Saturday, February 14, 2015

ప్రేమికులకు దినమా?

ప్రేమలు. పెళ్లిల్లూ భారతీయ సంస్కృతికి కొత్తేమీ కాదు.. పురాతన కాలంలో గంధర్వ వివాహాలు, స్వయంవరాలు తెలిసినవే.. రాధాకృష్ణులు, నల దమయంతులు.. ఇలా ఎన్నో ఉదాహరణలు కనిపిస్తాయి.. సమాజ పరిణామ క్రమంలో సామాజిక పరిస్థితుల్లో ఎన్నో మార్పులు వచ్చాయి. ప్రేమను వ్యక్తం చేసుకోవడానకి భారతీయులకంటూ ఉత్సవాలున్నాయి.. వసంతోత్సవం తెలిసిందే కదా?

ప్రేమను వ్యక్తీకరించుకోడానకి మన సంస్కృతి ప్రకారమే అవకాశాలు ఉన్నాక వేలంటేన్స్ డేలు ఎందుకో.. నా దృష్టిలో ఒదొక కమర్షియల్ వెస్ట్రన్ కల్చర్ మాత్రమే.. ఫిబ్రవరి 14 అంటే పక్తు వ్యాపారమే కనిపిస్తుంది.. గ్రీటింగ్ కార్డులు, బొకేల వ్యాపారానికి, గిఫ్టులు, హోటల్, రిసార్టుల వేడుకలు, టీవీ చానెళ్ల కమర్షియల్ ప్రోగ్రామ్ కోసమే పనికొచ్చే వేడుక ఇది. ఈ రోజున రోడ్లు, పార్కులు, రిసార్టుల వెంట తిరిగేవారిలో నిజమైన ప్రేమికులు చాలా తక్కువే.. ప్రేమ పేరిట బరితెగించి వాంఛలు తీర్చుకోవడమే లక్ష్యంగా పెట్టుకునే వారూ ఉన్నారు..
ప్రేమికులకు అడ్డు పడుతున్నారంటూ నిందించేవారు కూడా కాస్త ఆలోచించాలి.. విచ్చల విడిగా వ్యవహరించే వారిని ఓ కంట కనిపెట్టకపోతే ఆ నష్టం సమాజంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది..
నా వ్యాఖ్యలు కొందరికి కోపం కలిగించి ఉండొచ్చు.. ఉన్నమాటంటే ఎవరికైనా ఉలుకే..

ఎవరికి వారే సాగర తీరే..

చివరకు అనుకున్నట్లే జరిగింది.. రెండు రాష్ట్రాలు బహిరంగ యుద్దానికి దిగుతారని, అందునా పోలీసులే కొట్టుకుంటారని.. దీనికి వేదిక నాగార్జుసాగరే అవుతుందని ఊహించాను.. అనుకున్నట్లే దాయాదుల సంగ్రామానికి సాగర్ కేంద్రంగా మారింది..
తెలంగాణ, అంధ్రప్రదేశ్ రాష్ట్రాల జలజగడం పెద్దదే కానీ.. మరీ ఇలా కొట్టుకునే వరకూ పోవాల్సినంత పెద్దదేం కాదు.. ఇద్దరు సీఎంల ఇగోలే జగడాలకు కారణం అవుతున్నాయి.. చివరకు విజ్ఞతతో గవర్నర్ సమక్షంలో చర్చించుకోవాలని నిర్ణయించుకోవడం గుడ్డిలో మెల్ల..

Wednesday, February 11, 2015

తాబేలు, కుందేలు కథ పునరావృత్తం కావొద్దు..

తాబేలు, కుందేలు కథ అందరికీ తెలిసిందే.. ఇద్దరికీ పరుగు పందెం జరిగింది.. తాను వేగంగా పరుగెత్తగలనని కుందేలుకు ధీమా.. తాబేలు గమ్యం చేరేలోపు తానో కునుకు తీసి, తేలికగా లక్ష్యాన్ని చేరుకోవచ్చనుకుంది.. కానీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది.. తాబేలు విజేతగా నిలిచింది..

