Sunday, February 26, 2017

ఏ శక్తీ కశ్మీర్ ను విడదీయలేదు..

 జమ్మూ కశ్మీర్ రాష్ట్రం భారత దేశంలో ఎప్పటికీ అంతర్భాగం.. ఏ శక్తి విడదీయలేదు అని సంకల్ప్ దివస్ చాటి చెప్పింది.. జమ్మూ కశ్మీర్ స్టడీ సెంటర్ – హైదరాబాద్ చాప్టర్ ఆధ్వర్యంలో కాచిగూడ భద్రుకా కాలేజీలో ఈ కార్యక్రమం జరిగింది.. దేశమంతా తమ వెంట ఉందనే నమ్మకాన్ని కశ్మీర్ పండిట్లకు, అక్కడి ప్రజలకు కల్పించాలని సంకల్ప్ దివస్ వక్తగా విచ్చేసిన జేకేఎస్సీ ఢిల్లీ డైరెక్టర్ అసుతోష్ భట్నాగర్ తెలిపారు.. ఇటీవల కశ్మీర్ లోయలో పర్యటించి వచ్చిన భారతీయ ప్రజ్ఞ ఎడిటర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అక్కడి పురాతన దేవాలయాలు, తరిమివేయబడిన పండిట్ల శిథిల గృహాల పరిస్థితిని విరించారు..  కార్యక్రమానికి జేకేఎస్సీ హైదరాబాద్ ఛాప్టర్ ఉపాధ్యక్షుడు బీహెచ్ఆర్ చౌదరి అధ్యక్షత వహించారు.. కార్యక్రమంలో రాకా సుధాకర్, ఎన్వీకే ప్రసాద్, క్రాంతి దేవ్ మిత్ర, సుమంత్, అను శర్మ పిళ్లై, విక్రమ్ సింహా, కృష్ణ (కన్నన్), సోమేశ్వరరావు, రవి చావలి, సాయిబాబా, నీలేశ్, వీరప్ప గార్లతో పాటు ఇతర మిత్రులు పాల్గొన్నారు..

Saturday, February 25, 2017

అటూ మనమే.. ఇటూ మనమే..

మహారాష్ట్రలో ఇప్పుడు అధికార పక్షమైనా, ప్రతిపక్షమైనా జాతీయవాదులే.. ఇటీవలి స్థానిక ఎన్నికల్లో అధికార బీజేపీ అఖండ విజయం నమోదు చేసుకుంది.. తర్వాతి స్థానంలో ఎన్డీఏ భాగస్వామి అయిన శివసేన నిలవడం విశేషం..
ఈ మార్పు చూస్తుంటే నాకు తమిళనాడు రాజకీయాలు గుర్తుకు వస్తున్నాయి.. అక్కడ కాంగ్రెస్ పార్టీకి అర్ధ దశాబ్దం కిందే ద్రవిడ పార్టీలు పాతరేశాయి.. 1967లో తమిళనాట అధికారం కోల్పోయిన కాంగ్రెస్ ఇప్పటికీ కోలుకోలేదు.. డీఎంకే, ఏఐఏడీఎంకేల మధ్యే అధికార మార్పిడి జరుగుతోంది..
ఇప్పుడు చూడబోతే మహారాష్ట్రలోనూ అదే దృశ్యం కనిపిస్తోంది.. గతంలో మిత్రపక్షాలైన బీజేపీ, శివసేన పార్టీలు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో, నిన్నటి స్థానిక ఎన్నికల్లో విడిగా పోటీ చేశాయి.. అక్కడ కాంగ్రెస్, ఎన్సీపీలో ఉనికిని కోల్పోయాయి.. వారి ఓట్లు అన్నీ బీజేపీ వైపు మరలినట్లు స్పష్టం అవుతోంది.. గతంలో రాజ్ ఠాక్రే శివసేన నుండి విడిపోయి మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన పెట్టడంతో ఆ పార్టీకి కళ్లెం పడింది.. ఇప్పుడు ఎంఎన్ఎస్పీ ఓట్లు తిరిగి శివసేనకు పడుతున్నాయని తెలుస్తోంది..
ఎన్టీఏలో భాగస్వామిగా ఉన్న శివసేన తన ఉనికిని కాపాడుకోడానికి అప్పుడప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వం నుండి బయటకు వస్తామని హెచ్చరించండం ద్వారా సొంత అస్థిత్వాన్ని కాపాడుకోవాలని ప్రయత్నిస్తోంది.. అయితే ఓటర్లు కాంగ్రెస్, ఎస్పీపీలను పక్కన పెట్టి బీజేపీ, శివసేనల్లో ఎవరికో ఒక్కరికి ఓటేస్తున్నారు..మొత్తానికి అక్కడ జాతీయవాద పార్టీలే గెలుస్తున్నాయన్నమాట..

