Saturday, September 15, 2012

ఎఫ్.డి.ఐ.లకు గేట్లు బార్లా.. బరి తెగించిన యూపీఏ

గ్యాస్ డీజిల్ మంటలు చల్లారక ముందే మరో వివాదాస్పద నిర్ణయం తీసుకుంది యూపీఏ సర్కారు.. రిటైల్ రంగంలో 51% ఎఫ్‌డీఐలు, 4 ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల ఉపసంహరణ, దేశీయ విమాన యానంలోకి విదేశీ కంపెనీల అనుమతి.. ఇంత కాలం మన నగరాల్లో పెద్ద పెద్ద మాల్స్ చూసి దేశీయ పెట్టుబడిదారులు మన నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తున్నార్లే అని సరిపెట్టుకున్నాం.. ఇప్పడు మన్మోహనుడి పుణ్యమా అని దేశ సంపద క్రమంగా విదేశాలకు వెళ్లిపోయే పరిస్థితి ఏర్పడింది.. ఒక్కసారి దేశంలో తిష్టేసిన విదేశీ కంపెనీలు మన ప్రభుత్వ నియంత్రణలో ఉంటాయనే హామీ ఏమైనా ఉందా? డబ్బు కోసం ఎంతకైనా బరి తెగించే మన పాలకులను నమ్మొచ్చా? మళ్లీ ఈస్టిండియా పాలన రోజులు రానున్నాయా?
సంస్కరణలు అమలులోకి వచ్చి రెండు దశాబ్దాలు అవుతున్నా వాటి ఫలితాలపై అసలు సమీక్షంటూ జరిగిందా? మరుగుదొడ్ల కన్నా సెల్ ఫోన్లు ఎక్కువున్నాయనే విచిత్ర విశ్లేషణలకు బదులు, పేదరికం ఏమేరకు తగ్గింది? వారి బతులుకులు ఏమేరకు మెరుగయ్యాయి అని తెలుసుకునే ప్రయత్నం చేశారా? తెల్ల ఏనుగుల్లాంటి ప్రభుత్వరంగ సంస్థలను ఇలాగే నడపమని కోరుకోవడం సరికాదు, కానీ వాటిని సంస్కరించే బదులు పూర్తిగా వదిలించేసుకోవడం అంటే ప్రభుత్వం బాధ్యత నుండి తప్పుకోవడం కాదా?
మరి కొద్ది నెలల్లో ఎన్నికలు వస్తున్న తరుణంలో వివాదాస్పద నిర్ణయాలు తీసుకునే అధికారం యూపీఏ సర్కారుకు ఎక్కడిది? పోతూ పోతూ విదేశీ కంపెనీల నుండి అందిన కాడికి దండుకుందామనే ఆలోచనే కదా? మన ప్రతిపక్షాలు కూడా బాధ్యతా రహిత్యంగానే వ్యవహరిస్తున్నాయి.. రోడ్ల మీద తూతూ మంత్రంలా నామ మాత్రం నిరసనలు తెలపడం తప్ప, ప్రభుత్వం మెడలు వంచే ప్రయత్నాలు చేసిన దాఖలాలూ లేవు.. అధికారంలోని వస్తే తమకూ వాటాలు వస్తాయనే దు(దూ)రాలోచన వారికీ ఉందనడంలో సందేహం లేదు.. ఇక ప్రజలే తిరగబడాల్సిన సమయం వచ్చింది..

Friday, September 14, 2012

పేదల బాధలు పట్టని సర్కారు


బ్రిటిష్ వాడు మన దేశంలో టీ ప్రవేశ పెట్టే కొంత కాలం పాటు ఉచితంగా తాగించి అలవాటు చేశాడట.. మన స్వదేశీ ప్రభుత్వం కూడా వంట చెరుకు బదులు గ్యాస్ వాడకాన్ని సబ్సిడీలు ఇచ్చి ప్రోత్సహించి, ఇప్పడు సబ్సిడీలు ఎత్తేస్తామంటోంది.. నిజానికి మన దేశంలో పెట్రోలు, డీజిల్ బంకులు, గ్యాస్ ఏజెన్సీలు రాజకీయ నాయకులు, వారి బంధుమిత్రుల చేతిలోనే ఉన్నాయి.. ధరలు ఎంత పెరిగితే వారికి అంతగా లాభాలు వస్తాయి.. ప్రజల కష్టాలు పాలకులకు పట్టవు.. యూపీఏ పాలనలో మరీ ఘోరంగా పెట్రో బాధలు పెరిగిపోయాయి.. మళ్లీ అధికారంలోని వస్తామన్న ఆశలు లేని కాంగ్రెస్ పాలకులు అందిన కాడికి దండుకోవడమే పనిగా పెట్టుకున్నారు.. ధరలు ఎంత పెరిగినా ధనికులకు బాధ తెలియదు.. కానీ కష్టాలు అనుభవించేది పేదలు, మధ్య తరగతి ప్రజలే.. అసమర్థ పాలకులకు బుద్ది చెప్పేందుకు ఎన్నిక దాకా ఎదురు చూడాలా?.. కన బడిన చోటల్లా 'సత్కారం' చేద్దాం.. అప్పుడైనా బుద్ది వస్తుందోమో చూద్దాం..