గత సర్వత్రిక ఎన్నికల్లో అనూహ్య మెజరిటీతో కేంద్రంలో అధికారంలోకి వచ్చింది నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ.. దేశ రాజధాని దిల్లీలో ఏడింటికి ఏడు సీట్లనూ ఊడ్చేసింది. ప్రజలు పాలించడానికి ఐదేళ్ల సమయం ఇచ్చారు. ఎన్నికల వాగ్దానాలు నెరవేర్చడానకి కావాల్సినంత సమయం ఉంది అని భావించారు కమల నాథులు.. కానీ అవతల ఆకలితో ఉన్నవాడు తీరిగ్గా పరమాన్నం వండి పెడతానంటే ఊరుకోడు.. అలాంటి సమయంలో వాడికి గంజే పరమాన్నంతో సమానం.. జరగాల్సిన నష్టం జరిగిపోయింది.. దిల్లీ ఎన్నికల్లో బీజేపీకి ఘోర పరాజం. ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చింది.
దిల్లీలో బీజేపీకి పటిష్టమైన కార్యకర్తలు ఉన్నా, స్థానిక నాయకత్వ లోపం స్పష్టంగా కనిపించింది. కాంగ్రెస్ పార్టీదీ అదే పరిస్థితి.. ఆమ్ ఆద్మీ పార్టీకి ఉన్న ఒకే ఒక్కడు కేజ్రవాల్.. జనానికి స్పష్టంగా కనిపించాడు.. బీజేపీ కిరణ్ బేడీని తెరపైకి తెచ్చేసరికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది.. రోడ్డు మీద ఉండే వాడు ఏదైనా మాట్లాడగలడు.. ఎవరినైనా, ఏమైనా అనగలడు.. దాన్నే కడుపు మండినోడి ఆగ్రహం అంటారు.. కానీ అధికారంలో ఉండే వాడు ఆచి చూచి మాట్లాడాలి.. అక్కడే బీజేపీకి నష్టం జరిగింది.. ప్రత్యర్థులంతా ఒకటయ్యారు.. ఫలితం ఆప్ విజేతగా నిలిచింది

గర్వం తలకు ఎక్కితే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు పట్టిన గతే పడుతుందని అరవింద్ కేజ్రీవాల్ తమ కార్యకర్తలతో అన్నారు.. ఇది వాస్తవం.. ఈ మాట అందరికన్నా ఎక్కువగా కేజ్రీవాల్ కే వర్తిస్తుంది.. ఇప్పడాయన ముఖ్యమంత్రి పదవిలో ఉన్నాడు.. ఇంకా పాత ధోరణిలోనే మఫ్లర్ మీద టోపీ పెట్టి మూస ప్రచార ఆర్భాటాలకు పోతే దిల్లీ జనం అంగీకరించరు. ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చడంపై దృష్టి పెట్టాలి.. లేకపోతే కుందేలు, తాబేలు కథ పునరావృత్తం అవుతుంది.

Tuesday, February 10, 2015

మీ జీతాలకేనా న్యాయం చేయడండి బాబులూ..

రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల ఉద్యోగుల పని గారెల బుట్టలో పడ్డట్లయింది.. ఇకపై తమ పీఆర్సీలు, జీతాలు, గీతాలు అంటూ పెద్దగా రోడ్లెక్కాల్సిన అవసరం లేదు.. ఉద్యోగులకు ఎవరు ముందు మేళ్లు చేద్దామా అని ఇరు సర్కార్లు పోటీ పడుతుంటాయి. ఒక సర్కారు ఏదైనా నిర్ణయం తీసుకుంటే మరో సర్కారుకు అదే నిర్ణయం తీసుకోక తప్పదు.. (అవతలి వాడి రెండు కళ్లు పోవాలని తన ఒక కన్ను పోవాలని కోరుకున్నాడనే పురాణ గాథ ఇక్క అప్రస్తుతం అనుకోండి..)

