Tuesday, June 9, 2015

ఎప్పటికీ యాదికుండు దాశరథి సోదరులు

అన్న వెంట తమ్ముడు.. ఇద్దరిదీ ఒకే బాట.. పోరాటమైనా, సాహిత్యమైనా.. అపూర్వ తెలంగాణ సోదరులు వీరు.. దాశరథి కృష్ణమాచార్య, దాశరథి రంగాచార్య..

నా తెలంగాణ కోటి రతనాల వీణ.. మా నిజాము రాజు తరతరాల బూజు అంటూ నిరంకుశ పాలనపై తిరగబడి అగ్నిధారను కురిపించారు కృష్ణమాచార్య.. ఆగ్రహించిన ప్రభుత్వం జైలు పాలు  చేసింది.. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కుటుంబ బాధ్యతలు స్వీకరించిన రంగాచార్య అన్నయ్య చూపిన మార్గంలోనే నడిచాడు.. హైదరాబాద్ సంస్థానంలో చిల్లర దేవుళ్లను ఎండగట్టారు..

నిజాం పాలన అంతమయ్యాక ఉపాధి కోసం కృష్ణమాచార్య సినీ రంగంలో, రంగాచార్య ప్రభుత్వ ఉద్యోగాలను ఎంచుకొని తన సాహితీ సేవను కొనసాగించారు.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆస్థాన కవిగా గౌరవం అందుకున్న కృష్ణమాచార్య తన యాత్రాస్మృతిని 1987లో ముగించగా, రంగాచార్య పరిపూర్ణ జీవనయాగం ఇప్పుడు ముగిసింది.. తెలుగు సాహిత్యాన్ని మరింద పరిపుష్టం చేసేందుకు తమ వంతు కృషి చేసిన దాశరథి సోదరుల సేవలు విలువ కట్టలేనివి.. తెలుగు భాష ఉన్నత వరకూ ఈ తెలంగాణ సోదరుల సాహితీ సేవ యాదికుండిపోతుంది.. -క్రాంతి దేవ్ మిత్ర

Saturday, June 6, 2015

ఢిల్లీ మన దేశంలో లేదా?

అరవింద్ కేజ్రీవాల్ తాను ముఖ్యమంత్రిగా ఉన్న ఢిల్లీ, భారత దేశంలో లేదనుకుంటున్నాడు.. దేశ ప్రజలంతా నరేంద్ర మోదీని ప్రధానమంత్రిగా ఎన్నుకున్నారని, ఢిల్లీ ప్రజలు ఆప్ కు పట్టం కట్టారని అంటాడు. అందువల్ల ఎవరి పాలన వారు చూసుకోవాలని ఉచిత సలహా ఇస్తున్నాడు.. లోక్ సభ ఎన్నికల్లో ఢిల్లీలోని ఏడింటికి ఏడు సీట్లు బీజేపీ గెలుచుకున్న సంగతి మరచిపోతున్నాడు. ఢిల్లీ మన దేశానికి రాజధాని.. స్థానిక పాలన కోసం అసెంబ్లీ హోదా ఇచ్చినా, కీలకమైన అంశాలన్నీ కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నాయి.. భద్రతాకారణాల వల్ల పోలీసు శాఖను రాష్ట్రానికి బదిలీ చేయలేకపోతున్నారు..
సాధారణంగా కేంద్ర, రాష్ట్రాల చక్కని సమన్వయం ఉంటే ఎక్కడా ఘర్షణ తలెత్తే అవకాశం ఉండదు.. కానీ పేచీ కోరు మనస్థత్వం ఉంటేనే పెద్ద సమస్య.. గతంలో ముఖ్యమంత్రి హోదాలో ఉండి ధర్నాకు దిగిన ఘనత కేజ్రీవాల్ ది.. రిపబ్లిక్ డే వేడుకలు అవసరం లేదంటాడు. ఆప్ వారికి కాశ్మీర్ వేర్పాటు వాదులను సమర్ధించిన చరిత్ర ఉంది.. అలాగే ఆ పార్టీ వెబ్ సైట్ లో కశ్మీర్ ను భారత్ లో చూపించలేదు. విమర్షలు రావడంతో దాన్ని ఎత్తేశారు..

