Sunday, July 12, 2015

ఏదీ స్వచ్ఛ హైదరాబాద్..

ఏవీ నిరుడు చీపురు పట్టిన చేతులు.. చెత్త ఎత్తిన మీ భుజములెక్కడ?.. ఏరీ ఆ మహా నాయకులు?.. కార్మికుల సమ్మె వేళ చెత్తతో నిందిన వీధుల్ని చూడ మనసు అంగీకరించం లేదా?.. స్వచ్ఛ్ భారత్, స్వచ్ఛ తెలంగాణ, స్వచ్ఛ హైదరాబాద్ నాలుగు రోజుల ముచ్చటేనా.. నిరంతరం కొనసాగాలి అంటిరి కదా ఈ ఉద్యమం.. అప్పుడే అస్త్ర (చీపురు) సన్యాసమేల?..

మున్సిఫల్ కార్మికులు సమ్మెతో హైదరాబాద్ మహా నగరంతో సహా తెలంగాణ నగరాలు, పట్టణాలు కంపు కొడుతున్నాయి.. వీధుల్లో పేరుకున్న చెత్తతో దుర్గంధం వ్యాపిస్తోంది.. ఇక రోగాలే తరువాయి.. కార్మికుల సమ్మెతో చెత్త ఎత్తేవారు లేదు.. మరి నిన్న మొన్నటి దాకా స్వచ్ఛ మంత్రం పఠించిన నేతాజీలు ఏమి చేస్తున్నారు?.. ఫోటోలకు ఫోజులు ఇవ్వడంతోనే స్వచ్ఛ ఉద్యమం?. రండి వీధుల్లోకి చెత్త ఎత్తిపోయండి.. మీ చిత్తశుద్దిని చాటుకోడానికి ఇంతకన్నా మంచి తరుణం ఏముంటుంది? 

Saturday, July 11, 2015

ఛాయ్.. ఇంటర్నెట్

Tea with Wi-Fi.. ఛాయ్ తాగండి  మొబైల్ ఇంటర్నెట్ వాడుకోండి.. అంటున్నాడు సంజయ్ బఘుల్.. వదోదరలో రోడ్డు పక్క టీకొట్టు వ్యాపారి అతడు.. అతని దగ్గర ఛాయ్ తాగడానికి వచ్చే వారికి వైఫై సదుపాయం కల్పించాడు.. అదీ ఉచితంగానే.. నా దగ్గర టీ తాగపోయినా పర్వాలేదు.. ఇంటర్నెట్ యాక్సెస్ ఫ్రీగానే చేసుకోవచ్చని వినయంగా చెబుతున్నాడు ఈ ఛాయ్ వాలా.. జనం హాయిగా ఛాయ్ తాగుతూ తమ మొబైల్ ఫోన్లలో ఇంటర్నెట్ సౌకర్యాన్ని ఆస్వాదిస్తూ, సంజయ్ కు థాంక్స్ చెప్పుకుంటున్నారు..
జనానికి ఉచితంగా వైఫై సదుపాయాన్ని కల్పించడం వల్ల సంజయ్ బఘుల్ ఏమైనా అధనంగా ప్రయోజనం పొందుతున్నాడా? అదేమీ లేదంటున్నాడీ ఛాయ్ వాలా.. మరెందుకు ఈ పని చేస్తున్నాడు.. ప్రధాని నరేంద్ర మోదీ ‘డిజిటల్ ఇండియా’ స్వప్నం తనను ఆకట్టుకుందని సంజయ్ చెబుతున్నాడు.. 2019 నాటి దేశంలోని రెండున్నర లక్షల గ్రామాలకు ఫాస్ట్ ఇంటర్నెట్ కల్పించే డిజిటల్ ఇండియా కార్యక్రమానికి బడా పారిశ్రామికవేత్తలు ఇస్తున్న సహకారం ఏమిటో తెలియదు కానీ ఓ ఛాయ్ వాలా ఉడతా భక్తిగా తన వంతు సాయం ఇలా చేస్తున్నాడు..

ఇంటర్నెట్ సదుపాయాన్ని ఉచితంగా అందించడం అసాధ్యమేమీ కాదు. కానీ అలా చేస్తే తమ వ్యాపార సౌధాలు కూలుతాయని మొబైల్ సర్వీస్ ప్రొవైడర్ల భయం.. దేశ వ్యాప్తంగా ఉన్న వ్యాపార సంస్థలు గట్టిగా తలచుకుంటే సాకారం చేయవచ్చు.. బహిరంగ ప్రదేశాల్లో, షాపింగ్ సెంటర్లలో ఇప్పటికే చాలా చోట్ల ఉచిత వైఫై సౌకర్యం ఉంది.. దీన్ని మరింతగా విస్తరించాల్సి అవసరం ఉంది.. ఈ విషయంలో సంజయ్ బఘుల్ అందరికీ ఆదర్శంగా నిలిచాడు..

