Saturday, March 14, 2015

మీకు జీతాలా నాయనా?

ప్రజా ప్రతినిధి అంటే ప్రజల సమస్యల పరిష్కారం కోసం పని చేయాలి.. ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధి ప్రజల్లో ఒక భాగమే.. వార్డు సభ్యుని మొదలు ఎమ్మెల్యే, ఏంపీలైనా, మంత్రులు,సీఎం, పీఎంలైనా ప్రజల్లోని వారే.. వీరు ప్రజల తరపున పని చేస్తున్నందుకు గౌరవ వేతనం ఇస్తారు.. అది జీతం కాదు. వీరందరికీ సొంతంగా జీవనోపాధి మార్గాలు ఉంటాయి.. లేవంటే వారి చేతగానితనమే. సూటిగా చెప్పాలంటే భార్యా పిల్లలను, కుటుంబాన్ని సొంత రెక్కల కష్టంపై పోషించలేని వారు సోమరిపోతులే.. ప్రజాప్రతినిధులుగా వారు అనర్హులు.. సొంత బరువు బాధ్యతలు తెలిస్తేనే కదా వారికి సమాజం కష్టాలు తెలిసేది.. దేశ, సమాజ హితం కోసం కుటుంబ జీవితాలను త్యాగం చేసే వారి విషయం వేరు..
ఇటీవలి కాలంలో ప్రజాప్రతినిధుల వేతనాలు గణనీయంగా పెంచేసుకోవడం సిగ్గు చేటైన విషయం. ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయాన్ని రాజకీయ కోణంలో చూసి అడ్డుకునే రాజకీయ పార్టీలు తమకు లాభదాయకంగా ఉన్న ఈ విషయంలో చూసీ చూడనట్లుగా ఉంటున్నాయి.. అలా అని కూడా అనలేం గట్టిగా సమర్ధించుకుంటున్నాయి.. ఇప్పుడున్న ప్రజాప్రతినిధుల్లో ఎంత మంది నిజాయితీగా పని చేస్తున్నారు? ఆమ్యామ్యాలు లేకుండా ఏపనైనా చేస్తారా? నిజానికి నిజాయితీగా పని చేసే ఏ ప్రజాప్రతినిధి కూడా తమ జీత భత్యాల గురుంచి పెద్దగా పట్టించుకోరు.. వారి దృష్టి ప్రజల సంక్షేమంపైనే ఉంటుంది.. ఉన్నంతలో సర్దుకునే తత్వం వారిది..

వారి గౌరవ వేతనాలు పెంచుకుంటే ఎవరికీ పెద్ద అభ్యంతరం లేదు.. కానీ సమాజంలో జీవన ప్రమాణాలు అదే స్థాయిలో ఉన్నాయా అనే విషయం కూడా అలోచించాలి. ప్రయివేటు రంగ ప్రాధాన్యత పెరిగాక ఎవరికీ ఉద్యోగ భద్రత లేదు.. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు గణనీయంగా పెరిగిపోతుంటే, ప్రయివేటు ఉద్యోగుల జీతాలు అత్తెసరుగానే ఉన్నాయి.. పైగా కోతలు.. ఎప్పుడు జీతాలు  చేతికొస్తాయో తెలియదు.. కింది స్థాయి ఉద్యోగుల జీవితాలు మరీ దారుణం.. ఈ విషయంలో ఎప్పుడైనా ప్రభుత్వాలు దృష్టి పెట్టాయా? నిజాయితీ గుండెలపై చేయి వేసి ఆలోచించండి.. ఆ తర్వాతే మీ జీత భత్యాలు పెంచుకునే విషయాన్ని పరిశీలించుకోండి..

Monday, March 9, 2015

కచ్చతీవు కథ.. భారత జాలర్ల వ్యధ..