రెండు తెలుగు ప్రభుత్వాలు ఉద్యోగుల ఫిట్ మెంట్ 43 శాతానికి పెంచాయి.. మంచిదే(?)..మరి వారి నుండి మరింత బాధ్యతాయుతమైన పనిని రాబట్టుకునే ఆలోచన ఈ సర్కార్లకు ఏమైనా ఉందా? ఇది చదివేవాళ్లలో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు అయివుండి నొచ్చుకుంటే నేనేమి చేయలేను.. నిజం మాట్లాడితే కాస్త నిష్టూరం సహజమే కదా.. నేను గమనించిన ప్రభుత్వ ఉద్యోగుల గురుంచే రాస్తున్నాను.. ముప్పాతిక శాతం (ఇంకా తక్కువే ఉండొచ్చు)
ఉద్యోగులు ఏనాడు సమయానికి ఆఫీసుకు చేరుకోరు.. దాదాపు గంట సేపు ముచ్చట్ల తర్వాతే పని ప్రారంభిస్తారు.. అదీ చాలా లేజీగా, పనిలో నత్తతో పోటీ పడతారనడం నిజం.. మధ్యలో ఛాయ్ పానీ టైమ్ పాస్.. ఈలోగా లంచ్ టైమ్ వచ్చేస్తుంది.. అలా మరో గంట గడుస్తుంది.. తర్వాత కునికి పాట్లు, పనితో కుస్తీ..మధ్యలో మరో టీ బ్రేక్..ఆతర్వాత ఏదో అలా పని చేశామనిపిస్తూ ఆపీస్ అయిపోయే సమయం కోసం ఎదురు చూపులు.. ఆ తర్వాత ఇంటి బాట..రాష్ట్ర సచివాలయంలో ఎప్పుడు చూసినా క్యాంటీన్ పరిసరాల్లో తచ్చాడే ఉద్యోగులను చాలా సార్లు చూసినట్లు గుర్తుంది.. నేనేమి పని గట్టుకొని ప్రభుత్వ ఉద్యోగులను విమర్శించడం లేదు. వారి తత్వాన్ని వివరిస్తున్నానంతే.. సిన్సియర్ ఉద్యోగులను కూడా నేను చూశాను.. వారికి ఎంత కితాబిచ్చినా తక్కువే.. ఇక ప్రభుత్వ ఉపాధ్యాయుల గురుంచి ఎంత చెప్పినా తక్కువే..
మనం తీసుకుంటున్నది ప్రజల సొమ్ము.. వారిలో ప్రయివేటు రంగ ఉద్యోగులు, అల్పాదాయ కార్మికులు పెద్ద సంఖ్యలో ఉంటారు.. ప్రభుత్వ ఉద్యోగులకంటే వారే ఎక్కువ కష్టపడతారు.. పని వేళలు కూడా ఎక్కువే.. సోకాల్గ్ కార్మిక చట్టాలు ఉన్నా వారి పనికి తగ్గ వేతనాలు అసలు ఉండవని తెలిసిందే.. ప్రయివేటు, ప్రభుత్వ ఉద్యోగాలు జీతాల పోలిక ఇబ్బంది కలిగించి ఉండొచ్చు.. కానీ ముందే చెప్పాను నిజం నిష్టూరం లాంటిది కదా..

బాబూలూ (ఉత్తరాదిన సర్కారీ ఉద్యోగులను ఇలాగే పిలుస్తారు).. కనీసం మీ జీతాలకు అయినా న్యాయం చేసేలా పని తీరును మెరుగు పరచుకొండి.. మనం పని చేస్తున్నది ప్రజల కోసం అని గుర్తుంచుకొండి.. కాస్త సేవాభావం పెంచుకోండి.. ఫలితాలు చూపించండి.. ప్రభుత్వ ఆదాయాన్ని పెంచండి.. ఉత్తమ పాలన అందించండి.. జీతాలతో పాటు పని తీరులోనూ రెండు సర్కార్లు పోటీ పడాలని కోరుకుంటున్నాను..

