Tuesday, March 5, 2013

దోశె క్యాంపులకు రెడీ కండి..

తెలంగాణకు పరిష్కారం దోశ వేసినంత సులువు కాదంటున్నారు వయలార్ రవి.. రవి భోజన ప్రియుడని చూస్తూనే తెలుస్తోంది.. ఆ మాటకొస్తే పాలక కుటుంబ భజన పరుడు కూడా.. కానీ వంటలు చేయడంలో కూడా అనుభవం ఉందని చెప్పకనే చెప్పారు.. దోశ వేయడమంత సులువు కాదని.. వయలార్ రవి కేరళలో ఏనాడో కొట్టు కట్టేశారు.. రేపు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోతే.. రవి దోశె కొట్టు (Dose Camp) పెట్టుకోవాల్సిందే.. తెలంగాణ సమస్యను పరిష్కరించడం చేతగాక పోతే చేతులెత్తేయండి వయలార్ గారూ.. వెటకారాలు ఎందుకు? ఇంకా తెలుగు ప్రజలను ఎంత కాలం మోసం చేస్తారు?

Saturday, March 2, 2013

మొద్దు చర్మాలు భరిస్తున్నాయి

 మళ్లీ పెట్రోలు రేటు పెరిగింది.. సామాన్యుడి నడ్డి విరిగిందని ప్రతి పక్షాలు గోల పెట్టేశాయి.. ధరను తగ్గించే దాకా ఉద్యమిస్తాం.. ప్రభుత్వం మెడలు వంచుతాం అంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శించాయి..

ఈలోగా నాలుగు రోజులు గడచిపోతుంది.. ప్రజలకు నొప్పి తగ్గిపోతుంది.. ప్రతిపక్షాలు మౌనంగా ఉండిపోతాయి.. అదను చూసి మరోసారి ప్రభుత్వం పెట్రోలు ధరను పెంచేస్తుంది.. మళ్లీ సీన్ రిపీట్..
యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్రోలు, డీజీల్, గ్యాసు ధరలు లెక్కలేనన్నిసార్లు పెరిగాయి.. 2013 సంత్సరంలో మూడు సార్లు పెట్రోలు ధర పెరిగితే.. పక్షం రోజుల్లోనే రెండు సార్లు వాత పడింది.. ఇలా ఎన్ని సార్లు పెట్రో పడ్డా భరించే రీతిలో దేశ ప్రజలకు ప్రజలకు మొద్దు చర్మం వచ్చేసింది..

Friday, March 1, 2013

ఎందుకీ ఏడ్పులు?

నాయకుడంటే సామాన్య ప్రజల దృష్టిలో తమ కష్టాలు తీర్చేవారు.. మార్గదర్శులు.. ముందు ఉండి పోరాడే వారు.. కానీ వారే కన్నీరు పెట్టేస్తే ఎలా? కన్నీరు పెట్టడం అంటే ఓటమిని అంగీకరించడమే.. ధృడమైన మనస్సుతో ఒకరికి ఆదర్శంగా ఉండాల్సిన నాయకులే ఏడ్చేస్తే ఎలా? 
ఇక్కడ నేను లోతుల్లోకి పోదలచెకోలేదు కానీ తెలుగుదేశం నాయకులు ఇటీవల ఒక్కోరు ఒక్కో కారణంతో కంట తడి పెట్టడం , వలవలా ఏడ్చేయడం ఆశ్చర్యాన్ని కలిగించింది.. ప్రజల సమస్యలు చూసి కన్నీరు వచ్చిందని సమర్ధించుకోవచ్చునేమో కానీ వారి కన్నీరు తూడ్చి ధైర్యం చెప్పాల్సిన వారే ఏడ్చేస్తే ఎలా? 
అయితే ఒక రకమైన కన్నీరుకు, విచారానికి మినహాయింపు ఉంది.. దీన్ని అందరూ అర్థం చేస్తుకోవచ్చు.. అత్యంత సన్నిహితులను కోల్పోయినప్పడు లేదా దారుణ సంఘటనలు జరిగినప్పుడు ఎంతటి వారికైనా కన్నీరు వచ్చేస్తుంది.. నిజానికి ఇలాంటి సమయాల్లో కన్నీరు రాని వారు మానవత్వం లేని వారికిందే లెక్క.. కానీ ఇతరత్రా కారణాలకు కన్నీరు పెట్టడంలో ఔచిత్యం ఏమిటో నాకైతే అర్థం కాదు..

Monday, February 25, 2013

బాధ్యత లేని మీడియా, నాయకులు..