కొన్ని అనాలోచిత నిర్ణయాలు భవిష్యత్తులో వివాదాలకు తావు తీస్తాయి.. కుటుంబ పెద్ద ముందు చూపు లేకుండా వీలునామా రాయడం వల్ల వారసులు కొట్టుకుచావడం చూస్తూనే ఉన్నాం.. అదే పని దేశాధినేతలు చేస్తే?.. ఇప్పడు కచ్చతీవు విషయంలో జరిగింది అదే..
భారత జాలర్లు తమ సముద్రర జలాల పరిధిలోకి వస్తే చాల్చిచంపే హక్కు తమకు ఉందన్నాడు శ్రీలంక ప్రధానమంత్రి రణిల్ విక్రమ సింఘే.. భారత ప్రధాని నరేంద్ర మోదీ కొద్ది రోజుల్లో శ్రీలంక పర్యటనకు వెళతారనగా ఆయనీ ప్రకటన చేయడం ఇరు దేశాల సంబంధాలను ఇబ్బందుల్లోకి నెట్టింది.. అసలేమిటీ వివాదం? తెలుసుకోవాలంటే కచ్చతీవు కథలోకి వెళ్లాల్సిందే..
భారత్ శ్రీలంకల మధ్య సముద్రంలో ఉన్న దీవి కచ్చతీవు.. కేవలం 285 ఎకరాల విస్తీర్ణంలో ఒక మైలు పొడవు, 300 గజాల వెడల్పు ఉన్న చిన్న దీవి ఇది.. తమిళనాడుకు చెందిన భారత జాలర్లు సముద్రంలో వేటకు వెళ్లినప్పుడు సేద తీరడానికి, వలలు ఆరబెట్టుకొని బస చేసేందుకు ఉపయోగ పడేది కచ్చతీవు.. ఈ దీవి చుట్టూ అపారమైన రొయ్యల సంపద కూడా ఉంది. కచ్చతీవులో ఓ చర్చి కూడా నిర్మించారు.. ఇలాంటి  దీవి మీద శ్రీలంక కన్ను పడింది. రక్షణ సంబంధమైన కారణాలు చూపి కచ్చతీవును ఇవ్వాలని భారత్ ను కోరింది.. తండ్రి లాగే ప్రపంచ నాయకురాలిగా గుర్తింపు పొందాలని తహతహలాడే నాటి భారత ప్రధాని ఇందిర గాంధీ, ఉదారంగా కచ్చతీవును లంకకు ఇచ్చేసింది.. వద్దు వద్దు అంటూ భారత జాలర్లు, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం మొత్తుకుంటున్నా ఇందిర పరిగణనలోకి తీసుకోలేదు.. ఇది 1974లో జరిగింది..
కచ్చతీవు తమ పరిధిలోకి వచ్చినా భారత జాలర్లు, చర్చికి వచ్చే యాత్రికులు యధాతథంగా రవచ్చంటూ శ్రీలంక నమ్మబలికింది. అయితే 1976లో ఇరు దేశాల మధ్య కుదిరిన మన్నార్ జలసంధి ఒప్పందం పరిస్థితి సంక్లిష్టంగా మార్చింది. శ్రీలంకలో ఎల్.టీ.టీ.ఈ. సాయుధపోరాటం ప్రారంభించే సరికి కొత్త సమస్యలు వచ్చిపడ్డాయి. జాలర్ల ముసుగులో సముద్ర జలాల్లో తీవ్రవాదులు సంచరిస్తున్నారనే కారణంలో లంక నావికాదళం ఆంక్షలు ప్రారంభించింది. భారత జాలర్లు ఆ ప్రాంతంలో కనిపిస్తే కాల్చి చంపడం, అదుపులోకి తీసుకోవడం మొదలైంది..