Sunday, February 8, 2015

బద్రికి నివాళి

మిత్రుడు, న్యూస్ ప్రెజెంటర్, టీవీ9 సహ ఉద్యోగి బద్రి ఇకలేరనే వార్తను జీర్ణించుకోలేకపోతున్నాను.. నిన్నటి వరకూ ఆఫీసులో నా కళ్ల ముందే డెస్క్-స్టూడియోల మధ్య హడావుడిగా తిరుగుతూ, మధ్యలో పలకరించి మరీ వెళ్లే బద్రి జ్ఞాపకాలను మరచిపోవడం కష్టమే.. తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయిన బద్రి ఆత్మకు శాంతి కలగాలని భగవంతున్ని కోరుకుంటున్నాను..

Wednesday, February 4, 2015

వెకిలి చేష్టలతో అడ్డగా బుక్కైన కామ పిశాచి..

‘కామాతురానాం నభయం నలజ్జ..’ అంటే కామంతో కళ్లు మూసుకుపోయిన వాడికి భయం, సిగ్గు ఉండవు.. ఇలాంటి వారు ఎంతకైనా తెగిస్తారు.. కానీ ఇకపై మారక తప్పదు.. సోషల్ మీడియా విస్తృతం అయ్యాక ఇకపై ఇలాంటి వారు సమాజంలో తలెత్తుకు తిరగలేరు.. తాజాగా ఇండిగో విమానంలో జరిగిన ఘటన కామ పిశాచులకు కనువిప్పు కలిగించాల్సిందే..
ఢిల్లీ నుండి భువనేశ్వర్ వస్తున్న ఇండిగో విమానంలో ఓ 60 ఏళ్ల పెద్ద మనిషి తోటి ప్రయాణీకురాలితో అసభ్యంగా ప్రవర్తించాడు.. పరువు పోతుందని ఆమె భర్తిస్తూ ఊరుకోలేదు.. అతన్ని మొబైల్ ఫోన్లో బంధిస్తూ అరచి కేకలు పెట్టి అందరి ముందూ పరువు తీసింది.. తోటి ప్రయాణీకులంతా అతగాడిని అసహ్యించుకున్నారు.. భువనేశ్వర్ చేరుకున్నాక అతన్ని పోలీసులకు అప్పగించారు.. ఇతగాడు ఓ పెద్ద వ్యాపారి అట.. సింగపూర్లో ఉంటున్నాడట.. భువనేశ్వర్లో తన తండ్రి దగ్గరకు ఇటీవలే వచ్చాడట.. పాపం పండింది వీడికి.. కొసమెరుపు ఏమిటంటే పోలీసులు కేవలం ప్రశ్నించి వదిలేశారట.. పెద్ద మనుషులంటే వారికి ఎంత గౌరవమో.. 
ఈ వీడియో లింక్ కూడా చూడండి..
http://youtu.be/Rk9MB34cRO8