Friday, July 10, 2015

చరిత్ర చెప్పే బాహుబలి వేరు

‘బాహుబలి’ హిట్టా ఫట్టా?.. అని అడిగాడో మిత్రుడు. ఏ బాహుబలీ.. అంటూ ఎదురు ప్రశ్న వేశా.. అతను అయోమయంగా నా వైపు చూశాడు.. జర్నలిస్టువై ఉండి ఆ మాత్రం తెలీదా అనే జాలి చూపు కనిపించింది..
అవును.. చరిత్ర విద్యార్థిగా నాకు తెలిసిన ‘బాహుబలి’ వేరు మరి.. ఇది తెలుసుకోవాలంటే కర్ణాటకలోని శ్రావణ బెళగొళ వెళ్లాల్సిందే.. జైన తీర్థంకరుల్లో ఒకరైన భారీ గోమఠేశ్వరుని విగ్రహం కనిపిస్తుంది.. ఈ గోమఠేశ్వరుడి అసలు పేరు బాహుబలి..
జైన గ్రంధాల ప్రకారం పోతనపురం (బోధన్, నిజామాబాద్) రాజధానిగా ఉన్న రాజ్యాన్ని పాలించిన ఇక్ష్వాకు వంశానికి చెందిన వృషభనాధుని కుమారుడే బాహుబలి.. అతనికి భరతుడు అనే సోదరుడు కూడా ఉన్నాడు.. ఇద్దరూ పరాక్రమవంతులే.. తండ్రి తర్వాత రాజ్యాధికారం కోసం పోటీ పడ్డారు. యుద్దంతో అపార నష్టం ఎందుకని ద్వంద్వ పోరాటం చేశారు. బాహుబలి విజయుడైనా భరతున్ని చంపకుండా వదిలేశాడు. తనకు రాజ్యాధికారం వద్దని, దీన్ని తృణప్రాయంగా వదిలేస్తున్నానని ప్రకటించాడు బాహుబలి.. అప్పటికప్పుడు సన్యాస దీక్ష తీసుకున్నాడు..
కాలక్రమంగా బాహుబలి గోమఠేశ్వరునిగా ప్రసిద్దికెక్కాడు.. జైన తీర్థంకరుల్లో ఒకడిగా మారాడు.. శ్రావణ బెళగొళలో గోమఠేశ్వరుని 58 అడుగుల భారీ విగ్రహం రూపొందింది.. ఇది సంక్షిప్తం చరిత్ర.. వివరంగా వెళ్లాలంటే చాలా ఉంది.

నాకు తెలిసిన బాహుబలి, సినిమా బాహుబలి వేర్వేరు.. రాజమౌళి భారీ వ్యయంతో తీసిన చిత్రం కథకు, చరిత్రకు సంబంధం లేదు.. పేరు యాదృచ్చికమే.. అందుకే పెద్దగా చర్చ వద్దని భావిస్తున్నాను..

చెత్త శుద్దిలో చిత్త శుద్ధి ఎంత?

