ్యలోనే సీట్లు వచ్చి ఉండేవి.. తర్వాత వచ్చే ఎన్నికల్లో ఈ పార్టీ అధికారం చేపట్టే అవకాశాలుండేవి. ఆరెస్సెస్ రాజకీయ పార్టీ కాదు. హిందువుల్లో ఐక్యత, దేశభక్తిని ప్రేరేపించే సంస్థగా అప్పటికే గుర్తింపు వచ్చింది ఆ సంస్థకు..
దురదృష్టవశాత్తు గాంధీ హత్యతో పరిస్థితి తారుమారైపోయింది. నిషేధం కారణంగా ఆరెస్సెస్ విస్తరణలో కొంత కాలం జాప్యం జరిగిపోయింది. హిందూ మహాసభ పూర్తిగా రాజకీయాలకు దూరమై కనుమరుగైంది. అదే సమయంలో సానుభూతి ఓట్ల వెల్లువలో కాంగ్రెస్ పార్టీ తొలి సార్వత్రిక ఎన్నికల్లో సునాయాసంగా గెలిచింది. నెహ్రూ వంశ పారంపర్య-కుటుంబ పాలనకు పునాది పడింది.. దేశంలో కుహనా లౌకికవాదం, ఓటు బ్యాంకు రాజకీయాలు, అవినీతి, కుంభకోణాలకు బీజం వేసిన కాంగ్రెస్ పార్టీని మట్టి కరిపించేందుకు చాలా ఏళ్లే పట్టింది.
డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ స్థాపించిన జనసంఘ్ తో ఎంతో మంది స్వయం సేవకులు చేరారు. ఎమర్జెన్సీ తర్వాతి కాలంలో జనసంఘ్ భారతీయ జనతా పార్టీగా రూపొందింది. జాతీయవాదాన్ని సమర్ధించే బీజేపీకి సహజంగానే ఆరెస్సెస్ స్వయంసేవకుల అండదండలు ఉంటాయి..
గాంధీజీతో ఎవరికి ఎన్ని విభేదాలు ఉన్నా తాను నమ్మిన సిద్ధాంతాల కోసం జీవితాంతం కట్టుబడిన గొప్ప దేశభక్తుడు ఆయన.. భారతమాత ప్రియ పుత్రుడు.. కోట్లాదిమంది ప్రజల హృదయాల్లో మహాత్ముడిగా నిలిచిపోయారు.
మహాత్మా గాంధీ స్వాతంత్ర్యం తర్వాత కాంగ్రెస్ పార్టీని రద్దు చేయాలని కోరుకున్నారు. కానీ ఆ పార్టీ నాయకులు చెట్టుపేరు చెప్పుకొని కాయలమ్ముకునేందుకు సిద్దమై మహాత్ముని సూచనను పాటించలేదు. మహాత్మగాంధీ వారసులు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. వీరి స్థానంలో సోకాల్డ్ వారసత్వం పుట్టుకొచ్చింది. నకిలీ గాంధీలు దేశాన్ని పాలించారు. శతాధిక చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీని వారసత్వ రాజకీయ పార్టీగా మార్చేశారు.
కాంగ్రెస్ నాయకులు, ఇప్పటికీ వల్లించే అరిగిపోయిన రికార్డులాంటి అబద్దం ఏమిటంటే.. గాంధీజీని చంపింది ఆరెస్సెస్ అని.. చరిత్ర తెలిసిన దేశ ప్రజలు ఎవరూ ఇప్పుడు ఈ అబద్దాన్ని నమ్మేందుకు సిద్దంగా లేరు..
ఓ మహాత్మా.. నీవు కోరుకున్నట్లు స్వాతంత్ర్యానంతరం కాంగ్రెస్ పార్టీ రద్దు జరగలేదు.. ఇప్పుడు కాంగ్రెస్ ముఖ్త్ భారత్ దిశగా జరుగుతున్న అంతిమ ప్రయత్నాలకు అయినా నీ ఆశీస్సులు అందించు..

Monday, January 29, 2018

సీపీఎం చైనా భజన సిగ్గు సిగ్గు..