తనకు భారత దేశంలో సంబంధంలేదు, ఢిల్లీ తప్ప దేశం ఏమైపోతే నాకేమిటని కేజ్రీవాల్ అనుకుంటున్నారా?.. మోదీ పాలన నుండి ఢిల్లీని మినహాయించాలని ఆయన కోరుకోవడంలోని సంతకేతం ఏమిటి? కేజ్రీవాల్ వైఖరిని మనం సమర్ధించవచ్చా? 

Thursday, June 4, 2015

పిల్లల ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేయకండి..

ఇంటికొచ్చిన తనయుడు అమ్మా ఆకలి అంటాడు.. టూ మినట్స్ అంటూ తల్లి వంటింట్లోకి వెళుతుంది.. పొయ్యిమీద ఏదో మరుగుతుంటుంది..పిల్లోడు ఆసక్తిగా ఎదురు చూస్తుంటాడు.. క్షణాల్లో తల్లి వచ్చి సర్వ్ చేస్తుంది.. ఆసక్తిగా లొట్టలేస్తూ తినేస్తాడు.. టీవీలో వచ్చిన ఈ యాడ్ ఎంతో మంది భారతీయుల్ని కట్టి పడేసింది.. ఫలితంగా ఆ ప్రొడక్ట్ అమ్మకాలు విపరీతంగా పెరిగిపోయాయి.. ఇంటింటా డైనింగ్ టేబుల్ పై ఓ భాగమైపోయింది..
మీరు ఎప్పుడైన మ్యాగి ప్రకటనలో సత్యం ఎంతో గ్రహించారా?.. మీ ఇంట్లో రెండు నిమిషాల్లో మ్యాగి ఎప్పుడైనా ఉడికిందా?,, లేదు కదూ?.. అబద్దంతోనే ప్రారంభమైన మ్యాగి పిల్లల ఆరోగ్యాన్ని బుగ్గి చేస్తుంటే ఇంత కాలం మనం ఎలా కళ్లు మూసుకున్నామో.. తలచుకుంటేనే ఆశ్చర్యంగా ఉంది..
ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆహార నాణ్యతా ప్రమాణాల ప్రకారం సీసం 0.01 పీపీఎం మాత్రమే ఉండాలి.. కానీ లక్నోలో స్వాధీనం చేసుకున్న మ్యాగి శాంపిళ్లలో ఏకంగా 17 పీపీఎం సీసం ఉంది.. దీంతో దేశ వ్యాప్తంగా దుమారం లేచింది. కేంద్రంతో సహా రాష్ట్రాలన్నీ అప్రమత్తమయ్యాయి.. ఢిల్లీలో వెంటనే కొద్ది రోజులు నిషేధించి దర్యాప్తు ప్రారంభించింది. మిగతా రాష్ట్రాలు అదే బాటలో ఉన్నాయి. సైన్యంలో మ్యాగిపై పూర్తి నిషేధం విధించారు.
సీసం ఒక విషపూరితమైన లోహం.. ఇది మన శరీరంలోకి చేరితే తలనొప్పి, కడుపునొప్పి, గందరగోళం, చికాకు కలుగుతాయి. రక్తహీనత ఏర్పడుతుంది. మోతాదు మించితే మూర్చ, కోమా, మరణమూ సంభవించవచ్చు..ఆహార పదార్థాల రుచి పెంచడానికి మోనోసోడియం గ్లుటామేట్ కలుపుతారు. దీని కారణంగా కారణంగా తలనొప్పి, వెన్నునొప్పి, చికాకు, అయోమయం, మగత కలుగుతాయి. ఛాతిలో మంట, దవడలు బిగుసుకుపోవడం, అలర్జీలు వస్తాయి.. మ్యాగీని తయారు చేస్తున్న నెస్లే ఇండియా అనే బహుళజాతి సంస్థ తన వ్యవహారాన్ని సమర్ధించుకుంటోంది. అయితే ఈ సంస్థ తయారు చేసే పాలపొడిలో పురుగులు కనిపించం కూడా వివాదాస్పదమైంది.
ఎవరి వాదనలు ఎలా ఉన్నా మన పిల్లల ఆరోగ్యం మనకు ముఖ్యం.. ఎందుకొచ్చిన మ్యాగీలు, గీగీలు.. చూస్తూ చూస్తు ఆరోగ్యాలు బుగ్గి చేసుకుంటామా? ఒక మ్యాగినే కాదు, అన్ని ప్యాకింగ్ ఫాస్ట్ -జంక్ ఫుడ్లు, శీతల పానీయాలు కూడా ఆరోగ్యానికి హాని చేసేవే.. పిల్లలకు మన ఇంట్లో తయారు చేసే చిరుతిండ్లు, పళ్ల రసాలు ఇవ్వడమే మంచిది.. ఇంతకు మించిన ఆరోగ్యకర, పౌష్టికాహారం ఇంకేముంటుంది.. ఆలోచించండి..