Friday, February 24, 2017

ఓం నమశ్శివాయ


భారతమాత సేవలో శివైక్యం

జన్మస్థలం: మరాఠ్వాడా.. కార్యస్థలం: తెలుగు నేల.. చేపట్టిన పని: భారతమాత సేవ.. తుది శ్వాస వరకూ ఇదే పనిలో ఉన్నారు హల్దేకర్ జీ..
మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిలాల హల్దా గ్రామంలో ఫిబ్రవరి 5, 1930 నాడు జన్మించారు శ్రీరామచంద్ర సదాశివ హల్దేకర్.. హైదరాబాద్‌లో బీఎస్సీ చదువుతున్న సమయంలో వారికి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ పరిచయమైంది.. చదువు వదిలేసి సంఘ ప్రచారక్‌గా పని ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో విభాగ్ ప్రచారక్, సహ ప్రాంత ప్రచారక్, ప్రాంత ప్రచారక్, క్షేత్ర ప్రచారక్ తదితర బాధ్యతలు నిర్వర్తించారు..  పలు ప్రకృతి విపత్తుల సమయంలో హల్దేకర్ జీ నేతృత్వంలో స్వయం సేవకులు పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహించారు
ఎంతో మంది స్వయంసేవకులు, వారి కుటుంబాలతో ఆత్మీయ సంబంధాలు ఏర్పరచుకున్నారు హల్దేకర్జీ.. తెలుగు భాషను నేర్చుకొని మరాఠీ నుండి ఎన్నో గ్రంధాలను అనువదించారు.. ఈ క్రమంలో డాక్టర్జీ జీవిత చరిత్రను పెను తుఫానులో ద్వీప స్థంబం, గురూజీ జీవిత చరిత్రను ఓం రాష్ట్రాయ స్వాహా పేరిట తెలుగులో తీసుకువచ్చారు..
హల్దేకర్ జీ పిత్రార్జితంగా వచ్చిన యావదాస్తిని సంఘానికి ఇచ్చేశారు.. కొంత కాలంగా శ్వాసకోస వ్యాధితో బాధపడుతూ చకిత్స పొందుతున్నారు.. రాంభావు హల్దేకర్‌జీ తన 87వ ఏట ఫిబ్రవరి 23న మధ్యాహ్నం 12.15 గంటలకు బర్కత్‌పురాలోని కేశవ నిలయంలో తుదిశ్వాస విడిచారు. మరణానంతరం ఆయన కోరికపై నేత్రదానం జరిగింది..
దేశమాత సేవ కోసం, సమాజం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన జ్యేష్ఠ ప్రచారకులు హల్దేకర్జీ సేవలు చిరస్మరణీయం.. ఓం శాంతి..

Wednesday, February 22, 2017

జమ్మూ కశ్మీర్ సంకల్ప దివస్

బ్రిటిష్ వారు స్వాతంత్ర్యం ఇస్తూనే భారత దేశాన్ని విడగొట్టారు.. కొత్తగా ఏర్పడిన పాకిస్తాన్ మొదటి నుండి జమ్మూ కశ్మీర్ రాష్ట్రం మీద కన్నేసింది.. మహారాజా హరిసింగ్ అక్టోబర్ 26, 1947 నాడు జమ్మూ కశ్మీర్ ను భారత దేశంలో సంపూర్ణంగా విలీనం చేశారు.. ఆ సమయంలో పాకిస్తాన్ సైన్యం కిరాయి మూకల ముసుగులో ఈ రాష్ట్రంలోని గిల్గిత్ బాల్టిస్తాన్ భూభాగాన్ని ఆక్రమించుకున్నాయి.. భారత సైన్యం ఈ ప్రాంతాన్ని తిరిగి స్వాధీనం చేసుకునే తరుణంలోనే ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ఈ అంశాన్ని ఐక్య రాజ్య సమతి దృష్టికి తీసుకుపోయారు.. అప్పటి నుండి యధాతథ స్థితి పేరుతో ఆ భాగం పాకిస్తాన్ ఆక్రమణలోనే ఉండిపోయింది.. మరోవైపు అక్సాయ్ చిన్ ప్రాంతాన్ని పాకిస్తాన్, చైనాకు దారాదత్తం చేసింది..