పిల్ల చచ్చినా పురిటి కంపు చావలేదు అన్నట్లు చైనాలో కమ్యూనిజం చచ్చినా దాని ప్రేతాత్మ భారత కమ్యూనిస్టులకు ఆరాధనీయంగా కనిపిస్తోంది. భారత దేశానికి చైనా శత్రువని చిన్న పిల్లవాన్ని అడిగినా చెబుతాడు. అయినా సిగ్గు లేకుండా చైనా భజన చేస్తున్నారు సీపీఎం నాయకులు.. ముఖ్యంగా కేరళ సీఎం పినరయ్ మన దేశానికి వ్యతిరేకంగా, చైనాకు అనుకూలంగా చేసిన భజనకు ఆ పార్టీ క్షమాపణలు చెప్పుకోవాల్సిందే..
చైనా పేరుకు మాత్రమే కమ్యూనిస్టు దేశం.. కానీ అక్కడ ఆచరణలో ఉన్నది మాత్రం పెట్టుబడిదారీ వ్యవస్థ.. ప్రజాస్వామ్యం లేదు.. ఎన్నికలు ఉండవు. ఏక పార్టీ వ్యవస్థ ఉన్న నియంతృత్వ దేశం.. చైనాలో కార్మిక చట్టాలు పేరుకు మాత్రమే.. కనీస వేతనాలు ఇవ్వరు.. కార్మికులు 10-12 గంటల గొడ్డు చాకిరీ చేస్తారు. మన దేశంలో కార్మిక ఉద్యమాలమీదే బతికే కమ్యూనిస్టులు కార్మిక వ్యతిరేక చైనాను ఎలా సమర్ధిస్తున్నారు?
అమెరికా, ఇజ్రాయిల్ దేశాలను కాకుండా గుంట నక్క చైనానే మన దేశం విశ్వసించాలని సీపీఎం నాయకులు భావిస్తున్నారా?.. మన దేశ ప్రయోజనాలకు పూర్తి వ్యతిరకేకమైన చైనాను తెలివున్న వాడెవడూ సమర్ధించడు..
చైనాలో కమ్యూనిస్టు పాలన ఏర్పడింది మొదలు నేటి వరకూ మన దేశానికి వ్యతిరేకంగానే పని చేస్తోంది. పంచశీల ఒప్పందానికి తూట్లు పొడచి భారత దేశంపై దండెత్తిన నీతి లేని చరిత్ర ఆ దేశానిది. అక్సాయ్ చిన్ ప్రాంతాన్ని చెరబట్టడం, తాజాగా డోక్లామ్ లో దురాక్రమణ చరిత్ర లోకానికి తెలియనిది కాదు. అంతే కాదు లద్దాక్, అరుణాచల్ సహా సరిహద్దుల్లో మనతో కయ్యానికి కాలు దువ్వుతోంది చైనా.. బ్రహ్మపుత్ర నది మన దేశంలోకి రాకుండా దారి మళ్లించే ప్రయత్నాలు చేస్తోంది.
మన దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలను చేపట్టిన పాకిస్తాన్ కు సిగ్గు లేకుండా మద్దతు ఇస్తూ, వివాదాస్పద ఆక్రమిత కాశ్మీర్ మీదుగా ‘సీపీఈసీ’ కారిడార్ నిర్మిస్తోంది. పాకిస్తాన్ లో ఉంటూ భారత దేశంలో ఉగ్రవాద దాడులను నిర్వహించిన మౌలానా మసూద్ అజర్ ను ప్రపంచ ఉగ్రవాదిగా ప్రకటించే ప్రయత్నాలకు మోకాలడ్డుతోంది. భారత ప్రయోజనాలకు వ్యతిరేకంగా శ్రీలంక, నేపాల్, మాల్దీవ్స్, బంగ్లాదేశ్, మయాన్మార్ దేశాల్లో వ్యాపార, సైనిక స్థావరాలను ఏర్పాటు చేస్తోంది.
1962 చైనా యుద్ద సమయంలో మన దేశంలో కమ్యూనిస్టు పార్టీ సీపీఐ, సీపీఎంగా చీలిపోయింది. ఒకరు రష్యా, మరొక్కరు చైనాకు ఉపగ్రహాలుగా మారారు. చైనా మన దేశంపై దండెత్తడాన్ని సిగ్గు లేకుండా స్వాగతించింది సీపీఎం. నాటి నుంచి నేటి వరకూ సీపీఎం నీతి మారలేదు. తాజాగా ఉత్తర కొరియా నియంత కిమ్ భజనలు కూడా మొదలు పెట్టారు కేరళ సీపీఎం నాయకులు. భారత దేశంలో స్వేచ్ఛా వాయువులు పీలుస్తూ, ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని అనుభవిస్తూ నియంతృత్వ చైనాను కీర్తించడంలో ఏమైనా అర్థం ఉందా?
అడుగడుగునా భారత దేశానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న చైనాకు వత్తాసు పలకడం దేశ ద్రోహం కాదా?.. ఇందుకు సీపీఎం పార్టీ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పుకోవాలి..