స్వచ్ఛ్ భారత్, స్వచ్ఛ తెలంగాణ, స్వచ్ఛ హైదరాబాద్.. నినాదం ఏదైనా మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలనే స్ఫూర్తి దీని వెనుక ఉంది..  కార్యక్రమంలో సమాజంలోని అన్ని వర్గాలు చేరి భాగస్వాములయ్యాయి. చీపుళ్లు పట్టి వీధులు, పార్కుల్లోని చెత్తను, మట్టిని ఊడ్చి కుండీల్లో వేస్తున్నాం.. అంత వరకూ ఓకే.. ఆ తర్వాత ఏం జరుగుతోంది..
ఈ చెత్తనంతా తరలిండం పారిశుధ్య కార్మికుల పని.. ఎంత ఊడ్చి చెత్త పోగేసినా దాన్ని తీసుకెళ్లేది మాత్రం వీరే.. మనం ఎంత స్వచ్ఛతను పాటించినా ఈ పని జరగకపోతే చేసిందతా నిష్ప్రయోజనమే.. ఇప్పుడు జరుగుతున్నది అదే..
చాలా కాలంగా అపరిశ్కృతంగా ఉన్న తమ సమస్యలను, డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోనందుకు నిరసనగా పారిశుధ్య సిబ్బంది సమ్మెకు దిగారు.. సమస్యను పరిష్కరించే విషయంలో ప్రభుత్వం విఫలమైంది. ఇరువురూ రాజీ పడటంలేదు.. కార్మికుల డిమాండ్లలో చాలా వరకూ న్యాయమే కనిపిస్తోంది.. కానీ వాటికి ఒప్పుకుంటే ఆర్థిక భారం పెరిగిపోతుందని  ప్రభుత్వ వాదన..
ఈ సమస్యకు పరిష్కారం దొరకకపోవడంతో హైదరాబాద్ మహా నగరంలో కొద్ది రోజులుగా వీధుల్లో చెత్త గుట్టలుగా పేరుకుపోతోంది.. కంపు భరించపోతున్నాం.. పరిస్థితి ఇలాగే కొనసాగితే రాజధాని నగరం రోగగ్రస్థం కావడం ఖాయం..

స్వచ్ఛ కార్యక్రమాల్లో ప్రజలను భాగస్వాములను చేయడమే కాదు, దీనితో ముడిపడి ఉన్న ఇతర అంశాలను ప్రభుత్వం కూడా పరిగణలోకి తీసుకోవాలి.. ఈ చిత్తశుద్ధి లేకపోతే ‘స్వచ్ఛ’ కార్యక్రమాన్నీ ‘శుద్ధ’ దండగే అవుతాయి..