జమ్మూ కశ్మీర్ విషయంలో పాకిస్తాన్ మన దేశంతో ఇప్పటికి మూడు యుద్దాలు చేసి చావు దెబ్బతిన్నది.. అయినా బుద్ది మారకుండా ఈ రాష్ట్రాన్ని భారత్ నుండి విడదీసేందుకు ప్రయత్నాలు సాగిస్తూనే ఉంది.. ఉగ్రవాదానికి, వేర్పాటు వాదానికి ఆజ్యం పోస్తూ కశ్మీర్ లో నిత్యం ఆరాచకాలను కొనసాగిస్తోంది.. జమ్మూ కశ్మీర్ ను వివాదాస్పద ప్రాంతంగా పేర్కొంటూ  పదే పదే అంతర్జాతీయం చేస్తోంది..
ఈ నేపథ్యంలో భారత పార్లమెంటు ఫిబ్రవరి 22, 1994 నాడు పార్లమెంటులో చేసిన తీర్మాణం చరిత్రలో నిలచిపోయింది.. ప్రధాని పీవీ నరసింహారావు నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వ చేసిన ఈ తీర్మాణాన్ని ప్రతిపక్ష భాజపాతో సహా అన్ని పక్షాలు  సమర్ధించాయి.. జమ్మూ కశ్మీర్ విషయంలో మన దేశ దృఢ సంకల్పాన్ని, కృత నిశ్చయాన్నిఈ తీర్మాణం ప్రపంచానికి చాటి చెప్పింది..
ఈ తీర్మానంలో నాలుగు అంశాలున్నాయి.
1) జమ్మూ కశ్మీర్ భారత్ లో అంతర్భాగం. దీన్ని వేరుచేసే ఏ ప్రయత్నాన్నైనా అన్ని పద్ధతుల్లో అడ్డుకుంటాం. 
2) భారతదేశపు ఐక్యత, సార్వభౌమత్వం, భౌగోళిక ఏకాత్మతను అడ్డుకునే ఏ ప్రయత్నాన్నైనా ఎదుర్కొనే సంకల్పం, సామర్థ్యం భారత్ కు ఉంది. 
3) దురాక్రమణ ద్వారా ఆక్రమించిన జమ్మూ కశ్మీర్  ప్రాంతాలనుంచి పాకిస్తాన్ వైదొలగాలి.
4) భారత దేశ అంతర్గత వ్యవహారాల్లో ఎలాంటి జోక్యాన్నీ భారత్ సహించదు.
చాలా స్పష్టంగా ఉన్న ఈ తీర్మాణం దేశ ప్రజల ఆకాంక్షలను, మనోభావాలను ప్రతిబింబిస్తోంది..

ఈ తీర్మాణం చేసిన ఫిబ్రవరి 22వ తేదీని జమ్మూ కశ్మీర్ సంకల్ప దివస్ గా దేశ వ్యాప్తంగా జరుపుకుంటున్నాం.. 

Tuesday, February 21, 2017

మన భాషను రక్షించుకోవడం ఎలా?

ప్రపంచంలో అంతరిస్తున్న భాషలో జాబితాలో తెలుగు కూడా ఉందంటే కాస్త ఆందోళన చెందాల్సిన విషయమే.. మన కళ్ల ముందు కనిపిస్తున్న వాస్తవాల మీద దృష్టి పెడదాం.. ఒక్కసారి ఆలోచించండి..
1.మీ పిల్లలు తెలుగు మాధ్యమంలోనే చదువుతున్నారా?
2.తెలుగు పత్రికలను స్పష్టంగా చదవగలరా?
2. అన్య భాషా పదాలు లేకుండా తెలుగులో మాట్లాడుతున్నారా?..
ఈ మూడు ప్రశ్నల్లో ఏ ఒక్కదానికీ ఔననే సమాధానం లేకపోతే మా ఇంట్లో తెలుగు భాషకు ప్రమాద ఘంటికలు మొగుతున్నట్లే లెక్క..
తెలుగు భాషా సంస్కృతుల పరిరక్షణ కోసం ప్రభుత్వం సక్రమంగా పని చేయడం లేదని, ఆంగ్లానికే పెద్ద పీట వేస్తున్నారని ఆరోపిస్తుంటాం.. కానీ భాషను రక్షించుకునే విషయంలో మన వంతు పాత్ర ఏమిటి అనే ప్రశ్నకు మాత్రం సమాధానం లేదు.. తెలుగు మాధ్యమం పాఠశాలలు మూత పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నాం.. కానీ మన పిల్లలను మాత్రం ఆంగ్ల మాద్యమ పాఠశాలలకే పంపుతాం.. టీవీ యాంకర్లు భాషను ఖూనీ చేస్తున్నారని నిందిస్తున్నాం.. కానీ అలాంటి కార్యక్రమాలు ఎందుకు చూస్తున్నామనే విషయాన్ని ఆలోచించం.. మీలో తెలుగు అక్షరాలను వరుసక్రమం తప్పకుండా రాసే వారు ఎంత మంది?.. ఇంతకీ తెలుగు భాషలో అక్షరాలు ఎన్ని ఉన్నాయి?.. కొన్ని అక్షరాలను ఎందుకు మింగేశాం? ఈ రోజు మనం మాతృ భాషను వదిలేసి అన్య భాషల వెంట పడుతున్నాం.. రేపు మన ధర్మం, సంస్కృతి, సాంప్రదాయాలను కూడా ఇలాగే వదిలేస్తామా?
తెలుగు భాషను రక్షించుకునే విషయంలో వ్యక్తిగా మనవంతు కర్తవ్యాన్ని నిర్వహిద్దాం.. సమాచార సాంకేతిక రంగం విస్తరించిన ఈ రోజుల్లో మాతృభాషను రక్షించుకునే అవకాశాలు గతంలో కన్నా మెరుగయ్యాయి.. దీన్ని సద్వినియోగం చేసుకోగలిగితే మన భాషకు ఎప్పటికీ ఢోకా ఉండదు.. ఎన్ని భాషలైనా నేర్వండి.. కానీ మీ మాతృభాషను మాత్రం మరచిపోకండి..

అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం (21 ఫిబ్రవరి) సందర్భంగా ఆలోచించాల్సిన విషయాలు ఇవి..

Monday, February 20, 2017

తొలి ఏడాది పూర్తి చేసుకున్న WE CAN CHANGE

WE CAN CHANGE  విజయవంతంగా ఏడాది కాలం పూర్తి చేసుకుందని చెప్పడానికి సంతోషం వ్యక్తం చేస్తున్నాను.. సరిగ్గా సంవత్సరం క్రితం 20 ఫిబ్రవరి, 2016 నాడు రాత్రివేళ WE CAN CHANGE ఆవిర్భవించింది.. ఇప్పటికే ఎన్నో గ్రూప్స్ ఉన్నాయి మరో గ్రూప్ అవసరమా? అని కొందరు మిత్రులు ప్రశ్నించారు.. ఇతర గ్రూప్స్ కు మనం పూర్తిగా భిన్నంగా పోతున్నాం.. చూస్తూనే ఉండండి అని వారికి చెప్పాను.. మరునాటి ఉదయానికే ఫలితం కనిపించింది.. నా నమ్మకం వమ్ము కాలేదు..

సమాజంలోని వివిధ వర్గాల్లో ఉన్న జాతీయవాద సోషల్ మీడియా మిత్రులతో ప్రారంభమైన WE CAN CHANGEవిజయానికి కారణాలను నేను ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.. నిజానికి ఇందులో నా గొప్పదనం ఏమీ లేదు.. ఇదంతా సమిష్టి కృషితో సాధ్యమైన విజయం.. నేను ఎన్నో గ్రూపులలో ఉన్నాను.. మన సభ్యులు కూడా ఇతర గ్రూప్ లలో ఉన్నారు.. అందరికీ సొంత గ్రూప్స్ ఉన్నాయి.. ఆయా గ్రూప్ లలో క్రియాశీలకంగా ఉన్నవారిని గుర్తించి వారితో కొత్త ప్రయోగం చేశాను.. ఏ గ్రూప్ నూ మనం పోటీగా భావించలేదు.. ఎందుకంటే అందరూ మన మిత్రులే..
జాతీయవాద భావజాల ప్రచారమే WE CAN CHANGE ప్రధాన ఎజెండా.. Nation First అనేది మన నినాదం.. ఇది కేవలం ఒక నినాదం కాదు.. ఆచరణ.. ఇతర గ్రూప్స్ కు మనం భిన్నంగా పోదామని ఆరంభంలోనే అనుకున్నాం.. కాపీ + కట్ + పేస్ట్ సాధ్యమైనంత వరకూ వద్దని నిర్ణయించుకున్నాం.. చర్చలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చాం.. ఇందుకు అనుగుణంగా రూపొందించిన నియమ నిబంధనలను సభ్యులంతా పాటించారు..
WE CAN CHANGE కేవలం సోషల్ మీడియా ఛాటింగ్స్ కే పరిమితం కాదు.. Social Media for Social Change అనే నినాదంతో సామాజిక సేవను కూడా చేపట్టింది.. ఇందులో భాగంగా గ్రూప్ లోని మిత్రుల సహకారంతో కుడుమూరు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో పుస్తకాల పంపిణీ చేపట్టాం.. భవిష్యత్తులోనూ ఈ ప్రయత్నాన్ని కొనసాగిస్తాం..
ఈ ఏడాది కాలంలో సహకరించిన మిత్రులందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను.. ముఖ్యంగా అడ్మిన్స్, టీమ్ బృందం అందిస్తున్న సహకారం విస్మరించలేనిది.. వారి తోడ్పాటు లేకుంటే ఈ గ్రూప్ నిర్వహణ ఏ మాత్రం సాధ్యమయ్యేది కాదు.. మన గ్రూప్ ఇదే విధంగా ముందుకు సాగేందుకు సభ్యులంతా తోడ్పాటును అందించాలని కోరుకుంటున్నాను.. ధన్యవాదాలు..