రథ సప్తమి



సకల జీవరాశికి ప్రాణశక్తి, ఉత్తేజాన్ని కలిగించే అధి దేవత సూర్యుడు. కోట్లాది సంవత్సరాలుగా విశ్వమండలానికి వెలుగులు ప్రసాదిస్తున్న సూర్య భగవానుడు సాక్షాత్తు శ్రీమహావిష్ణువు ప్రతిరూపంగా పూజలు అందుకుంటున్నాడు..
మాఘశుద్ద సప్తమి సూర్యభగవానుడు పుట్టిన తిథి. సూర్య గమనం ప్రకారం ఉత్తరాయనం, దక్షిణాయనం అని రెండు విధాలు. ఆషాఢ మాసం నుండి పుష్య మాసం వరకు దక్షిణాయనం. సూర్యరథం దక్షిణాయనంలో దక్షిణ దిశగా పయనిస్తుంది. తరువాత సూర్యుడు మకరరాశి ప్రవేశం ఉత్తరాయన ప్రారంభ సూచకముగా రథసప్తమి అని పేరు వచ్చింది. అందుకే ఈరోజు పవిత్రదినముగా భావించి సూర్యున్ని ఆరాధిస్తారు.
రోజులు ఏడు . సూర్యుడి రథం గుర్రాలు ఏడు . సప్తాశ్వారథమారూఢం - రోజులనే గుర్రాలుగా కిరణాల దారులమీద కోట్ల ఏళ్లుగా అలుపెరుగని రథం మీద ఆగని , ఆగకూడని ప్రయాణం సూర్యుడిది.
మొక్కల పత్రహరిత ప్రాణం పాదుకొల్పడానికి సూర్యుడు కారణం . మన శరీరంలో విటమిన్ లు ఏర్పడి ఎముకలు నిలబడడానికి కారణం సూర్యుడు . నీరు ఆవిరి అయి మేఘం ఏర్పడడానికి కారణం సూర్యుడు . నానా మురికి ఎండి చెత్త తగ్గడానికి కారణం సూర్యుడు . కుళ్ళినవి అలాగే మిగలకుండా వాడిపోయేలా కావడానికి కారణం సూర్యుడు.
సూర్యుడు అసాధారణ పండితుడు . లెక్కల ఉపాధ్యాయుడు . అపరిమిత శక్తి ప్రదాత . అపరిమిత వేడితో తను రగిలిపోతూ - లోకాలకు వెలుగులు పంచే త్యాగి . అంతులేని వెలుగులు విరజిమ్మే అతిపెద్ద విద్యుత్ ఉత్పత్తి వ్యవస్థ
(24.01.2018)

నిస్సుగ్గు ఉల్లంఘన


గంపెడు మందిని కనుడు కాదు.. గుప్పెడు బుద్ది కూడా ఉండాలి.. ఈ ద్విచక్ర వాహనదారున్ని చూడండి.. హెల్మెట్ లేదు.. భార్య, ముగ్గురు పిల్లలు.. పైగా దర్జాగా సిగ్నల్ జంప్.. చాంద్రాయణగుట్ట ఫ్లై ఓవర్ కింద ఇటీవల కనిపించిన దృశ్యం..
(22.01.2018)