Tuesday, September 11, 2012

కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వదు

కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వదుగాక ఇవ్వదు.. ఈ విషయం మెడ మీద తలకాయ ఉన్నోడికి స్పష్టంగా తెలుసు.. హోంమంత్రి షిండేతో పాటు గతంలో ఎందరో కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ ముఖ్య నాయకులు పరోక్ష మాటలతో స్పష్టం చేస్తూనే ఉన్నారు.. ఈ నిజం తెలిసినా తెలంగాణ కోసం పోరాడుతామని చెప్పుకుంటున్న వ్యక్తులు లాబీయింగ్, పోరాటాల పేరిట కాలక్షేపం చేస్తూ తమ సొంత ప్రయోజనాలు చూసుకుంటున్నారు.. తెలంగాణ పార్టీలు, ఉద్యమకారుల మధ్య ఐక్యతే లేనప్పుడు ప్రభుత్వాలు ఇలాగే చేస్తుంటాయి.. రాష్ట్రంలో అనిశ్చితికి తెరదించుదామనే సదాలోచన ఏ పార్టీకీ లేదు.. రెండు పడవల మీద కాలు పెట్టి చేసే ఈ ప్రయాణాలు ఇంకెంత కాలం?.. ముసుగులో గుద్దులాటలు, రాజకీయ ప్రయోజనాలు కట్టిపెట్టి, తెలుగు ప్రజల కోసం స్పష్టమైన నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చింది..

Sunday, September 9, 2012

యాదిలో కాళన్న

పుట్టుక నీది, చావు నీది, బతుకంతా దేశానిది అన్నారు కాళోజీ నారాయణ రావు.. హైదరాబాద్ సంస్థాన విముక్తి, ఈ ప్రాంత రాజకీయ, భాష, రాజకీయ చైతన్యం కోసం కృషి చేసిన మహా వ్యక్తి కాళోజీ.. రెండున్నర జిల్లాల భాషే తెలుగు భాష ఎట్లైతదని నిలదీసిన మహనీయుడాయన.. నేడు కాళోజీ 98వ జయంతి.. కాళన్నను స్మరించుకుందాం..

Saturday, September 8, 2012

గోరక్షణ ఇలాగేనా?

ఇటీవల ఒకటి రెండు పత్రికల్లో, అందునా లోపలి పేజీలో వచ్చిన వార్త ఇది.. ఎవరినీ ఆకర్శించని వార్త అనుకుంటా.. అందుకే అంతగా పట్టించుకొనివుండరు.. ఆంధ్రప్రదేశ్ గోవధ నిషేధం, పశు సంరక్షణ చట్టం-1977ను తీసుకొచ్చి మూడున్నర దశాబ్దాలు అయినా ఇంత వరకూ అమలు చేయకపోవడాన్ని రాష్ట్ర హైకోర్టు తప్పు పట్టింది.. గో సంరక్షణ ఇలాగేనా? అని ప్రభుత్వాన్ని నిలదీసింది.. నాలుగు నెలల్లో నిబంధనలు రూపొందించాలని న్యాయస్థానం ఆదేశించింది.. కొద్ది రోజుల క్రితం ఇదే మరో అంశంపై మరో వార్తను ఓ పత్రికలో చూశాను.. మెదక్ జిల్లాలో విచ్చల విడిగా పశువధ శాలలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడాన్ని హైకోర్టు న్యాయమూర్తి తప్పు పట్టారు.. గ్రామీణ ప్రాంతాల్లో పశు సంపద తగ్గి వ్యవసాయాభివృద్ధి తగ్గడాన్ని ప్రస్థావించారు..

హైదరాబాద్ నగరంలో, శివార్లలో రోడ్లపై విచ్చల విడిగా పిచ్చి కుక్కలు తిరుగుతూ, జనాలను కాటేస్తూ భయబ్రాంతులను చేస్తున్నాయి.. ఒక స్వచ్చంధ సంస్థ కుక్కలను చంపొద్దన్న సాకును చూపి ప్రభుత్వం పిచ్చి కుక్కల నిర్మూళనను గాలి కొదిలేసింది.. మన ప్రభుత్వానికి, స్వచ్ఛంద సంస్థలకు పశు సంపదపై ఈ భూత దయ ఎందుకు లేదో అర్థం కావడంలేదు.. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయానికి పశు సంపద ఎంతో అవసరం. పాల ధరలు పేదలకు అందుబాటులో లేక వారి పిల్లలు తాగలేకపోతున్నారు.. మరి మనకు వీధి కుక్కలు ముఖ్యమా? పశు సంపద ముఖ్యమా?.. మత విశ్వాసాల విషయంలో చూసీ చూడనట్లు ఉండే మెజార్టీ వర్గ ప్రజలు ఆవును, పశు సంపదను పవిత్రంగా పూజిస్తారు.. ఈ అంశం మైనారిటీలకు సంబంధించినదో, రిజర్వేషన్ల అంశమో అయితే రాజకీయ నాయకులు పోటీ పడి ఉద్యమించేవారు.. కనీసం బీజేపీ కూడా ఈ విషయాన్ని పట్టించుకోకపోవడం దురదృష్టకరం..

