Sunday, June 8, 2014

ఒకే పత్రిక.. రాష్ట్రానికో స్పెషల్

తెలుగు మీడియాలో ఆసక్తికరమైన పరిణామం..
ఇవాళ ఈనాడు సండే స్పెషల్ చూశారా?.. కవర్ పేజీ స్టోరీ ఏమిటి?.. ఏముంది కేసీఆర్ పై ఇచ్చారా కదా? అనుకుంటున్నారా?.. అయితే మీరు తెలంగాణ వాళ్లన్నమాట.. కాదే చంద్రబాబు గురుంచి రాశారు కదా? అంటున్నారా?.. అయితే మీరు కచ్చితంగా సీమాంధ్ర వారే..
ఈరోజు ఈనాడు దిన పత్రిక సండే స్పెషల్ రెండు రాష్ట్రాలకు వేర్వేరుగా ఇచ్చింది.. తెలంగాణ ఎడిషల్ కేసీఆర్ ముఖ చిత్రంతో, ఆంధ్రప్రదేశ్ ఎడిషన్ చంద్రబాబు ముఖచిత్రంతో సండే స్పెషల్స్ అందించాయి.. కొద్ది నెలలుగా ఈనాడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఎడిషన్లను పూర్తి వైవిధ్య స్థానిక వార్తలు, కథనాలను అందిస్తూ వస్తోంది.. అదే బాటలో సాక్షి కూడా నడుస్తోంది.. ఆంధ్రజ్యోతి పాక్షికంగా ఆ పని చేస్తోంది.. అయితే ఆదివారం అనుబంధాలు మాత్రం రెండు ప్రాంతాల్లో ఒకటే వస్తున్నాయి.. విచిత్రంగా ఈనాడు ఇవాళ రెండు ప్రాంతాలకు వేర్వేరు సండే స్పెషల్స్ ఇచ్చి ఆసక్తిని రేకెత్తించింది..

పత్రికలు తమ పాఠకుల ఆసక్తులకు అనుగుణంగా తమ వ్యాపార అవసరాల కోసం స్థానిక వార్తలకు ప్రాధాన్యత ఇస్తూ ఎడిషన్లు తీసుకురావడాన్ని తప్పు పట్టలేం.. కానీ అన్ని ప్రాంతాల వారు ఆసక్తిగా చూసే ఆదివారం అనుబంధాలను కూడా ఇలా తీసుకురావడంలోని ఔచిత్యం ఏమిటో నాకు అర్థం కాలేదు.. ఏం కేసీఆర్ జీవిత విశేషాలు సీమాంధ్ర ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం లేదా?.. చంద్రబాబు గురుంచి తెలంగాణ ప్రజలకు ఇక అవసరం లేదా?.. ఆలోచించండి.. 

నవ్యాంధ్రకు స్వాగతం..

నవ్యాంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న నారా చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు.. తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణల మధ్య పరస్పరం స్నేహ పూర్వకంగా వ్యవహరిస్తూ అభివృద్ధిపదంలో దూసుకుపోవాలని కోరుకుంటున్నాను..

Saturday, June 7, 2014

ఏరు దాటాక..

నెల రోజుల క్రితం ఓ బ్రాండెడ్ షాపులో చెప్పులు కొన్నాను.. ఆరు నెలల వారంటీ అన్నాడు షాపువాడు.. కానీ రెండు వారాలకే తెగిపోయాయి.. ఆ షాపుకి వెళ్లి అడిగితే మీరు సరిగ్గా వాడలేదు.. వారంటీ వర్తంచదు అన్నాడు.. షరతులు వర్తిస్తాయనే నిబంధన చూడలేదా? అని దబాయించాడు.. అప్పుడనిపించింది.. వాన్ని చెప్పుతో ఒక్కటిచ్చుకోవాలని.. సరిగ్గా వాడటం అంటే చెప్పులను ఇంట్లోనే భద్రంగా పెట్టుకొని పాద పూజలు చేయాలేమో..
ఇటీవలి సార్వత్రిక ఎన్నికల సందర్భంగా లక్షలోపు రైతుల రుణాలు మాఫీ చేస్తామని టీఆర్ఎస్, టీడీపీ హోరెత్తించాయి.. తెలంగాణలో టీఆర్ఎస్ అధికారం చేపడితే, ఆంధ్రప్రదేశ్లో టీడీపీ పగ్గాలు తీసుకునేందుకు సిద్ధంగా ఉంది.. ఏరు దాటగా ఓడ మల్లన్న బోడి మల్లన్న అయ్యాడు.. ఇప్పడు ఓటరన్న పరిస్థితి ఇలాగే ఉంది..
అన్ని రుణాలు మాఫీ చేయలేమంటూ షరతులు విధిస్తోంది టీఆర్ఎస్ ప్రభుత్వం.. తిక్కరేగిన రైతన్నలు రోడెక్కి ఆందోళనలు చేస్తున్నారు.. రుణ మాఫీపై గంపెడు ఆశలు పెట్టుకున్న ఒకరిద్దరు రైతన్నలు హరీమన్నారు.. రాష్ట్ర విభజన తర్వాత ఆర్థికంగా బలోపేతలంగా ఉన్న తెలంగాణ రాష్ట్రంలోనే కేసీఆర్ ఇచ్చిన వాగ్దానాన్ని నిల్పుకోలేని దుస్థితి ఉంటే, తాడూ బొంగరం లేకుండా లోటు బడ్జెట్తో మిగిలిన అవశేష ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ఎలా ఉద్దరిస్తాడో చూడాలి..