కేజ్రీ స్వయంకృతం


ఆడలేక మద్దెల ఓడు అన్నట్లు ఉంది కేజ్రీవాల్ వ్యవహారం. రాజ్యాంగ విరుద్ధంగా పార్లమెంటరీ కార్యదర్శుల పదవులు సృష్టించి ఎమ్మెల్యేలకు కట్టడం ఎందుకు? ఎన్నికల సంఘంతో వారిపై వేటు వేయించుకునుడు ఎందుకు?.. చేజేతులరా నష్టం చేసుకొని ప్రధాని మోదీపై ఏడ్వడం ఎందుకో?
ఇలా చేయి అంటూ మోదీ ఏమన్నా నీకు సలహా ఇచ్చి ఇరికించిండా కేజ్రీ?.. 
(20.01.2018)🤔
(

హజ్ సబ్సిడీ రద్దు సమంజసం



ఏ మతంలో అయినా తీర్థ యాత్రలకు ప్రాధాన్యత ఉంటుంది. భక్తులు ఇష్ట దైవాన్ని దర్శించుకొని మొక్కు చెల్లించుకుంటారు. ఈ యాత్రల కోసం తమ కష్టార్జితం నుంచి కొంత మొత్తం పక్కన పెట్టుకోవడం ఆనవాయితీ..
దురదృష్టవశాత్తు ఈ యాత్రలపై దశాబ్దాల క్రితమే రాజకీయ కన్ను పడింది.. ఆయా వర్గాలను ప్రసన్నులను చేసుకోవడానికి ప్రభుత్వాలు నిధులు ఇవ్వడం మొదలు పెట్టాయి.. ఇందులో భాగమే ముస్లింలకు హజ్ యాత్ర సబ్సిడీ.. కొన్ని రాష్ట్రాల్లో క్రైస్తవులకు జెరూసలేం యాత్ర సబ్సిడీ కూడా మొదలు పెట్టారు.. దీన్ని చూసి మెజారిటీ మతస్తులైన హిందువులు తమ తీర్థ యాత్రలకు ప్రభుత్వాలు సబ్సిడీలు ఇవ్వకపోగా, పన్నులు వేయడానికి పలు సందర్భాల్లో ప్రస్థావించారు.. 
తాజాగా కేంద్ర ప్రభుత్వం హజ్ యాత్ర సబ్సిడీ నిలిపివేయడం ఆహ్వానించదగిన పరిణామం. నిజానికి ఈ సబ్సిడీ ఇస్లాం వ్యతిరేకం అని గతంలో ఆ మతానికి చెందిన ప్రముఖులు, ఎంపీలు కూడా స్పష్టం చేశారు.. కష్టపడి సంపాదించిన సొమ్ముతోనే యాత్ర చేయాలి, తప్ప ఇతరుల దాయాదక్షిణ్యాల సొత్తుతో హజ్ వెళ్లొద్దని వారి వాదన..
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు హిందూ మత ఉత్సవాలు, జాతరలు, కుంభమేళాలకు డబ్బు ఖర్చు చేయడాన్ని కొందరు మేతావులు తప్పు పడుతున్నారు.. అయితే ఇక్కడ ఒక అంశాన్ని గ్రహించాలి.. ఈ యాత్రలకు పెద్ద సంఖ్యలో భక్తులు, ప్రజలకు సౌకర్యాలు, భద్రత కల్పించడం ప్రభుత్వ విధి.. ఏ మతాలకు సంబంధించిన ఉత్సవాలు అయినా ప్రభుత్వాలపై ఈ బాధ్యత ఉంటుంది.
హజ్ యాత్ర సబ్సిడీ నిలిపి వేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి ఏటా రూ.700 కోట్ల రూపాయలు ఆదా అవుతుంది.. ఈ సొమ్మును ముస్లిం బాలిక విద్యపై ఖర్చు చేయడం సముచిత నిర్ణయమే..
(17.01.2018)

ఇది న్యాయమేనా?



ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం అని మనం చెప్పుకుంటాం.. కానీ దురదృష్టవశాత్తు తాజా పరిణామాలు మన ప్రజాస్వామ్యానికే మచ్చ తెచ్చే విధంగా ఉన్నాయి..
ప్రజాస్వామ్య వ్యవస్థలో శాసన, న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్థల పాత్రను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఈ మూడు వ్యవస్థలు దేని పని అది సక్రమంగా పని చేస్తేనే వ్యవస్థ విజయవంతంగా సాగి ప్రజలు సుఖ సంతోషాలతో జీవిస్తారు.. ఈ విషయాలు అన్నీ మనం చిన్నప్పుడే స్కూలు పాఠాల్లో చదువుకొని ఉంటాం..
శాసన, న్యాయ వ్యవస్థల ఘర్షణ కొత్తేమీ కాదు. మన రాజ్యాంగం న్యాయ వ్యవస్థకు స్వతంత్ర ప్రతిపత్తిని కట్టబెట్టింది.. ఇందులో ప్రభుత్వాల జోక్యాన్ని పరిమితం చేసింది..
ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు న్యాయ వ్యవస్థ తమకు అండగా ఉండాలని కోరుకోవడం సహజం. ప్రభుత్వ పెత్తనాన్ని న్యాయ వ్యవస్థ ఒప్పుకోదు.. ఇది మంచిదే.. 
ఇటీవలి కొన్ని పరిణామాలు గమనిస్తే కోర్టులు పరిధిని మించి క్రియాశీలకంగా పని చేస్తున్నాయా అనిపిస్తుంది.. పలు సందర్భాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు ఇవ్వడం, విధానాలు, చర్యలను తప్పు పట్టడం చూస్తున్నాం.. 
ఇలాంటి జోక్యం ప్రజలకు మేలు చేసేదిగా ఉంటే ఆహ్వానించవచ్చు.. కానీ ప్రతి విషయంలో బెత్తం పట్టిన మాస్టారు మాదిరిగా ఉంటే ఇబ్బందిగానే ఉంటుంది.. ఇంత ఓవర్ యాక్షన్ అవసరమా అనిపిస్తోంది.. సుప్రీం కోర్టు న్యాయమూర్తుల నియామకంలో ప్రభుత్వ జోక్యం వద్దంటున్నారు.. సరే మరి వారు వేసుకున్న కొలీజియం ఏమి చేస్తోంది? జడ్జీల నియామకాల్లో జాప్యం కారణంగ ఎన్నో కీలకమైన కేసులు పెండింగులో పడిపోయాయి. 
ఇక అసలు విషయానికి వద్దాం..
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి వ్యతిరేకంగా నాలుగు న్యాయమూర్తులు గళం ఎత్తారు.. ఇక్కడ నేను సీజేను కానీ తిరుగుబాటు జడ్జీలను కానీ సమర్ధించడం లేదు.. వ్యతిరేకించడం లేదు.. వారి వెనుక ఎవరు ఉన్నారు?.. ఎందుకు ఈ పని చేయిస్తున్నారు అనేది కూడా చర్చించడం లేదు.. కానీ వీరు మీడియాకు ఎక్కి దేశ సర్వోత్తమ న్యాయస్థాన ప్రతిష్టను మాత్రం మంటకలిపారు.. వీరి టార్గెట్ ప్రధాన న్యాయమూర్తి.. ఈ వ్యవహారంలో తమకూ సమిష్టి బాధ్యత ఉందని గుర్తించడంలో పూర్తిగా విఫలం అయ్యారు.. ప్రధాన న్యాయమూర్తి కూడా పట్టు విడుపులతో వ్యవహరించాల్సింది..
అంతా అయిపోయాక ఆకులు పట్టుకున్న చందాన వీధిన పడ్డ వ్యవహారాన్ని అంతర్గతంగా పరిష్కరించుకోవాలనే ప్రతిపాదన మరీ విచిత్రం.. వీధిన పడి పరువు తీసుకున్న తర్వాత, దేశ ప్రజల దృష్టిలో పలచన అయ్యాక ఎన్ని రాజీలు, సర్దుబాట్లు చేసుకున్నా ఫలితం ఏముంటుంది?
(15.01.2018)