దిల్ సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల తర్వాత మన నాయకులు, మీడియా బాధ్యత లేకుండా వ్యవహరించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది..
బాంబు పేలుళ్లు జరగగానే రాజకీయ నాయకులు ఢిల్లీ నుండి గల్లీ దాకా నాయకులు సంఘటనా స్థలంలో వాలిపోయారు.. తామేదో మైలేజీ కోల్పోతామన్నట్లుగా ఒకరి చూసి ఒకరు సంఘటనా స్థలానికి పరుగెత్తి దర్యాప్తు సంస్థలకు ఇబ్బంది కలిగించడం ఎంత వరకూ సమంజసం.. ఇలాంటి విపరీత ప్రవర్థన కారణంగా కేసు దర్యాప్తుకు అవసరమైన ప్రాథమిక ఆదారాలకు నష్టం జరిగిన విషయం ఆ నాయకులకు అర్థం అయ్యిందా? పోలీసులు ప్రజల భద్రతను పక్కన పెట్టి వీరికి భద్రత కల్పించడమెలా అని హైరానా పడిపోయారు.. అంతగా కుతూహలం ఉంటే పోలీసులు దర్యాప్తు ఆధారాలు సేకరించిన తర్వాత వెళ్లవచ్చు..అయ్యా నాయకులారా.. ఇలాంటి క్లిష్ట సమయంలో ప్రజలెవరూ మీ సందర్శనలు, పరామర్శలు ఆశించడం లేదని గ్రహించండి..
ఇక మీడియా విషయానికి వద్దాం.. బాంబు పేలుళ్ల కేసులలో నిఘా సంస్థలు, పోలీసులు సేకరిస్తున్న ఆధారాలను ఎప్పటికప్పడు బట్టబయలు చేస్తున్న మీడియా కేసు దర్యాప్తుకు అవరోధాలు కల్పిస్తోందా అనిపిస్తోంది.. ముంబాయిపై దాడి సమయంలో టీవీ ఛానెళ్లు ఇచ్చిన లైవ్ చూసి అప్రమత్తమైన తీవ్రవాదులు తమను పట్టుకోవడానికి వచ్చిన పోలీసులు మరింత ఎక్కువ సంఖ్యలో పొట్టన పెట్టుకున్నారు.. ఇది కాదేనలేని నిజం.. ఇప్పడు హైదరాబాద్ పేలుళ్ల దర్యాప్తు విషయంలో మీడియా ఇస్తున్న కథనాలు అదే స్థాయిలో ఉన్నాయి.. దర్యాప్తు జరుగుతున్న తీరును ఎప్పటికప్పడు ప్రకటించడం ద్వారా తీవ్రవాదులు తప్పించుకునే అస్కారాన్ని కల్పిస్తోంది మన మీడియా.. ఇవాళ ఓ ఛానెల్లో చూసిన స్క్రోలింగ్ ఆశ్యర్యాన్ని కలిగించింది.. దర్యాప్తు సంస్థలు తనను వేధిస్తున్నాయని ఒకాయన ఆ ఛానలోడితో ఏడిచాడట.. అయ్యా.. వాడి నేరం ఏమిటో విచారణలో నిగ్గు తేలుతుంది కదా? అతగాడు నిర్దోషి అని వకాల్తా పుచ్చుకునే అధికారం మీకు ఎక్కడిది?

 అమెరికా లాంటి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో సెప్టెంబర్ 11 సంఘటన తర్వాత అక్కడి మీడియా కనీసం మృతుల సంఖ్యను కూడా ప్రకటించకుండా.. కీలకమైన దర్యాప్తు అంశాలను బయటపెట్టకుండా ఎంతో నిగ్రహం, సంయమనం పాటించింది.. అలాంటి సంయమనం మన మీడియాకు ఎందుకు లేదో?.. మీ పోటీలకు, రేటింగ్లకు తగిన సమయమేనా ఇది.. అసలు పోలీసులు, నిఘా సంస్థలు తప్పుకొని బాంబు పేలుళ్ల కేసు దర్యాప్తును మీడియాకే అప్పగిస్తే మంచిదేమో? నేర వార్తల కవరేజీ విషయంలో మీడియా విచారణ ప్రతికూల ప్రభావాలను చూపే అవకాశం ఉందని ఇటీవల సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి అల్తమస్ కబీర్ ఆందోళన వక్తం చేయడం గమనించాల్సిన అవసరం ఉంది..