Tuesday, February 3, 2015

భగంతునికి అందరూ సమానులే అన్న సంత్ రవిదాస్

కులం కాదు గొప్పది, కులం కన్నా కర్తవ్యం ప్రధానం.. ధర్మమే సత్యం, మదిలో నింపుకోండి ధర్మాన్ని..ధర్మం- కర్మం రెండూ సమానం..
సృష్టి జరిగింది ఒకే జ్యోతితో.. అందరూ దేవుని పుత్రులే, కులం-ప్రాంతం బేధం లేదు.. అందరూ సమానమే.. బ్రాహ్మణులైనా, చమారులైనా ఎక్కువ, తక్కువలు లేవు..
బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు ఎవరైనా వారి పవిత్ర కర్మలే శ్రేష్టత్వాన్ని నిర్ణయిస్తాయి.. 
సంత్ రవిదాస్ బోధనలివి. ఉత్తర భారత దేశంలో ఏడు శతాబ్దాల క్రితం భక్తి ఉద్యమాన్ని కొత్త పుంతలు తొక్కించిన ఆధ్యాత్మిక యోధుడు, కర్మయోగి సంత్ రవిదాస్.. పేదరికంలో అందులో చర్మకార (చమార్) వృత్తిని నిర్వహిస్తూ గొప్ప ఆధ్యాత్మిక గురువుగా, మార్గదర్శకునిగా నిలిచారు. భక్తికి, జ్ఞానానికి కులం ప్రధానం కాదు. పెద్దగా శాస్త్రాలు చదువాల్సిన అవసరమే లేదు. సన్మార్గంతో భగవంతున్ని చేరుకోవచ్చని నిరూపించారు సంత్ రవిదాస్.  
సంత్ రవిదాస్ ఎప్పుడు జన్మించారనే విషయంలో భిన్నవాదనలున్నాయి. 1377 లేదా 1399 సంవత్సరంలో ఆయన జన్మించాడని అంటారు. మరి కొందరు 1450లో జన్మించారని చెబుతున్నారు. పవిత్ర కాశీ నగరానికి సమీపంలోని సీర్ గోవర్ధన్‌పూర్‌కుచ గ్రామంలో మాఘ పూర్ణిమ నాడు  ఖల్‌సాదేవి, సంతోస్ దాస్ దంపతులకు రవిదాస్ జన్మించారు. రవిదాస్ పేరును రైదాస్ అని కూడా చెబుతారు. చమార్ కులంలో జన్మించిన రవిదాస్ చిన్నప్పటి నుండే ఆధ్యాత్మిక జీవితం పట్ల మక్కువ పెంచుకున్నారు. గంగానదిలో స్నానం చేసి, అక్కడ సాధుసంతులు చేసే బోధనలను శ్రద్దగా ఆలకించేవారు.. తాత్విక, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందిన రవిదాస్ భగవంతున్ని స్థుతిస్తూ కీర్తనలు, భజనలు ఆలపిస్తూ అందరినీ ఆకట్టుకునేవారు. సమాజంలో కుల వివక్ష, అంటరానితనం ఆయన్ని తీవ్ర ఆందోళనకు గురి చేసేవి.. రవిదాస్ ధోరణి పట్ల ఆందోళన చెందాడు ఆయన తండ్రి పెళ్లి చేస్తే కానీ దారిలోకి రాడని భావించారు. అలా లోనాదేవితో చిన్న తనంలోనే వివాహం జరిగింది. పెళ్లి చేసుకున్నా ఆధ్యాత్మిక మార్గాన్ని వీడలేదు రవిదాస్. లోనాదేవి తన భర్తను చక్కగా అర్ధం చేసకుంది. ఇద్దరూ కుల వృత్తి అయిన చెప్పులు కుట్టుకుంటూ దైవ చింతనను కొనసాగించారు..
రవిదాసు ఎంతో శ్రద్దగా పాదరక్షలు కుట్టేవాడు. అయితే దాన్ని ఆదాయవనరుగా భావించలేదు. తీర్థయాత్రులు చేసే సాధుసంతులకు ఉచితంగా ఇచ్చేవాడు.. దీంతో భక్తి గడవడం కష్టమైంది. దుర్భర దారిద్ర్యంలో ఉన్నదాంట్లోనే సరి పెట్టుకుంటూ భక్తి మార్గంలో పడిచేవాడు రవిదాస్. క్రమంగా రవిదాస్ కీర్తి అందరికీ తెలియడం మొదలైంది.. పేదరికంలో ఉన్న ఆయన్ని ఆదుకోవాలని భావించారు సంత్ ప్రేమానంద్.. రవిదాసుకు పరుసవేదిని బహుకరించారు. దానితో ఇనుమును తాకితే బంగారం అవుతుందని, ఆర్ధిక పరిస్థితుల నుండి గట్టెక్కవచ్చని సూచించాడు. రవిదాస్ దాన్ని తీసుకోడానికి ఇష్టపడలేదు. ప్రేమానంద్ వత్తిడితో అయిష్టంగానే తీసుకొని చూరులో పెట్టేశాడు. రవిదాస్ దృష్టి దానిపై పడనేలేదు.. తన జీవితం ఎప్పటిలాగే గడుస్తూ వచ్చింది. కొంత కాలం తర్వాత సంత్ ప్రేమేనంద్ మరోసారి రవిదాస్ పూరిపాకకు వెళ్లారు. రవిదాస్ పేదరికం నుండి గట్టెక్కి ఉంటాడని భావించారాయన. కానీ పరుసవేది పెట్టిన చూరులోనే అలాగే భద్రంగా ఉంది. రవిదాస్ నిరాడబరమై జీవితంలోనే అలౌకిక ఆనందం పొందుతున్నాడని గ్రహించి ఆయనకు సవినయంగా నమస్కరించారు ప్రేమానంద్..
రాజస్థాన్ చిత్తోడ్ గడ్ రాజపుత్ర యోధుడు రాణా సాంగా తల్లి రతన్ కువారీకి రవిదాసు గురుంచి తెలుసుకుంది. తన సైన్యంతో సహా వచ్చి రవిదాస్ పూరిపాక ముందు సవినయంగా మోకరిల్లి తనను శిష్యురాలిగా స్వీకరించమని కోరింది. రతన్ కువారీ కోరిక మేరకు రవిదాసు, ఆయన సతీమణి లోనాదేవి చిత్తోడ్ గడ్ వెళ్లారు.. అక్కడ వారిని ఘనంగా సత్కరించి ఏనుగు అంబారీపై ఊరేగించారు.. రాణా సాంగా భార్య మీరాబాయి కూడా రవిదాస్ శిష్యురాలిగా మారిపోయారు. రవిదాస్ ఖ్యాతి నలు దిశలా వ్యాపించింది.. కాశీ మహారాజ దంపతులతో సహా ఎందరో రాజులు, రాణులు, సాధుసంతులు రవిదాస్ బోధనల పట్ల ఆకర్శితులై ఆయన శిష్యులుగా మారారు. సంత్ రవిదాస్ చిత్తోడ్ లోనే తన 120వ ఏట చైత్రశుద్ద చతుర్ధశి నాడు భగవంతునిలో లీనమైపోయారు.

