Wednesday, August 6, 2014

మోదీ రక్ష..

రక్షాబంధన్ స్పెషల్.. ఉత్తర భారత దేశంలో ఈ కొత్త రాఖీలు గరం మిర్చీల్లా అమ్ముడు పోతున్నాయి.. అవే మోదీ రాఖీలు.. అక్కయ్యలూ, చెల్లెమ్మలూ ఈ రాఖీలను కొనేందుకు ఎగబడుతున్నారట.. నాలుగైదు వెరైటీల్లో తయారు చేసిన మోదీ బొమ్మ రాఖీలను 40 నుండి 50 రూపాలయ వరకూ అమ్ముతున్నారు.. స్టాక్ అయిపోతే మళ్లీ తెప్పించాల్సి వచ్చిందని ఢిల్లీకి చెందిన సీజనల్ వ్యాపారి చెబుతున్నాడు.. ప్రధాని నరేంద్ర మోదీ ఈ దేశానికి ఎలా రక్షకుడో.. తమ సోదరులకూ అగే రక్ష అంటున్నారు అహ్మదాబాద్ నగరానికి చెందిన ఓ యువతి.. మన హైదరాబాద్లో ఈ రాఖీలు దొరుకుతున్నాయో లేదో తెలియదు.. కానీ బేగం బజార్లో ట్రై చేసి చూడండి..

మళ్లీ సారధ్యం..

భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షునిగా మరోసారి ఎన్నికైన జి.కిషన్ రెడ్డి గారికి అభినందనలు, శుభాకాంక్షలు..

జయశంకర్ జయంతి

తెలంగాణ రాష్ట్రం ఆయన స్వప్నం.. ఆయన ఊపిరి.. తుది వరకూ తెలంగాణ కోసమే శ్వాసించారు.. నేడు మన మధ్య లేకున్నా ఆయన స్ఫూర్తి నిరంతరం కొనసాగుతుంది.. ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు..

బాబు టేస్ట్ మారింది..

చంద్రబాబు గారు గతంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పర్యాటక రంగ వికాసంలో భాగంగా హైదరాబాద్ బిర్యానీకి దాదాపు బ్రాండ్ అంబాసిడర్ గా పని చేశారు.. హైదరాబాద్ బిర్యానీ రుచి చూడండంటూ సందర్భం వచ్చినప్పుడల్లా నగరానికి వచ్చే ప్రముఖులకు సూచించేవారు.. పాపం.. ఇప్పుడు కాలం మారింది కదా.. హైదరాబాద్ బిర్యానీ తెలంగాణ రాష్ట్రానిదాయే.. అందుకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త ఫుడ్ బ్రాండ్ ఎంచుకున్నారు.. రాగిసంకటి, నాటుకోడి పులుసుకు ప్రాచుర్యం ఇస్తారట.. రాయలసీమ వాసులకు ఎంతో ఇష్టమైన ఆహారం ఇది.. హైదరాబాద్ నగరంలో సైతం క్రితుంగ, రాయలసీమ రుచులు తదితర రెస్టారెంట్లలో ఇవి బాగా సేల్ అవుతున్నాయి.. బాబు గారూ సంయుక్త ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉన్నప్పుడే రాగిసంకటి, నాటుకోడి పులుసును ప్రమోట్ చేసి ఉంటే?.. ఈపాటికి దీనికి అంతర్జాతీయ ప్రాచుర్యం దక్కేసేదే కదా?..

Tuesday, August 5, 2014

ప్రపంచ వారసత్వ సంపద హోదా దక్కేనా?