ఈ సమస్యలన్నింటికీ కారణం కచ్చతీవును ముందు చూపులేకుండా శ్రీలంకకు దారాదత్తం చేయడమే.. సముద్రంలో చేపల వేటలకు వెళ్లే భారత జాలర్లది జీవన్మరణ సమస్య.. సంక్లిష్టంగా మారిన సరిహద్దుల కారణంగా సముద్ర జలాల్లో అడపా దడపా అట్టు ఇటుగా వెళ్లడం సహజం.. కానీ శ్రీలంక నావికాదళం క్రూరంగా వ్యవహరిస్తోంది.. ప్రధాని మోదీ శ్రీలంక పర్యటనలో ఈ సమస్య కూడా ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది.. గతంలో జరిగిన పొరపాటును సరిదిద్దిలేకపోయినా లంక ప్రభుత్వ వైఖరిలో కొంత మార్పయినా వస్తే అదే మన జాలర్లకు శ్రీరామ రక్ష..

Sunday, March 8, 2015

ప్రతి రోజూ మహిళల దినోత్సవం కాదా?..

యత్ర నార్యస్తు పూజ్యంతే తత్ర రమన్తి దేవతాః.. భారత దేశంలో మహిళల స్థానాన్ని మన పెద్దలు ఆనాడే స్పష్టంగా చెప్పారు.. ప్రాచీన భారతీయ సమాజం స్త్రీకి గౌరవనీయ స్థానం ఇచ్చింది.. శక్తి స్వరూపిణులుగా, మాతృ మూర్తులుగా పూజించింది.. పార్వతీ దేవి (దుర్గ)ని శక్తికి, లక్ష్మీదేవిని సంపదకు, సరస్వతి మాతను విద్యకు ప్రతిరూపంగా కొలుస్తున్నాం.. మన దేశం భారత దేశాన్ని భారత మాతగా పూజిస్తాం. వైదిక యుగంలో స్త్రీ, పురుషుల మధ్య తేడాలు లేవు.. చదువు, శక్తి సామర్ధ్యాల్లోనూ సమానత్వమే ఉండేది.. స్త్రీకి నచ్చిన వారిని వివాహమాడే స్వేచ్ఛ కూడా ఉండేది. స్వయంవరాలు ఈ కోవలోనివే.. మన చరిత్రలో రాణి రుద్రమ దేవి, ఝాన్సీ లక్ష్మీభాయి, చెన్నమ్మ లాంటి శక్తిశాలురులైన మహిళా మూర్తులు కనిపిస్తారు..
దురదృష్టవశాత్తు విదేశీయుల దండయాత్రలు ప్రారంభమయ్యాక మన దేశంలో అనాచారాలు, మూఢ నమ్మకాలు వచ్చాయి. వివక్షకు బీజం అక్కడే పడింది.. బాల్య వివాహాలు, వరకట్నం, ఆడ పిల్లలను చదువుకు దూరంగా ఉంచడం, వారిని ఇంటికే పరిమితం చేయడం, పరదా పద్దతి లాంటి దురాచారాలు ప్రవేశించాయి.. మధ్య యుగంలో తీవ్ర రూపం దాల్చిన ఈ పరిణామం ఆధునిక కాలంలోనూ కొనసాగడం దురదృష్టకరం.. అయినా రాణి రుద్రమదేవి, ఝాన్సీ లక్ష్మీభాయి, చెన్నమ్మ తదితర మహిళా మూర్తులు తమ తెగువ చూపించారు.
ఈ రోజున మహిళలు అన్ని రంగాల్లోనూ దూసుకుపోతున్నారు.  విద్య, ఉపాది అవకాశాల్లో స్త్రీ పురుషులు పోటీ పడుతున్నారు.. మన రాజ్యాంగం అందరికీ సమాన అవకాశాలు ఇచ్చింది.. రాజకీయ, పరిపాలన, ఆర్థిక రంగాల్లో ఎందరో మహిళలు ఉన్నత స్థానంలో ఉన్నారు.. కానీ ఇవన్నీ పైపై మెరుగులేనా అనే బాధ కలుగుతోంది.. ఏ పత్రిక చూసినా, ఏ ఛానల్ మార్చినా లింగ వివక్షకు ఇంకా తెర పడలేదా అనే బాధ కలుగుతోంది.. మహిళలపై అత్యాచారాల వార్తలే ప్రముఖంగా కనిపించడం దురదృష్టకరం..
మనం ఎంత ఆధునికంగా మారుతున్నామనుకుంటున్నా మన మనస్థత్వాల్లో మార్పు రాలేదు.. ఇంకా అనాగరికులమేనా అనిపిస్తోంది.. పాశ్యాత్య సంస్కృతి ప్రభావంతో  స్త్రీని భోగ వస్తువుగానే చూపిస్తోంది మన మీడియా.. వారు చూపిస్తున్నారో, మనం చూస్తున్నామా అనే చర్చ ఇక్కడ అప్రస్తుతం.. సినిమాలు, టీవీలు, పత్రికల్లో కనిపించే దృశ్యాలను ఎలా అర్థం చేసుకోవాలి.. మన పిల్లలకు, యువతకు ఏం సందేశం ఇస్తున్నాం.. కట్టు, బొట్టు విషయంలో కామెంట్స్ చేయడంలో అర్థం లేదు.. పురుషుల వస్త్ర ధారణ మారినట్లుగానే మహిళల విషయంలోనూ అర్థం చేసుకోగలం.. కానీ కాస్త గౌరవ ప్రదంగా ఉండటం ముఖ్యం..
మహిళకు గౌరవం, ప్రాధామ్యం, హక్కుల విషయంలో వారు పోరాడి సాధించుకోవాల్సిన దుస్థితి ఎందుకు వచ్చింది.. ఈ విషయంలో మనం ఆత్మ విమర్శ చేసుకోవాలి.. మార్పు అనేది ఎక్కడో మొదలవదు.. మన ఇంటి నుండే మార్పు రావాలి.. మన ఆలోచనా విధానం మారాలి.. తమ ఇంట్లోని మహిళా మూర్తులను గౌరవించాలి.. మన పిల్లలను వివక్ష లేకుండా పెంచాలి.. బాలురతో సమానంగా బాలికలనూ చదివించాలి.. వారి స్వశక్తిపై ఎదిగేందుకు ప్రోత్సహించాలి..