కామ్ కర్తే రహో.. నామ్ జప్తే రహో.. భుక్తి కోసం పని చేస్తుకుంటూనే ఆధ్యాత్మిక చింతనను ఎలా అనుసరించాలో ఆచరణలో చూపించారు సంత్ రవిదాస్.. రవిదాస్ బోధనలు కీర్తనల రూపంలో దోహాలుగా ప్రసిద్ది కెక్కాయి. సమాజంలో కులం, అంటరానితనం, దురాచారాలను తీవ్రంగా నిరసించారాయన. భగవంతున్ని చేర్చేది కేవలం భక్తి మార్గమే అని, కులం కన్నా గుణమే ప్రధానం అని బోధించారు. దేవునికి అందరూ సమానమే అని చాటి చెప్పారు. మొఘలుల పాలనలో దుర్భర కష్టాల్లో ఉన్న హిందూ సమాజంలో ఐక్యత సాధించడంలో రవిదాస్ బోధనలు దోహదపడ్డాయి. సంత్ రవిదాస్ బోధనలను సిక్కుల ఐదో గురువు అర్జున్ దేవ్ పవిత్ర గ్రంధం గురు గ్రంధసాహిబ్ లో చేర్చారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తాను రాసిన అస్పృశ్యులు ఎవరే అనే గ్రంధాన్ని సంత్ రవిదాస్ కు అంకితం ఇచ్చారు. సంత్ రవిదాస్ బోధనలు ఉత్తర భారత దేశానికే పరిమితం కాలేదు. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ఆయన సందేశం నుండి స్పూర్తి పొందారు.. రవిదాస్ సూచించిన మార్గం అందరికీ, ఎప్పటికీ, అన్ని వేళలా అనుసరనీయం.(ఫిబ్రవరి 3న సంత్ రవిదాస్ జయంతి సందర్భంగా)