Thursday, September 6, 2012

ఫారిన్ బ్రాండ్ మహిమ

నిన్న' టైమ్' ఇవాళ 'వాఐింగ్టన్ పోస్టు' మన ప్రధాని అసమర్థ పనితీరును ఎండగట్టాయి.. మన్మోహన్ సింగ్ పరిపాలన గురుంచి ఈ పత్రికలు రాసిందాంట్లో కొత్తేమీ లేదు.. భారతీయ పత్రికలు తరచూ ఇలాంటి కథనాలు రాసినా ఫారిన్ సరకులాగా విదేశీ పత్రికలు రాస్తే మరింత విలువ ఉండటం సహజం.. అంతర్జాతీయ పత్రికలు మన దేశంపై ఏది రాసినా కొంత మేర సంచలనం సహజం.. భారత దేశంలో సింగ్ గారి ప్రతిష్టే ఇప్పటికే మసకబారింది.. ఇప్పడు ఈ పత్రికలు అంతర్జాతీయ స్థాయిలో ఎండగట్టేశాయి.. దేశీయ పత్రికలు ఎంత రాసినా దున్నపోతుపై వాన పడ్డ చందాన పట్టించుకోని ప్రధాని కార్యాలయం, కాంగ్రెస్ అధిష్టానం వాషింగ్టన్ పోస్టు పత్రికపై తీవ్ర అగ్రహంతో రుసరుసలాడుతూ స్పందించాయి..

Wednesday, September 5, 2012

ఉపాధ్యాయుల స్థానం ఎక్కడ?

గురువును బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులతో పోల్చాయి మన పురాణాలు.. తల్లిదండ్రుల తర్వాత స్థానం గురువుదేనని చెప్పారు మన పెద్దలు.. పిల్లలకు విద్యాబుద్దులు నేర్పించి వారి భవిష్యత్తుకు పునాదులు వేసే ఉపాధ్యాయులకు మన సంస్కృతిలో ప్రముఖ స్థానమే ఉంది.. అయితే ఇదంతా నిన్నటి చరిత్రగానే మగిలిపోనుందా?

నేటి గురు శిష్య సంబంధాలు చూస్తే బాధ కలుగుతోంది.. విద్య అంగడి సరుకయ్యాక ఇది ఒక వ్యాపారికి, వినియోగదారునికి సంబంధించిన వ్యవహారమైపోయింది.. ఇదీ ఒక క్విడ్ ప్రొకో అంటే ఎలాంటి అతిషయోక్తి లేదు.. చదువుకునే వారు కరువై, చదువు కొనే వారు తయారయ్యారు.. ఉపాధ్యాయుల గౌరవం కూడా మసకబారింది.. నేటి సినిమాల్లో ఉపాధ్యాయులను బఫూన్ల మాదిరిగా, విద్యార్థులు వారిని టీజ్ చేసే వారిగానే చూపిస్తున్నారు.. సారీ టీచర్ లాంటి చిత్రాలు మరీ పరాకాష్టగా మారాయి.. ఇది చాలదన్నట్లు అక్కడక్కడా కీచక టీచర్లకు సంబంధించిన వార్తలు చూస్తున్నాం.. విలువలతో కూడిన విద్యకు, నైతిక విద్యకు స్థానం లేకుండాపోయింది..
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పూర్తిగా దిగజారిపోయాయి.. ప్రయివేటు టీచర్లతో పోలిస్తే ఎన్నో రెట్లు అధిక జీతాలు తీసుకునే ప్రభుత్వ ఉపాధ్యాయులు తమ బాధ్యతలను ఏనాడో గాలికి వదిలేశారు.. ఈ పరిస్థితిని సరిదిద్దే పని తమది కాదన్నట్లుగా వ్యవహరిస్తున్నాయి ఉపాధ్యాయ సంఘాలు.. ఈ సంఘాల నేతలు దళారులుగా తయ్యారని చెప్పడానికి బాధ కలుగుతోంది.. ఈ పరిస్థితులు మారాలని ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా కోరుకుందాం.. - క్రాంతి దేవ్ మిత్ర