దినాలు జరుపుకోవడం మన సంస్కృతి కాదు.. అందునా మహిళల కోసం ప్రత్యేక దినం అర్థం లేనిది.. ఒక్క మార్చి 8వ తేదీ నాడే మహిళా దినోత్సవం ఎందుకు? ప్రతి రోజూ ఎందుకు జరుపుకోకూడదు?

Saturday, March 7, 2015

తిహార్ జైల్ టు దిమాపూర్ జైల్

నిర్భయ అత్యాచార ఘటన తాలూకూ బీబీసీ ‘ఇండియాస్ డాటర్ డాక్యుమెంటరీ దేశ వ్యాప్తంగా గగ్గోలు పుట్టించిన సమయంలోనే ఈశాన్య రాష్ట్రం నాగాలాండ్ లో ఓ రేపిస్టును జనం జైలు నుండి బయటకు ఈడ్చుకొచ్చి చంపేశారు.. నిర్భయ ఉదంతంలో దోషిగా ఉరి శిక్ష పడ్డా, తీహార్ జైలులో ఉల్లాసంగా గడుపుతున్న ముఖేష్ సిగ్గులోకుండా మహిళలపై అత్యాచారాలను సమర్ధించుకున్నాడు.. దేశ ప్రజలంతా వాడి వ్యాఖ్యలపై ఆగ్రహంతో రగిలిపోయారు.. వాడిని వెంటనే చంపేయాలన్నారు.. యాదృచ్చికంగా నాగాలాండ్ దిమాపూర్ సిటీలో అదే జరిగింది. వేలాది మంది యువ జనం జైలుపై దాడి చేసి నిందితున్ని బయటకు లాక్కొచ్చారు.. నగ్నంగా కొట్టుకుంటూ తీసుకెళ్లి నడి రోడ్డు మీద చంపేశారు..
దిమాపూర్ ఘటనలో రెండు కోణాలు ఉన్నాయి.. నిందితుడు బంగ్లాదేశీ.. అసోం మీదుగా మన దేశంలో చొరబడ్డాడు.. దిమాపూర్లో వ్యాపారం చేసుకుంటూ బుద్దిగా ఉండకుండా స్థానిక నాగా యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు. అరెస్టయి సెంట్రల్ జైలులో రిమాండ్లో ఉన్నాడు.. అదే సమయంలో నాగా స్టూడెంట్స్ ఫెడరేషన్ ఇచ్చిన పిలుపు మేరకు దిమాపూర్లో భారీ ర్యాలీ జరిగింది. ఇందులో వేలాది మంది విద్యార్థులు, యువతీ యువకులు, ప్రజలు పాల్గొన్నారు. స్థానిక, స్థానికేతర సమస్యపై జరుగుతున్న ఉద్యమ నేపథ్యంలో ఈ ప్రదర్శనకు వచ్చిన వారందరికీ అత్యాచార ఘటన పుండుపై కారం చల్లినట్లయింది.. దాని ఫలితమే జైలుపై దాడి, నిందితుని హత్య..