Wednesday, June 3, 2015

ఇద్దరు చంద్రులు.. ఏడాది పాలన..

తెలుగునాట ఎల్ నినో ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.. ప్రకృతి అంతా గందరగోళం.. వానాకాలంలో సకాలంలో వర్షాలు పడలేదు.. చలికాలం కూడా అంతంతే ప్రభావాన్ని చూపింది.. ఈలోపు వేసవి వచ్చేసింది.. ఎండాకాలం మొదటి భాగమంతా అండపాదడపా చిరు జల్లులు పడ్డాయి.. రెండో భాగం మాత్రం ఉష్ణోగ్రతలు సాధారణాన్ని మించిపోయే సరికి ప్రజలు కళ్లుతేలేశారు.. మళ్లీ వానాకాలం వచ్చేస్తోంది.. ఈసారీ సాధారణంకన్నా తక్కువ వర్షపాతమే అంటూ వాతావరణ శాఖ అధికారులు చల్లగా తమ అంఛనాలు చెప్పేశారు..
ఇద్దరు చంద్రుల ఫోటో వ్యాఖ్య పెట్టి ఈ సోదంతా ఎందుకు రాశాడనుకుంటున్నారా?.. ఏం చేస్తాం మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల పరిస్థితి కూడా ఈ ఎన్ నినోకు భిన్నంగా లేదు మరి.. పోయిన కాలం, వయస్సు తిరిగి రాదని మన పెద్దలు చెబుతుంతారు.. ఏం చేయాలన్నా మన జీవిత కాలంలోనే చేయాలి.. ఐదేళ్లు అంటే ఇంకా చాలా సమయమే ఉందిలే అనుకుంటారు నేతాజీలు.. కానీ కాలచక్రం గిర్రున తిరుగుతున్న కొద్దీ తత్వం బోధపడుతుంది వారికి.. ఇటు చంద్రశేఖర రావు, అటు చంద్రబాబు నాయుడు తన పీఠాలపై బేషుగ్గా, తీరిగ్గా ఏడాది కొలువు పూర్తి చేస్తుకున్నారు.. ఏం చేశారయ్యా అని అడిగితే.. చాలానే చేశాం, ఇంకా అవీ ఇవీ చేస్తాం అంటుంటే వింటున్న జనం ఇంతేనా అని నిట్టూరుస్తున్నారు..
స్వరాష్ట్ర స్వప్నం సిద్ధించి ఏడాది పూర్తయిన సందర్భంగా తెలంగాణలో సంబరాలు జరిగాయి.. రాజధాని లేని గందరగోళ పరిస్థితుల్లో చీలిపోయిన ఆంధ్రప్రదేశ్లో నవ నిర్మాణ దీక్ష జరిగింది.. ఈ రెండింటిలో అధికారంలో ఉన్నవారి హడావుడి తప్ప సాధారణ ప్రజల పాత్ర ఏమాత్రం లేదనేది నిష్టూరమైన నిజం.. ఇద్దరు చంద్రులు ఇరు రాష్ట్రాల్లో అత్తెసరు రుణమాఫీ, ఫించన్లులాంటివి లేపనాలు తప్ప పెద్దగా చేసిందేమీ లేదు.. ప్రభుత్వోద్యోగులను మాత్రం పోటీలు పడి చల్లగా చూసుకుంటున్నారు.. ముఖ్యమైన సమస్యలపై ఇంకా దయ చూపడంలేదు..  రైతులు, మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగ యువత, ఇతర సాధారణ వర్గాల ప్రజలు గుర్రుగా చూస్తున్నారు.. ఎన్నికల వాగ్దానాలను పక్కన పెట్టేసి తమ స్వప్నాలను జనాలకు త్రీడీ ఎఫెక్టుతో చూపిస్తున్నారు.. హైదరాబాద్ నగరాన్ని ఎక్కడికో తీసుకుపోతానని కేసీఆర్ చెబుతుంటే.. సింగపూర్ రేంజిలో హైదరాబాదును మించిన రాజధాని కడతానంటున్నాడు బాబు.. ప్రతిపక్ష సభ్యులకు వల వేయడం.. గిల్లి కజ్జాల్లో మాత్రం ఎవరికి వారే..
ఇప్పటికే ఏడాది గడచిపోయింది.. ఎల్ నినో ప్రభావం నుండి బయటనకు వచ్చి వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకొని జనాలను అంతో ఇంతో మేళ్లు చేసి చూపిస్తే చాలు.. మీ స్వప్నాలను మాటల్లో కాకుండా ఆచరణలో చూపిస్తే 2019లో వద్దు మొర్రో అన్నా జనం మళ్లీ మిమ్మల్నే కోరుకుంటారు.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అంతా శుభం కలగాలని కోరుకుందాం..