Monday, July 6, 2015

దేశ సమగ్రత కోసం డాక్టర్ ముఖర్జీ బలిదానం

జిన్నా భారత దేశాన్ని విభజించి పాకిస్తాన్ ఏర్పాటు చేశాడు.. కానీ పాకిస్తాన్ ఏర్పడక ముందే దాన్ని చీల్చాడో నాయకుడు.. ఈనాడు పశ్చిమ బెంగాల్, పంజాబ్ (తూర్పు) రాష్ట్రాలు భారత దేశంలో భాగంగా ఉన్నాయంటే అది ఆ మహా నాయకుని పుణ్యమే... భారత దేశానికి స్వాతంత్ర్యం ఇవ్వాలంటే, ముస్లింల కోసం పాకిస్తాన్ ఏర్పాటు చేయాలని మహ్మద్ అలీ జిన్నా వత్తిడి తెచ్చాడు.. ఆనాటి వృద్ధ కాంగ్రెస్ నేతలు తాము జీవితంలో పదవులు అనుభవించలేమనే ఆందోళనతో దేశ విభజనకు తలొగ్గారు..  కొత్తగా ఏర్పాడే పాకిస్తాన్లో బెంగాల్, పంజాబ్ ప్రాంతాలను పూర్తిగా కలిపేయాలని నిర్ణయించారు.. ఆ సమయంలో గట్టిగా వ్యతిరేకించి అడ్డు పడిందో గళం.. ఈ రెండు రాష్ట్రాల్లో హిందూ, సిక్కు అధిక్యత గల ప్రాంతాలను విభజించి భారత దేశంలోనే ఉంచాలని పట్టుబట్టారా నాయకుడు.. ఆయనే డాక్టర్ శ్యాం ప్రసాద్ ముఖర్జీ.. స్వతంత్ర భారత దేశంలో జాతీయవాద రాజకీయాలకు నాంది పలికిన మహానేత..
శ్యాంప్రసాద్ ముఖర్జీ.. 1901 జులై 6 కలకత్తాలో జన్మించారు. ఆయన తండ్రి అసుతోష్ ముఖర్జీ ప్రముఖ న్యాయవాది, కలకత్తా విశ్వ విద్యాలయం వైస్ ఛాన్సలర్ గా పని చేశారు.. శ్యాంప్రసాద్ ముఖర్జీ ఎంఏ, న్యాయవాద విద్య అభ్యసించారు. 1934లో 33 ఏళ్ల చిన్న వయసులోనే కలకత్తా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ బాధ్యతలు చేపట్టడం విశేషం. శాసనసభకు ఎన్నికైన శ్యాంప్రసాద్ ముఖర్జీ 1941లో బెంగాల్ ప్రావిన్స్ తొలి ఆర్థిక మంత్రిగా పని చేశారు. ఆ తర్వాత హిందూ మహాసభలో ప్రవేశించి ఆ పార్టీకి అధ్యక్షులు అయ్యారు ముఖర్జీ..
దేశ విభజన సమయంలో బెంగాల్, పంజాబ్ పూర్తిగా పాకిస్తాన్ కు వెళ్లకుండా అడ్డుపడ్డారు శ్యాంప్రసాద్ ముఖర్జీ.. జవహర్ లాల్ నెహ్రూ నేతృత్వంలోని స్వతంత్ర భారత జాతీయ ప్రభుత్వంలో పరిశ్రమల మంత్రిగా చేరారు. అయితే నెహ్రూ విధానాలను వ్యతిరేకించి ప్రభుత్వం నుండి బయటకు వచ్చేశారు.
దేశంలో జాతీయ వాదుల కోసం 1951లో భారతీయ జనసంఘ్ పార్టీని ప్రారంభించారు (ఈ పార్టీ కాలక్రమంలో భారతీయ జనతా పార్టీగా మారింది). 1952లో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో జనసంఘ్ 3 స్థానాల్లో గెలుపొందగా, ఒక స్థానంలో శ్యాంప్రసాద్ ముఖర్జీ విజయం సాధించారు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తూ నెహ్రూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు ముఖర్జీ. ఆర్టికల్ 370 రద్దు కోసం పట్టుబట్టారు. ‘ ఏక్ దేశ్ మే విధాన్, ఏక్ దేశ్ మే దో ప్రధాన్, ఏక్ దేశ్ మే తో నిషాన్.. నహీ చలేగా, నహీ చలేగా..’ ( ఒక దేశంలో రెండు విధానాలు, ఇద్దరు ప్రధానులు, రెండు పతాకాలు వద్దే వద్దు) అంటూ నినదించారు..
జమ్మూ కాశ్మీర్ భారత దేశంలో సంపూర్ణ భాగం.. ఆ రాష్ట్రంలో భారతీయులకు నివసించే హక్కును ఎలా నిరాకరిస్తారని ప్రశ్నిస్తూ సత్యాగ్రహాన్ని తలపెట్టారు శ్యాంప్రసాద్ ముఖర్జీ.. ఇందులో భాగంగా 1953 మే 11న ఆ రాష్ట్రంలోని ప్రవేశించారు. జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం ఆయనను అరెస్టు చేసింది. మే 23న నిర్భందంలోనే ప్రాణాలు కోల్పోయారు ముఖర్జీ.. ఆయన మరణం మిస్టరీగా మిగిలిపోయింది. దీనిపై దర్యాప్తు జరిపించేందుకు ప్రధాని నెహ్రూ నిరాకరించారు.
భారత దేశ సార్వభౌమత్వాన్ని కాపాడాలంటూ బలిదానం అయ్యారు శ్యాంప్రసాద్ ముఖర్జీ.. ఆయన ఇచ్చిన పోరాట స్పూర్తి మనకు ఆదర్శం కావాలి.. జూన్ 6న ముఖర్జీ జన్మదినం సందర్భంగా ఆ మహానాయకున్ని తలచుకుందాం.. దేశ సమగ్రతను కాపాడుకుందాం.. 