Saturday, February 23, 2013

ఉగ్రవాద నగ్న స్వరూపం

దిల్ సుఖ్ నగర్ లో జరిగిన బాంబు పేలుళ్ల దుర్ఘటన తర్వాత ఉగ్రవాదుల నగ్న స్వరూపం దేశ ప్రజలందరికీ మరోసారి తెలిసి వచ్చింది.. ఉగ్రవాదం అనేది ఒకరకమైన మానసిక వికృత చర్య తమ భావాలను ఇతరులపై బలవంతంగా నెట్టేందుకో, పంతాన్ని నెగ్గించుకోవడాకి ఎలాంటి దారుణమైన హత్యలుకైనా పాల్పడేందుకు సిద్దపడే పైశాచిక స్వభావులే ఉగ్రవాదులు.. అవసరమైతే తమకు తాము మానవ బాంబులుగా మారి తాము చచ్చీ, అవతలి వారిని చంపి తామేదో ఘన కార్యానికి అంకితమౌతున్నామని సమాధానపరచుకుంటారు..
ఉగ్రవాదానికి జాతి, మతం, కులం, వర్గం, భాష, ప్రాంతం లేదనేది నిజం.. కానీ కొందరు దర్మార్గులు జిహాద్ పేరిట భయోత్పాతాన్ని సృష్టిస్తూ ఉగ్రవాదాన్ని ఒక మతానికి ఆపాదించేస్తున్నారు.. నిజానికి మన దేశంలో ఉన్న ఆ మతస్తుల్లో అత్యధికులు ఉదారస్వభావులే.. ఈ దేశాన్ని ప్రేమించేవారే.. దేశ విభజన జరిగిన సమయంలో వారంతా తాము పుట్టి పెరిగిన భారత్ దేశమే కావాలనుకున్నారు.. కానీ తులసి వనంలో గంజాయి మొక్కల్లా అతి కొద్ది మంది జిహాద్ పేరిట రెచ్చగొడుతూ తప్పుదోవ పట్టిస్తున్నారు.. అయితే ఉగ్రవాదం ఒక మతానికి మాత్రమే పరిమితం అని నేను వాదించడం లేదు.. ఉగ్రవాదులు హిందూ మతంతో సహా అన్ని మతాల్లోనూ ఉన్నారు.. ఉగ్రవాదాన్ని మెజారిటీ, మైనారిటీ అనే దృష్టితో చూడరాదు..
ఆర్థికంగా, సామాజికంగా వెనుకబాటు తనం, చదువు లేక పోవడమే వేర్పాటు భావనలను సృష్టిస్తుందని కొందరు మేధావులు తేల్చేస్తుంటారు.. కానీ నా పరిశీలన ప్రకారం చదువుకున్న మేధావులు, అంతో ఇంతో స్థితి మంతులు అయినవారు, సామాజికంగా కొంత పలుకుబడి ఉన్న వారే అధికంగా ఉగ్రవాద భావాలకు ఆకర్శితులవుతున్నారు.. వ్యాప్తి చేస్తున్నారు కూడా.. ఇందుకు నేను ఎన్నో ఉదాహరణలు చూపగలను..
ఈ దేశంలో పుట్టి, ఇక్కడి తిండి తింటూ, స్వేచ్ఛను అనుభవిస్తూనే తామేదో అన్యాయానికి గురవుతున్నామని చెప్పుకునేవారు కచ్చితంగా దేశ ద్రోహులే.. ఇలాంటి వారందరికీ పొరుగు దేశం ఏదో స్వర్గం అనే భావన ఉంది.. కానీ మతం పేరిట ఏర్పడ్డ ఆ దేశంలో వర్గాలు, తెగల పేరిట ఎంతగా కొట్టుకు చస్తున్నారో ప్రతి నిత్యం మనం పత్రికల్లో టీవీల్లో చూస్తూనే ఉన్నాం.. తమ దేశంలో ఉన్న అరాచకాన్ని పుచ్చుకోవడానికి వారు మన దేశంలో హింసను రగిలిస్తున్నారు..