మహిళలపై అత్యాచారాలకు పాల్పడేవారు, దేశంలోని అక్రమంగా చొరబడుతున్న వారు సాగిస్తున్న ఆగడాలను చూస్తూ కపట నిద్ర నటిస్తున్న రాజకీయ నాయకులకు దిమాపూర్ ఉదంతం కనువిప్పు కావాలి.. ప్రజల మనోభావాలను అర్థం చేసుకొని మెలగాలి.. లేకపోతే జరగబోయే పరిణామాలు ఎలా ఉంటాయనడానికి ఈ ఉదంతం ఒక మచ్చుతునక..

Friday, March 6, 2015

నిర్భయకు అన్యాయం చేసిన 'ఇండయాస్ డాటర్'

ఇండియాస్ డాటర్.. ఢిల్లీలో నిర్భయపై బస్సులో జరిగిన సామూహిక అత్యాచారంపై బీబీసీ రూపొందించిన గంట నిడివి డాక్యుమెంటరీ కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. ఈలోగా బీబీసీ హడావుడిగా డాక్యుమెంటరీని ప్రసారం చేసేసింది.. అయితే నేను యూట్యూబ్ నుండి దీన్ని తొలగించముందే చూడగలిగాను.. ఒక జర్నలిస్టిక్ వ్యూతో  చూస్తే ఇది చాలా అద్భుతమైన డాక్యుమెంటరీ.. స్కిప్ట్ కూడా బాగుంది.. అతి తక్కువ వాయిస్ ఓవర్, పూర్తిగా బైట్లతోనే నడిపించారు..
కానీ ఒక భారతీయుని దృష్టి కోణంలో చూస్తే నిర్భయకు చాలా అన్యాయం చేసిన డాక్యుమెంటరీ ఇది.. తిహార్ జైలు గోడల మధ్య దోషి ముఖేష్ చేసిన వ్యాఖ్యకు అతిగా విలువ ప్రచారం ఇచ్చింది బీబీసీ.. అత్యాచారానికి గురైన యువతి అసలు పేరు చాలా మంది భారతీయులకు తెలియదు కారణం భారతీయ మీడియా స్వచ్చందంగా విధించకున్న కట్టుబాట్లే కారణం.. కేవలం నిర్భయ అనే పేరుగనే మనం ఉపయోగిస్తున్నాం.. కానీ బీబీసీ పరిధిని దాటింది. ఆమె అసలు పేరు వెల్లడిండమే కాదు.. చిన్నప్పటి ఫోటోను కూడా లోకానికి చూపించేసింది..
ముఖేష్ వ్యాఖ్యలపై ఐక్యరాజ్య సమితి కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు.. తాను రూపొందించిన డాక్యుమెంటరీని ఇండియాలో నిషేధించడం భావ ప్రకటనా స్వేచ్ఛకు భంగకరమని అంటున్నారు లెస్లీ ఉడ్ విన్.. మరి ఆమె భారతీయులు మనోభావాలను గౌరవించారా?.. ఏదైతేనేం ఆమెకు మాత్రం బాగా పేరు తెచ్చిపెట్టింది ఇండియాస్ డాటర్చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు మనం ఈ డాక్యుమెంటరీని నిషేధించినా, బీబీసీకి నోటీసులు ఇచ్చినా, జైలు అధికారులపై చర్యలు తీసుకున్నా ఇంతకు మించి చేయగలిగింది ఏమీ లేదు..