గోల్కొండ కోట మళ్లీ వార్తల్లోకి వచ్చింది.. దాదాపు ఎనిమిది శతాబ్దాల చరిత్ర గల ఈ కోట ఉన్నప్రాంతం సహస్ర కాల చరిత్ర ఉన్నట్లు ఆనవాళ్లు కనిపిస్తాయి..
1143వ సంవత్సరంలో ఓ గొల్లకాపరికి ఈ కొండమీద జగాంబ దేవతా విగ్రహం కనిపిండంతో కాకతీయుల దృష్టిలో పడింది. ఇక్కడో మట్టికోటను నిర్మించారు.. మొదట్లో గొల్లకొండ అని పిలిచేవారు.. క్రమంగా గోల్కొండగా ప్రాచుర్యంలోకి వచ్చింది.. కాకతీయులు, ముసునూరి నాయకుల ఆధీనంలో ఉన్న 1323లో ముస్లిం సుల్తానుల వశమైంది.. ముసునూరి నాయకులు గోల్కొండ కోటను మళ్లీ తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు.. కానీ ఎక్కువ కాలం నిలవలేదు.. 1371లో శాశ్వతంగా హిందూ పాలకులకు దూరమైపోయింది.
1507లో కుతుబ్ షాహీ పాలకుల ఆధీనంలోకి వచ్చిన కోట మట్టి కోట నుండి శత్రు దుర్భేధ్య రాతి కట్టడంగా మారింది.. 5 కిలోమీటర్ల విస్తీర్ణంతో 87 బురుజులు, నాలుగు ప్రధాన సింహ ద్వారాలు, అనేక రాజ మందిరాలతో కోటను విస్తరించారు.. కుతుబ్ షాహీల పాలనలో గోల్కొండ ఒక వెలుగు వెలిగింది.. ఈ కోట కేంద్రంగా గోల్కొండ సామ్రాజ్యం విస్తరించింది.. కాల క్రమంలో కోటలో జనాభా పెరిగి, సరైన సదుపాయాలు లేక వ్యాధులు ప్రభలాయి.. ఈ నేపథ్యంలో కోట వెలుపల మహా నగర నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.. 1591లో మహ్మద్ కులీ కుతుబ్ షా మూసీనది ఆవల హైదరాబాద్ నగర నిర్మాణానికి శ్రీకారం చుట్టాడు.. 1687లో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు గోల్కొండ కోటపై దాడికి దిగారు.. అంతటితో ఈ కోట ప్రాభవం అంతరించింది..
కుతుబ్ షాహీల కాలంలో తెలంగాణంలో సహా ప్రస్తుత ఆంధ్రా, రాయలసీమ ప్రాంతాలు దాదాపుగా గోల్కొండ సామ్రాజ్య పరిధిలో ఉండేవి.. తెలుగు భాషా సాంప్రదాయాలు ఒక రూపాన్ని సంతరించుకున్నది ఈ కాలంలోనే.. ప్రపంచ ప్రసిద్ధ కోహినూర్ వజ్రానని గోల్కొండ సామ్రాజ్యంలోనే గనుల్లోనే వెలికి తీశారు.. తానీషా కాలంలో అక్కన్న మాదన్నలు మంత్రులుగా ఉండటం, భక్తరామదాసు కోటలో బందీగా ఉండటం, రామలక్ష్మణులు కప్పకం కట్టి విడిపించడం తెలిసిందే.. దాదాపు వెయ్యేళ్లుగా గోల్కొండ కోటలోని జగదాంబ ఆలయ కేంద్రంగా బోనాలు కొనసాగుతున్నాయి..
నిజాం పాలనపై పోరాటం సాగించిన తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాప రెడ్డి గోలకొండ పత్రికను స్థాపించడం ద్వారా తెలుగు భాషా సాహిత్యాలకు సేవ చేయడం తెలిసిందే.. తెలంగాణంలో అసలు కవులే లేరు అని ఓ కువిమర్శకుడు చేసి వ్యాఖ్యకు సమాధానంగా కవుల సంచిక తేవడం తెలిసిందే..

గోల్కొండ కోట ప్రపంచంలోని గొప్ప కట్టడాలకు మాత్రం తీసిపోదు.. ఎన్ని సార్లు చూసినా తనివి తీరదు.. దేశ విదేశాల నుండి పర్యాటకులు ఈ కోటను చూసేందుకు వస్తుంటారు.. దురదృష్టవశాత్తు గత పాలకులు గోల్కొండకు ప్రపంచ చారిత్రిక వారసత్వ సంపద గుర్తింపు తేవడంలో విఫలం అయ్యారు.. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో తొలి ప్రభుత్వం గోల్కొండ కేంద్రంగా స్వాతంత్ర్య దిన వేడుకలు జరపాలని నిర్ణయించడం స్వాగతించదగినదే.. తెలంగాణ ప్రభుత్వం గోల్కొండ కోటకు ప్రపంచ వారసత్వ సంపద గుర్తింపు తెచ్చే ప్రయత్నం సీరియస్ గా చేయాలని కోరుకుంటున్నాను.. 