Thursday, July 2, 2015

అత్యవసర సందేశాలు.. సమస్యలు

విజయ్ సోదరుడు ఆస్పత్రిలో ఉన్నాడు. అర్జంటుగా పలానా గ్రూప్ రక్తం కావాలి. వాట్సప్ లో తన మొబైల్ నెంబర్ ఇచ్చి మెసేజ్ పెట్టాడు.. ఆ మెసేజ్ చూశాడు రాకేష్.. తనది ఆ గ్రూపు రక్తం కాదు ఎలా?.. అయ్యో పాపం అర్జంటు అంటున్నారు కదా అని మెసేజ్ మరి కొందరికి ఫార్వర్డ్ చేశాడు.. అలా పదులు, వందలు, వేల మందికి ఆ సందేశం వెళ్లింది.. కొద్ది వారాల పాటు ఇంకా ఫార్వర్డ్ అవుతూనే ఉంది..
విజయ్ సోదరునికి కావాల్సిన గ్రూప్ రక్తం దొరికింది. ఆపరేషన్ విజయవంతమై డిస్చార్జ్ అయ్యాడు.. కానీ కొత్త సమస్య పుట్టుకొచ్చింది.. విజయ్ కు మూడు నెలలుగా మొబైల్ మోగుతూనే ఉంది. సార్ రక్తం కావాలా? ఎక్కడికి రావాలి అని అడుగుతున్నారు. పాపం విజయ్.. అవసరం ఎప్పుడో తీరిపోయిందని అందరికీ ఓపికగా సమాధానం చెబుతున్నాడు. ఒక రకంగా ఇది హింసే.. ఈ కాల్స్ భరించలేక నెంబర్ మార్చలేని పరిస్థితి, మారిస్తే కాంటాక్ట్స్ పోతాయి.. ఈ సమస్య విజయ్ ఒకరిదే కాదు.. దాదాపు ప్రతి ఒక్కరిదీ..
ఆపదలో ఉన్నవారికి చేతనైన సాయం చేయడం మన ధర్మం, మానవత్వం.. మనం చేయలేకపోయినా, ఏదో రూపంలో సాయం అందాలని తపనపడుతుంటాం.. అందుకే అర్జంటుగా రక్తం కావాలంటూ మెసేజ్ రాగానే ఫార్వర్డ్ చేసేస్తుంటాం.. కానీ దాని వల్ల వస్తున్న సమస్యలు చూశారు కదా?.. మరి మెసేజ్ ఫార్వర్డ్ చేయకపోతే అవతల ఆపదలో ఉన్నవారికి సకాలంలో సాయం అందక ఇబ్బంది పడతారు కదా అనే అనుమానం రావడం సహజం. దీనికో పరిష్కారం ఉంది...
మీకు అర్జంటుగా బ్లడ్ కావాలనుకుంటే సందేశంతో పాటు దాన్ని పోస్ట్ చేసిన తేదీ కూడా పెట్టండి.. తద్వారా ఆ మెసేజ్ ఎప్పటిదో అవతలి వారికి తెలుస్తుంది.. అలాగే మెసేజ్ అందుకున్నవారు కూడా డిటైల్స్ జాగ్రత్తగా చూడండి.. అందులోని కాంటాక్ట్ నెంబర్ కు ఫోన్ చేసి అవసరం తీరిందా, లేదా? కనుక్కోండి.. ఆ తర్వాతే షేర్ చేయండి.. ఈ జాగ్రత్తలు పాటిస్తే అవసరమైన వారికి సకాలంలో సాయం అందడంతో పాటు, వారికి ఇబ్బందులు కూడా తప్పుతాయి.. (ఈ మెసేజ్ మాత్రం నిరభ్యంతరంగా అందరికీ షేర్ చేయండి..)

Wednesday, July 1, 2015

ఔట్ లుక్ చిల్లర రాతలు

మహిళలను గౌరవంతో చూడాలని మన పెద్దలు చెబుతుంటారు.. మహిళలను పూజించే చోట దేవతలు కొలువై ఉంటారని ఆర్యోక్తి.. ఆధునిక సమాజంలో అన్ని రంగాల్లోనూ పురుషులతో సమానంగా మహిళలు పని చేస్తున్నారు.. తమతో పోటీ పడి ఆడవాళ్లు పని చేయడం ఏమిటీ అనే జలసీతో ఫీలయ్యే మగాళున్న సమాజం మనది. ఈ అహంకారమే సూటి పోటి కామెంట్లకు దారి తీస్తుంది.. ఈ మనస్థత్వం వల్ల పతనమయ్యేదీ వారే.. దురదృష్టవశాత్తు మీడియా కూడా ఈ అహంకార పైత్యంతో బాధపబుతోందని ‘ఔట్ లుక్’ చాటుకుంది.. జాతీయ స్థాయితో పేరు ప్రతిష్టలున్న ఈ పత్రిక ఓ మహిళా ఐఏఎస్ అధికారిణిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం మాత్రమే కాకుండా, దిగజారుడు కారికేచర్ వేసింది.. విచిత్రం ఏమిటంటే దీన్ని రాసింది కూడా మహిళా జర్నలిస్టేనట.. ఎంత విడ్డూరం..  సదరు అధికారిణి ఆ పత్రికను నోటీసు పంపారు.. ఆ కథనం తాలూకు క్లిప్పింగ్ నా దగ్గర కూడా ఉన్నా, సోషల్ మీడియాలో చూపించడం, మరింత ప్రచారం కల్పించడం ఇష్టంలేకే పోస్ట్ చేయలేదు. ‘ఔట్ లుక్’ పత్రిక క్షమాపణలు చెప్పుకునే వారకూ ఆ పత్రిక చదవొద్దని నిర్ణయించుకున్నాను.. అందరూ అదే పని చేయాలని కోరుతున్నాను..