కానీ ఒకటి మాత్రం చేయగలం.. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ముఖేష్, అతగాడి గ్యాంగుకు న్యాయస్థానం విధించిన మరణ శిక్షను తక్షణం అమలు చేయడం.. ఆ పని చేయడమే నిర్భయ ఆత్మకు నిజమైన శాంతి.. అంతే కాదు రేపిస్టులకు హెచ్చరిక కూడా..

హోలీ శుభాకాంక్షలు..


Thursday, March 5, 2015

హోలీ పండుగ.. కొన్ని జాగ్రత్తలు


* సహజ రంగులతోనే హోలీ ఆడండి.. రసాయనాలు వద్దు.. ఎరుపు, గులాబి పొడులతో మాత్రమే ఆడేందుకు ప్రయత్నించండి..
*హోలీ ఆడే ముందు తలకు, ముఖానికి నూనె, చేతులకు నూనె చక్కగా రాసుకోండి.. ముఖానికి మేకప్, క్రీములు రుద్దుకోవద్దు..
*పొడువైన దుస్తులు ధరించండి.. ఫలితంగా రంగులు శరీరానికి ఎక్కవగా తగలకుంగా నివారించవచ్చు..
*రంగులు కళ్లలో పడకుండా జాగ్రత్తలు తీసుకోండి.. అలాగే మీరు ఇతరుల కళ్లలో వేయకండి..
*వీలైనంత వరకూ పెద్దగా ఉండే కూలింగ్ గ్లాస్ ధరించండి.. అలాగే చెవిలో దూది పెట్టుకోండి..
*హోలీ ఆడేందుకు ముందు మంచి నీరు బాగా తాగండి.. ఫలితంగా చమట బాగా వచ్చి రంగులు చర్మంలోకి పోకుండా కొంత మేర నివారించవచ్చు..
*నీటిలో రంగులు కలిపి చల్లుకుంటే చాలా నీరు వృధా అవుతుంది.. ఎక్కువగా డ్రై కలర్స్ మాత్రమే ఉపయోగించండి..
*హోలీ ఆడిన తర్వాత కొబ్బరి నూనెతో తడిపిన బట్టతో తుడుచుకోండి.. ఆ తర్వాత శుభ్రంగా తలంటి స్నానం చేయండి. తలంటుకు హెర్బల్ షాంపులు మాత్రమే వాడండి.. సున్ని పిండి స్నానం మరీ మంచిది..
*హోలీ ఆడిన తర్వాత ముఖ్యంగా నోటిని, పండ్లను శుభ్రంగా కడుక్కోండి.. హోలీ ఆడుతున్న సమయంలో ఎలాంటి ఆహారం తీసుకోకండి, రంగులు పొట్టలోకి వెళ్లే ప్రమాదం ఉంది..
*హోలీ పండుగ తర్వాత కొద్ది రోజుల వరకూ మేకప్ కు దూరంగా ఉండటం ముఖానికి మంచిది..
*రంగుల దుష్పలితాలపై ఏ మాత్రం అనుమానం వచ్చినా వెంటనే డాక్టరును సంప్రదించండి..

పై జాగ్రత్తలను మీరు ఆచరించండి అలాగే ఇతరులకూ తెలియజేయండి.. ఈ సందేశాన్ని అందరికీ ఫార్వర్డ్ చేయండి.. మీ క్రాంతి దేవ్ మిత్ర #