ఉగ్రవాద చర్యలకు పాల్పడేవారిని, ప్రోత్సహించేవారిని కఠినంగా శిక్షించాల్సిందే.. వీరికి ఉరికన్నా కఠినమైన శిక్షలే విధించాలి.. దురదృష్టవశాత్తు మన దేశంలో ఉగ్రవాదులకు, దేశ ద్రోహులకు, దేశ ద్రోహులకు వంతపాడేవారే మేధావులు(అసలు వీరిని అలా పిలవవచ్చా?) ఉన్నారు.. వీరి పైశాచిక ఆనందానికి అమాయక పౌరులు చనిపోయినప్పుడు ఈ మేధావుల నోళ్లు పెగలవు.. కానీ వారికి శిక్షపడ్డప్పుడో, ఎన్ కౌంటర్లో చనిపోయినప్పుడో గొంతు చించుకొని అరుస్తారు.. దిల్ సుఖ్ నగర్ లాంటి దుర్ఘటనలు జరిగినప్పుడు వీరి నోళ్లు మూబోతాయెందుకో?.. అఫ్జల్ గురు ను ఉరి తీసినప్పుడు చర్చ చేసిన వారు ఇప్పుడు ఎందుకు చప్పుడు చేయరు? అఫ్జల్ గురు ఉరికి ప్రతీకారమే దిల్ సుఖ్ నగర్ హత్యాకాండ అనే విషయం తెలిసి తేలు కుట్టిన వారిలా వ్యవహరిస్తున్నారా?

Friday, February 22, 2013

దిల్ దు:ఖ్ నగర్


దిల్ సుఖ్ నగర్ ఈ పేరులోనే ఎంతో సంతోషం కనిపిస్తుంది.. మన మనస్సు ఎంతో సుఖంగా ఉండాలని కోరుకుంటున్న ప్రాంతం.. నిత్యం వచ్చి పోయే ప్రయాణీకులతో, వ్యాపార, విద్యాసంస్థలు, సినిమా ధియేటర్లతో కళకళలాడే ప్రాంతం ఇది.. ఒక్కడి రద్దీ రోడ్లు, గల్లీల్లో తిరగాలే కానీ.. ఈ జనాన్ని చూస్తుంటే నిజంగా మన దిల్ కు ఎంతో సుఖం’ అనిపిస్తుంది..
జర్నలిస్టుగా నా కెరీర్ ప్రారంభించింది దిల్ సుఖ్ నగర్లోనే.. త్రినేత్ర సూపర్ మార్కెట్ పైన ఉండే ఈనాడు జోనల్ ఆఫీస్, మధుర స్వీట్స్, వెంకటాద్రి పక్కన ఉడిపి హోటల్ టిఫిన్స్, కోణార్క్ ముందు విల్సన్ కేఫ్ ఛాయ్.. ఇవన్నీ నా జీవితంలో మరచిపోయేని తీపి గుర్తులు.. దురదృష్టవశాత్తు మధుర స్వీట్స్ తప్ప త్రినేత్ర సూప్ మార్కెట్, ఈనాడు జోనల్ ఆఫీసు, ఉడిపి హోటల్, విల్సన్ కేఫ్ ఇప్పుడు లేవు.. విల్సన్ కేఫ్ పోయి ఆనంద్ టిఫిన్ సెంటర్ వచ్చింది (ఇక్కడే బాంబు పేలింది).. నా జీవితంలో రెండొంతులకు పైగా దిల్ సుఖ్ నగర్ గుర్తులు నిండిపోయాయి..

నిన్నటి దినం (21 ఫిబ్రవరి 2013) సాయంత్రం వేళ సరిగ్గా 6 గంటల 10 నిమిషాలకు దిల్ సుఖ్ నగర్ కోణార్క్ సమీపంలోనే ఛాయ్ తాగి వెళ్లాను.. కొద్ది నిమిషాలకే ఆ ప్రాంతంపై ఉగ్రవాదులు పంజా విసరడం నన్నెంతో కలచి వేసింది.. 25.08.2007 నాడు ఇలాగే కోఠిలోని గోకుల్ ఛాట్ భండార్లో సమోసా తిని బయలు దేరిన 5 నిమిషాలకే అక్కడో దారుణ సంఘటన జరిగింది.. (గతంలో ఫేస్ బుక్ లో ప్రస్థావించాను) ఇలా రెండుసార్లు మృత్యువు నుండి వెంట్రుక వాసిలో బయటపడ్డాను.. కానీ ఆనాటి, ఈనాటి ఉగ్రవాద చర్యల్లో ఎందరో అమాయకులు బలైపోయారు?.. వీరి ప్రాణాలకు ఎవరు తిరిగివ్వగలరు?.. నా జీవితంలో మరచిపోలేని చేదు గుర్తులు ఇవి.. 
 దిల్ సుఖ్ నగర్ లో ఉగ్రవాదుల దుశ్చర్యను ఖండిద్దాం.. ఎందరో అమాయకులు మరణించారు.. వారందరి ఆత్మలకు శాంతి చేకూరాలని కోరుతూ, వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలుపుకుంటున్నాను.. ఈ ఘటనలో గాయపడ్డ వారందరూ త్వరలో కోలుకోవాలని కోరుకుంటున్నాను..