Monday, August 4, 2014

యుద్ద స్మారకం దుస్థితి

మీరు ఎప్పుడైనా చాదర్ ఘాట్ వెళ్లితే మూసీ నది ఒడ్డున సాయిబాబా ఆలయం ముందు పిచ్చి మొక్కలతో కంపు కొట్టే దుర్గంధంలో ఉన్న ఓ స్మారక స్థూపాన్ని చూడొచ్చు.. అదేమిటో తెలుసుకోవాలనుకుంటున్నారా?..
ఇటీవలే మొదటి ప్రపంచ యుధ్ధ శత వార్షికోత్సవాలు ప్రారంభమయ్యాయి.. జులై 28, 1914లో ప్రారంభమైన ఈ యుధ్ధం నాలుగేళ్లకు పైగా సాగి 11 నవంబర్ 1918లో ముగిసింది.. మరి దీనితో మనకేమిటి సంబంధం అనుకుంటున్నారా?..


ఆనాటి యుద్ధ రంగంలో హైదరాబాద్ సైన్యానికి చెందిన రెండు రెజిమెంట్లు గ్రేట్ బ్రిటన్ తరపున పాల్గొన్నాయి.. బ్రిటిష్ వారి సామంతుడిగా ఉన్న హైదరాబాద్ పాలకుడు ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ యుద్ధంలో వారికి ఆర్ధికంగా కూడా అండగా నిలిచాడు.. ఈ సేవలకు ఎంతగానో మెచ్చుకున్న బ్రిటన్ రాజు యుద్ధానంతరం నిజాం ప్రభువు బిరుదును హిజ్ హైనస్నుండి హిజ్ హెగ్జాల్టెడ్ హైనస్స్థాయికి పెంచాడు.. మొదటి ప్రపంచ యుద్ధంలో హైదరాబాద్ సైనికులు ఎందరో అమరులుయ్యారు.. వారికి నివాళిగా చాదర్ ఘాట్ ప్రాంతంలో War Memorial Monument నిర్మించారు..
అంతటి చారిత్రిక ప్రాధాన్యత గల ఈ స్మారక స్థూపం ప్రస్తుతం మల మూత్రాల కంపులో పిచ్చి మొక్కల మధ్య ధీనంగా కనిపిస్తోంది.. దాని చూట్టూ ఉన్న రెయిలింగ్ పైన స్థానికులు బట్టలు ఆరేస్తారు.. పాపం వారికి దాని ప్రాధాన్యత తెలియదు కదా.. ఈ స్థాపం నిర్మించిన స్థలాన్ని విక్టరీ గ్రౌండ్ అని పెలిచేవారు.. కాల క్రమంలో ప్రభుత్వం అక్కడ చక్కని ప్లే గ్రౌండ్ నిర్మించింది.. (అది మాత్రం శుభ్రంగా ఉంటుంది లెండి)

మొదటి ప్రపంచ యుద్ధ శత వార్షికోత్సవం సందర్భంగా అందులో పాల్గొన్న దేశాలన్ని ఆనాటి గాయాలకు గుర్తు చేసుకొని, యుద్దంలో అమరులైనవారికి నివాళులు అర్పిస్తున్నాయి.. కానీ ఘనత వహించిన తెలంగాణ ప్రభుత్వం, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ కు ఈ విషయం పట్టినట్లు లేదు.. అందుకే ఈ స్మారక స్థూపాన్ని మరచిపోయాయి.. జర దీని మీద నజర్ పెట్టుండి సార్లూ.. గిది కూడా మన హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీకి సంబంధించిన వ్యవహారమే..

Sunday, August 3, 2014

ఎన్నాళ్లకెన్నాళ్లకెన్నాళ్లకూ?..