ఎన్నికల ముందు గెలవడమే లక్ష్యంగా అడ్డగోలు వాగ్దానాలు చేస్తాయి రాజకీయ పార్టీలు.. నమ్మిన ఓటరన్నలు గెద్దెనెక్కిస్తే బడ్జెట్టూ.. ఆర్థిక భారం.. అంత చేయలేం.. ఇంతే చేస్తాం అంటూ కుంటి సాకులు చెబుతారు నాయకులు.. షరతులు వర్తిస్తాయని చావు కబురు చల్లగా చెబుతారు.. నిజానికి ఇక్కడ తప్పంతా ఓటర్లదే.. మేక కసాయిని నమ్మినట్లు నాయకులు చెప్పినవన్నీ నమ్మేసి గుడ్డిగా ఓట్లేస్తారు.. ఓటేయడానికి ముందు అదెలా సాధ్యమో వివరించమని గట్టిగా నిలదీసి వివరణ అడిగి ఉంటే ఇలా జరిగేదా? ఆలోచించండి.. (క్రాంతి దేవ్ మిత్ర)

Friday, June 6, 2014

మగతనం చచ్చిందా?..

ఎంత దారుణం.. మగతనం చచ్చిపోయిందా వారికి..
ముంబై నగరంలోని డాంబివేలి ప్రాంతంలో ఓ ప్రయాణీకుడు మహిళా కాండక్టర్ బస్సు నుండి కిందకి లాగి బట్టలు చించేసి దారుణంగా కొట్టాడు.. బస్సులోని, బస్టాప్లోని పురుష పుంగవులెవరూ వాన్ని అడ్డుకోలేదట.. ఆతర్వాత కొందరు ప్రయాణీకులు ధైర్యం చేసి వాన్ని పోలీసులకు అప్పగించారట..
కళ్ల ముందే మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నా అడ్డుకోలేని దుస్థితి.. మహిళలపై అత్యాచారాలు, హింసాకాండకు అడ్డులేదా అని గొంతు చించుకునేవారు ముందు తమ కళ్లు ఎదుట జరిగే అన్యాయాన్ని ప్రతిఘటించడం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది..

Thursday, June 5, 2014

ఇప్పుడు కాదనగలరా?

నరేంద్ర మోదీ తమ దేశానికి రావద్దని రావద్దని వీసా నిరాకరించిన అమెరికా  దిగిరాక తప్పలేదు.. ద్వైపాక్షిక చర్చల కోసం రావాలని భారత ప్రధానిని అమెరికాకు లాంఛనంగా ఆహ్వానించారు బరాక్ ఒబామా.. కోట్లాది మంది భారతీయులు కోరి ఎన్నుకున్న  ప్రియతమ నాయకున్ని  ప్రధానిని నిరాకరించే దమ్ముందా అమెరికాకు? 

Tuesday, June 3, 2014

అశ్రునివాళి..

కేంద్రమంత్రి గోపీనాథ్ ముండే హఠాన్మరణం బాధాకరం.. మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా పనిచేసిన ముండే.. ఐదు సార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు ఎంపిగా ఎన్నికయ్యారు.. తాజా ఎన్నికల్లో భీడ్ నుండి లోకసభ సభ్యునిగా గెలిచి, మోదీ సర్కార్లో మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.. రానున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపధ్యంలో గోపీనాథ్ ముండేకు ప్రాధాన్యత పెరిగింది.. అంతలోనే ఆయన కన్నుమూత బిజెపి శ్రేణులను విచార సాగరంలో ముంచింది..  ముండే ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిద్దాం..