( *ఈ పోస్టుతో ఉన్న ఫోటో వ్యాఖ్య సరదాకి మాత్రమే.. )

ఒకే భాష.. రెండు రాష్ట్రాలు. ఒకే పత్రిక.. రెండు ఎడిషన్లు. ఒకే ఐడియా.. రెండు కార్టూన్లు. నా అభిమాన కార్టూనిస్టు శ్రీధర్ సంగతి ఇదండీ.. నాకెంతో నచ్చాయివి..



Monday, June 1, 2015

దండోపాయానికి చిత్తయిన రేవంత్..

రాజకీయాల్లో దూకుడు చాలా అవసరం.. కానీ అతి దూకుడు ప్రమాదకరం.. చాలా స్వల్పకాలంలో కీలక రాజకీయ నేతగా ఎదిగాడు రేవంత్ రెడ్డి.. 2004లో టీడీపీ పరాజయం పాలై అధికారం కోల్పోయినప్పుడు రేవంత్ ఎవరో ఎవరికీ తెలియదు.. జడ్పీటీసీ, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా ఎదగడానికి ఆయనకు కేవలం మూడేళ్ల సమయం మాత్రమే పట్టిందంటే దూసుకుపోయే తత్వమే కారణం.. తెలంగాణ తెలుగుదేశంలో హేమా హేమీలు బీటీ బాట పట్టడంతో ఉన్నా రేవంత్ రెడ్డి కీలక నాయకుడిగా ఎదిగాడు..
రాజకీయాల్లో గుర్తింపు రావడానికి దూకుడు అవసరమే.. కానీ నాయకునిగా ఎదిగిన తర్వాత వ్యూహాత్మకంగా వ్యవహరించాలి.. రేవంత్ ఏకంగా కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ యుద్దానికి దిగాడు..  రాజకీయంగా అది ఆయన మైలేజీకి దోహదం చేస్తుండొచ్చు కానీ, అవతలి వారి వ్యూహాన్ని కనిపెట్టడంలో విఫలమయ్యాడు.. అధికార పార్టీ సామ, దాన, భేదోపాయలను ఉపయోగించినా రేవంత్ వారికి చిక్కలేదు.. చివరకు దండోపాయంలో చతికిల పడ్డాడు..
శాసన మండలి ఎన్నికల్లో అధికార పార్టీకి చెందిన నామినేటెడ్ ఎమ్మెల్యేతో టీడీపీ అభ్యర్ధికి ఓటేయించేందుకు లంచం అడ్వాన్స్ ఇచ్చి గట్టి సాక్షాధారాలతో దొరికిపోయాడు రేవంత్.. విచిత్రం ఏమిటంటే రేవంత్ నామినేటెడ్ సభ్యునికి ఎర వేసినట్లు కనిపించడం,, కానీ ఎర వేసింది అధికార పార్టీయే.. రేవంత్ ను రప్పించి పకడ్భందీగా ఇరికించేశారు.. ఇప్పట్లో కోలుకోలేని విధంగా.. రేవంత్ మాటలు టీడీపీ శ్రేణులను ఇరకాటంలో పడేశాయి..

మనం చేస్తే శృంగారం, అవతలి వాడు చేస్తే వ్యభిచారం.. రాజకీయుల నీతి ఇది.. దొరికిపోయిన వాన్నే దొంగ అంటుంది లోకం.. దొరకనంత కాలం దొరలే.. తెర వెనుక ఏమీ చేసినా అనవసరం.. పాపం అతి దూకుడుతో రేవంత్ ఇలా దొరికిపోయాడు..