దోస్తు మేరా దోస్త్.. స్నేహమేనా జీవితం..’ ‘ఇద్దరు చంద్రులు కలిశారు.. అంటూ ఈ దృశ్యానికి మన మీడియా మిత్రులు బాణీలు కట్టేస్తున్నారు.. నిజానికి ఈ సీన్ కోసం రెండు నెలలుగా గోతికాడి నక్కల్లా ఎదురు చూస్తున్నారంటే నమ్మండి.. వెటకారం మరీ ఎక్కువైందని ఎవరైనా మీడియా మిత్రులు నొచ్చుకుంటే అందులో నా తప్పేమీ లేదు.. నిజం నిప్పులాంటి కదా?.. మీరు చూస్తున్న ఈ దృశ్యంలో ఏ మాత్రం నిజాయితీ లేదు.. ఇద్దరివీ తెచ్చి పెట్టుకున్న బలవంతపు నవ్వులే..
రెండు రాష్ట్రాలు.. ఇద్దరు ముఖ్యమంత్రులు.. ఒకే రాజధాని.. ఒకే తడక చాటు సచివాలయం..ఇద్దరి నివాసాలు దగ్గర్లోనే ఉంటాయి.. అంతే కాదు ఇద్దరి క్యాంప్ ఆఫీసులు దగ్గర్లోనే ఉంటాయి.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి అప్పుడే రెండు నెలలు గడచింది.. కానీ ఈ రెండేళ్లలో ఏనాడూ మొహాలు చూసుకోలేదు ఈ మాజీ దోస్తులు..
కలవడానికి ఎన్నో సందర్భాలు వచ్చాయి.. ఒకరి ప్రమాణ స్వీకారానికి మరొకరు హాజరు కాకుండా తప్పించుకు తిరిగారు.. గవర్నర్ సాంప్రదాయంగా ఇచ్చిన ఇఫ్తార్ విందులో తప్పనిసరిగా కలుస్తారుని మీడియా మిత్రులు చకోర పక్షుల్లా ఎదురు చూశారు.. కానీ ఇద్దరిలో ఒక సీఎం మాత్రమే వచ్చాడు.. రెండో ఆయన మొహం చాటేశాడు.. ఏ కార్యక్రమంలోనూ ఎదురుపడకుండా జాగ్రత్త పడ్డారు.. కానీ ఇప్పడు రాష్ట్రపతి హైదరాబాద్ వస్తున్న సందర్భంలో రాజ్యాంగ హోదాలో ఇద్దరూ ఎయిర్ పోర్టుకు వెళ్లి స్వాగతం పలకక తప్పలేదు.. మొత్తానికి ఇలా బుక్కైపోయారు.. ఎన్నాళ్లు తప్పించుకుంటారు.. బలవంతపు నవ్వులతో పలకరించుకొని చేతులు కలిపారు పాపం..
నిజానికి ఇరు రాష్ట్రాల మధ్య సత్సంబంధాల కోసం చంద్రబాబు ఓ మెట్టు దిగి వస్తున్నా కేసీఆర్ యే మేనా జహా.. తెర కామ్ క్యా హై యహా..అంటూ మొండిగానే ఉంటున్నారు.. కానీ బాబు గారికి తప్పదు కదా ఎంతైనా అద్దె ఇళ్లు.. కొత్త ఇళ్లు కట్టుకునే దాకైనా ఓనరు గారితో జాగ్రత్తగా ఉండాలి కదా?..
ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇలా ఎడ్డం అంటే తెడ్డం అంటూ దోబూచులాడుతుంటే, దెబ్బతినేది తెలుగువారి ప్రయోజనాలే.. భౌగోళికంగా, పాలనా పరంగా విడిపోయామే తప్ప, భాషా సాంస్కృతికంగా ఉన్న సంబంధాలను ఎవరు చెరిపేయగలరు? మనకు సమస్యలు ఎన్నో ఉన్నాయి.. అవి స్థానికత, ఫీజు రీ యంబర్స్ మెంట్, విద్యుత్, నదీ జలాల పంపిణీ తదితరాలతో ముగిసిపోదు.. మున్ముందు ఇంకా ఎన్నో  దృశ్యాలు చూడబోతున్నాం.. ఇవన్నీ పరిష్కారం కావాలంటే ఇలాంటి దోబూచులాటలు పనికి రావు.. మీ కోసం కాకపోయినా ప్రజల కోసమైనా ఈ బలవంతపు నవ్వులు పులుముకొని అయినా తరచూ కలుసుకోండి.. కరచాలనాలు చేసుకోండి అవసరమైతే వాటేసుకోండి..

జై తెలంగాణ.. జై ఆంధ్రప్రదేశ్.. జై హింద్..